మహబూబ్‌నగర్

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, జూన్ 26: రాజకీయాలకు అతీతంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతానని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం హన్వాడ, మహబూబ్‌నగర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఆర్‌అండ్‌బి అతిథిగృహం మీటింగ్‌హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పన్నపల్లి మాజీ సర్పంచ్ రామాంజనేయులు, కొనగట్టుపల్లి మాజీ సర్పంచ్‌లు చెన్నయ్య, మల్లయ్య, వేణు, మాజీ ఎంపిటిసిలు కృష్ణయ్య, రమేష్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడు బసిరెడ్డి, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ హన్వాడ, మహబూబ్‌నగర్ మండలాల్లో రోజురోజుకు టిఆర్‌ఎస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని, గ్రామాలలో 80శాతం ప్రజలు తెరాస వైపు ఉన్నారని, అందుకు కొనగట్టుపల్లి గ్రామమే ఉదాహరణ అని అన్నారు. కొనగట్టుపల్లి గ్రామంలో ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారని, ఇతర పార్టీలకు జెండా మోసే వారే ఉండరని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మించుకోవాలంటే ప్రజలంతా టిఆర్‌ఎస్‌లో చేరి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కావాలని కోరారు. పార్టీని నమ్ముకుని గత ఎన్నో ఏళ్ల నుండి ఉద్యమంలో పని చేసిన వారితో పాటు, సకల జనుల సమ్మెలో వివిధ సందర్భాలలో టిఆర్‌ఎస్‌లో లేకున్నా వివిధ సంఘాల ద్వారా ఉద్యమాలు చేసిన వారు ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. పాత, కొత్త అనే తేడా లేకుండా అందరు సమన్వయంతో కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. కొనగట్టుపల్లి గ్రామానికి నెల రోజుల్లో బిటిరోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికే రోడ్ల నిర్మాణానికి రూ. 100 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అందులో దాదాపు రూ. 20 కోట్ల నుండి రూ. 30 కోట్ల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌లోని పెద్ద చెరువు మరమ్మత్తు పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరో దఫా రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామగ్రామాన టిఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, ప్రతాప్‌రెడ్డి, కృష్ణయ్యగౌడ్, బాలయ్య, చెన్నయ్య, కేశవరెడ్డి, అనంతరెడ్డి, సురేష్, హన్మప్ప తదితరులు పాల్గొన్నారు.

సరళసాగర్‌ను పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
కొత్తకోట, జూన్ 26: ప్రపంచంలోనే అటోమెటికల్ సైఫన్స్ సిస్టంలో సరళ సాగర్‌ప్రాజెక్టు రెండవదని, ఆసియా ఖండంలో ఆటోమెటిక్ సైఫిన్ సిస్టంలో మొదటిదని, సరళసాగర్ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన ప్రాజెక్టును పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సరళసాగర్ ఐబి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రామన్‌పాడు ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల పథకం ద్వారా కాకుండా కర్వెన రిజర్వాయర్ పూర్తయితే గ్రావిటీ కెనాల్ ద్వారానే సరళాసాగర్ ప్రాజెక్టును నింపుకోవచ్చని, ఎఫ్‌ఆర్‌ఎల్ ఎప్పుడూ ఉండే విధంగా ప్రాజెక్టుకు నీటిని నింపుకోవచ్చని ఆయన అన్నారు. కోయిల్‌సాగర్‌లో కేజి కల్చర్ కార్యక్రమాన్ని చేపట్టామని, అక్కడే కాకుండా రామన్‌పాడు, సరళాసాగర్ ప్రాజెక్టులో కూడా కేజి కల్చర్‌ను పెట్టి మశ్చ్యకారులకు ఉపాధి అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు. డ్యాం వరకు సిసి, లేదా బీటిరోడ్డును మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉధ్యమ స్పూర్తితో హరితాహారాన్ని నిర్వహించాలని, బిటి రోడ్లు నిర్వహిస్తున్న ఇరువైపుల మొక్కలను నాటాలని, ఇప్పటికే రాష్ట్రంలో 33శాతం అడవి ప్రాంతం ఉండాల్సి ఉండగా 24శాతమే ఉందని ఆయన అన్నారు. అడవులు ఉంటేనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని,ప్రభుత్వం, ప్రైవేటు విద్యాసంస్థలతోపాటు కార్యాలయంలో మొక్కలు నాటాలని, ఎన్ని మొక్కలైనా సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, మిషన్ కాకతీయ చెరువుల వద్దకూడా మొక్కలునాటాలన్నారు. సరళసాగర్ నీటిని వృథా కాకుండా రైతులు వాడుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎంపిపి గుంతవౌనిక, జడ్పిటిసి పిజె బాబు, నాయకులు చెన్నకేశవరెడ్డి, రవీందర్‌రెడ్డి, భీంరెడ్డి, బాబురెడ్డి, ప్రశాంత్, జగన్, మిషేక్, కటికెశ్రీను, కృష్ణయ్య, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, నాగన్నసాగర్, నరేందర్‌రెడ్డి, అద్వానిశ్రీను, లాలు, బాలకృష్ణ పాల్గొన్నారు.

