కరీంనగర్

ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, జనవరి 24: న్యూ ఢిల్లీ వైపునుండి సికింద్రాబాద్, విజయవాడ, మద్రాస్ వైపుకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. శీతాకాలం సందర్భంగా ఏర్పడిన వాతావరణ మార్పులతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల దిగువ ప్రాంతాల్లో నడిచే అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటల పాటు ఆలస్యంగా నడవడంతో పాటు ఆదివారం రోజున ఎగువ, దిగువ లైన్లలో నడిచే దానాపూర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే అధికారులు రద్దు చేశారు. అదే విధంగా న్యూ ఢిల్లీ నుండి చెన్నైకి వెళ్లే గ్రాండ్‌ట్రాంక్ (జిటి) ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగు గంటలు, అండమాన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు 4గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు 2గంటలు, సింగరేణి ప్యాసింజర్ రైలు 3గంటల పాటు ఆలస్యంగా నడుస్తుంది. ఎగువ లైన్లలో నడిచే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లన్ని ఎదావిధిగానే నడుస్తుండగా న్యూ ఢిల్లీ వైపునుండి మద్రాస్ వైపు వెళ్లే దిగువ లైన్‌లోని పలు ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లన్ని గంటల పాటు ఆలస్యంగా నడవడంతో ఆ వైపునకు వెళ్లే రైలు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కున్నారు. రామగుండం ఏరియా నుండి విజయవాడ, మద్రాస్ వైపుకు వెళ్లే ప్రయాణీకులు రైల్వే స్టేషన్ చేరుకున్నాక రైళ్ల ఆలస్యం ప్రకటనతో రైల్వే స్టేషన్‌లో నానా తంటాలు పడ్డారు. 1వ నంబర్ ప్లాట్‌ఫారం లూప్‌లైన్‌లో ట్రాక్‌లైన్ మరమ్మతులు కొనసాగుతుండగా ఈ లైన్ల గుండా వెళ్లే పలు రైళ్లను స్పీడ్ తగ్గించి నడుపుతుండగా మరికొన్ని రైళ్లను 2,3 ప్లాట్‌ఫాం నుండి మరలించి నడుపుతున్నారు. దీంతో ఈ 3ప్లాట్‌ఫాంల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులంతా కూడా 2,3నంబర్ల ప్లాట్‌ఫాంల వద్దనే రైళ్ల రాకపోకల కోసం ఎదురుచూడడంతో ఆ ప్లాట్‌ఫాంలన్ని వందలాది మంది ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. తినుబండారాలకు సంబంధించిన రైల్వే క్యాంటిన్ కూడా 1వ నంబర్ ప్లాట్‌ఫాం వైపునే ఉండడంతో ఈ వైపున ఉన్న వందలాది మంది రైలు ప్రయాణీకులు రైళ్ల ఆలస్యం మూలంగా ఇబ్బందులు పడుతున్నప్పటికి తినుబండారాలకు అనేక ఇబ్బందులను పడాల్సి వచ్చింది. దీనికి తోడు 2,3 నంబర్లలోని ప్లాట్‌ఫాంల వద్ద ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా శుభ్రంగా లేకపోవడంతో కూడా ప్రయాణీకులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరికొంత మంది ప్రయాణీకులు పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు, పలు రైళ్ల ఆలస్యంతో అసహనానికి గురైన ప్రయాణీకులు వెనుదిరిగి వెళ్లారు. కొద్దిరోజులుగా వాతావరణ మార్పులతో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న మంచు ప్రభావం మూలంగా రైళ్లన్ని ఆలస్యంగా నడవడంతో రామగుండం రైల్వే స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్ వద్ద ప్రయాణీకులు లేకుండా బోసిపోయి కనిపిస్తుంది.

ఇదేం ‘చలి’రా బాబోయ్..!
