అనంతపురం

ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బత్తలపల్లి, ఏప్రిల్ 30 : దేశంలోనే అతితక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నా రు. ఆదివారం మండలంలోని డి.చెర్లోపల్లి గ్రామంలో రైతు చల్లా పెద్దపుల్లన్న ట్యాంకర్ల ద్వారా నీటిని అం దిస్తూ సాగు చేస్తున్న చీనీ తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా సాగు వివరాలు, సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాగు చేస్తున్న పండ్లతోటలను కాపాడుకోవడానికి ట్యాం కర్ల ద్వారా నీరు సరఫరా చేసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందన్నారు. ఎకరాకు నాలుగు బస్తాల చొప్పున సబ్సిడీపై వేరుశెనగ కాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కేంద్రం నుంచి రావాల్సిన బీమ మొత్తంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టపరిహారాన్ని ఖరీఫ్ సాగుకు ముందుగానే పంపిణీ చేస్తామన్నారు. నూతన రాష్ట్రం ఆర్థికలోటులో ఉన్నా ప్రకటించిన సంక్షేమ పథకాల అమలులోకానీ, చేపట్టిన ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకుగానీ బిల్లులు చెల్లింపులో బ్బందులు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రతిపక్షం అడ్డుపడుతున్నా ప్రాజెక్టుల వద్ద రాత్రింబవళ్లు పనులు చేయిస్తున్నామన్నారు. చంద్రబాబు పనులు చేయిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సైతం కొనియాడిందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ అమలు చేసిన సందర్భాలు లేవని, ఏపిలో ముఖ్యమంత్రి నూతన టెక్నాలజీతో చేపట్టిన రుణమాఫీ తదితర పథకాలను అమలు తీరును పరిశీలించడానికి ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవడం గర్వకారణమన్నారు. ఇరిగేషన్, వ్యవసాయ శాఖ సమన్వయంతో పని చేస్తే రైతులకు లబ్ధి చేకూర్చవచ్చునన్నారు. ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మాట్లాడుతూ వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటి రైతులు సాగు చేసిన చీని, మామిడి తదితర పంటలు ఎండిపోయి రైతులకు ఆర్థిక లబ్ది చేకూర్చే పండ్లతోటలు ఎండిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణం జిల్లాలో ఎండిన పండ్లతోటలను పరిశీలించడానికి వ్యవసాయ శాఖ మంత్రిని పంపారన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో భూగర్భజలాలు పెంపొందించడానికి హంద్రీనీవా, పిఎబిఆర్ తదితర వాటి నుంచి చెరువులకు నీటి సరఫరా చేస్తామన్నారు. పండ్లతోటలు సాగు చేసే ప్రతి రైతు వారానికి ఒకసారి తడి వేసుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకోవాలని, ఎన్ని ఎకరాల్లో పండ్లతోటలు సాగు చేసినా వర్షాలు వచ్చేంతవరకు ట్రాన్స్‌పోర్టు బిల్లులు చెల్లిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపి నిమ్మల కిష్టప్ప, చీఫ్‌విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్‌డైరెక్టర్ శ్రీరామమూర్తి, ఆర్‌డిఓ బాలానాయక్, ఎంపిడిఓ లక్ష్మీభాయి, డిప్యూటీ తహశీల్దార్ సురేష్‌బాబు, ఏఓ పెన్నయ, మండల టిడిపి నేతలు వీరనారప్ప, సుబ్బరాయుడు, ఈశ్వరయ్య, వెంకటేశ్వరచౌదరి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంత రైతుకు అండగా ఉంటాం..
* వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి
అనంతపురం సిటీ, ఏప్రిల్ 30 : కరవుతో అల్లాడుతున్న అనంత రైతుకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అతితక్కువ వర్షపాతం ఉండడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కనుక జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే జిల్లాకు 23.80 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ రావాల్సి ఉందన్నారు. అయితే రూ.1700 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. జిల్లాలో ఎండిపోతున్న పండ్ల తోటలకు పంటలను కాపాడేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు కోసం త్వరలో నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే డ్రిప్, స్పిక్లర్లు కోసం 2012-13 సంవత్సరానికి 40 కోట్లు, గతేడాది రూ.179 కోట్లు ఇచ్చామన్నారు. ఇక ఖరీఫ్ సీజన్‌కు వేరుశెనగ విత్తన కాయలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో ఒక్కో రైతుకు మూడు బస్తాల వేరుశెనగ కాయలు ఇచ్చేవారమని, ఈ ఏడాది నుంచి 4 బస్తాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విత్తనకాయల నాణ్యతలో రాజీపడకుండా పంపిణీ చేస్తామన్నారు. అలాగే ఎరువుల్లో కల్తీలు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో మిర్చి రైతులకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్‌లు ఖాళీగా లేనందునే స్టోరేజ్ చేయలేకపోతున్నామన్నారు. రైతులు సమన్వయం పాటిస్తే క్విటాకు రూ.1500 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. అలాగే పసుపు రైతులకు క్వింటా రూ.6వేలతో కొనుగోలు చేస్తున్నామన్నారు. మరోవైపు రైతులకు ఎలాంటి నష్టం జరుగుతోందో తెలియకుండా ప్రతిపక్ష నేత జగన్ గుంటూరులో రెండు రోజుల దీక్ష చేపట్టడం హస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రైతుల, ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించాలే తప్ప ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదన్నారు. గుంటూరులో జగన్ చేస్తున్న దీక్ష రైతుల కోసం కాదని, కేవలం పార్టీ ఉనికి కోసమే అని ఎద్దేవా చేశారు. సోషియల్ మీడియాలో ఏదైనా ఒక వ్యక్తినికానీ, సంస్థను కానీ కించపరిచే విధంగా ప్రచారం చేస్తే ఎంతటి వారినైనా, ఏపార్టీ వారైనా పోలీసులు వదలి పెట్టకూడదన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ, జడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్సీ శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వేమన సాహితీ పుస్తకాల ఆవిష్కరణ
* మహోన్నతుడు యోగి వేమన : మాజీ మంత్రి పల్లె
* వేమన పద్యం వేనోళ్ల గానం : తెలకపల్లి రవి
అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 30: మానవాళికి సంస్కారాన్ని, చైతన్యాన్ని కలిగించిన మహోన్నతుడు యోగి వేమన అని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన రాష్టస్థ్రాయి సదస్సు సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నగరంలోని పద్మావతీ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగింది. సమాలోచన ఆహ్వాన సంఘం అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సుకు మాజీ మంత్రి పల్లె, ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, విశే్లషకులు తెలకపల్లి రవి, మాజీ విసి కొలకలూరి ఇనాక్, ఎన్.గోపి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, అవధాని ఆశావాది ప్రకాశరావు, సింగమనేని, ఏలూరి యంగన్న, శాంతినారాయణ, మేడిపల్లి రవికుమార్, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పిళ్లా కుమారస్వామి, ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తదితరులు హాజరై ప్రసంగించారు. వేమన సాహిత్యంపై రూపొందించిన 14 పుస్తకాలను సదస్సులో ఆవిష్కరించారు. ఈసందర్భంగా పల్లె మాట్లాడుతూ వేమన పద్యాలు చక్కగా, సూటిగా, సరళంగా, జనరంజకంగా పామరులకు సైతం అర్థమయ్యేలా ఉంటాయన్నారు. మూఢాచారాలను, సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు వేమన పద్యాలు ఎంతో తోడ్పడతాయన్నారు. వేమన సాహిత్యం తరగని సంపదని, నైతికవిలువలు నశించిపోతున్న, మానవత్వం అడుగంటుతున్న ప్రస్తుత తరుణంలో వేమన సాహిత్యం పాఠశాల స్థాయి నుండి డిగ్రీ స్థాయి వరకు పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరముందన్నారు. రచయిత, విశే్లషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ వేమనను ధైర్యశిఖరంగా, దీపస్తంభంగా, సూర్యబింబంగా, జ్ఞాన సంద్రంగా పేర్కొన్నారు. వేమన పద్యం వేనోళ్ల గానమని, వేమన సాహిత్యం కొత్తపుంతలు తొక్కనుందన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో సజీవమైన వేమన అనంత చైతన్య స్ఫూర్తి నింపిన విశ్వజనీనమైన కవి అన్నారు. మాజీ విసి, పరిశోధకులు ఎన్.గోపి మాట్లాడుతూ వేమన పద్యాలు తెలుగు భాషను రక్షిస్తాయన్నారు. గురిపెట్టి చూసిన తుపాకి గుండు లాంటి పద్యాలు వేమనవన్నారు. వేమన పద్యాలు విన్న ప్రతివారికీ ఆత్మీయుడులా కనిపిస్తాడన్నారు. వేమన పద్యాలు చదువుతూ వుంటే వ్యక్తిత్వంలో కూడా మార్పు వస్తుందన్నారు. ఇంకా పలువురు రచయితలు, కవులు మాట్లాడుతూ వేమన మాట ప్రగతికి బాట అని, వేమన గొప్ప దార్శనికులు, కవితా ద్రష్ట, స్రష్ట అని, జన జీవనాన్ని జానపదుల జీవితాన్ని ఆవిష్కరించిన నవ యుగ వైతాళికుడని పేర్కొన్నారు. ఈసందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులచే ప్రదర్శింపబడిన వేమన రూపకం, సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈసదస్సులో సాహితీ సంస్థల ప్రతినిధులు, రచయితలు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గతానికి భిన్నంగా టిడిపి సంస్థాగత ఎన్నికలు
* నాయకుల నడుమ కనిపించని ఐక్యత..!
* చిలమత్తూరు జడ్పీటీసీ వర్గీయుల గైర్హాజరు
* పార్టీ పదవుల కోసం పోటాపోటీ..
హిందూపురం టౌన్, ఏప్రిల్ 30 : నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభేదాలు పూర్తిస్థాయిలో సమిసిపోలేదు. ఎందుకంటే పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాస ప్రాంగణం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి కొందరు ముఖ్య నేతలు గైర్హాజరవడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కూడా గతానికి భిన్నంగా నిర్వహించడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సాధారణంగా సమావేశం అనంతరం ఆయా ప్రాంతాల నాయకులు సమావేశమై పార్టీ పదవులను ఆశిస్తున్న నాయకుల జాబితాను సిద్ధం చేసి పరిశీలకులకు అందచేస్తే అదే రోజే సామాజిక వర్గాలు తదితర వాటి సమీకరణలకు అనుగుణంగా పార్టీ పదవులను కట్టబెట్టేవారు. ప్రస్తుతం కూడా ఇతర నియోజకవర్గాల్లో ఇదే విధానం అమలులో ఉంది. అయితే నియోజకవర్గంలో మాత్రం గతానికి భిన్నంగా ఈమారు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్వహించినట్లు ఆ పార్టీ వర్గీయులే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం, నియోజకవర్గంలోని పార్టీ నాయకుల నడుమ అంతంత మాత్రంగానే సఖ్యత కనిపిస్తుండటం, పార్టీ పదవులను ఆశించే వారి సంఖ్య అధికంగా ఉండటంతో లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని భావించిన రాష్ట్ర పరిశీలకులు నిర్ణయాన్ని రాష్ట్ర అధిష్ఠానానికే వదిలేసినట్లు తెలుస్తోంది. మండలాలు, పట్టణ టిడిపి కమిటీలతోపాటు అనుబంధ సంఘాలకు పదవులను ఆశిస్తున్న వారి పేర్లను జాబితాగా రూపొందించి రాష్ట్ర పరిశీలకులకు అందజేశారు. ఈ జాబితాను ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించిన అనంతరం రాష్ట్ర టిడిపి అధిష్ఠానం కమిటీలను ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. పలు మండలాల్లో ఒకే ఒక్క పేరు మాత్రమే పదవుల జాబితాలో ఉన్న ఆ పేరును ప్రకటించేందుకు నేతలు సాహసించలేకపోతున్నారు. దీంతో సమావేశం అనంతరం మండలాల నాయకులు వేర్వేరుగా సమావేశమై పదవులు ఆశిస్తున్న నాయకుల పేర్లను జాబితాగా రూపొందించి అందచేశారు. హిందూపురం పట్టణ అధ్యక్ష స్థానం కోసం ఆరుగురు, లేపాక్షి మండలానికి ఐదుగురు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా సంస్థాగత ఎన్నికల సమావేశానికి చిలమత్తూరు మండలానికి చెందిన జడ్పీటీసీ లక్ష్మీనారాయణరెడ్డి వర్గీయులు హాజరు కాలేదు. గత కొంతకాలంగా అక్కడ ఎంపిపి, జడ్పీటీసీ వర్గీయుల నడుమ తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్న విషయం విదితమే. అయితే చిలమత్తూరులోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిటీలను ఎంపిక చేయాలని కొందరు ఆ మండల నాయకులు కోరుతున్నారు. ఇకపోతే పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న వారికి మాత్రమే పదవుల్లో అవకాశం కల్పించాలని, కొత్తగా పార్టీల్లోకి చేరిన వ్యక్తులకు, అప్పుడప్పుడు మాత్రమే పార్టీ కార్యకలాపాల్లో దర్శనమిచ్చే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కల్పించాలని కొందరు టిడిపి నాయకులు నియోజకవర్గ సమన్వయ కర్త కృష్ణమూర్తితో వాగ్వివాదానికి దిగారు. ఏదేమైనా గతానికి భిన్నంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరగడం, కమిటీల ఎంపికలో అధిష్ఠానందే తుది నిర్ణయమని పరిశీలకులు ప్రకటించడంతో ఎవరెవరికి పదవులు దక్కుతాయో వేచి చూడాల్సిందే.
పుట్టపర్తికి మహర్దశ
* స్వచ్ఛాంధ్ర మిషన్ వైస్‌చైర్మన్ పిఎల్.వెంకటరావు
పుట్టపర్తి, ఏప్రిల్ 30 : అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి అభివృద్ధికి మహర్దశ రానుందని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర మిషన్ వైస్ చైర్మన్ పి ఎల్.వెంకటరావు అన్నారు. ఆదివారం పుట్టపర్తి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టపర్తి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తాను పుట్టపర్తికి వచ్చానన్నారు. మున్సిపల్ చైర్మన్ పిసి.గంగన్నతో కలిసి పుట్టపర్తిలోని ప్రధాన కూడళ్లు, కర్ణాటక నాగేపల్లి వద్ద డంప్‌యార్డు, శిల్పారామం ఫోర్‌లైన్ రోడ్, నెక్లెస్ రోడ్ తదితర ప్రాంతాలను ముందుగా పరిశీలించారు. ప్రధాన వీధుల్లో డివైడర్ల ఏర్పాటు, బటర్‌ఫ్లై విద్యుత్ దీపాల ఏర్పాటు, వాటర్ ఫౌంటేన్ నెలకొల్పడం, ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే ఏర్పాట్లను చేస్తామన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు సహకారాన్ని తీసుకుని సేవాదళ్ సభ్యులను భాగస్వాములను చేయడానికి సాధ్యాసాధ్యాల గురించి ట్రస్టుతో చర్చిస్తామన్నారు. ఈ విషయమై ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, ప్రసాదరావులతో చర్చించామన్నారు. చిత్రావతి బ్యూటిఫికేషన్, నదిలో బ్రిడ్జి నిర్మాణం, హారతి ఘాట్, సత్యసాయి విగ్రహ ఏర్పాటు, సుందరీకరణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించడం జరిగిందన్నారు. శిల్పారామంలో ప్రత్యేక ఏర్పాట్ల కోసం అధికారులు తగిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
ఆంధ్రభూమి వార్తకు స్పందన
పాయకట్టు చెరువులో ఉబికిన గంగ
నల్లమాడ, ఏప్రిల్ 30 : ఎవరికైనా దాహం వేస్తే ఓ గ్లాసుడు నీళ్లిచ్చి దా హం తీర్చడం మానవత్వం. అదే అడవిలోని పశుపక్షాదులకు దాహం వేస్తే తీర్చేదెవరు.. ఆ భగవంతుడే.. నల్లమా డ మండలం పెమనకుంటపల్లి గ్రామానికి పశ్చిమాన తుమ్మలాముల దుర్గం గా పిలవబడే అటవీ ప్రాంతంలో ఉన్న పాయకట్టు చెరువు ఎండిపోయి ంది. దీంతో అడవిలోని పశుపక్షాదు లు దాహం తీర్చుకోవడానికి చెరువు వద్దకు వచ్చి నీళ్లు లేక ఆర్తనాదాలు పె డుతూ తిరిగి అడవిలోకి వెళ్లిపోయే యి. ఈనేపథ్యంలో ఎండిన పాయకట్టుచెరువు.. నీళ్ల కోసం పశుపక్షాదుల ఆర్తనాదాలు పేర ఏప్రిల్ 26న ఆంధ్రభూమి దినపత్రిలో కథనం వెలువడింది. ఇందుకు అటవీశాఖాధికారి చంద్రశేఖర్ ముందుకొచ్చి సిబ్బంది ద్వారా పెమనకుంటపల్లికి చెందిన పలువురు రైతన్నల సహకారంతో జెసీబితో పాయకట్టు చెరువులో గుంతలు తవ్వించారు. దీంతో పాతాళగంగ ఉబికింది. చెరువుకి దక్షిణ భాగంలో ఆనుకుని ఉన్న అడవికి దగ్గరగా పశువులకు అనుకూలంగా చెరువులో గుంతలు తవ్వించగా కేవలం 4అడుగుల లోతు నుంచే నీటి ధారలా వచ్చాయి. మనుషుల దాహం తీర్చడానికి ఎన్నిబోర్లు వేస్తున్నా నీళ్లు రావడం కష్టంగా ఉన్న రోజుల్లో కేవలం నాలుగడుగుల లోతులోనే నీళ్లు ఉబికిరావడం అడవి జంతువుల దాహం తీర్చడానికే అభగవంతుడు నీళ్లిచ్చాడని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకూ భగభగ మండే వేసవిలో కూడా ఉబికిన గంగతో పాయకట్టు చెరువు పరిధిలోని అడవిలో ఉన్న పశుపక్షాదులు, గొర్రెలకు దాహం తీరినట్లయింది.
