సంపాదకీయం

ప్రకృతికి చికిత్స..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈశాన్య ప్రాంతంలోని కొందరు సామాజిక ఉద్యమకారులు ‘వెదురు’ ఈనెలతో రకరకాల పరిణామాలలో సంచులను తయారుచేస్తున్నారట! వెదురు కలపను ఉపయోగించి ‘సీసా’లను, గినె్నలను, దొనె్నలను, డిప్పలను, చిప్పలను, డబ్బాలను, ‘డొక్కు’- చిన్న డబ్బా-లను కూడ తయారుచేసే ‘పంపిణీ సంస్థలు’ పెరుగుతున్నాయట! ఈ ‘చిట్టి’ సంస్థలలో అత్యధికం స్వచ్ఛందంగా ‘స్వచ్ఛ్భారత’ పునర్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. కొన్ని ‘సంస్థలు’ తాము తయారుచేసిన ఈ ‘వంశీ’- వెదురు- ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేయాలి! మరికొన్ని సంస్థలు ‘లాభ నష్ట రహిత ప్రాతిపదికపై’ ఈ వెదురు సంచులను బుట్టలను తట్టలను ‘సీసా’లను చౌక ధరలకు విక్రయిస్తున్నాయట! మంచినీరు సరఫరా చేయడంకోసం ఇలా తయారైన ‘అర్థ లీటర్’, ‘లీటర్’, ‘రెండు లీటర్ల’, ‘పావు లీటర్’ పరిమాణంలోని వెదురు సీసాలను నవంబర్‌లో స్వచ్ఛంద కార్యకర్తలు గౌహతిలో ప్రదర్శించడం మాథ్యమాలలో ప్రచారమైంది. ‘ప్లాస్టిక్’ ఉపకరణాలకు ప్రత్యామ్నాయంగా ఈ ‘వెదురు’వస్తువులను విరివిగా వాడాలన్నది ఈ ‘స్వచ్ఛంద’ సేవకులు చేస్తున్న ప్రచారం! ఇది ఒక ఉదాహరణ మాత్రమే... అన్ని ప్రాంతాలలోను ‘ప్లాస్టిక్’కు ప్రత్యామ్నాయాలను తయారుచేస్తున్న ‘స్వచ్ఛ భారత’ పర్యావరణ ప్రేమికుల సంఖ్య విస్తరిస్తోంది! గత ఏడాది అక్టోబర్ రెండవ తేదీన- మహాత్మాగాంధీకి నూటయాబయి ఏళ్లు నిండి నూట యాబయి ఒకటవ జగన్తిని జరుపుకున్న సందర్భంగా- ‘ఏక పర్యాయ వినియోగ’ ‘ప్లాస్టిక్’ పదార్థాల నిషేధం దేశమంతటా అమలులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ ‘ఏక పర్యాయ వినియోగ’- సింగిల్ యూజ్- ‘ప్లాస్టిక్’ వస్తువుల నిషేధాన్ని ఆవిష్కరించాడు. గతంలోవలె కాక ‘ప్రస్తుత నిషేధం’ మెల్లమెల్లగా విజయవంతం అవుతుండడం ప్రకృతికి ప్రమోదం కలిగిస్తున్న శుభ పరిణామం! ‘ప్లాస్టిక్’ దశాబ్దులపాటు కలిగించిన గాయాలతో నొప్పిని భరించలేక విలపిస్తున్న ప్రకృతి నొప్పిని కలిగిస్తోంది! అందువల్ల ‘‘గాయాలను మాన్పడానికి వీలుగా’’ పత్తి, నూలు, జనుపనార, కాగితం, వెదురు, కలప ఉపకరణాలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. భాగ్యనగరంలోను తెలుగు ప్రాంతాలలోని వివిధ పట్టణాలలోను కొన్ని జాతీయభావ స్వచ్ఛంద సంస్థలు విరివిగా బట్ట సంచులను పంపిణీ చేయడం ప్రకృతి గాయాలకు చికిత్స జరుగుతోందనడానికి నిదర్శనం! సికిందరాబాద్‌లోని ‘సైనిక్‌పురి’ నివాసులు ‘ప్లాస్టిక్’ నిర్మూలనకోసం దేవాలయాలు మాథ్యమంగా ఉద్యమిస్తున్నారట! పురోహితులు, అర్చకులు, స్థానిక సంక్షేమ సంఘాలవారు కలసికట్టుగా భక్తులకు, దేవాలయ సందర్శకులకు ‘ప్లాస్టిక్’ బుట్టలను, తట్టలను, సీసాలను, సంచులను వినియోగించవద్దని విజ్ఞప్తులను చేస్తున్నారట! పూజా సామగ్రిని తీసుకొని వెళ్లడానికి ‘ప్రత్యామ్నాయ’ ఉపకరణాలను వాడాలన్నది ఈ దేవాలయ ఉద్యమ స్ఫూర్తి...