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 24: జిల్లాలో ‘చలి’ పంజా విసురుతోంది. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాంతో జనం గజగజ వణికిపోతున్నారు. మధ్యాహ్నం వరకు ప్రజలు రోడ్లపైకి రావడం లేదు. తప్పనిపరిస్థితుల్లో అయితేనే తగిన రక్షణ కవచాలతో ఇంటి నుంచి బయటకు అడుగుపెడుతున్నారు. ఫలితంగా జన సంచారం కరువై రోడ్లన్ని బోసిపోయి కన్పిస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో జన సంచారం మొదలవుతుండగా, సాయంత్రం ఆరు గంటల తరువాత మళ్లీ తగ్గిపోతోంది. ఉదయం వేళల్లో మంచు విఫరీతంగా కురుస్తోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మంటలు పెట్టుకుంటూ చలి కాగుతున్నారు. ఆదివారం ఉష్ణోగ్రతలు 9డిగ్రీలకు పడిపోయింది. దీనికితోడు శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వాహనాలపై ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. దీంతో ఇదేం ‘చలి’ రా బాబు అంటూ వాపోతున్నారు. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుండటంతో జిల్లా ప్రజలు ఉన్ని వస్తువులను ఆశ్రయిస్తున్నారు. ఎముకలు కొరికే చలి నుంచి రక్షణగా నిలిచే వెచ్చని నేస్తాల (స్వెటర్లు, మంకీ క్యాప్‌లు, దుప్పట్లు, చేతి తొడుగులు) కోసం పరుగులు పెడుతున్నారు. దీంతో ఉన్ని వస్తువుల దుకాణాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని పలుచోట్ల టిబెట్ వ్యాపారులు తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని ఉన్ని వస్తువుల అమ్మకాలను కొనసాగిస్తున్నారు. వీరికితోడు స్థానిక వ్యాపారులు కూడా ఉన్ని వస్తువులను అమ్ముతున్నారు. మొత్తం మీద రెండ్రోజులుగా చలి గజగజ వణికిస్తుండటంతో ప్రజలు ఇదేం ‘చలి’ రా బాబోయ్ అంటూ బయటకు అడుగులేసేందుకు జంకుతున్నారు.

నేడు ఓటర్స్ డే
* జిల్లాలో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన
* జిల్లా కేంద్రంలో 3-కె రన్ నిర్వహణ
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 24: జిల్లా వ్యాప్తంగా సోమవారం ఓటర్ల దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో 3-కె రన్ నిర్వహించనున్నారు. ఈ రన్ జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. అన్ని పోలింగ్ కేంద్రాలు తెరిచి ఉంటాయని, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారికి ఓటరు కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు ప్రతిజ్ఞ ఉంటుందని, అనంతరం ఆడిటోరియంలో ఓటర్ల దినోత్సవం సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, సాంస్కృతిక సారథి కళాబృందంచే కళాజాత కార్యక్రమం ఉంటుందని, జిల్లా పౌరసంబంధాల అధికారిచే ఛాయ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

రబీపై అడుగంటిన రైతన్నల ఆశలు
* డెడ్‌స్టోరేజీకి చేరిన ఎగువ మానేరు జలాశయం
* ఎండిన చెరువులు-బీడు వారిన భూములు * ఈ ఏడు తాగునీటి కటకటే..
గంభీరావుపేట, జనవరి 24: సకాల, అకాల వర్షాలు లేక ఖరీఫ్ పోయి ఆలస్యంగానైన రబీ సాగవుతుందనుకున్న రైతన్నల ఆశలు అడుగంటిపోయాయి. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం నీరులేక డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. వర్షాకాలం ఆరంభం నుండి నేటివరకు ఏ ఒక్క భారి వర్షం కురియకపోవడం మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు నీరులేక వెలవెలపోతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో ఎక్కడచూసిన బీడుభూములే కనిపిస్తున్నాయి. గత ఏడు వర్షాలు కురియక ఆయకట్టు ప్రాంత రైతాంగం ఏడాది కాలంగా దిగాలు చెందుతుండి ఈ ఏడాదయిన వర్షాలు కురిసి పంటలు సాగుచేసుకోవాలనుకున్న రైతులకు కన్నీళ్లే మిగిలాయి. ప్రాజెక్టు, చెరువు కుంటలలో చుక్కనీరు లేక రైతులు బిక్కమొకాలేస్తున్నారు. రెండేళ్లుగా పంటలు లేక అప్పులు పెరిగి బీడు వారిన పంటపొలాలను చూసి ప్రాంత రైతులు దిగాలు చెందుతున్నారు. 31 ఫీట్ల సామర్ధ్యం గల ప్రాజెక్టు ప్రస్తుతం నీరులేక డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. ప్రాజెక్టు పరిధిలోని వేల ఎకరాల సాగుభూములు బీడు భూములుగా మారాయి. కనీసం పశుగ్రాసం దొరకలేని పరిస్థితి నెలకొంది. వర్షాకాలం ఆరంభం నుండి వర్షాలు కురియకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోరు బావుల వద్ద సైతం రైతులు సాగుచేసుకోలేని దుస్థితితో కుమిలిపోతున్నారు. దీంతో ప్రాంత రైతన్నలు ఏమిచేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వచ్చే ఏడాది వరకు ఖర్చులు ఏలా భరించేదని ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయ భూముల పరిస్థితి ఇలావుంటే తాగునీటి పరిస్థితిని తలుచుకుంటేనే మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భూగర్భజలాలు అడుగంటి ఇప్పటికే పలు గ్రామాల ప్రజలు తాగునీటికి నానాతంటాలు పడుతున్నారు. జనవరి చివరిలోనే ఈ పరిస్థితి నెలకొనివుంటే నిండు వేసవిలో దాపురించే పరిస్థితి ఏలా వుంటుదోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పది ఏళ్ల క్రితం వచ్చిన కరువు మళ్లీ నేడు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రజలు గుర్తుకుతెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా తాగునీటికి ఈ ఏడు కటకట తప్పేట్లు లేదు.