మూడు నెలల్లో హంద్రీనీవా పనులు పూర్తి
* సిఎం హామీలన్నీ నెరవేరుస్తాం..
* భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా
గుంతకల్లు, ఏప్రిల్ 30 : మూడు మాసాల్లో హంద్రీనీవా కాలువ విస్తరణ పనులను పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు పామిడి బహిరంగ సభలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మండలంలోని వైటీ చెరువులో తెప్ప తిరగబడి 14 మంది మృతి చెందిన మృతుల కుటుంబాలను ఆదివారం పరామర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కరవు కాటకాలకు నిలయమైన జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ధృడ నిశ్చయంతో పని చేస్తోందన్నారు. హంద్రీనీవా విస్తరణకు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో పనులు చేపడుతోందన్నారు. వరుసగా నెలకొన్న వర్షాబావ పరిస్థితులతో జిల్లాలో కేవలం 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాలేదన్నారు. దీనివల్ల భూగర్భజలాలు 30 మీటర్లకుపైగా అడుగంటాయన్నారు. అయితే కరవు పరిస్థితుల్లోనూ వైటీ చెరువులో జలవనరులు పుష్కలంగా ఉండటం గ్రామస్థుల అదృష్టమన్నారు. గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్న దుర్ఘటన బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ నీటి కుంటలు, రిజర్వాయర్లు, చెరువుల వద్ద ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేయడంతోపాటు వాచ్ అండ్ వాచ్‌ను ఏర్పాటు చేసి ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు జరగకుండా నివారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్, అనంతపురము ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రామప్ప, చంద్రప్ప కుటుంబాలకు పరామర్శ
వైటీ చెరువు గ్రామానికి చెందిన రామప్ప కుటుంబసభ్యులు, బంధువులు చెరువుపై విహారానికి వెళ్లి తెప్ప తిరగబడటంతో మృతి చెందిన విషయం విధితమే. ఈ సంఘటన సమాచారం అందుకున్న చంద్రప్ప గుండెపోటుతో మృతి చెందాడు. బాధిత కుటుంబాలను ఆదివారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. జరిగిన నష్టం తీర్చలేనిదని, ఇలాంటి సమయంలో గుండెధైర్యంతో ఉండాలని రామప్పను ఓదార్చాడు.
యుకుడి ఆత్మహత్య
చిలమత్తూరు, ఏప్రిల్ 30 : మండల కేంద్రంలోని బిసి కాలనీలో నివాసం ఉంటున్న మంజునాథ్ (22) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంజునాథ్ జాతీయ రహదారిలో ఉన్న ఓ దాబాలో పనిచేసేవాడు. అయితే కుటుంబ సభ్యులు బంధువుల గ్రామానికి వెళ్ళారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరావడం లేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 30 : మండల కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కదిరికికి చెందిన బాబ్‌జాన్ (36) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు కదిరి పట్టణంలోని పోలీస్ లైన్‌కు చెందిన బాబ్‌జాన్ బేల్దారి పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈక్రమంలో ఓబుళదేవరచెరువుకు బేల్దారి పనికి వచ్చి బస్సుదిగి రోడ్డు దాటుతుండగా కదిరికే చెందిన ఇన్నోవా వాహనం ఢీకొనడంతో బాబ్‌జాన్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం బెంగుళూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బావిలో పడియువకుడి మృతి
గోరంట్ల, ఏప్రిల్ 30 : మండల పరిధిలోని పుట్టగుండ్లపల్లికి చెందిన బాబు (30) బావిలో పడి మృతి చెందినట్లు ఎఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆదివారం బాబు మరో అబ్బాయితో గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. బావిలో దిగిన సమయంలోనే మూర్చ రావడంతో బాబు నీటిలో మునిగి పోయాడు. గమనించిన మరో అబ్బాయి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు బాబును బావి నుండి బయటకు తీసి 108 అంబులెన్స్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు. తల్లి ఆదెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని
మహిళ మృతి
తనకల్లు, ఏప్రిల్ 30 : మండల పరిధిలోని పరాకువాండ్లపల్లి వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదేగ్రామానికి చెందిన రమణమ్మ (45) మృతి చెందింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు మేరకు రమణమ్మ సంతగేటు నుండి పరాకువాండ్లపల్లికి నడుచుకుంటూ వస్తుండగా మదనపల్లి వైపు నుండి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ రంగేనాయక్ తెలిపారు.