కెసిఆర్ పాలనలో దళితులను అధికారం నుండి గెంటేశారు
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
మహబూబ్‌నగర్, జూన్ 26: కెసిఆర్ పాలనలో తెలంగాణలో లింగ, కుల, మత వివక్షత కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో ఎమ్మార్పీఎస్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మందకృష్ణమాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే తేదీని ముందుగా ప్రకటించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గత మూడు నెలల క్రితమే ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని ప్రకటించారని, అందుకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఒకవేళ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లకుంటే కెసిఆర్‌కు ఎస్సీ వర్గీకరణపై ఎంత చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమవుతుందని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రంగంలో వర్గీకరణ అమలు చేయాలని, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని, రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాబట్టి తక్షణమే అమలు పరచాలని అన్నారు. 1997లో 183 జిఓ ద్వారా సంక్షేమ ఫలాల్లో వర్గీకరణ అమలు చేశారని, తిరిగి 183 జిఓను పునరుద్దరించాలని మందకృష్ణమాదిగ డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో కుల, లింగ, మత వివక్షత కొనసాగుతుందని, అందుకు నిదర్శనం రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించకపోవడమేనని అన్నారు. ఇందుకు నిరసనగా జూలై 21, 22వ తేదీలలో నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం ముందు రెండు రోజుల పాటు దీక్ష చేస్తానని మందకృష్ణమాదిగ వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మత వివక్షత చూపుతున్నారని, యాదగిరిగుట్టకు, వేములవాడ రాజన్న దేవాలయాలకు బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమైనప్పటికినీ మెదక్ చర్చితో పాటు హైదరాబాద్‌లోని మక్కా మజిద్‌కు, జైన మందిరానికి ఎందుకు నిధులు కేటాయించడం లేదని, రాజ్యాంగ బద్ధంగా ఎంపికైన ముఖ్యమంత్రి అన్ని మతాలకు సంబంధించిన దేవాలయాలను సమాన దృష్టితో చూడాలని తెలిపారు. మంత్రివర్గంలో కుల వివక్షత కూడా ఉందని అన్నారు. వెలమ, రెడ్డి సామాజిక వర్గాలే పదిమంది మంత్రులుగా కొనసాగుతున్నారని, మాదిగ, మాలలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అధికారం నుండి దళితులను ముఖ్యమంత్రి కెసిఆర్ గెంటేశారని, ఇందుకు నిరసనగా జూలై మొదటి వారంలో పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో చంద్రబాబును నిలదీస్తే ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ ఫలాల అమలులో 183 జిఓను పునరుద్దరించారని, దాంతో అక్కడ సంక్షేమ పథకాల అమలులో ఎస్సీ వర్గీకరణ కొనసాగుతుందని వెల్లడించారు. ఎన్నికల మెనిఫెస్టోను అమలు చేయడంలో కూడా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఉద్యమకాలం సమయంలో దళితుడిని సిఎంను చేస్తానన్న కెసిఆర్ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ చేస్తానని చెప్పారని, అయితే ఈ రెండు హామీలను నెరవేర్చడం లేదని, అందుకే తాము కెసిఆర్‌ను దళిత వ్యతిరేకిగా భావిస్తున్నామని విమర్శించారు.

విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాలి
వెల్దండ, జూన్ 26: ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలను నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దండ మండలం జూపల్లి గ్రామంలో జిల్లాపరిషత్, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డిల పదవీ విరమణ సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ నేటితరం విద్యార్థులకు పూర్తిగా నైతిక విలువలు తగ్గిపోతున్నాయని, అవి పెరిగినప్పుడే ఆ విద్యార్థి సన్మార్గంలో పయనించి ప్రయోజకుడవుతాడని అన్నారు. సమసమాజ స్థాపనకు నైతిక విలువలు ఎంతో ముఖ్యమని, వాటిని నేర్పించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి లక్ష్మి, లక్ష్మారెడ్డి పారిజాతం దంపతులను ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, టిఆర్‌ఎస్ నేత బాలాజిసింగ్‌లు శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాజశేఖర్, ఆమనగల్లు జడ్పీటిసి హరిప్రసాద్, వైస్ ఎంపిపి వెంకటయ్యగౌడ్, ప్రముఖ కవి పొద్దుటూరి ఎల్లారెడ్డి, తహశీల్దార్ రాంబాయి, సర్పంచ్ చంద్‌లాల్, ఎంపిటిసి సంత్రోలి తదితరులు పాల్గొన్నారు.

మతసామరస్యానికి రంగాపూర్ దర్గా నిదర్శనం
ఉప ముఖ్యమంత్రి మహబూబ్ అలీ
అచ్చంపేట, జూన్ 26: హిందూ, ముస్లీం మతసామ్యరస్యానికి మండలంలోని రంగాపూర్‌లోని నిరంజన్‌షావలీ దర్గా నిదర్శనమని ఉపముఖ్యమంత్రి మహబూబ్‌అలీ అన్నారు. శుక్రవారం అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహబూబ్ అలీ మొదట జమా మసీదువద్ద ముస్లింలను అలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని రంగాపూర్ నిరంజన్‌షావలీ దర్గాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని పట్టణ ముస్లింలనుద్దేశించి ఆయన కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో హిందు, ముస్లింలు కలిసి జిల్లా అభివృద్దికి తగిన కృషి చేస్తున్నారని అన్నారు. యువ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో రాబోయే నాలుగు సంవత్సరాలలో అచ్చంపేట నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక నిధులను మంజూరు చేయిస్తానని హామి ఇచ్చారు. రంగాపూర్ దర్గా నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని అన్నారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్పీటిసి రామకృష్ణారెడ్డి, అచ్చంపేట, బల్మూర్, లింగాల ఎంపిపిలు పర్వతాలు, కరుణాకర్‌రావు, మంజులతోపాటు పార్టీ నాయకులు మనోహర్, నర్సింహ్మాగౌడ్, రఘురాం, శివ, మైనార్టీ నాయకులు మహబూబ్‌అలీ, వసుయోద్దీన్, రఫత్‌ఖాన్, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు.