పోలీసులు ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 24: పోలీసులు ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ అన్నారు. వయస్సు పెరుగుతున్న దృష్ట్యా వివిధ రకాల ఒత్తిళ్లతో వ్యాధులు సంక్రమిస్తున్నాయని, పరీక్షలు చేయించుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో అపోలోరీచ్ ఆసుపత్రి సహకారంతో జిల్లా పోలీస్ శాఖ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉంటేనే సమర్థవంతమైన సేవలు అందించవచ్చన్నారు. జిల్లా పోలీసుల సమర్థవంతమైన సేవలకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. పోలీస్ కుటుంబ సభ్యులకు కూడా ఉచిత వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరాలను నిర్వహించనున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని యూనిట్ ఆసుపత్రిలో అన్ని రకాల రక్తపరీక్షలు నిర్వహించడం జరుగుతోందని, పోలీస్ కుటుంబాలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ వైద్య శిబిరంలో పోలీసులకు బిపి, షుగర్, ఇసిజి, బోన్ మినరల్ బెన్‌ఫిటి, 2డి ఇకో, గుండె, ఎముల పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయా విభాగాలకు చెందిన వైద్యనిపుణులు రిపోర్టులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఒఎస్‌డి సుబ్బారాయుడు, ట్రైనీ ఐపిఎస్ అధికారిని సింధు శర్మ, కరీంనగర్ డిఎస్పీ రామారావు, ఎఆర్‌డిఎస్పీ కోటేశ్వర్ రావు, ఆర్‌ఐలు గంగాధర్, శశిధర్, అపోలోరీచ్ పరిపాలనాధికారి బాబూరావు, మెడికల్ సూపరింటెండెంట్ నరేష్ కుమార్, యూనిట్ ఆసుపత్రి వైద్యులు, ఆసుపత్రి ఇంచార్జి చంద్రశేఖర్, అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్ టిఆర్‌ఎస్ ఏజెంట్, చీఫ్ సెక్రటరీ ప్రచారకర్త
*ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి ధ్వజం
జగిత్యాల, జనవరి 24: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తుందని జిహెచ్‌ఎంసి ఎన్నికలలో గవర్నర్ టిఆర్‌ఎస్ ఎజెంటుగా, ప్రభుత్వ చీప్ సెక్రటరీ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారని ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి ఆరోపించారు. ఆదివారం జగిత్యాలలో టిఆర్‌ఎస్ పాలన అధికార వ్యవహార శైలి ప్రజల ఇబ్బంలపై మధుయాష్కి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అసలు స్వరూపాన్ని ప్రజలు బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అటు ఆంధ్రా సిఎం చంద్రబాబు, ఇటు తెలంగాణ సిఎం చంద్రశేఖర్‌రావు ఇద్దరు చంద్రులు ప్రజల మభ్య పెడుతూ నాటకం ఆడుతున్నారని విమర్శించారు.