ఇలా, ‘‘చీకటిని తిడుతూ కూర్చున్న’’ వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది... చిఱు దివ్వెలను వెలిగిస్తున్నవారు పెరుగుతున్నారు. ‘ప్లాస్టిక్’ రసాయన విష రక్కసునికి వ్యతిరేకంగా మొదలైన స్వచ్ఛ్భారత సమరం క్రమక్రమంగా తీవ్రతరం అవుతోంది! నిజానికి ‘ప్లాస్టిక్’ పదార్థాల వాడకాన్ని నిషేధించాలన్న కార్యక్రమం దాదాపు రెండు దశాబ్దుల క్రితం మొదలైంది. అనేక మహానగరాలలో ‘మందం లేని’ ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిషేధించిన తరువాత ఇరవై ఏళ్లు గడిచి పోయాయి! తీర్థయాత్రా స్థలాలలో ‘ప్లాస్టిక్’ సీసాలను, సంచులను నిషేధించారు. పురపాలక, నగర పాలక కార్యాలయాల్లో, ప్రభుత్వ సచివాలయ ప్రాంగణాలలో విద్యాలయ ప్రాంగణాలలో ఆయా నిర్వాహకులు ‘ప్లాస్టిక్’లను నిషేధించినట్టు పదే పదే ప్రచారం అయింది... కానీ నిషేధాలలో అత్యధికం వమ్మయిపోవడం ఇరవై ఏళ్ల చరిత్ర, రైళ్లలోను రైలుస్టేషన్‌లలో ‘ప్లాస్టిక్’ కప్పులకు బదులు మట్టి ‘పిడత’లలో తేనీరు, మంచినీరు, కాఫీ, మజ్జిగ తదితర పానీయాలను సరఫరాచేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి పదిహేను ఏళ్లు దాటింది. కానీ రైళ్లలో ఇప్పటికీ యథావిధిగా ‘ప్లాస్టిక్’ చిప్పలు, ప్లాస్టిక్ ‘డిప్పలు’ ధారాళంగా ఉపయోగిస్తున్నారు! ‘ప్లాస్టిక్’ కాలుష్యాన్ని నిరోధించాలన్న, నియంత్రించాలన్న, నిర్మూలించాలన్న ఉద్యమం నీరుకారిపోతుండడానికి అతి ప్రధాన కారణం ‘ప్లాస్టిక్’ ఉత్పత్తిదారులు... దేశంలో వేల సంఖ్యలో ‘ప్లాస్టిక్’ బట్టీలను నిర్వహిస్తున్నారు. ఈ ‘ఉత్పత్తి’లోను, పంపిణీలోను విదేశీయ సంస్థల, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ‘ఉనికి’ బహిరంగ రహస్యం! భారతీయతకు, ప్రపంచీకరణకు మధ్య ఇరవై ఆరు ఏళ్లుగా నడుస్తున్న సంఘర్షణలో ‘మట్టి’పాత్రలు, నూలు సంచులు, జనుపనార ఉపకరణాలు, కాగితం ‘తిత్తులు’ భారతీయతకు ప్రతీకలు... ‘ప్లాస్టిక్’ ప్రపంచీకరణ ప్రతినిధి...
