అనంతపురం

కార్యకర్తలే టిడిపికి ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, మే 17: నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీకి ఊపిరని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మండల కన్వీనర్ సాకే నారాయణస్వామి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడును తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. ముందుగా ఎంపిపి దగ్గుబాటి ప్రసాద్, మండల నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ నుంచి మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లు స్వాగతం పలికి అక్కడి నుండి సభా వేదిక వరకు ర్యాలీగా టిడిపి నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. సభా వేదిక దగ్గర వున్న తెలుగుదేశం పార్టీ జెండాను మంత్రి సునీత ఆవిష్కరించారు. అనంతరం దివంగత నేత ఎన్‌టి.రామారావు, పరిటాల రవీంద్ర ప్రతిమలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ మినీ మహానాడుకు ముఖ్య అతిథులుగా మంత్రి పరిటాల సునీతతోపాటు ఎమ్మెల్యేలు పార్థసారధి, కాలవ శ్రీనివాసులు, నియోజకవర్గ పరిశీలకురాలు పద్మజ, జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్‌లు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి సునీత మాట్లాడుతూ దివంగత నేత ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి మహానాడును ఓ పండుగలాగా టిడిపి కార్యకర్తలు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సినిమారంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రపంచంలోనే కొత్త ఒరవడి సృష్టించిన ఘనత ఎన్‌టిఆర్‌కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు, కార్మికులకు, కర్షకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారన్నారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ 33 శాతం రిజర్వేషన్‌ను కల్పించి ఆస్తి హక్కులో సగం వాటా కల్పించారన్నారు. ఎన్‌టిఆర్ అధికారంలోకి రాక ముందు ధన బలం, కండ బలం వున్న వారు రాజకీయాల్లో చెలామణి అయ్యారని, ఎన్‌టిఆర్ రాకతో కుల, మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ పదవులు పొందుతున్నారన్నారు. ఎన్‌టిఆర్ స్ఫూర్తితోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, నాయకులంతా ముందుండి అందరూ కలిసి అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడదామన్నారు. హంద్రీనీవా కాలువ పూర్తి అయిన రోజే నా కోరిక తీరుతుందన్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పదవిలో వుండి ఒక్క చెరువుకు నీరందించిన పాపాన పోలేదన్నారు. నియోజకవర్గంలో రూ.357 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఎమ్మెల్యేలు పార్థసారధి, కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్‌టి రామారావు పార్టీని స్థాపించినపుడు పేద ప్రజలను, బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూ.2లకే కిలో బియ్యం, చీర, ధోవతి, కూడూ, గూడు, గుడ్డవంటి సంక్షేమ పథకాలు అమలుచేశారని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదాలతో పార్టీని స్థాపించారని, రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు పింఛన్లు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్‌టి రామారావు అన్నారు. అప్పుడు పింఛన్ రూ.35లతో ప్రవేశపెట్టారన్నారు. అదే స్ఫూర్తిగా ఎన్‌టిఆర్ అడుగుజాడల్లో చంద్రబాబునాయుడు గత ప్రభుత్వంకంటే ఐదు రెట్లు పింఛన్లు పెంచి రూ.1000, రూ.1500లు చేసిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి భూముల వివరాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందిపడుతున్నారని మీ ఇంటికి-మీ భూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దళారీతనాన్ని పారదోలారన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యుత్ కోతలు లేకుండా 24గంటలు సరఫరా చేస్తున్నామన్నారు. రైతులకు 7గంటలూ ఉచిత కరెంటును ఇస్తున్నామన్నారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు, కార్యకర్తలకు ఆర్థిక సాయం, పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ, తాగునీటి సరఫరా ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కార్యకర్తలు అందరూ నాకు పెద్దదిక్కుగా అండగా వుండి నడిపించాలని తెలిపారు. మినీ మహానాడు సందర్భంగా నియోజకవర్గంలో కొన్ని తీర్మాణాలను ఆరు మండలాల కన్వీనర్లు మంత్రికి పూర్తి చేయాలని కోరారు. మొదటగా హంద్రీనీవాను వచ్చే మహానాడుకు పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని, 6 మండలాల్లో టిడిపి కార్యాలయాలను పూర్తి చేయాలని, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు, హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరు, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందివ్వాలని తీర్మాణం చేశారు. వీటన్నింటిని తప్పకుండా పూర్తి చేయడానికి కృషి చేస్తామని మంత్రి పరిటాల సునీత కన్వీనర్లకు హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి పరిటాల సునీతను మహిళలు నంది విగ్రహాన్ని అందజేసి శాలువతో సన్మానించారు. అదేవిధంగా 50మంది సీనియర్ పార్టీ కార్యకర్తలను సన్మానించారు. అనంతరం ఇక్కడికి వచ్చిన ప్రజలందరికి తాగునీరు, భోజనాల వసతి, మజ్జిగ ప్యాకెట్ల సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆనం నరసానాయుడు, 6మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్‌పి మల్లికార్జునవర్మ, సిఐలు శివనారాయణస్వామి, రాజేంద్రనాథ్‌యాదవ్‌ల ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.