అనంతపురం

వైభవంగా రథోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, మార్చి 5 : స్థానిక 1వ రోడ్డులోని శ్రీ కాశీవిశే్వశ్వర కోదండ రామాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం తెల్లవారుజామున నాలుగవ యామలో శివపార్వతుల కల్యాణం సాంప్రదాయంగా నిర్వహించారు. ఉదయం 8గం.లకు రథాంగ హోమం, రథాంగ బలి గావించారు. 10గం.లకు నూతన దంపతులను పూలమాలలతో అలంకరించిన రథంలో ఆశీనులు చేసి ఉదయం మడుగుతేరు లాగారు. ఆలయంలో ఏకవారదశ రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి గురుగుంట వారు భజనలు చేసారు. అనంతరం కూచిపూడి కళా కేంద్రం నాట్యాచార్యులు కృష్ణమూర్తి రాజు శిష్య బృందం శివలీలలుపై నృత్యాలు చేసారు. మహా మంగళ హారతి తరువాత ఆలయ మేనేజర్ నాగేంద్రరావు భక్తాదులకు తీర్థప్రసాద వితరణ చేసారు.
లేపాక్షిలో...
లేపాక్షి : శివరాత్రి బ్రహోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం శిల్ప కళారామంగా పేరుగాంచిన లేపాక్షి వీరభద్రాలయంలో శివ, పార్వతుల బ్రహ్మరథోత్సవం భక్తజన సందోహం మధ్యన అంగరంగ వైభవంగా సాగింది. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుండి దుర్గాదేవి, వీరభద్రస్వామి, పాపనాశేశ్వర దివ్య లింగానికి అర్చకులు సూర్య ప్రకాష్‌రావు, నరసింహశర్మ ఆధ్వర్యంలో అభిషేకార్చనలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు రథ సంప్రోక్షణ పూజలు చేశారు. 11 గంటలకు దవనోత్సవ పూజ అనంతరం నాట్య మంటపంలో శివ, పార్వతుల ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు చేశారు. బ్రహ్మణులు ఉపవాస దీక్షతో శివ, పార్వతుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయం నుంచి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన రథం దాకా తీసుకొచ్చారు. వేద పండితులు శివ, పార్వతుల ఉత్సవ విగ్రహాలను రథంపై కూర్చోబెట్టి వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య బ్రహ్మరథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాల్లో తహశీల్దార్ బలరాం, మండల పరిషత్ సూపరింటెండెంట్ నారాయణస్వామి, టీడీపీ మండల కన్వీనర్ జయప్ప, జడ్పీటీసీ ఆదినారాయణరెడ్డి, ఎంపీపీ హనోక్, నాయకులు సూర్యప్రకాష్, ఆనంద్‌కుమార్, జేఏసీ నాయకులు రామాంజినేయులు, డాక్టర్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
పలుచోట్ల అన్నదానం..
రథోత్సవం సందర్భంగా జేఏసీ, నంది వినాయక, అయ్యప్పస్వామి సేవా సమితి, ఎంపీటీసీ చలపతి, ముద్దిరెడ్డిపల్లి జగదీష, ఆర్యవైశ్య సంఘం, బ్రాహ్మణ సంఘం, కన్వీనర్ జయప్ప తదితర సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. అదేవిధంగా వైకాపా నాయకులు నారాయణస్వామి, వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ, లారీ యజమాని శ్రీరాములు మిత్ర బృందం ఆధ్వర్యంలో పానకం, డాక్టర్ గోపీచంద్ తదితరుల ఆధ్వర్యంలో నీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఘనంగా బుగ్గ సంగమేశ్వర, భీరప్ప స్వాముల రథోత్సవాలు
గుంతకల్లు : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని శ్రీ బుగ్గ సంగమేశ్వరస్వామి రథోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున స్వామివారి లింగోద్భవం అనంతరం సతీసమేతుడైన శ్రీ పార్వతి, పరమేశ్వర, గంగాదేవికి కల్యాణోత్సవం నిర్వహించారు. ఉదయం యధావిధిగా అభిషేకాలు, అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహా మంగళహారతి, భక్తులకు అన్నదానం చేశారు. సాయంకాలం సతీసమేతుడైన సంగమేశ్వర స్వామిని రథంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథాంగ హోమం, బలిహరణ పూజలు నిర్వహించారు. అనంతరం హర ఓం హర నామస్మరణలతో ఆలయ సమీపంలోని చెరువు వరకు రథాన్ని లాగారు. ఈసందర్భంగా భక్తులు చెరకు గడలు, అరటి పళ్లను రథంపైకి విసిరి మొక్కులు తీర్చుకున్నారు.
