సంపాదకీయం

‘నల్ల’ రాజకీయానికి చెల్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ పక్షాల నిధుల నిర్వహణలో ‘పారదర్శకత’ లేదన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అంగీకరించిన వాస్తవం. ఇరవై వేల రూపాయల వరకు విరాళాలిచ్చే వారి పేర్లను రాజకీయ పక్షాల వారు వెల్లడించే అవసరం లేకపోవడం పారదర్శకతా రాహిత్యానికి ప్రత్యక్ష ప్రమాణం. ఈ పారదర్శకత లోపంవల్ల నల్లడబ్బు చెలామణి అవుతోందని కూడ ప్రధానమంత్రి వ్యాఖ్యానించాడు. ఈ నిబంధనను మార్చాలని రెండువేల రూపాయలకు మించిన విరాళాలను ఇచ్చే ప్రదాతల పేర్లను విరాళాల వివరాలను రాజకీయ పక్షాలు తప్పనిసరిగా వెల్లడించాలన్న విధంగా నిర్దేశించాలని ‘ఎన్నికల సంఘం’ - ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదిస్తోంది! ప్రధానమంత్రి ప్రకటనకు ఎన్నికల సంఘం వారి ప్రతిపాదన ప్రాతిపదిక! గుప్త విరాళాల- అనానిమస్ డొనేషన్స్- పరిమితిని ఇరవై వేల రూపాయలనుంచి రెండువేల రూపాయలకు కుదించాలన్నది ‘ఎన్నికల సంఘం’ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన చేసిన ప్రతిపాదన! ఈ ప్రతిపాదనను నిర్ధారణగా మార్చడానికి చర్యలు చేపట్టాలని, తమ ప్రభుత్వం, తమ రాజకీయ పక్షం అలాంటి నిర్ధారణను సమర్ధిస్తున్నాయని నరేంద్ర మోదీ పంతొమ్మిదవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రకటించాడు. భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ‘పరివర్తన’ సమ్మేళనంలో మోదీ ఈ ‘పరివర్తన’ను సమర్ధించడం రాజకీయ పక్షాల ఆలోచన రీతిలో సంభవిస్తున్న ‘పరివర్తన’కు ప్రబల చిహ్నం. అధికార పక్షాలకే ప్రధానంగా నల్లడబ్బు సంచులు విరాళాల రూపంలో లభిస్తుండడం దశాబ్దులుగా మన ప్రజాస్వామ్య ప్రక్రియను ఆవహించి ఉన్న వైపరీత్యం! నిధుల నిర్వహణ విషయంలో పారదర్శకత ఉండాలన్న సంప్రదాయన్ని ప్రధానంగా ఉల్లంఘిస్తున్నది అధికార పక్షాలే! ‘ప్రపంచీకరణ’ వాణిజ్య వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ నల్లడబ్బు కూడ కట్టలుగా గుట్టలుగా పేరుకొని పోతోంది. అధికార రాజకీయ పక్షాలకు అక్రమ వాణిజ్య వేత్తలకు మధ్య నెలకొన్న ‘అనుసంధానం’ అవినీతిని వ్యవస్థీకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు లాలూచీ పడడంవల్లనే ‘ప్రత్యేక ఆర్థిక మండలాల’ పేరుతో, పారిశ్రామిక ప్రగతి సాకుతో లక్షలాది ఎకరాల వ్యవసాయ భూమి, అటవీ సీమ బహుళ జాతీయ వాణిజ్య సంస్థల-మల్టీ నేషనల్ కంపెనీస్-కు ధారాదత్తం అవుతోంది! బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు నివేదిస్తున్న భూరి విరాళాలను స్వీకరిస్తున్న అధికార పక్షాలు అందువల్ల పారదర్శకతను అంగీకరించడం లేదు! దశాబ్దులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ఈ పారదర్శకతా రాహిత్య ప్రహసనాన్ని నడిపిస్తున్నారు. ఇందుకు ‘విపరీతం’గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎన్నికల సంఘం’ వారి ప్రతిపాదనను తక్షణం అంగీకరించడం ‘మహా పరివర్తన’కు సంకేతం. నల్లడబ్బునకు వ్యతిరేకంగా సాగుతున్న సమరంలో ఇది మరో విజయం!
చిల్లర మల్లర రాజకీయ పక్షాలు కోకొల్లలుగా పొటమరిస్తుండడం వల్ల నల్లడబ్బు వినిమయం విస్తరించిపోయిందన్న సందేహాన్ని పదిహేడవ తేదీన వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం మరుసటి రోజున ఈ నూతన ప్రతిపాదనను ఆవిష్కరించింది. ‘ఇరవై వేల’కు లోపున్న విరాళాల ప్రదాతల పేర్లను వెల్లడించడం అవసరం లేదు కాబట్టి ఇలాంటి విరాళాలను రాజకీయ పక్షాలు భారీ సంఖ్యలో స్వీకరిస్తున్నాయి. ఒక ‘ఘరానా’ వద్ద లక్ష రూపాయల నల్లడబ్బు పుచ్చునే రాజకీయ పక్షం ఆ విరాళాన్ని ఆరుగురు గుర్తుతెలియని ‘ప్రదాత’లు ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటె ఇరవై వేల రూపాయల విరాళాల ప్రదాతల పేర్లు చెప్పనక్కరలేదు. రెండు వేల రూపాయలు అంతకంటె ఎక్కువ విరాళం ఇచ్చేవారి పేర్లను వెల్లడించాలన్న నిబంధన అమలు జరిగితే ఇలా నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చడం కష్టం. అసాధ్యం కాదు కానీ అతికష్టం! లక్ష రూపాయల ‘ఘరానా’ పేరును దాచడానికి కనీసం యాబయి మంది ‘కల్పిత’ గుప్త దాతలు అవసరం. అందువల్ల నల్లడబ్బు, లెక్కలకెక్కని డబ్బు భారీగా సేకరించడం, ఖర్చుపెట్టడం రాజకీయ పార్టీలకు మిక్కిలి శ్రమతో కూడిన వ్యవహారం కాగలదు. ‘‘నల్లడబ్బుపై ఆధారపడడం మానుకోవాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చిన ఎన్నికల సంఘానికి నేను ప్రణమిల్లుతున్నాను.. భారతీయ జనతా పార్టీ ఈ ప్రతిపాదనను స్వాగతిస్తోంది’’ అని ప్రధానమంత్రి చెప్పడంవల్ల ‘ప్రతిపాదన’ వాస్తవ రూపం ధరించడానికి ఎంతో కాలం పట్టదు!
