ప్రకాశం

అన్ని హంగులతో స్టేడియం నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 19:జిల్లాకేంద్రమైన ఒంగోలులో అన్నిహంగులతో స్టేడియం నిర్మాణానికి అనువైన 25ఎకరాల స్థలాన్ని గుర్తించాలని రాష్టప్రర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం సూచించారు. శుక్రవారం జిల్లాకలెక్టర్ సుజాతశర్మతో కలిసి ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో పది ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. వారిద్దరు స్వయంగా పేర్నమిట్ట కొండపైభాగానికి కాలినడకన చేరుకుని అక్కడనుండి స్టేడియం కోసం ఎంపికచేసిన ఖాళీప్రదేశాన్ని గమనించారు. ఈసందర్భంగా ప్రత్యేక ముఖ్యకార్యదర్శి మాట్లాడుతూ క్రీడాభివృద్ధిలో భాగంగా జిల్లాకేంద్రమైన ఒంగోలు నగరంలో ఒక మంచి స్టేడియాన్ని నిర్మించాల్సి ఉందన్నారు. అందుకోసం 25ఎకరాల స్థలాన్ని నగరపరిధిలో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ స్టేడియంలో ఎనిమిది వందల మీటర్ల ట్రాక్, ఇండోర్‌స్టేడియం, స్విమ్నింగ్‌ఫూల్, వసతిగృహాలు తదితరాలు ఏర్పాటుచేస్తామన్నారు. ఐదువందలమంది వరకు వాకర్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. వీరందరికి అనువుగా ఉండే ప్రదేశాన్ని గుర్తించాలన్నారు. ఈ పర్యటనలో వారి వెంట ట్రైనీ కలెక్టర్ వెట్రీసెల్వీ తదితరులు పాల్గొన్నారు.
స్కూలు బస్సు బోల్తా
అద్దంకి, ఫిబ్రవరి 19: అద్దంకి మండలం జార్లపాలెం-చెరువుకొమ్ములెం మధ్య శుక్రవారం ఉదయం స్కూలు విద్యార్థులను చేరవేసే క్రమంలో చైతన్యస్కూలుకు చెందిన స్కూలుబస్సు బోల్తాపడింది. జార్లపాలెంలో విద్యార్థులను ఎక్కించుకుని డొంకరోడ్డులో చెరువుకొమ్ముపాలెం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చే క్రమంలో బస్సు ఒకవైపు ఒరిగి బోల్తాపడింది. ఈబస్సులో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికి గాయాలుకాలేదు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తమపిల్లలను తీసుకెళ్లారు.

జిల్లాలో కొత్తగా నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన
భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి
- కలెక్టర్ సుజాతశర్మ
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 19: జిల్లాలో కొత్తగా నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్య లు తీసుకోవాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపుకార్యాలయంలో జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి నెంబరు 565సంబంధించి యర్రగొండపాలెం, మార్కాపురం మండలాల్లో ఈనెల 21వతేదీల్లో భూసేకరణ అవార్డుపాస్ చేయాలన్నారు. పామూరు, కొనకనమిట్ల మండలాలకు సంబంధించి పివి ఇన్‌స్పెక్షన్స్ పూర్తిచేసి నివేదికలు ఇవ్వాలన్నారు. చీరాల, ఒంగోలు జాతీయ రహదారికి సంబంధించి, చినగంజాం, వేటపాలెం మండలాల్లో అటవీభూమికి సంబంధించి సర్వేపెండింగ్ ఉందన్నారు. ఈనెల 25వతేదీనాటికి సర్వేపనులు పూర్తిచేసి కలెక్టరేట్‌కు నివేదికలు ఇవ్వాలన్నారు. అద్దంకి - నార్కెట్‌పల్లి జాతీయ రహదారికి సంబంధించి నష్టపరిహారం రైతులకు అందలేదని పెండింగ్ బకాయిలు ప్రభుత్వంనుండి విడుదల అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారుల నిర్మాణాల కోసం 2009సంవత్సరం రైతుల వద్ద సేకరించిన భూములకు ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి శాఖలు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాజధాని శంకుస్థాపన పేరు వినగానే
ఉలిక్కిపడుతున్న తల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలు
మంత్రి శిద్దా ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 19 : రాజధాని శంకుస్థాపన పేరు వినగానే తల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలు ఉలిక్కి పడుతున్నాయని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామోనని అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారని ఆయన ఆరోపించారు. హేతుబద్ధత లేకుండా అశాస్ర్తియంగా అవమానకరంగా పిల్ల కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించిన ఘనత తల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలకే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని అనైతికంగా విభజించిన కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం మొసలి కన్నీరు కార్చుతున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్‌పై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన పాపం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుందని, దేశం మొత్తం మీ పార్టీని తిరస్కరించారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలోని బిజెపికి ప్రజలు పట్టం కట్టారన్నారు. రాజకీయ నిరుద్యోగులైన మీరు మీ ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ప్రజలు హర్షించరని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి ఇచ్చారని, దేశంలో ఎక్కడా ఇవ్వని ప్యాకేజీని రైతులకు తమ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ముఖ్యమంత్రి మీద విశ్వాసం ఉండటం వల్లే రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారే తప్పా మరోకటి కాదన్నారు. భూమి పూజకు, శంకుస్థాపనకు తేడా తెలియకుండా రఘువీరారెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

కులవృత్తులకు ఐదు లక్షల రుణాలు
- బిసి కార్పొరేషన్ డైరెక్టర్
ఒంగోలు అర్బన్,్ఫబ్రవరి 19:బిసిల్లోని కులవృత్తులు చేసుకునే లబ్ధిదారులకు ఇక నుండి ఐదులక్షల రూపాయలు రుణాలు ఇవ్వనున్నట్లు బిసి కార్పొరేషన్ డైరెక్టర్ వినుకొండ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. శుక్రవారం స్థానిక జిల్లాతెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2015-16 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో బిసిలకు రెండువందల కోట్లరూపాయలు కేటాయించినట్లు చెప్పారు. త్వరలో బిసి కార్పొరేషన్‌కు 6500కోట్లరూపాయలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత, కులవృత్తుల రుణాలు కింద ఇప్పటివరకు రెండులక్షల రూపాయలు ఇస్తున్నట్లు, త్వరలో ఈ సంఖ్యను ఐదులక్షలరూపాయలకు పెంచుతున్నామన్నారు. పార్టీలకు అతీతంగా బిసిలను అన్నిరంగాల్లో ముందుఉంచటమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తామన్నారు. బిసిలకు ఇబ్బందిలేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తారన్నారు. బిసిలందరు సమన్వయం పాటించాలని విజ్ఞప్తిచేశారు. కొన్నిపార్టీలు పనికట్టుకుని రిజర్వేషన్ల అంశాన్ని రెచ్చగొడుతున్నారని, ఆపార్టీలంతా బిసిలంతా బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా బిసిసెల్ అధ్యక్షుడు ఎంపి ఆంజనేయులు, నగరపార్టీ అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు బొమ్మినేని మురళి, షేక్ కపిల్‌బాషా,నాయకులు పి సుధాకర్, కె శ్రీనివాసరావు, ఒంగోలు మండల అధ్యక్షుడు కామేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రూ 5 లక్షలు విలువైన
కంది పంట బుగ్గి
ముండ్లమూరు, ఫిబ్రవరి 19 : ముండ్లమూరు మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ పరిధిలోని నందమూరి నగర్, లంబాడితండ మధ్య గల భూముల్లో కంది పంట అగ్నికి ఆహుతైన సంఘటన శుక్రవారం జరిగింది. సుమారు ఐదు లక్షల మేర పంట నష్టానికి గురైనట్లు కంది పంట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందమూరు నగర్‌కు చెందిన జమాల్‌నాయక్, బాలాజీనాయక్, బుసిరెడ్డి రాములు, సానికొమ్ము రమణారెడ్డి 8 ఎకరాల్లో కందిపంటను సాగు చేశారు. ఇటీవల కంది పంట ను కోసి గూళ్ళు పెట్టారు. శుక్రవారం 8 ఎకరాల్లోని కంది పంట పూర్తిగా కాలిపోయింది. సాగర్ కాలువ రాకపోవడంతో మాగాణి భూముల్లో కంది పైరు సాగు చేశారు. కంది పంట ఆశాజనకంగా పండిందన్న తరుణంలో ఈ విధంగా జరిగిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేయగా ఫైరింజన్ వచ్చి మంటలను అదుపు చేసినప్పుటికీ ఏమీ మిగలలేదు.

వీరన్నపాలెంలో
ఎసిబి అధికారుల విచారణ
పర్చూరు, ఫిబ్రవరి 19: మండల పరిధిలోని వీరన్నపాలెం గ్రామంలో గుంటూరుకు చెందిన ఎసిబి అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. ఎసిబి ఇన్‌స్పెక్టర్ నరసింహారెడ్డి తెలిపిన వివరాల మేరకు వీరన్నపాలెం గ్రామానికి చెందిన గోరంట్ల వీరయ్యచౌదరి గుంటూరు జిల్లాలో డి ఎల్‌పి ఒగా విధులు నిర్వహిస్తూ ఆదాయానికి మించి ఆస్థులున్నాయని 2015 డిసెంబర్‌లో ఎసిబి అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వీరన్నపాలెంలోని వీరయ్యచౌదరి అస్తులపై విచారణ చేపట్టడానికి వచ్చినట్లు తెలిపారు. వీరయ్యచౌదరికి చెందిన పొలాలను పరిశీలించి నివేదిక తయారు చేశారు. నివేదికను పై అధికారులకు అందజేస్తామని ఎసిబి ఎస్సై చెప్పారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని, మరో రోజు గ్రామంలో ఉన్న ఆయన ఆస్తులపై వివరాలు ఇంకా సేకరించాల్సి ఉందని ఎసిబి ఎస్సై తెలిపారు. ఎసిబి అధికారులు ఎస్‌పిఒ నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ కనకయ్యతో పాటు తహశీల్దార్ కె రాజ్యలక్ష్మి, ఆర్‌ఐ నాగార్జున, ఎఇ శివనాగప్రసాద్, విఆర్వో హుస్సేన్ తదితరులున్నారు.