ఆకతాయల ఆట కట్టిస్తాం
డిఎస్పీ కృష్ణమూర్తి
మహబూబ్‌నగర్, జూన్ 26: ఆకతాయిల ఆట కట్టిస్తామని, షీ టీం బృందాలతో ఇప్పటికే ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నామని మహబూబ్‌నగర్ డిఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ కృష్ణమూర్తి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో పది మందితో కూడిన షీ టీం బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు ఎస్సైని కూడా నియమించడం జరిగిందని అన్నారు. జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల తదితర జన సంచారం ఉండే ప్రాంతాలలో షీ టీం బృందాలు ఇప్పటికే మంచి ఫలితాలను వెలుగులోకి తీసుకువచ్చాయని తెలిపారు. గత రెండు, మూడు రోజుల నుండి రహస్య కెమెరాల ద్వారా షీ టీం బృందాలు తీసిన ఫొటోలు, వీడియో ఆధారంగా పలువురిని అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. వారందరికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. మొదటి సారి కౌన్సిలింగ్ ఉంటుందని, తర్వాత జైలుకు పోవడం తథ్యమని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అదుపులో పెట్టుకోవాలని, షీ టీం బృందాలు మప్టీలో ఉంటారని, చాకచక్యంగా నిఘా ఉంటుందని అన్నారు. ఒకసారి వీడియోలో బంధిస్తే తప్పనిసరిగా తల్లిదండ్రులతో కలిసి దొరికిన వారికి కౌన్సిలింగ్ ఉంటుందని అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో చాలామంది షీ టీం బృందానికి పట్టుబడిన వారు ఎక్కువ మంది మైనర్లే ఉన్నారని, వారందరికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరిగిందని అన్నారు. ఒకరిద్దరిపై కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ఆకతాయి పని చేయకుండా శ్రద్ధగా చదువుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని, దేశంలో మంచి పౌరులుగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. విలేఖరుల సమావేశంలో టూటౌన్ సిఐ సోంనారాయణసింగ్, వన్‌టౌన్ సిఐ సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

రూ.6,800 కోట్లతో వాటర్ గ్రిడ్
వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి * ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వెల్లడి
మహబూబ్‌నగర్, జూన్ 26: జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ. 6800 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం రాబోతుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో వాటర్ గ్రిడ్‌కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుందని వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనుల వైపు దృష్టి పెట్టడం జరుగుతుందని అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ఇప్పటికి ప్రజలు చేసిన పాపం ఏమిటో కాని 20 రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుందని, ఇది దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారని, జిల్లా కేంద్రానికి వాటర్ గ్రిడ్ ద్వారా మొదటి విడతలోనే తాగునీటిని అందించాలని దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు. కరెంట్ ఉన్నా లేకున్నా పట్టణ ప్రజలకు నిరంతరంగా నీరు వచ్చేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అందులో భాగంగా మన్యంకొండ గుట్టపై రిజర్వాయర్‌ను నిర్మిస్తామని, ఈ రిజర్వాయర్ ద్వారా కొన్ని గ్రామాలకు సాగునీరుతో పాటు మహబూబ్‌నగర్ పట్టణానికి మాత్రం తాగునీరు అందనుందని అన్నారు. గత నాలుగు నెలల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్‌నగర్ పట్టణంలోని పాతపాలమూరు, వీరన్నపేట, పాతతోట మురికి వాడల్లో పర్యటించారని, అందులో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముందుగా మూడు ప్రాంతాలకు కలిపి 2300 ఇళ్ల మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే లబ్ధిదారులకు సర్ట్ఫికెట్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. హన్వాడ మండలంలో హేమసముద్రంను రిజర్వాయర్‌గా మార్చబోతున్నామని, 10 టిఎంసిల కెపాసిటీతో గల రిజర్వాయర్‌ను నిర్మిస్తామని చెప్పారు. ఒకపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెడుతుంటే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తెలంగాణలో చిచ్చుపెట్టి ఓటుకు నోటు కేసులో ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్రలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిని తప్పించుకునేందుకు ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబునాయుడు సెక్షన్ 8ను తెరపైకి తెచ్చి ఇటు.. అటు ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు శాంతియుతంగా ఉన్నారని, ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్నారని, ఎవరికి లేని ఇబ్బంది చంద్రబాబుకే ఉందా అని ప్రశ్నించారు. అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణలో చిచ్చు పెట్టడానికి చూస్తే ప్రత్యేక్ష కార్యచరణకు దిగుతామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, బురుజు సుధాకర్‌రెడ్డి, వెంకటయ్య, బెక్కం జనార్దన్, శివకుమార్ పాల్గొన్నారు.