భీరప్ప, గుంతకల్లప్ప స్వామి రథోత్సవం
కురుబల ఆరాధ్య దైవం భీరప్ప స్వామి, గుంతకల్లప్ప స్వామి రథోత్సవాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాభిషేకం, విశేష పుష్పర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. సాయంకాలం స్వామివారిని రథంలో కొలువుదీర్చి ప్రత్యేక అలంకారాలు, పూజలు చేసిన అనంతరం రథోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ పూజారులు బసప్ప కుటుంబ సభ్యులతోపాటు కురుబ సంఘం నాయకులు, కులస్థులు పాల్గొన్నారు.
కోన రామలింగేశ్వరస్వామి రథోత్సవం
యాడికి : మండల పరిధిలోని కోన గ్రామం పరిధిలో ఉన్న కొండల్లో వెలసిన కోన రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం, రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాల అలంకరించారు. ఆలయ అర్చకులు, వేదపండితుల మంత్రాల నడుమ హోమాలు, అభిషేకాలు మంగళహారతులతో కల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్వతీ పరమేశ్వరులను కొండపై నుంచి పల్లకిలో రథం వద్దకు తీసుకొచ్చి రథోత్సవం నిర్వహించారు.
ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాడికి, రాయలచెరువు, చందన తదితర గ్రామల్లో శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. యాడికిలోని భైరవకొండపై ఉన్న భరవ లింగేశ్వరుడు, పార్వతిదేవి కల్యాణోత్సవం, బస్టాండ్ సమీపంలో ఉన్న శివాలయాల్లో కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు.

వైభవంగా వీరనారాయణస్వామి జాతర
బత్తలపల్లి, మార్చి 5: శివరాత్రి పర్వదినం అనంతరం మండలంలోని రామాపురం గ్రామంలో నిర్వహించే వీరనారాయణస్వామి జాతర వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పూజల అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అక్కడి నుండి సమీపంలోని చిత్రావతి నదిలోకి ఉత్సవ విగ్రహాలను తీసుకువెళ్లి ప్రత్యేక అలంకరణలో అర్చకులు కప్పల నరేంద్ర, రామప్ప, నారప్ప అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతరకు చుట్టుపక్కల గ్రామాల రైతులు, ఎద్దులబండ్లు, ట్రాక్టర్లను రంగురంగుల కాగితాలతో అలంకరించి ఊరేగింపుగా స్వామి వద్దకు చేరుకున్నారు. వీరనారాయణస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి కానుకలు సమర్పించుకున్నారు. వీరనారాయణస్వామి ప్రధాన అర్చకులు కప్పల నరేంద్రస్వామి భవిష్యవాణిని భక్తులకు వినిపించారు. జాతర సందర్భంగా పలు దుకాణాలు వెలిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ధర్మవరం రూరల్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాంప్రసాద్ తమ సిబ్బందితో బందోబస్తును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి కప్పల నారాయణస్వామి, కప్పల పెద్దన్న, నారప్ప, ముసుగు సూర్యనారాయణ, బండి వీరనారప్ప, కప్పల నారప్ప, కప్పల పెద్దప్ప, లక్ష్మినారాయణ, సోమశేఖర్ పాల్గొన్నారు.