అందువల్ల ‘ప్లాస్టిక్’కు ప్రత్యామ్నాయాలు ఏర్పడకుండా బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు, వాటితో అనుసంధానం ఏర్పడి ఉన్న దేశంలోని దళారీ సంస్థలు ఇంతకాలం నిరోధించాయి. రాజకీయ అవినీతిపరులు, అక్రమ వాణిజ్య పారిశ్రామిక సంస్థలవారు, లంచగొండి అధికారులు, దళారీలు- ‘ప్రపంచీకరణ’ సృష్టించిన దుష్టచతుష్టయం. ఈ దుష్టచతుష్టయం కలసికట్టుగా ‘ప్లాస్టిక్’ భూతాన్ని పరిరక్షిస్తున్నాయి. బాల కార్మిక వ్యవస్థ రద్దయిపోయిన తరువాత దశాబ్దులు గడిచినప్పటికీ, ఇప్పటికీ, ఎక్కడో అక్కడ ఈ ‘ప్లాస్టిక్’ బట్టీలలో చిన్నారులచేత పనిచేయిస్తున్న వైపరీత్యాలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. నిషిద్ధ ‘ప్లాస్టిక్’ వస్తువులు, ఉపకరణాలు ఏవి??- అన్న విషయంలో స్పష్టత లేకపోవడం ‘ప్లాస్టిక్’ నిర్మూలనకు అవరోధంగా మారిన మరో కారణం. ‘మందం’ విషయంలోను, ‘ఏక పర్యాయ వినియోగ’ నిర్వచనం విషయంలోను స్పష్టత లేదు. అందువల్ల ఈ ‘‘సంచి వాడవచ్చు, ఈ సీసా వాడవచ్చు...’’అని వ్యాపారులు భాష్యాలు చెపుతున్నారు! అందువల్ల ప్రభుత్వం పూనుకొని ‘ప్లాస్టిక్’ పూర్వ వ్యవస్థను పునరుద్ధరించాలి! నిజానికి మన దేశంలో ‘ప్రత్యామ్నాయాలు’ వౌలిక ఉత్పత్తులుగాను, వౌలిక ఉత్పత్తులు ప్రత్యామ్నాయాలుగాను చెలామణి అవుతున్నాయి. శతాబ్దులపాటు కొనసాగిన విదేశీయ దురాక్రమణ ఫలితం ఇది. ఉదాహరణకు ఈ దేశంలో ఆయుర్వేద చికిత్స ఔషధాలు అనాదిగా ఉన్నాయి. అందువల్ల ‘ఆయుర్వేదం’ వౌలికమైనది. ఇటీవలి శతాబ్దులలో విస్తరించిన ‘అల్లోపతి’ వైద్యం ప్రత్యామ్నాయం. ఆల్టర్నేటివ్ మెడిసిన్-! కానీ బ్రిటన్ దురాక్రమణ కారణంగా ‘అల్లోపతి’ వౌలిక వైద్యంగాను, ‘ఆయుర్వేదం’ ప్రత్యామ్నాయ వైద్యంగాను ప్రచారమైంది! ఇదే రీతిలో పత్తి, లోహం, జనుపనార, కలప, మన్ను వంటివి ఉపకరణాలు తయారీకి అనాదిగా వౌలిక పరికరాలు... ‘ప్లాస్టిక్’ పుట్టక పూర్వం సహస్రాబ్దులుగా ఈ ‘వౌలిక’ ఉత్పత్తులను మన దేశంలో వాడారు. కొత్తగా వచ్చిపడిన ‘ప్లాస్టిక్’ నిజానికి ప్రత్యామ్నాయం!
కానీ ‘ప్లాస్టిక్’ ‘వౌలిక’ పదార్థంగాను, ‘పత్తి’ తదితర వౌలిక పదార్థాలు ‘ప్రత్యామ్నాయం’గాను ప్రచారం జరిగిపోయింది!!
ఈ కృత్రిమ వ్యవస్థను తొలగించుకోవడం అందువల్ల ‘స్వదేశీయ’ జీవన విధానం... కాగితం, బట్ట, జనుపనార సంచులు, మట్టి, గాజు, లోహం పాత్రలు ఒకప్పుడు ‘పంపిణీ’కి మాధ్యమాలు, పదార్థాలను నిలువ ఉంచడానికి మాధ్యమాలు, మరిగెలు, జాడీలు, రాతి చిప్పలు మళ్లీ విరివిగా వాడడంవల్ల ‘మందం’తో నిమిత్తం లేకుండా మొత్తం ‘ప్లాస్టిక్’ను నిర్మూలించవచ్చు. కొన్ని కిరాణా దుకాణాలలో ఇప్పటికే బట్ట సంచులలో పదార్థాలను నింపి విక్రయిస్తున్నారు! కాగితం, జనుపనార సంచులను కూడ విరివిగా ప్రచారం చేయాలి! ప్లాస్టిక్ పూర్వ సమయంలో ప్రకృతి స్వచ్ఛంగా ఉండేది. ‘ప్లాస్టిక్’ నిర్మూలనవల్ల ఈ ‘స్వచ్ఛత’ హరిత శోభలలో మళ్లీ విస్తరించగలదు...