సంపాదకీయం
‘కరోనా’ కట్టడి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చైనావాడు... కరోనా కారకుడు- అని అరచిన కొందరు ఆ యువకుడిని చితక్కొట్టడం పరాకాష్ఠ! ఇజ్రాయిల్ దేశంలోని ‘తైబరియాస్’ నగరంలో సోమవారం ఈ దుర్ఘటన జరిగిందట. దెబ్బలు తిని, ఛాతీ మీద గాయాలు ఏర్పడి, వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆ ‘యూదు’ యువకుని పేరు ‘అమ్‌షాలెమ్ సింగ్‌సన్’... అతడిని దౌర్జన్యకాండకు బలిచేసినవారు కూడ ‘యూదులే’! నిజానికి ఈ దౌర్జన్యకాండకు గురిఅయిన ‘అమ్‌షాలెమ్ సింగ్‌సన్’ కరోనా వ్యాధిగ్రస్తుడు కాదు, చైనా పౌరుడు కూడ కాదు. అతడు మన ఈశాన్య ప్రాంతంనుంచి వెళ్లి ఇజ్రాయిల్‌లో స్థిరపడిన ‘వినమ్ మెనాషీ’ తెగకు చెందిన ఇరవై ఎనిమిదేళ్ల యూదు మతస్థుడు. ఈ తెగకు చెందిన యూదులు రెండువేల ఏళ్లుగా మణిపూర్ మిజోరమ్ ప్రాంతాలలో నివసించారు. క్రీస్తుశకం ఒకటవ శతాబ్దిలో ‘రోమ్’ బీభత్సకారులు యూదుల మాతృభూమి పాలస్తీనాను ధ్వంసం చేశారు. యూదుల ఆలయాలను పడగొట్టారు, యూదులను సామూహిక హత్యాకాండకు గురిచేశారు. మాతృభూమినుంచి యూదులను సమూలంగా నిర్మూలించారు. ఇలా నిర్మూలనకు గురిఅయిన యూదులు ప్రపంచంలోని నలుమూలలకూ చెల్లాచెదరయ్యారు. ఏ దేశంలో కూడ యూదులకు ఆదరణ లభించలేదు, వివిధ దేశాలలో సైతం యూదులు చిత్రవిచిత్ర బాధలకు గురికావడం చరిత్ర. భారతదేశంలో మాత్రమే యూదులకు ఆత్మీయ ఆతిథ్యం లభించింది. వివిధ తెగల యూదులు రెండు సహస్రాబ్దులు మన దేశంలో హాయిగా జీవించారు, ఇప్పటికీ జీవిస్తున్నారు. ఇలా మన దేశంలో రెండువేల ఏళ్లు జీవించిన యూదులలో కొందరు, కొన్ని తెగలవారు 1948లో యూదులకు ఒక దేశం- ఇజ్రాయిల్ లభించిన తరువాత తమ మాతృభూమికి తిరిగి వెళ్లారు. పాలస్తీనాలోని కొంత ప్రాంతం ‘ఇజ్రాయిల్’గా ఏర్పడింది. మిగిలిన భాగం పాలస్తీనా పేరుతోనే కొనసాగుతోంది. ఇలా ఇజ్రాయిల్‌కు మన దేశంనుంచి తిరిగి వెళ్లిన యూదులు ‘్భరతీయ సంతతి’ వారుగా చెలామణి అవుతున్నారు. సోమవారం గాయపడిన ‘అమ్‌షాలెమ్‌సింగ్‌సన్’ ఈ భారతీయ సంతతివాడు! ఇతడిని ‘‘చైనా జాతీయుడని’’ దౌర్జన్యకారులు భ్రమించారు! చైనాలోని ‘ఊహాన్’లో ‘కరోనా’ జాడ్యం మొదట కనబడింది కాబట్టి వివిధ దేశాలలోని ‘అనభిజ్ఞ’-ఇగ్నోరెంట్- ప్రజలు కొందరు చైనా పేరు చెప్పిన వెంటనే హడలిపోతున్నారు... చైనానుంచి ప్రయాణీకుల రాకపోకలవల్లనే ‘కరోనా’ రోగ క్రిములు ఇతర దేశాలకు వ్యాపించి ఉండవచ్చునన్నది జరిగిన ప్రచారం. ఆ వ్యాపించిన ఇతర దేశాలనుంచి ప్రయాణీకుల ద్వారా మరిన్ని దేశాలకు ఈ భయంకర వ్యాధిక్రిములు విస్తరించిపోయాయి...