రైట్ టు ప్రైవసీ ప్రకారం మంత్రి లోకేష్‌పై చర్యలు తీసుకోవాలి
అనంతపురం సిటీ, మార్చి 5: రాష్ట్రం ఆధార్ యాక్టు సెక్షన్ 38, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు సెక్షన్ 72కి భిన్నంగా వ్యవహరించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ఈమేరకు మంగళవారం బీజేపీ జిల్లా నాయకులు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంత్రి లోకేష్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని అధికార తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా కుటిల ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్, తెలుగుదేశం కార్యకర్తలు, సేవామిత్ర అనే మొబైల్ యాప్‌కు ఆధార్ యాక్టు సెక్షన్ 38కి భిన్నంగా ఏపీలోని వ్యక్తులకు సంబందించిన గోప్యంగా ఉంచవలసిన ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతాలు వివరాలు తెలుగుదేశం పార్టీ అక్రమ మార్గాల ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వాడుకొంటున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు అమర్‌నాథ్, సుదర్శన్, కెఎం.శ్రీనివాసులు, సూర్యప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.

నేటి నుంచి ఎమ్మెల్యే బాలయ్య పర్యటన
హిందూపురం టౌన్, మార్చి 5 : స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేటి నుంచి రెండు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్, హిందూపురం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేయనున్నారు. బుధవారం చిలమత్తూరు మండలంలో బీటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, లేపాక్షి మండలంలో బీటీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ, సమగ్ర మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపనతోపాటు నాగేపల్లిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం ఎంజీఎం క్రీడా మైదానంలో కుట్టుమిషన్ల పంపిణీ, జామియా మసీదులో దువా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారన్నారు. సాయంత్రం హిందూపురం రూరల్ మండల పరిధిలోని సంతేబిదనూరులో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, షాదీమహల్, బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు చెప్పారు. అలాగే గోళ్లాపురం, కొటిపిలలో పట్టాల పంపిణీ, బీటీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. దీనికి తోడు 7వ తేదీ ఉదయం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్‌లో వాణిజ్య భవన సముదాయాలను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. అదేవిధంగా ధర్మపురంలో షాదీమహల ప్రారంభోత్సవం, సూరప్పకుంటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, అంబేద్కర్ భవన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సాయంత్రం నూతనంగా అమలు చేసిన రూ.194 కోట్ల తాగునీటి పథకం ద్వారా నీటి విడుదల, పైలాన్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.

జేఎన్‌టీయూలో నలుగురు అధికారులు బదిలీ
అనంతపురం సిటీ, మార్చి 5: జేఎన్‌టీయూలో నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లును జేఎన్‌టీయూ ఉప కులపతి ఆచార్య శ్రీనివాసకుమార్ మంగళవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.ఆర్.రాజశేఖర్‌ను అడిషినల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌కు, ఆ స్థానంలో ఉన్న డా.మాధవిని జేఎన్‌టీయూ కళాశాలకు, కలికిరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పులివెందులకు, పులివెందులలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సాంబయ్యను కలికిరికి, కలికిరి ప్రిన్సిపాల్‌గా ఆచార్య ఎన్.విశాలి నియమిస్తూ, అక్కడ ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆచార్య ఈశ్వర్‌రెడ్డిని అనంతపురం యూనివర్సిటీ సీఈ డిపార్టమెంట్‌కు బదిలీలు చేస్తూ ఉప కులపతి మంగళవారం ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యర్థ పదార్థాలను బూడిదగా మార్చే మిషన్ ట్రయల్ రన్‌ను పరిశీలించిన కమిషనర్
అనంతపురంటౌన్, మార్చి 5: నగరంలోని వ్యర్థ పదార్థాలను కాల్చి బూడిదగా మార్చే మిషన్ ట్రయల్ రన్‌ను మంగళవారం స్థానిక ఆర్ అండ్ బి కార్యాలయంలోని ఖాళీ స్థలంలో కమిషనర్ మూర్తి పరిశీలించారు. కమిషనర్ మూర్తి మాట్లాడుతూ కేరళ నుంచి ఇన్సనేరషన్ ప్లాంట్‌ను (కంపోస్టింగ్ మిషన్) తెప్పించటం జరిగిందన్నారు. నగరంలోని హోటళ్లలో వెలువడే వ్యర్థ పదార్థాలను ఎటువంటి వ్యయం లేకుండా ఈ మిషన్ ద్వారా కంపోస్ట్ తయారుచేసుకోవచ్చునన్నారు. నగరంలోని హోటల్ యజమానులకు అవగాహన కల్పించటానికి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎస్‌ఎస్ ప్యారడైజ్ హోటల్ వద్ద కంపోస్టింగ్ మిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కావున హోటల్ యజమానులు హాజరై మిషన్ పనితీరును పరిశీలించి వాటిని అమలుచేయాలన్నారు.
