అనంతపురం

ఫ్లెక్సీలకెక్కిన టిడిపి విభేదాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం రూరల్, ఆగస్టు 4: జిల్లా తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభేదాలు మళ్లీ ఫ్లెక్సీలకెక్కాయి. నిన్నటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో బహిర్గతమయ్యాయి. నేతల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరులో క్యాడర్ నలిగిపోతోంది. ధర్మవరం నియోజకవర్గంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య తలెత్తిన విభేదాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. స్థానిక ప్రజాప్రతినిధి అంతాతానై వ్యవహరిస్తున్న తీరు పార్టీ క్యాడర్, ముఖ్యంగా మంత్రి అనుచరులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ధర్మవరం తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు సిఎంకు స్వాగతం చెప్పేందుకు పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే వాటిలో జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత ఫొటో మచ్చుకి ఒక్కటి కూడా కనిపించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి సునీత ఇంతవరకు కనీసం ఒక్కసారి కూడా పరిశీలించలేదు. అంతేగాక పరిటాల అనుచరవర్గం కూడా ఏర్పాట్లపై దృష్టి సారించలేదు. దీనికితోడు పట్టణంలో వారు ఒక్క ఫ్లెక్సీకూడా ఏర్పాటు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
హిందూపురం పార్లమెంటు పరిధిలోని ధర్మవరంపై పట్టుకు అటు పరిటాల వర్గం, ఇటు సూరి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మంత్రి సునీత, ఎమ్మెల్యే సూరి మధ్య విభేదాలు చాలాకాలంగా కొనసాగుతూ వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇందుకు సిఎం స్వాగత ఫ్లెక్సీలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దివంగత నేత పరిటాలకు ధర్మవరం నియోజకవర్గంపై మంచి పట్టు ఉండేది. అంతేకాక సూరి ఆయన ముఖ్య అనుచరుడుగా కొనసాగుతూ వచ్చారు. అయితే 2004 ముందునుంచే సూర్యనారాయణ పరిటాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత జెసి.దివాకర్‌రెడ్డి సహాయంతో కాంగ్రెస్ టికెట్ ఆశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో ఆయన వౌనంగానే వుండిపోయారు. 2009 ఎన్నికల్లో ధర్మవరం టికెట్ ఆశించిన గోనుగుంట్లకు నిరాశే మిగిలింది. అప్పట్లో ధర్మవరం సీటును సిపిఐకి కేటాయించారు. అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన అనుచరవర్గం పట్టణంలోని టిడిపి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. అధిష్టానంపై తిరుగుబాటు ప్రకటించిన సూరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. సొంతంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా రెండవ స్థానంలో నిలిచాడు. ఆ తరువాత చంద్రబాబునాయుడు సూరిని నియోజవర్గం ఇంచార్జిగా ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సూరి 2014 ఎన్నికల్లో టికెట్ సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి మంత్రి పరిటాల సునీతతో సఖ్యతగా ఉంటున్నట్టు కనిపించినా ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరిస్తూ వచ్చారన్నది క్యాడర్ వాదన. ఇటీవల జరిగిన కదిరి వ్యవసాయ మార్కెట్ ప్రమాణ స్వీకారం వాయిదా, వెంకటాపురం కార్యక్రమంలో జరిగిన ఓ సంఘటనతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరినట్లు సమాచారం. గత నెలలో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన వాయిదాకు నేతల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరే కారణమని కార్యకర్తలు భావిస్తున్నారు. తమ పార్టీ నేత కాకున్నా బిజెపికి చెందిన వెంకయ్యనాయుడు ఫొటో వుంచిన వారు జిల్లాకు చెందిన మంత్రి సునీత ఫొటో ఏర్పాటుచేయకపోవడం పరిటాల కుటుంబాన్ని కించపరచడానికేనని పరిటాల వర్గం భావిస్తోంది.
కాగా సూరి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ధర్మవరానికి మంత్రిని దూరం చేస్తున్నారన్నది పరిటాల వర్గం ఆరోపణ. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మంత్రి పరిటాల సునీతను ధర్మవరం ప్రాంతానికి రాకుండా చేయడమేగాక తన బలం పెంచుకునే ప్రక్రియ చేపట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అధిష్టానం దగ్గర మంత్రి సునీతకు దగ్గరగా వున్నట్లు చెప్పుకుంటున్నా వాస్తవానికి ఇక్కడ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందనేది జగమెరిగిన సత్యం. పరిటాల అనుచరులుగా ముద్రపడిన వారికి ప్రభుత్వ పథకాలు, ఇతర పనుల్లో ఎలాంటి సహాయసహకారాలు అందించడం లేదన్నది మరో ఆరోపణ. తన వర్గానికి పెద్దపీట వస్తున్న సూరి తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ భవిష్యత్‌లో ఓ బలమైన నాయకునిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు.