అనంతపురం

రిజిస్ట్రేషన్లకు నోట్లదెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 29 : పెద్ద నోట్ల రద్దుతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా ఆదాయం తగ్గిపోయింది. నోట్లు రద్దు చేయడం వల్ల భూముల రిజిస్ట్రేషన్, ఇతరత్రా ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు నష్టం వాటిల్లడంతో ‘పెద్ద’దెబ్బ పడింది. చేతిలో ‘చిల్లర’ నోట్లు ఆడక, కొత్త నోట్లు అవసరమైనన్ని అందని పరిస్థితుల్లో వివిధ రకాల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పడిపోయాయి. ఒకనెలలో ఆర్జించే ఆదాయంలో సుమారు సగం వరకూ నష్టపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అనంతపురం, హిందూపురం జిల్లాల రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలు మందగించాయి. కేవలం 21 రోజుల్లోనే సగానికి పైగా ఆదాయాన్ని కోల్పోయాయి. ముఖ్యంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ఫీజ్, బదిలీలపై పన్ను(ట్రాన్స్‌ఫర్ డ్యూటీ), యూజర్ చార్జీలు, ఈసి చార్జీలు వంటి వివిధ రకాల కార్యకలాపాలు కుంటుపడ్డాయి. కొత్త రూ.2వేల నోట్లు చేతికందకపోవడం, కొన్ని అందినా రూ.500, రూ.1000, రూ.100, రూ.50 తదితర చిల్లర నోట్ల సమస్య వేధిస్తుండటం, బ్యాంకుల్లో పరిమితంగా నగదు ఇస్తుండటంతో సకాలంలో డబ్బు చేతికందక పోవడం వంటి పలు కారణాలతో లావాదేవీలు పడిపోయాయి. అనంతపురం, హిందూపురం జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కనీసం రూ.8 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. ఒక్క అనంతపురం రిజిస్ట్రార్ జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోనే ఈనెల 8 నుంచి ఇప్పటి వరకు రూ.5కోట్ల మేర నష్టం వాటిల్లింది. అక్టోబర్‌లో 4,996 డాక్యుమెంట్లు రిజిష్టర్ కాగా, మొత్తం రూ.11.23 కోట్ల ఆదాయం లభించింది. అదే నవంబరులో ఇప్పటి వరకు సుమారు రూ.6.50 కోట్లు మాత్రమే లభించింది. కేవలం 1461 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముఖ్యంగా సేల్స్, మార్జిగేజ్, గిఫ్ట్ డీడ్ వంటి వాటి రిజిస్ట్రేషన్లపై దెబ్బ పడింది. డబ్బు లేకపోవడంతో వందలాది మంది వినియోగదారులు డాక్యుమెంట్ల అగ్రిమెంట్లను(ఎక్స్‌టెన్షన్ ఆఫ్ అగ్రిమెంట్స్) పొడిగించుకుంటున్నారు. దీంతో డాక్యుమెంట్ రైటర్ల ఆదాయం సైతం తగ్గిపోయింది. రోజువారీ ఆదాయం రాక అవస్థలు పడుతున్నారు.
లక్ష్య సాధనకు ఆటంకం
ప్రభుత్వం ఈఏడాది రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇచ్చిన లక్ష్య సాధనకు పెద్ద నోట్ల రద్దు తీవ్ర ఆటంకంగా మారనుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంతోపాటు అనంతపురం రూరల్ పరిధిలో రిజిస్ట్రేషన్లు భారీగా జరిగేవి. ఈ ఆర్థిక సంవత్సరానికి(ఏప్రిల్ 2016- మార్చి 2017 వరకు) అనంతపురం రిజిస్ట్రార్ జిల్లాకు 177.57 కోట్ల ఆదాయం సమకూర్చాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో ఈ ఏడాది అక్టోబర్ నాటికి రూ.100.32 కోట్ల లక్ష్యం సాధించాల్సి ఉంది. అయితే రూ.78.20 కోట్లు మాత్రమే ఆర్జించి కేవలం 77.95 శాతం లక్ష్యం సాధించడం జరిగింది. నవంబరులో నష్టాన్ని పూడ్చుకోవాలని ఆశించిన అధికారులకు పెద్దనోట్ల రద్దు ఆటంకంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లాల్లో మరో ఏడెనిమిది కోట్ల రూపాయల ఆదాయం కోల్పోక తప్పదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈఆర్థిక సంవత్సరం లక్ష్య సాధనలో రెండు జిల్లాల్లోనూ కనీసం ఐదారు కోట్ల రూపాయల నష్టం వాటిల్లక తప్పదని అధికారులే అంచనా వేస్తున్నారు.