అనంత అర్బన్ సీటు బ్రాహ్మణులకు కేటాయించాలి
అనంతపురం అర్బన్, మార్చి 5: అనంతపురము అర్బన్ నియోజకవర్గం సీటును బ్రాహ్మణులకు, వైశ్యులకు కేటాయించాలని ఓసీ సంఘర్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సదాశివారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఓసీ సంఘర్షణ కార్యాలయంలో సదాశివరెడ్డి మాట్లాడుతూ సామాజిక వర్గాలకు వారసత్వంగా కొందరికే రాజకీయం చెందే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఏ రాజకీయ పార్టీకి సబబుకాదన్నారు. బ్రాహ్మణ, వైశ్యులు లాభాపేక్ష కోసం కాకుండా నిజాయితీగా సేవలందిస్తున్నారన్నారు. ఈసారి అవకాశం కల్పించాలని లేనిపక్షంలో వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతామని తెలిపారు.
విద్యార్థుల విజయాలే కళాశాల ప్రగతి
అనంతపురం అర్బన్, మార్చి 5: విద్యార్థుల విజయాలు కళాశాల ఉన్నతికి నిదర్శనాలు అని కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్ర పేర్కొన్నారు. స్థానిక శ్రీ సాయిబాబా కళాశాల వార్షికోత్సవం వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఉదయం చదువుల తల్లి సరస్వతిదేవి, గణపతి, బాబా చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్య అతిథిలుగా ఎస్కేయూ ఉప కులపతి రహంతుల్లా, కళాశాల ప్రెసిడెంటు రమణారెడ్డి, కరస్పాండెంట్ పి.యల్.ఎన్ రెడ్డి, కార్యదర్శి నిర్మలమ్మ, ప్రిన్సిపాల్ రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రతి ఒక్కరి కృషి అవసరమని, విద్యార్థులు చదువులో నూరు శాతం రావడం, క్రీడలలో, సేవా కార్యక్రమాలలో ఇలా అన్ని రంగాలలో విజయం సాధించడం కళాశాల ప్రగతికి సోపానాలు అన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ సినీ పాటలకు నృత్యాలు అందరిని అలరించాయి.
విజయానికి సోపానం హార్డ్ వర్క్
అనంతపురం, మార్చి 5: విద్యార్థులకు జీవితంలో గోల్, ఫోకస్, హార్డ్‌వర్క్, కమిట్మెంట్ విజయానికి సోపానాలని కేఎస్‌ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.శంకరయ్య పేర్కొన్నారు. కళాశాలలో కామర్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన కామర్స్ డే ఉత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్, ఫోకస్, హార్డ్‌వర్క్, కమిట్మెంట్ అనేవి వాణిజ్య శాస్త్ర విద్యార్థులకు ఉండాల్సిన ప్రధాన లక్ష్యాలన్నారు. అనంతరం సెమిస్టర్ పరీక్షల్లో, ఇతర పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
8న డ్వాక్రా డమరుకం
* హాజరుకానున్న రోజా
* వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
అనంతపురం, మార్చి 5: నగర సమీపంలోని పాపంపేట వద్ద ఈ నెల 8న నిర్వహించనున్న డ్వాక్రా డమరుకం కార్యక్రమానికి వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు ఐదేళ్ల పాలనలో టీడీపీ చేసిన మోసాలు, వేధింపులపై డ్వాక్రా డమరుకం పేరుతో సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధికారం చేపట్టగానే వాటిని విస్మరించిందన్నారు. అంతేకాక డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని, మహిళలపై దాడులు, వేధింపులు అధికమయ్యాయన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లను కూడా ఎన్నో అవమానాలకు గురిచేశారన్నారు. మహిళలు ఆర్థికంగా వెనుకబాటుకు గురైన తీరుపై సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే పాడి పరిశ్రమ, గార్మెంట్స్, సహకార రంగం, ధాన్యం కొనుగోళ్లువంటి వాటిలో మహిళలకు ప్రాధాన్యత కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా డ్వాక్రా డమరుకం సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

డిపాజిట్లు చెల్లించే దాకా పోరాటం
* 11న కేశవరెడ్డి విద్యాసంస్థలను అడ్డుకుంటాం
