సంపాదకీయం

జీవన సంయమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి శుక్రవారం నుంచి వారం దినములు ‘్భక్తాదుల’కు దర్శనం ఇవ్వకపోవడం ‘కరోనా’ వైపరీత్యానికి పరాకాష్ఠ. సమీపంలోని శ్రీకాళహస్తీశ్వరుడు సైతం ఎక్కువసేపు ‘ఏకాంతం’- ఐసోలేషన్-లో ఉండవలసి రావడం ఊహించని విపరిణామం! ‘తిరుమల తిరుపతి దేవస్థానముల’- తితిదే- ఆధ్వర్యవంలోని మొత్తం యాబయి ఒక్క దేవస్థానములు ‘కరోనా’ కాటునుంచి తప్పించుకొనడానికై వారం రోజులు మూతపడడం ప్రమాదాన్ని ప్రతిఘటించడంలో భాగం! నూట ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని కొన్ని రోజులు నిలిపి వేశారట! ఎందుకన్నది ‘తితిదే’వారికి తెలియని విషయం. ఇలా దాదాపు రెండువేల ఏళ్ల- తెలిసిన- చరిత్రలో శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని రద్దుచేయడం ఇది రెండవసారి మాత్రమే. ఆలయాలతో అనేక సంస్థలు మూతపడి ఉండడం ‘కరోనా’-కోవిడ్ 19- భూతపు విశ్వవిస్తృత ‘కుఖ్యాతి’ కొనసాగుతున్న నిదర్శనం. దేశ ప్రజలు ‘సంయమనం’ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఇచ్చిన పిలుపునకు ఇదంతా నేపథ్యం! ‘‘సాధ్యమయినంతసేపు ‘ఏకాంతం’లో ఉండడం జనం పాటించదగిన సంయమనం’’అన్నది నరేంద్ర మోదీ ధ్వనింపచేసిన వాస్తవం! ప్రయాణాలు, బహిరంగ కలయికలు బాగా తగ్గిపోవాలన్నది ‘కరోనా’ను ప్రతిఘటించే చర్యలలో ప్రధానమైన కార్యక్రమం. ఈ ‘ఏకాంతం’లో భాగంగా ప్రజలు ఆదివారంనాడు ఉదయం ఏడునుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు- పదునాలుగు గంటలపాటు- తమ ఇళ్లలోనే ఉండిపోవాలన్నది ప్రధాని చెప్పిన హితవు. ఈ ‘ప్రజల కర్ఫ్యూ’ ప్రజలు పాటించవలసిన భౌతిక బౌద్ధిక సంయమనంలో భాగం! ఆదివారం బయట తిరగకుండా ఇళ్లలోనే ఉండడం భౌతిక ‘సంయమనం’! బయట అమ్మే నానావిధములైన కాలుష్య కారకమైన ‘కిరాయి’ తిండి తినాలన్న ‘వాంఛ’ను ఆ ఒక్కరోజైనా అమలుజరుపకపోవడం బౌద్ధిక సంయమనం! పదార్థాలు దొరకవేమోనన్న భయానికి లోనుకాకపోవడం కూడ బౌద్ధిక సంయమనం! ఈ అనవసరం భయంతో ఆహార పదార్థాలను, నిత్యావసరాలను అమితంగా కొని, నిలువచేయవద్దన్నది మోదీ చెప్పిన హితవు. అమితంగా కొనకపోవడం, నిలువ చేయకపోవడం బౌద్ధిక మానసిక సంయమనం. దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణకోసం అహర్నిశలు అవిరళ కృషిచేస్తున్న వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిముషాలకు అందరూ కృతజ్ఞతను వ్యక్తంచేయాలన్నది ప్రధానమంత్రి చేసిన మరో విజ్ఞప్తి! ప్రతి కుటుంబంవారు ఆ సమయంలో మిద్దెలనెక్కి లేదా ఇళ్లముందు నిలబడి కరతాళ ధ్వనులతో ఈ కృతజ్ఞతను ఆవిష్కరించడం మోదీ అభిమతం...