నష్టం తప్పడం లేదు..
- ఎస్. ఆంజనేయులు నాయక్, జిల్లా రిజిస్ట్రార్ (ఎఫ్‌ఏసి), అనంతపురం.
పెద్ద నోట్ల రద్దు ప్రభావం రిజిస్ట్రేషన్లపై భారీగానే పడింది. దీంతో వినియోగదారులు అగ్రిమెంట్లను పొడిగించుకుంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాలకు ఇప్పటికే సరఫరా అయిన మొత్తం రూ.3 కోట్ల విలువైన స్టాంపులను పంపిణీ చేశాం. రూ.5, రూ.10 స్టాంపులు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంపులు రూ.45 లక్షల విలువైనవి, స్పెషల్ అడెసివ్ స్టాంపులు రూ.2.76 కోట్లు, రెవెన్యూ స్టాంపులు రూ.4.23 లక్షల మేరకు పంపిణీ చేశాం. ఎవరూ స్టాంపుల్ని బ్లాకులో కొనాల్సిన అవసరం లేదు.
బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్లు!
* ఖాతా లేని వారి ఆందోళన
అనంతపురంటౌన్, నవంబర్ 29 : సాంఘిక భద్రత పెన్షన్లను బ్యాంకు అకౌంట్ల ద్వారా పంపిణీ చేయటానికి డిఆర్‌డిఏ పి.డి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో అకౌట్లు లేనివారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పెద్దనోట్ల రద్దుకుతోడు కరెన్సీ కొరత అధికం కావటంతో బ్యాంకు అకౌంట్లలో పెన్షన్లను జమ చేయటం ద్వారా సమస్యను అధిగమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడచిన మూడునెలల క్రితమే పెన్షన్‌దారుల నుంచి బ్యాంక్ అకౌంట్ల ఖాతాల వివరాలు, ఆధార్, రేషన్‌కార్డుల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ క్రమంలో బ్యాంక్ ఖాతాలు ఉండి ఆధార్‌కార్డు నంబర్లు నమోదుకానివారి వివరాలను సేకరించే బాధ్యతలను ఆయా డివిజన్లలో పెన్షన్ పంపిణీ చేసేవారికి అప్పగించారు. బ్యాంక్ అకౌంట్లు లేనివారిచే ఖాతాలు తెరిపించాలని ఆదేశిస్తూ డెలిగేట్ కమిషనర్ కృష్ణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకుగా బ్యాంకు దరఖాస్తు కాపీలను సిబ్బందికి అందజేశారు. అధికారిక గణాంకాల ప్రకారం నగరంలో 20473 మందికి సాంఘిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వీరిలో బ్యాంకు ఖాతాలు కలిగినవారు 12653 మంది ఉన్నారు. బ్యాంకు అకౌంట్లు ఉండి ఆధార్ లింక్‌కానివారు 5650 మంది ఉన్నారు. 2170 మందికి బ్యాంక్ అకౌంట్లు లేవు. పూర్తిగా బ్యాంకు అకౌంట్లు లేనివారు అర్హులై ఉండి ఖాతాలు తెరవలేదా లేక అనర్హులైనవారు రద్దు వేటు తప్పించుకునేందుకు ఖాతాలు సమర్పించకుండా పెన్షన్లు తీసుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. మంగళ, బుధవారంలోగా ఆధార్ లింకప్‌ప్ చేయవచ్చని అంటున్నారు. అయితే ప్రస్తుతం బ్యాంకుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఒకేసారి 2170 మందికి బ్యాంక్ అకౌంట్లు తెరిపించటం ఆచరణ సాధ్యం కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. బ్యాంకుల్లో పెద్దనోట్ల డిపాజిట్లు తప్పించి కొత్త అకౌంట్ల ఓపెనింగ్ గడచిన కొన్ని రోజులుగా చేపట్టని పరిస్థితి నెలకొంది. దీంతో సాంఘిక భద్రత పెన్షన్ల పంపిణీలో తలెత్తే పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలియక అధికారులు తంటాలు పడుతున్నాయి. బుధవారం నాటికి సాంఘిక భద్రత పెన్షన్ల మొత్తం డిఆర్‌డిఏ పి.డి కార్యాలయం విడుదల చేసి చెక్కులు జారీ చేసిన తర్వాత ఆ మొత్తాలను బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తాలను పెన్షన్‌దారుల ఖాతాలకు జమ చేసేలా జాబితాను అందజేయాల్సి ఉంటుందన్నారు. బ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి సాఫీగా ఖాతాలకు జమ చేయవచ్చని అంటున్నారు. ఖాతాలు ఉండి ఆధార్‌లింక్ కానివారి జాబితా సిద్ధం చేసి పంపినా, పూర్తిగా బ్యాంక్ ఖాతాలు లేని 2170 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఖాతాలు లేనివారికి బ్యాంక్ అకౌంట్లు తెరిపించటం ఆచరణ సాధ్యమైతేనే పరిస్థితిని అధిగమించవచ్చని అంటున్నారు.

అర్హులందరికీ రేషన్‌కార్డులు
* మంత్రి పరిటాల సునీత
చెనే్నకొత్తపల్లి, నవంబర్ 29 : త్వరలో రాష్ట్రంలో కొత్తరేషన్‌కార్డులను మంజూరు చేయనున్నట్లు మంత్రి పరిటాల సునీత అన్నారు. మంగళవారం మండలంలోని గంగినేపల్లిలో జరిగిన జనచైతన్యయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గంగినేపల్లి, బ్రాహ్మణపల్లి, ఎర్రోనిపల్లి తండాల్లో కొత్తగా నిర్మించిన సీసీరోడ్లు, కమ్యూనిటీ భవనాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థికలోటు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే అర్హులందరికీ త్వరలో రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దశలవారీగా గ్రామాల్లోని సమస్యలను సైతం పరిష్కరించనున్నట్లు తెలిపారు. గ్రామాలను ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అలాగే ప్రతి పేదకూ ప్రభుత్వఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రైస్తవులకు క్రిస్‌మస్ సందర్భంగా ఉచితంగా సరుకులను అందిస్తామన్నారు. సంక్రాంతి, రంజాన్‌తోఫాలను మునుపులాగానే అందించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు ముందుండి పనిచేయాలన్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో అభివృద్ధికి నోచుకోక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు చొరవ చూపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ చమన్, మంత్రి తనయుడు శ్రీరామ్, టీడీపీ సీనియర్ నాయకులు ఎల్.నారాయణచౌదరి, ఎంపీపీ అంకే అమరేంద్ర, జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, మార్కెట్‌యార్డు వైస్‌చైర్మన్ దండు ఓబులేసు, కన్వీనర్ శ్రీరాములు, సర్పంచిలు గోపాల్, ఎంపీటీసీ రాజు, బీసీ సెల్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
2న గొల్లపల్లి, మడకశిరలో ముఖ్యమంత్రి పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, నవంబర్ 29 : ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చేనెల 2న జిల్లాకు రానున్నాయి. ఆరోజు ఉదయం హంద్రీనీవా రెండో దశ కాలువ ద్వారా చేరిన కృష్ణాజలాలను గొల్లపల్లి రిజర్వాయర్‌కు విడుదల చేస్తారు. అనంతరం మడకశిరలో స్వయం సహాయక మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని ప్రారంభిస్తారు. తర్వాత మడకశిర రింగ్ రోడ్డు, బాల, బాలికల రెసిడెన్సియల్ స్కూళ్ల భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఈమేరకు కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖరబాబు, పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, పెనుకొండ ఆర్డీఓ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది, పోలీసు అధికారులు తగిన చర్యలు చేపట్టారు. కాగా సిఎం పర్యటన షెడ్యూల్ నేడో,రేపో అధికారికంగా వెలువడనుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఖరారు
* జిల్లాలో పట్ట్భద్రులకు 119, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 65
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, నవంబర్ 29 : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు ఖరారయ్యాయి. ఈమేరకు సంబంధిత జాబితాను న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినట్లు డిఆర్‌ఓ మల్లీశ్వరి మంగళవారం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ రాయలసీమలో పట్ట్భద్రుల నియోజకవర్గంలో 336, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 175 చొప్పున పోలింగ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇందులో జిల్లాలో పట్ట్భద్రులకు 119, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 65 చొప్పున ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. అలాగే కడపలో పట్ట్భద్రులకు 105, ఉపాధ్యాయులకు 52, కర్నూలులో 112, 54 చొప్పున పోలింగ్ కేంద్రాలకు ఆమోదం లభించిందని తెలిపారు. ఈ జాబితాను అన్ని తహశీల్దారు, ఎంపిడిఓ, మున్పిపల్, ఎంఇఓ, ఆర్‌డిఓ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనార్థం నోటీసు బోర్డుల్లో ఉంచినట్లు తెలిపారు. కాగా ఈనెల 23న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, పేరు నమోదు చేయడానికి డిసెంబర్ 8 లోపు సంబంధిత తహశీల్దారు, మున్సిపల్, ఆర్‌డిఓ కార్యాలయాల్లో క్లెయిమ్‌లను అందజేయవచ్చని తెలిపారు.

2న మడకశిరలో డ్వాక్రా సదస్సుకు
హాజరుకానున్న సిఎం
* కలెక్టర్ కోన శశిధర్
మడకశిర, నవంబర్ 29 : మడకశిరలో వచ్చేనెల 2న నిర్వహించనున్న డ్వాక్రా మహిళల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నట్లు కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఈమేరకు మంగళవారం పట్టణ సమీపంలోని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని కలెక్టర్‌తోపాటు ఎస్పీ రాజశేఖర్‌బాబు, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న, జెసిలు లక్ష్మీకాంతం, ఖాజామోహిద్దీన్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ సుబ్రమణ్యం పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో సిఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద హంద్రీనీవా నీటిని విడుదల చేసి బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మడకశిరలో జరిగే డ్వాక్రా సదస్సులో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో రూ.50 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం, రూ.197 కోట్లను పసుపు, కుంకుమ పథకం కింద మహిళా సంఘాల సభ్యులకు సిఎం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. హెలిప్యాడ్ వద్దే పాలిటెక్నిక్ విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్‌ఇ ప్రసాద్‌రెడ్డి, డిఆర్‌డిఏ పిడి వెంకటేశ్వర్లు, ఇఇలు కొండయ్య, శ్రీనివాసరావు, ఆర్డీఓ రామ్మూర్తి, డిపిఓ జగదీశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎటిఎంలలో నిండుకున్న నగదు!
* బ్యాంకు ఎదుట అన్నదాతల నిరసన
* మధ్యాహ్నానికే నో క్యాష్ బోర్డులు...