అనంతపురం, మార్చి 5: కేశవరెడ్డి విద్యాసంస్థల్లో విద్యార్థుల తల్లిదండ్రులు డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి చెల్లించే దాకా పోరాటం సాగిస్తామని బాధితులు, సీపీఎం నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఆర్ట్స్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నానుద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం అనేక కష్టాలకోర్చి డిపాజిట్ చేశారన్నారు. సొమ్మును తిరిగి చెల్లించాల్సిన కేశవరెడ్డి యాజమాన్యం ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. జిల్లా వ్యాప్తంగా 1441 మంది రూ.37.18 కోట్లు డిపాజిట్ చేశారన్నారు. అయితే సీఐడీ పోలీసులు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించి కేవలం 13 మందికి మాత్రమే డిపాజిట్లు చెల్లించి కేసును విత్‌డ్రా చేసుకునేలా చేస్తున్నారన్నారు. మిగిలిన 1428 మంది డిపాజిట్లు ఎవరు చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీలో విద్యాసంస్థ అధినేత వియ్యంకుడు మంత్రిగా ఉన్నందునే బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులే అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కేశవరెడ్డి ఆస్తులను బాధితులకు అప్పగించాలన్నారు. లేనిపక్షంలో ఈ నెల 11న కేశవరెడ్డి విద్యాసంస్థలను అడ్డుకుంటామన్నారు. అనంతరం డీఆర్వో సుబ్బారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు.

అసంఘటిత కార్మికుల భద్రతకై
శ్రమయోగి మాంథన్
అనంతపురం సిటీ, మార్చి 5: అసంఘటిత కార్మికుల భద్రతకై దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన శ్రమయోగి మాంధన్ పథకమని లేబర్ జూయింట్ కలెక్టర్ కర్నూల్ శ్రీనివాసులు, బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.లక్ష్యయ్యలు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రధానమంత్రి శ్రమ యోగి మాంధన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసంఘటిత కార్మిక రంగానికి ఈ పథకం ఒక వరమని, కార్మికులు అందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుని తమ జీవితాలకు సామాజిక భద్రతను ఏర్పాటుచేసుకోవాలని కోరారు. 60 సంవత్సరాల తర్వాత వారికి ఆధారంగా ఈ పెన్షన్ ఉపయోగపడుతుందన్నారు. నెలకు 15 వేల రూపాయలకంటే ఆదాయం తక్కువ ఉన్నవారికి ఈ స్కీం అమలవుతుందని, అసంఘటిత కార్మికులకు మాత్రమే ఇది అమలవుతుందని తెలిపారు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయస్సు ఆధారంగా 55 రూపాయల నుండి 200 రూపాయల మధ్య ప్రతి నెల జమ చేయాల్సి ఉంటుందని తెలిపారు. 60 సంవత్సరాలు దాటిన తరువాత 3 వేల రూపాయలు వస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్,
ఫీజురీయంబర్స్‌మెంట్స్ విడుదల చేయాలి
అనంతపురం సిటీ, మార్చి 5: జిల్లాలో విద్యార్థులకు పెండింగ్‌లో వున్న స్కాలర్‌షిప్, ఫీజురియంబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం అనంతపురం ఆర్‌డీఓ కూర్మానాథ్‌కు ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తులసీరామ్, మనోహర్‌లు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ శాతం మంది పేద విద్యార్థులు ప్రభుత్వం మంజూరు చేసే స్కాలర్‌షిప్, ఫీజురియంబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువులను కొనసాగిస్తున్నారన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాలకు తగిన నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపివేసే పరిస్థితిని కల్పించిందన్నారు. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు చదువులు పూరైనప్పటికీ ప్రభుత్వం నుంచి పీజురియంబర్స్‌మెంట్ సొమ్ము అందకపోవడంతో పూర్తి ఫీజు చెల్లిస్తేనే సర్ట్ఫికెట్స్ ఇస్తామని విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే వాటిని విడుదల చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఆర్‌డీఓ స్పందించారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆర్‌డీఓ హామీ ఇచ్చారని తెలిపారు.