ఇలాగే అవినీతి కూపంలో ఇరుక్కుపోయినవారికి ప్రాజెక్టులు అప్పజెప్పుతూ ఇష్టంవచ్చిన రీతిలో తెలంగాణలో పాలన సాగిస్తూ ఓ వైపు కెటిఆర్, మరో వైపు కవిత రాజ్యమేలుతున్నారన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం మత కల్లోలాలు రెచ్చగొట్టి ప్రశ్నించే వారిని తప్పుడు కేసులతో అరెస్టులు చేయిస్తున్నారని మధుయాష్కి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర మంటే కేవలం తమ సొంత నియోజక వర్గం గజ్వెల్, సిరిసిల్ల, సిద్దిపేట తప్పా వేరు ప్రాంతాలు సిఎం కెసిఆర్‌కు కనబడడం లేదని కేవలం కుటుంబ సభ్యుల నియోజక వర్గాలకే పరిమితం అయ్యారని ధ్వజమెత్తారు. సిఎం కెసిఆర్ మాటల మాంత్రికుడు దొరగారి అహంకార ప్రవర్తనకు మాటలు అద్దం పడుతున్నాయన్నారు. 20నెలల టిఆర్‌ఎస్ పాలన ప్రజలు నిస్వార్థంగా అర్థం చేసుకొని తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరూ కదలాల్సిన అవసరం ఉందన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో వాటర్ లెవన్ తగ్గి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రైతుల ఆదుకునేందుకు సిఎం కెసిఆర్‌కు క్షణం తీరిక లేకుండాపోయిందన్నారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులను ఇస్తామని మభ్యపెట్టినట్లే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మరోసారి మోసానికి తెరతీస్తూ గ్రెటర్ ఎన్నికల్లో అధికారం కోసం యత్నిస్తున్నారని గుర్తు చేశారు. కార్పొరేట్ కళాశాలలు నారాయణ, శ్రీచైతన్య పన్నులు చెల్లించకున్నా పెద్ద మొత్తంలో అందాల్సినవి అందుతుండడంతో ఆవైపు చూడడం లేదన్నారు. రోహిత్ ఆత్మహత్య సంఘటనపై సిఎం కెసిఆర్ కనీసం స్పందించిన పాపాన పోలేదని ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శంకర్, ఎంపిపి గర్వందుల మానస, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

హెల్మెట్‌లు ధరించకపోతే చర్యలు : సిఐ
కోహెడ, జనవరి 24: ద్విచక్ర వాహనచోదకులు విధిగా హెల్మెట్లు ధరించాలని, లేకపోతే చర్యలు తీసుకోనున్నట్లు సిఐ దాసరి భూమయ్య తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ భద్రతావారోత్సవాలలో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించి ప్రమాదాల నివారణకు వాహనదారులను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని, తద్వారా ప్రమాదాలలో విలువైన ప్రాణాల్ని పోగొట్టుకోకుండా ఉంటారని, అలాగే కారులలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించడం వల్ల క్షేమంగా ప్రయాణించవచ్చునని అన్నారు. గుట్కాలు విక్రయించినా, బెల్టు షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బెల్టు షాపులలో ఇదివరకే ఎవరైనా మద్యం నిలువలు ఉంచిన పక్షంలో త్వరగా వాటిని సదరు షాపుల్లో వాటిని వాపస్ చేయాలని సూచించారు. ప్రజల అవసరాల్ని, బలహీనతలను ఆసరాగా చేసుకొని మంత్రాలు, తంత్రాలతో పబ్బం గడుపుకునే వారి భరతం పట్టుతామని హెచ్చరించారు. ఎలాంటి అర్హతలు లేకున్నా డాక్టర్లుగా చలామణి అవుతున్న వారిపై కనే్నసామని, అలాంటి వారిని చట్టరీత్యా శిక్షించనున్నట్లు తెలిపారు. ఆర్‌ఎంపి, పిఎంపిలు డాక్టర్లుగా చలామణి కారాదని, తమ పేర్ల ముందు డాక్టర్ అని రాసుకొని బోర్డు పెట్టడం నేరమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని సదరు డాక్టర్లు వాటిని తొలగించాలని, తమకున్న అర్హతల మేరకే పని చేయాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే అక్రమ ఇసుక వ్యాపారంపై నిఘా ఉంచామని, ఇలాంటివి సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ నైలూ పాల్గొన్నారు.