హిందూపురం, నవంబర్ 29 : పెద్ద నోట్లు రద్దు కావడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎటు చూసినా ఎటిఎంలు, బ్యాంక్‌ల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరకొరగా ప్రధాన బ్యాంక్‌ల ఎటిఎంలలో నగదు అందుబాటులో ఉంచుతున్నా కొద్ది సేపటికే ఖాళీ అవుతుండటంతో గంటల తరబడి క్యూల్లో ఉన్న వారు తీవ్ర మనోవేదనకు గురవుతూ వెనుదిరుగుతున్నారు. ప్రధాన బ్యాంకులు మినహా మిగిలిన బ్యాంక్‌ల ఎటిఎంలలో గత 20 రోజులుగా నో క్యాష్ అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీని కారణంగా అసలే నామమాత్రంగా ఇచ్చే నగదు కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి మధ్య తరగతి కుటుంబాల్లో దాపురించింది. చిల్లర నోట్లు దొరక్క వివిధ వర్గాలు అనేక కష్టాలకు గురవుతున్న నేపథ్యంలో పెద్ద నోట్లు రద్దైన తర్వాత ప్రప్రథమంగా రైతాంగం రోడ్డుపైకి ఎక్కి నిరసన చేసిన సంఘటన పరిగిలో చోటు చేసుకుంది. పరిగిలోని సిండికేట్ బ్యాంక్ వద్ద నగదు లావాదేవీల కోసం పెద్ద సంఖ్యలో మంగళవారం రైతులు, ఖాతాదారులు తదితరులు చేరుకున్నారు. అయితే కొద్ది సేపటికే నగదు అందుబాటులో లేదంటూ ప్రకటించడంతో ప్రధానంగా రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దై 20 రోజులు పైబడుతున్నా ఇప్పటికీ తమకు చిల్లర నోట్లు దొరక్క ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో తమ అవసరాల కోసం క్యూలో నిలబడినా ఎలాంటి ప్రయోజనం లేదంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకుల్లో కూడా అవసరమైన మేరకు నగదు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. దీనికి తోడు రూ.10, రూ.50, రూ.100 నోట్లు బ్యాంకుల్లో చిరిగిపోయిన నోట్లు, గతంలో తిరస్కరించిన ఆయా నోట్లను ఇస్తుండటంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా పెద్ద నోట్ల రద్దు కావడం, కనీస స్థాయిలో కూడా అవసరమైన నోట్లు అందుబాటులో లేకపోవడంతో ఓ వైపు భవన నిర్మాణ రంగంతోపాటు మరోవైపు బంగారం, సిమెంటు, ఇనుము, చేనేత, మరమగ్గాలు వంటి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ఆవేదనకు గురవుతున్నారు. కూలీలకు ఇచ్చే నగదు కూడా ఆయా వర్గాలకు అందుబాటులో లేకపోవడంతో అరకొరగా ఇచ్చి పంపిస్తున్నారు. కాగా తమ ఖాతాల్లో నగదు నిలువ ఉన్నా డ్రా చేసుకోలేని పరిస్థితి ఖాతాదారుల్లో నెలకొంది. కేంద్ర ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుండటం, నిర్ణీత స్థాయిలో కూడా బ్యాంకులు, ఎటిఎంలలో నగదు అందుబాటులో లేకపోవడం వల్ల అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నోట్ల కష్టాలు ఎప్పుడు తీరుతాయో వేచి చూడాల్సిందే.
సక్రమంగా పని చేయని
ఉపాధ్యాయులు మాకొద్దు..