కొన్ని ప్రతిపక్షాలు ‘ఎన్నికల సంఘం’ ప్రతిపాదనపై వౌనం వహిస్తున్నప్పటికీ ఎక్కువ సంఖ్యలోని విపక్షాలు కూడ నరేంద్ర మోదీ స్వాగత స్వరంతో గళం కలుపుతున్నాయి! ఇన్నాళ్లపాటు ఈ వైపరీత్యం కొనసాగడానికి కారణం రాజకీయ పక్షాలకూ నల్లడబ్బు కామందులకూ మధ్యగల అవినాభావ సంబంధం. ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రకటనతో అకస్మాత్తుగా పరివర్తన సంభవిస్తుండడం హర్షణీయం. 1951వ సంవత్సరంలో రూపొందించిన ప్రజాప్రాతినిధ్యపు చట్టంలోని నిబంధనలు మార్చడం వల్ల మాత్రమే ‘గుప్త విరాళ ప్రదాతల’ పేర్లు బయట పడడానికి వీలు కలుగుతుంది. ప్రభుత్వ పక్షమూ, అధికాధిక ప్రతిపక్షాలు కూడ గుప్త విరాళాల గరిష్ఠ పరిమితిని రెండు వేల రూపాయలకు తగ్గించడానికి ఒప్పుకున్నాయి కాబట్టి రానున్న బడ్జెట్ సమావేశాలలోనే ‘ప్రాతినిధ్యపు చట్టాని’కి సవరణను ఆమోదించవచ్చు. అలా ఆమోదించడం వల్ల మాత్రమే ప్రధాన రాజకీయ పక్షాల పారదర్శకతా చిత్తశుద్ధి ధ్రువపడగలదు. దేశం మొత్తం మీద దాదాపు పంతొమ్మిది వందల రాజకీయ పక్షాలు నమోదై ఉండడం ‘విరాళాల’ పరిమాణానికి ఒక నిదర్శనం. ప్రపంచంలోని మరే ప్రజాస్వామ్య దేశంలో కూడ ఇన్ని రాజకీయ పక్షాలు లేవు! గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పక్షాల సంఖ్య దేశం మొత్తం మీద వంద కంటె తక్కువే! మిగిలిన రాజకీయ పక్షాలు వివిధ రాష్ట్రాలలో నామమాత్రంగా ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. ఈ నామమాత్రపు పోటీ చేస్తున్న పక్షాల అభ్యర్థులలో అనేక మంది ప్రత్యర్థుల వద్ద ‘అంతో ఇంతో తీసుకుని‘ పరోక్షంగా వారికి ప్రచారం చేస్తున్నారు. కొందరు పోటీనుంచి ఉపసంహరించుకుని ప్రత్యక్షంగానే ప్రత్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇవి ‘నమోదయి’ - రిజిస్టర్డ్ - ఎన్నికల సంఘంవారి గుర్తింపునకు నోచుకోని -అన్ రికగ్నైజ్డ్- పక్షాలలో అత్యధిక పక్షాల ప్రధాన వ్యాసంగం నల్లడబ్బును స్వీకరించి ఖర్చుపెట్టడమేనన్నది ఎన్నికల సంఘం వ్యక్తం చేసిన అనుమానం. వీటిలో దాదాపు నాలుగు వందలకు పైగా రాజకీయ పక్షాలు నమోదైన తరువాత ఏళ్ల తరబడి ఏ ఎన్నికలలో కూడ పోటీ చేయలేదట!
రాజకీయ పక్షం ప్రధాన లక్ష్యం అధికారాన్ని సాధించడం. ఇందుకు ఏకైక మార్గం ఎన్నికలలో పోటీ చేయడం. ఎన్నికలలో పోటీ చేయని రాజకీయ పక్షాలు ఎందుకు మనుగడ సాగిస్తున్నట్టు? ఇలాంటి ‘చిల్లర’ పక్షాలు నిజానికి రాజకీయాలతో సంబంధం లేనివి. కొంతమంది గుంపుగానేర్పడి ఏదో ఒక్క పట్టణంలోనో నగరంలోనో డబ్బు దండుకుంటూ స్థానికంగా ‘గూండా గిరీ’లను మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇలాంటి రాజకీయ పక్షాలను క్రమంగా ‘జాబితా’నుంచి తొలగించాలని కూడ ఎన్నికల సంఘం నిర్ణయించడం శుభంకర ప్రజాస్వామ్య పరిణామం!