అందువల్ల వివిధ దేశాల మధ్య రాకపోకలు దాదాపు నిలచిపోవడం ‘కరోనా’ ఫలితం! దేశాలు పరస్పరం ‘‘తెగతెంపులు’’చేసుకొని ఏకాంతగ్రస్తమయ్యాయి. ‘ఏకాంతం’-ఐసోలేషన్- ‘కరోనా’ నిరోధక, ‘కరోనా’ నిర్మూలక చికిత్సలో వౌలిక అంశమైపోయింది! దశాబ్దుల తరబడి ఒకదాని తరువాత మరొకటిగా ప్రపంచాన్ని ముంచెత్తుతున్న చిత్రవిచిత్ర భయంకర వ్యాధులలో ఈ ‘కరోనా’ పరాకాష్ఠ. ఇంతగా ప్రపంచాన్ని భయవిభ్రాంతికి గురిచేసిన వ్యాధి మరొకటి లేదు. ఇంత పెద్ద ఎత్తున ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవలసిన అనివార్యం గతంలో ప్రబలిన విచిత్ర వ్యాధులు కల్పించలేదు! పాఠశాలలు మూసివేశారు, విమానాల రాకపోకలను రద్దుచేస్తున్నారు, ఎక్కువ సంఖ్యలో జనం కలిసే సభలను, సమావేశాలను, ఉత్సవాలను, శోభాయాత్రలను, జాతరలను, సమ్మేళనాలను రద్దుచేశారు. మన ప్రధానితో సహా వివిధ దేశాల ప్రభుత్వ నేతలు విదేశాల పర్యటనలు రద్దుచేసుకున్నారు. కేంద్ర మంత్రులు విదేశాలకు పోరాదట! కొన్ని దేశాలలో జనం ఇళ్లనుంచి బయటికి రాకుండా ప్రభుత్వాలు కట్టడి చేశాయి. దేవాలయాలు సైతం మూతపడుతుండడం సమస్య తీవ్రతకు పరాకాష్ఠ. అనేక దేశాలలో ఎన్నికలు వాయిదాపడినాయి. మన దేశంలో కూడ ఇదే కథ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు కారణం చెలరేగిన రాజకీయ దౌర్జన్యకాండ కంటె, ‘కరోనా’ ప్రమాదం ప్రధాన కారణం! ఒకరికొకరు దూరంగా ఉండాలన్నది చికిత్స, కరచాలనాలు, బహిరంగ ఆలింగనాలు రద్దయిపోయాయి. చివరికి మన చేతులతోనే మన ముక్కును, మన కళ్లను, మన చెవులను, మన చెంపలను ముట్టరాదన్నది ‘కరోనా’హడలెత్తిస్తున్న తీరునకు నిదర్శనం! ఉన్నత న్యాయస్థానాలు కేవలం అత్యవసర అనివార్య వివాదాలను మాత్రమే విచారిస్తుండడం కరోనా ప్రమాదంపై ప్రకటించిన యుద్ధప్రాధాన్యానికి ధ్రువీకరణ...