ఇలా అనివార్యం అయినప్పుడు ‘సంయమనం’ - రిస్ట్రయింట్- పాటించడం బాగుంది. ఆదివారం పగలంతా, రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్లలోనుంచి బయటికి రాకపోవడం, ప్రయాణాలు చేయకపోవడం ‘సంయమనం’. కానీ ‘దప్పిక’అయినప్పుడు ‘బావి’ని తవ్వినట్టుగా ‘సంయమనం’ పాటించడంవల్ల తత్కాల ప్రయోజనం పాక్షికంగా సిద్ధించవచ్చు! కానీ శాశ్వత ప్రాతిపదికపై ‘సంయమనం’ జీవనస్థితం అయినప్పుడు భౌతిక రుగ్మతలను, సామాజిక రుగ్మతలను, బౌద్ధిక మానసిక రుగ్మతలను కూడ నిరోధించవచ్చు. భారతీయులు భారతీయ పద్ధతులలో భారతీయులు జీవించిన సమయంలో మనదేశం ఆరోగ్యవంతంగా జీవించింది. కానీ ప్రస్తుతం ‘చదువుల స్థాయి’ పెరిగినకొద్దీ విద్యావంతులలో భారతీయత స్థాయి తగ్గిపోతోంది! పాశ్చాత్య భావ నిబద్ధత పెరుగుతోంది! నిద్ర లేవడంతో మొదలు... కడగని కాళ్లకున్న ‘బూట్ల’నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని ఆఘ్రాణిస్తూ నిలబడి నానా కల్తీ తిండినీ మెక్కడం తరువాతి దశ! నరేంద్ర మోదీ చెప్పిన తాత్కాలిక ‘సంయమనం’ భారతీయులలో అత్యధికుల జీవన వ్యవస్థనుంచి శాశ్వతంగా వైదొలగిపోయి ఉంది! శౌచక్రియకు నీరు ఉపయోగించని అమెరికా వాళ్లలాగ, ఐరోపా వాళ్లలాగ మన ‘‘విద్యాధిక, సంపన్న, విబుధ దైత్య’’ జనాలు ఉదయాన్ని ప్రారంభిస్తున్నారు. ‘కరోనా’ రోగ క్రిములు విదేశాలనుంచి వ్యాపిస్తున్నాయి. ఇది తాత్కాలికం. దురాచార రోగక్రిములు ఐరోపానుంచి, అమెరికానుంచి దశాబ్దుల తరబడి వ్యాపించాయి. సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి భూమికి నమస్కరించడం మానవ జీవనవ్యవస్థను ప్రకృతితోను సృష్టిగత ‘స్వస్థత’తోను నిరంతరం అనుసంధానం చేస్తున్న అనాది భారతీయత! సూర్యోదయం తరువాత నిద్ర లేచి ‘పాచి నోటి’తో పానీయాలను సేవించడం, ‘పాచి’ శరీరంతో ఫలహారాలను, అల్పాహారాలను ఆరగించడం పాశ్చాత్య దేశాల పద్ధతి...
సూర్యోదయ సమయంలో గురకలు పెడుతూ, చొల్లుకారుస్తూ నిద్రపోరాదన్న నియమాన్ని పాటించడం ఆ జీవన ‘సంయమనం’! రోగులు మిక్కిలి వృద్ధులు, రాత్రిపూట పనిచేయడం అనివార్యం అయినవారు ఈ నియమం పాటించకపోవచ్చు. కానీ ఆరోగ్యవంతులైన యువజనులు ఇతరులు ఈ ‘‘సూర్యోదయ నిద్రానిరోధక’’ సంయమనాన్ని పాటించాలి! సూర్యోదయం కంటె దాదాపు గంటముందు నిద్రలేచి చన్నీటితో స్నానం చేసినవారు ‘‘వంద ఏళ్లు ఆనందంగా జీవించడం’’- నందామ శరదః శతమ్- చరిత్ర! ఇలా ‘సంయమనం’పాటించని యువజనులు క్రమంగా అనారోగ్య జీవులుగా మారుతుండడం వర్తమాన అనుభవం! తొంబయి శాతం వ్యాధులకు నిరోధక- ప్రివెంటివ్- చికిత్స సూర్యుడికంటె ముందు లేచి సూర్యుడికి స్వాగతం చెప్పడం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, బౌద్ధిక ప్రచోదకుడు- ధియో యోనః ప్రచోదయాత్-! ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ ఆరంభమైన తరువాత ప్రకృతి వ్యవస్థకూ మానవ జీవన వ్యవస్థకూ మధ్యకల సహజ అనుబంధం గురించి ధ్యాస పెరుగుతోంది. నిజానికి మానవ జీవనం ప్రకృతి అంతర్భాగం! ‘యోగం’అని అంటే కేవలం ‘్ధ్యనం’కాదు, కేవలం ‘ఆసన అభ్యాసం’కాదు. ‘యోగం’లో ఇవి భాగాలు! యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి-అన్నవి క్రీస్తునకు పూర్వం పదమూడవ శతాబ్దినాటి పతంజలి మహర్షి వివరించిన ‘యోగం’లోని ఎనిమిది ప్రక్రియలు. ‘యమము’అని అంటే ‘సూర్యోదయ నిద్ర’వంటి వికృతులకు పాలుపడకుండా సంయమనం పాటించడం. ‘యమం’ ఆజీవన సంయమనం!
కేరళలోని నీలానదీ తీరంలో ప్రభాత సమయాన ఒక ఆయుర్వేద వైద్యుడు ‘ఓషధుల’ను నూరుకుంటూ కూర్చున్నాడట! ఎగిరివచ్చి ఆయన సమీపంలోని చెట్టుపై తిష్ఠవేసిన రెండు పక్షులు ఇలా అరిచాయట ‘‘కోరుక్’’- కఃఅరుక్- ఎవరు రోగి కానివాడు?’’ ఈ ప్రశ్నకు సమాధానంగా ‘నీలా’తీరంలోని ఆ వైద్యుడు ‘‘హితభుక్- హితమైన తిండి తినేవాడు’’-అని అరిచాడు! ఆ పక్షులు మళ్లీ ‘‘కోరుక్?’’అని అరిచాయట! ‘‘మితభుక్- మితంగా తినేవాడు-’’అని వైద్యుడు జవాబు చెప్పాడు! ఆ పక్షులు మరోసారి ‘‘కోరుక్...?’’ అని అడిగాయి! ‘‘సమయభుక్...- సమయానికి నియతంగా భుజించేవాడు-’’అన్నది వైద్యుని సమాధానం! పట్టువదలని ఆ జంట పక్షులు నాలుగవసారి ‘‘కోరుక్- ఎవడు ఆరోగ్యవంతుడు-?’’అని ఎలుగెత్తాయి. ‘‘హిత, మిత, సమయ భుక్- హితమైన ఆహారాన్ని, మితంగా నిర్ణీత సమయంలో- అంటే పగలు ఒకసారి రాత్రి ఒకసారి- తినేవాడు ఆరోగ్యవంతుడు. ఆ జంట పక్షులు అశ్వనీ దేవతలట! ఇది కల్పిత కథ కాదు. ఆహార సంయమనానికి సంబంధించిన జీవన వాస్తవం! ఇలా వివిధ దశలలో దినమంతా, జీవితమంతా సంయమనాన్ని పాటించడం భారతీయం! ‘కరోనా’తాత్కాలికం... సకల వ్యాధులను నిరోధించగల ‘జీవన సంయమనం’ మాత్రమే శాశ్వత ఆరోగ్య పరిరక్షకం...