రైతు కన్నీరు పెడితే అరిష్టం
గోదావరిఖని, జనవరి 24: ఎద్దు ఏడిస్తే వ్యవసాయం బాగుపడదు..రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదు అని రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేయాలని హైకోర్టు మాజి న్యాయమూర్తి బి. చంద్రకుమార్ అన్నారు. ఆదివారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించిన అనంతరం మాట్లాడారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల రైతు అనేక నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నాడని, మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటి సమయంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వాలు ప్రోత్సహించి వారిని ఆదుకునేందుకు కృషి చేయాలని అన్నారు. లక్షల కోట్ల రూపాయల రుణాలు పొంది చెల్లించని పారిశ్రామిక వేత్తల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి అప్పులు కట్టించుకోవడం కోసం బ్యాంకు అధికారులే పారిశ్రామిక వేత్తల ఇళ్లముందు పడిగాపులు కాస్తున్నారని అన్నారు. పంటకోసం 30వేల రూపాయల రుణం తీసుకున్న రైతు అనుకోని పరిస్థితుల్లో నష్టం వాటిల్లి చెల్లించకుంటే బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్లపై బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ మానసికంగా వేధించడంవల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. పర్యావరణాన్ని కాపాడి జలవణరులను పెంచుకునేందుకు ఇసుక తరలింపును అరికట్టాలని, అరికడితే నీటి నిల్వలు పెరిగి రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. అదే విధంగా పండించిన పంటకు అమ్ముకునేందుకు దళారి వ్యవస్థలను తొలగించి ప్రభుత్వాలు నేరుగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. అదే విధంగా విత్తనాలను ప్రభుత్వాలే తయారు చేసి రైతులకు అందించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న గోదావరిఖని ఎ ఎస్పీ విష్ణు ఎస్ వారియార్ మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, సమస్యలు ఉంటే ప్రభుత్వ అధికారుల వద్దకు వస్తే తగిన రీతిలో సూచనలు, సలహాలను అందించి ఆదుకుంటామన్నారు.
కార్యక్రమంలో రైతు సంక్షేమ సమితి రామగుండం ఏరియా కన్వీనర్ ఏలేశ్వరం వెంకటేష్, గోదావరిఖని వన్‌టౌన్ సి ఐ వెంకటేశ్వర్, రామగుండం వ్యవసాయ అధికారిణి అలవేణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అమరేందర్ రావు, మాజి ఎమ్మెల్యే మాతంగి నర్సయ్య, స్థానిక నాయకులు పిటి స్వామి, అందె సదానందం, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, జెవి రాజు, ముడిమడుగుల మల్లన్న, వేముల అశోక్, అమంచు గౌతం పాల్గొన్నారు.

ప్రజారాజ్య నిర్మాణమే
వామపక్షాల లక్ష్యం
కరీంనగర్ టౌన్, జనవరి 24: విశాలాంధ్రలో ప్రజారాజ్యం స్థాపించకపోయినా, తెలంగాణలో మాత్రం దీని నిర్మాణమే లక్ష్యంగా వామపక్షపార్టీ సిపిఎం ముందుకు సాగుతోందని ఆపార్టీ రాష్టక్రార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. తెలంగాణ వ్యవసాయకార్మికుల మొదటి రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం నగరంలోని పద్మనాయక కల్యాణమండపంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక విధానాలతో దినమొక గండంగా బతుకీడుస్తున్నారని, బడుగు, బలహీనవర్గాల ఓట్లతోసీట్లు పొంది ఉన్నత వర్గాల కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. కార్మికులంతా సంఘటితమై పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తేనే ప్రపంచీకరణకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కార్మికసంఘాలు ఏపార్టీకి అనుబంధంగా కాకుండా స్వతంత్రంగా కొనసాగితే వీటి విస్తరణ మరింత పెరిగి, అన్నిపార్టీలు మద్దతునిచ్చే అవకాశాలుంటాయన్నారు. కూలీరేట్ల పెంపు డిమాండ్‌తో పాటు సామాజిక సమస్యలపై కూడా వ్యవసాయకార్మికులు పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మికసంఘం రాష్టక్రార్యదర్శి బి.వెంకట్ పలు తీర్మాణాలు ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా అమోదించారు.
అంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య, కెవిపి ఎస్ రాష్ట్ర కార్యదర్శి కైలాస్‌బాబు, వ్యకాస జిల్లా అధ్యక్షుడు మర్రి వెంకటస్వామి, సిపి ఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, సి ఐటియు నాయకులు ఎరవెల్లి ముత్యంరావు, జ్యోతి, ఎస్ ఎఫ్ ఐ శేఖర్, నాగరాజు, బి.సారంగపాణి, ఎడ్లరమేశ్, పప్పు సదానందం, గుడికందుల సత్యంలతో పాటు పలువురు పాల్గొన్నారు.