ప్రమాదం, వైపరీత్యం, విలయం, ప్రాకృతిక బీభత్సం ముంచుకొని వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి... కానీ ఇవి ముంచుకొని రాకుండా ఇలాంటివి, ఇలాంటి రోగాలు పుట్టకుండా శాశ్వతంగా నిరోధించే సమన్వయ జీవన విధానాన్ని మనం తప్పనిసరి చేసుకోలేమా?? అన్న మథనం జరుగవలసిన తరుణం ఇది. ఈ ‘సమన్వయం’ మన వివిధ అలవాట్లమధ్య, పద్ధతుల మధ్య, ఆలోచన రీతుల మధ్య, ప్రవృత్తుల మధ్య జరగాలి! మనిషికీ మనిషికీ మధ్య సమన్వయం కలిగి ఉండడం ఉత్తమ కుటుంబం. కుటుంబ జీవన పద్ధతుల మధ్య సమన్వయం- హార్మోనీ- సామాజిక సమన్వయం... సమాజానికీ ప్రకృతికీ మధ్య సమన్వయం సృష్టివికాస క్రమం! ‘‘అఖండ మండలాకార’’మైన విశ్వవ్యవస్థలో ఏ బిందువు స్వచ్ఛత చెడిపోయినప్పటికీ మొత్తం విశ్వవ్యవస్థ స్వచ్ఛత భంగపడడానికి అది క్రమక్రమంగా దోహదం చేస్తోంది! మానవుడు విశ్వవ్యవస్థలోని అనేక ‘బిందువుల’లో ఒకడు. మానవ సమాజం, ధరాతల జీవజాలంలో ఒక ప్రధాన అంశం... జీవజాలం ప్రకృతి! అందువల్ల ప్రధాన అంశమైన మానవ జీవనం స్వచ్ఛతను కోల్పోతూ ఉండడం ప్రకృతి క్రమంగా గాయపడుతుండడానికి కారణం. గాయపడుతున్న ప్రకృతి గాయపరుస్తోంది! అందువల్లనే గతంలో ఊహించని రోగాలు, రోగక్రిములు ఇతరేతర విచిత్రాలు విరుచుకొని పడుతున్నాయి. ఒకదాన్ని నిరోధించి నిర్మూలించిన వెంటనే మరి ఒక విచిత్ర రోగం విస్తరిస్తోంది. సమీప గతంలోనే మెదడువాపు వ్యాధి, సూకర వ్యాధి, విహంగ వ్యాధి- బర్డ్ఫ్లూ-, కుక్కట వ్యాధి- చికెన్‌గునియా-, గోఉన్మాద వ్యాధి,- మాడ్ కౌ డిసీజ్- వంటివి వ్యాపించడం అవనీతలాన్ని ఆవహించి ఉన్న ప్రకృతి రోగగ్రస్త అయిపోతున్న తీరునకు ప్రమాణం... ఇంతేకాదు ఇంకా ఇంకా ఎన్నో జబ్బులు! వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేయవచ్చు, కానీ వ్యాధి రాకుండా, ప్రకృతి రుగ్మతకు గురికాకుండా నిరోధించగల జీవనరీతి మళ్లీ సమాజంలో వ్యవస్థితం ఎందుకు కారాదు?? ఒకప్పుడు, సహస్రాబ్దుల తరబడి, ఇలాంటి సమన్వయ జీవన పద్ధతి మన దేశంలో వ్యవస్థీకృతమై ఉండేది! మానవుడు, కుటుంబంలోను, కుటుంబం సమాజంలోను, సమాజం ప్రకృతిలోను, ప్రకృతి విశ్వవ్యవస్థలోను అవిభాజ్యం అన్న జీవన పద్ధతి స్వచ్ఛతను కాపాడింది! ఈ జీవన స్వచ్ఛత కలిగిన భారతీయులు ప్రాకృతిక స్వచ్ఛతను విశ్వవ్యవస్థ సమన్వయాన్ని రక్షించారు!
ఇలా రక్షణ పొందిన ప్రకృతి ప్రజలను కాపాడింది. చేతులు మాత్రమే కాదు రోజంతా అప్పుడప్పుడు చేతులను, కాళ్లను, ముఖాన్ని మొత్తం శరీరాన్ని కడగికొనడం ఈ దేశంలో జీవన విధానం. మూడు సంధ్యలలో ప్రకృతిని కాపాడాలన్న ధ్యాసతో వందనం చేయడం జీవన విధానం! సూర్యునికంటె ముందు నిద్ర లేవడం, మనకు సర్వం ప్రసాదిస్తున్న భూమికి నమస్కరించడం, చెట్టును ప్రేమించడం, పుట్టను గుట్టను పర్వతాన్ని నదిని సముద్రాన్ని స్వచ్ఛంగా ఉంచడంకోసం శ్రమించడం ఈ దేశంలో అనాది జీవన విధానం... స్వచ్ఛతవల్ల కలిగే పరిణామాలను ఊహించవచ్చు! కానీ స్వచ్ఛత భంగపడితే ‘కలిగే’విపరిణామాలు ఊహకు అందనివి. అందువల్లనే కాలుష్యం విస్తరించడం విరుచుకొని పడుతున్న రోగాలను, వాటి విస్తరణ తీరును ఊహించలేకపోతున్నాము. అందువల్ల ‘స్వచ్ఛత’ను రక్షించడం తాత్కాలిక చర్యగాకాక, శాశ్వత జీవన సహజ విధానంగా వ్యవస్థీకృతం కావాలి!