* పాఠశాలకు తాళం
గుత్తి, నవంబర్ 29 : మండల పరిధిలోని చురకపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సక్రమంగా పని చేయడం లేదని ఆరోపిస్తూ స్థానికులు ఉపాధ్యాయులు, విద్యార్థులను మంగళవారం బయటకు పంపి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడుగురు ఉపాద్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఉపాధ్యాయులు విధుల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం పాఠశాల ప్రారంభమైన అనంతరం గ్రామానికి చెందిన గ్రామస్థులు కొందరు పాఠశాల వద్దకు చేరుకుని విధులు సక్రమంగా నిర్వహించని ఉపాధ్యాయులు తమకు అవసరం లేదని ఉపాధ్యాయులతో వాగ్వివాదానికి దిగారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గ్రూపులుగా ఏర్పడి పోటాపోటీగా విధులు సక్రమంగా నిర్వహించకుండా గంటల తరబడి తరగతులు ఎగ్గొట్టి ఫోన్లలో సంభాషిస్తున్నారన్నారు. గ్రామస్థులను శాంతిపజేయడానికి హెచ్‌ఎం సురేంద్ర, పలువురు ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పాఠశాల మధ్యాహ్నం వరకూ పాఠశాల మూతబడింది. విషయం తెలుసుకున్న ఎంఇఓ వేణుగోపాల్ చేరుకుని గ్రామస్థులతో చర్చించారు. అయినా వినకపోవడంతో సమస్యను డిఇఓ కార్యాలయానికి చేరవేశారు. తిరిగి సాయంత్రం ఎస్‌ఐ రామంజినేయులు గ్రామానికి చేరుకుని మూతబడిన పాఠశాలను తెరిపించారు. అదేసమయంలో అక్కడి చేరుకున్న గ్రామస్థులు డిఇఒ ఇక్కడి వచ్చి సమస్యను పరిష్కరించేంత వరకూ పాఠశాలను తెరవనీయమని తెగేసి చెప్పారు.
కసాపురం ఆంజనేయ స్వామిని
దర్శించుకున్న డిఐజి
గుంతకల్లు, నవంబర్ 29 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని డిఐజి ప్రభాకర్‌రావు మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయనకు ఆలయ లాంచనాలతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చరిత్రను వివరించడంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. తర్వాత దుశ్శాలువాలు పూల మాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ ముత్యాలరావు, ఎఇఓ మధు, డిఎస్పీ రవికుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో రూ.350 కోట్ల విద్యుత్ బకాయిలు
* ఎస్‌ఇ ప్రసాద్‌రెడ్డి
మడకశిర, నవంబర్ 29 : జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్ శాఖకు రూ.350 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని సంబంధిత శాఖ ఎస్‌ఇ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కదిరి, ధర్మవరం, రాయదుర్గం, మడకశిర మున్సిపాలిటీల నుంచి రూ.30 కోట్లు వసూలు కావాల్సి ఉన్నట్లు తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీల నుంచి రూ.140 కోట్ల బకాయిలు ఉండగా ఇందులో కొంతభాగం 14వ ఆర్థిక సంఘం నిధులతో రికవరీ చేసినట్లు తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా పథకం నుంచి రూ.65, సత్యసాయి ప్రాజెక్టు నుంచి రూ.55, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి రూ.10, గృహ నిర్మాణ శాఖ నుంచి రూ.20, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ల నుంచి రూ.25, పరిశ్రమల నుంచి రూ.20 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉన్నాయన్నారు. మొండి బకాయిలు ఉన్న శాఖల కార్యాలయాలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మడకశిర నగర పంచాయతీ రూ.4.51 కోట్ల విద్యుత్ బకాయిలు ఉండగా అందులో రూ.3 లక్షలను మంగళవారం చెల్లించడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఇ శేషగిరి, ఎడిఇ రవిప్రసాద్, ఎఇ చెన్నకృష్ణ పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
* మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తి,నవంబర్ 29 : విద్యార్థులు విద్యతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడల్లో రాణించాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. మంగళవారం పుట్టపర్తి మండలంలోని జగరాచుపల్లి ఆదర్శ పాఠశాలలో పైకా క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికే గర్వకారణమైన సచిన్ టెండూల్కర్, విరాట్‌కోహ్లి, పీవీ సింధు లాంటి క్రీడాకారులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రుల ఆశలను నిజం చేసేలా జీవితాన్ని మలచుకోవాలన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థినీవిద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు.
మాజీ సర్పంచికి నివాళి...
పుట్టపర్తి మాజీ సర్పంచి దివంగత కడియాల వెంకటాద్రికి మంత్రి పల్లె నివాళులర్పించారు. పుట్టపర్తి చిత్రావతినది సమీపంలోని వెంకటాద్రి ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో పాటు మంత్రి నివాళులర్పించారు. వెంకటాద్రి కుమారుడు పుట్టపర్తి మున్సిపల్ వైస్‌ఛైర్మన్ కడియాల రాము కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఆయన అభిమానులు పాల్గొన్నారు.

గుత్తి పోలీస్ స్టేషన్ తనిఖీ
గుత్తి, నవంబర్ 29 : స్థానిక పోలీస్ స్టేషన్‌ను అనంతపురం రేంజ్ డిఐజి ప్రభాకరరావు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉదయం గుత్తికి చేరుకున్న డిఐజికి తాడిపత్రి డిఎస్పీ చిదానందరెడ్డి, సిఐ మధుసూదన్‌గౌడ్ సిబ్బందితో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ప్రారంభించారు. అనంతరం స్టేషన్‌కు చేరుకుని రికార్డులు, లాకప్ గదులు, పట్టుబడిన వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. నేరాల నియంత్రణలో పోలీసులు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం అందించేందుకు పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రతి పోలీసు తనకు కేటాయించిన గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు చాంద్‌బాషా, రామంజినేయులు తదితరులు పాల్గొన్నారు

వ్యక్తి ఆత్మహత్య
బెళుగుప్ప, నవంబర్ 29 : మండల పరిధిలోని కోనాపురం గ్రామానికి చెందిన వడ్డే వెంకటరాముడు(50) మంగళవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కోనాపురం గ్రామానికి చెందిన వెంకటరాముడు తాగుడుకు బానిసై భార్య సుజాతమ్మ బ్యాంకులో తీసుకున్న రుణం తిరిగి చెల్లించమని వెయ్యి రూపాయిలు ఇచ్చింది. అయితే డబ్బు బ్యాంకులో చెల్లించకుండా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో భార్యతోపాటు కుటుంబ సభ్యులు మందలించింది. దీంతో మనస్థాపానికి గురై గ్రామ సమీపంలోని వేప చెట్టుకు పంచెతో ఉరేసుకున్నాడన్నారు. గమణించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు తెలపడంతో పోలీసులకు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగస్వామి తెలిపారు.
గల్లంతైన మృతదేహం లభ్యం
పుట్లూరు, నవంబర్ 29 : మిత్రులతో కలసి సరదాగా సుబ్బరాయసాగర్‌లో ఈతకెళ్లి గంల్లతైన నారాయణరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజకుళ్లాయప్ప(22) మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. సాగర్ అట్టడగున మృతదేహం లభ్యమవుతుండడంతో ముఖం గుర్తు పట్టలేనంతగా చేపలు, కీటకాలు కొరికాయి. ఎస్‌ఐ సురేష్‌బాబు పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అగ్ని ప్రమాదంలో మూడిళ్లు దగ్ధం
అగళి, నవంబర్ 29 : మండల పరిధిలోని హనుమనపల్లిలో మంగళవారం సాయంత్రం ప్రమాదవ శాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో మూడిళ్లు దగ్ధమయ్యాయి. సాయంత్రం 3 గంటల సమయంలో ఇంటి చుట్టూ వేసిన వసారాకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో దొడ్డ నంజప్ప, చౌడప్ప, ఈరప్పలకు చెందిన ఇళ్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. గ్రామస్థులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆయా ఇళ్లలోని నిత్యావసరాలతోపాటు రెండు గొర్రెలు అగ్ని ప్రమాదంలో మృతి చెందినట్లు బాధితులు తెలిపారు.