సంపాదకీయం

స్వచ్ఛంద విద్రోహం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా-అన్న ప్రభుత్వేతర సంస్థ-నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్-ఎన్‌జివో-కు వ్యతిరేకంగా దేశద్రోహం ఆరోపణ నమోదు కావడం ప్రతీక మాత్రమే! విదేశీయ నిధులతోను స్వదేశీయ అక్రమ నిధులతోను తెగబలిసిపోతున్న నకిలీ స్వచ్ఛంద సంస్థల దేశ వ్యతిరేక కార్యకలాపాలు అసలు సమస్య! ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా అన్నది మానవ అధికారాలను పరిరక్షించడానికి కృషి చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోంది. ఎవరి మానవ అధికారాలు? అన్న ప్రశ్నకు ఈ సంస్థకు చెందిన ఒకవర్గంవారు చెబుతున్న సమాధానం కశ్మీర్‌లో బీభత్సకాండను కొనసాగిస్తున్న వారి మానవ అధికారాలు -అన్నది! ఈ సమాధానం వారు చెప్పకపోయినప్పటికీ ఇది జగమెరిగిన వాస్తవం! బుర్హన్ వనీ అనేహిజ్‌బుల్ ముజాహిదీన్ ముఠాకు చెందిన పేరుమోసిన జిహాదీ హంతకుడు హతమైనప్పటినుంచి కశ్మీర్‌లోయలో కల్లోలాలు చెలరేగుతున్నాయి. ఈ కల్లోలాలను పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న జిహాదీ ఉగ్రవాదుల కొనసాగిస్తున్నారు. బుర్హన్ వనీ ముఠావారు కశ్మీర్ లోయ ప్రాంతంలో హత్యాకాండ సాగించినప్పుడు ఈ పాకిస్తానీ తొత్తులు బంద్‌లకు పిలుపునివ్వలేదు, ప్రదర్శనలు, ధర్నాలు, నిరసన యాత్రలు నిర్వహించలేదు. కానీ సైనిక దళాలతో తలపడి బుర్హన్ వనీ తదితర జిహాదీ బీభత్సకారులు హతులవుతుండడం మాత్రం మానవీయమైన హక్కులకు జరిగిపోతున్న విఘాతమన్న ప్రచారం చేస్తున్నారు. నిరసనల పేరుతో సైనిక దళాలపై దాడులు చేస్తున్నారు, విధ్వంసకాండను కొనసాగిస్తున్నారు. సైనికులు పోలీసులు గాయపడినా హతులైనా మానవ అధికారాలకు భంగం కాదన్నది ఆమ్నెస్టీ ఇండియా వంటి హక్కుల పరిరక్షణ పేరుతో చలామణి అవుతున్న సంస్థల నిర్థారణ! కానీ విధ్వంసాన్ని, హింసాకాండను సైనికులు ప్రతిఘటించినప్పుడల్లా ఆమ్నెస్టీ వంటి సంస్థలు హక్కులకు భంగం జరిగిపోయినట్టు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారంలో భాగంగానే ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా వారు బెంగళూరులో ఆగస్టు 13వ తేదీన ఈ కశ్మీర్ హక్కుల సదస్సును నిర్వహించారట! సదస్సులో దేశ వ్యతిరేక నినాదాలను చేయడమే కాక దేశద్రోహకరమైన పాటలు కూడ పాడినట్టు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వారు 13వ తేదీన ఫిర్యాదు దాఖలు చేశారట! కర్నాటక పోలీసులు భారతీయ శిక్షాస్మతిలోని 124-ఏ-వ నిబంధన ప్రకారం ఇతర నేర నిరోధక నిబంధనల ప్రకారం ఆమ్నెస్టీపై ఆరోపణను నమోదు చేసి విచారిస్తున్నారట!
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అన్నది అంతర్జాతీయ మానవాధికారాల సంస్థగా చెలామణి అవుతోంది! బ్రిటన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థ గతంలో అనేక సార్లు మన దేశంలో మానవ అధికారాలకు విఘాతం కలిగిపోతున్నట్టు ప్రచారం చేసింది. ఐరోపా పార్లమెంటు వారు కశ్మీర్‌లో మన ప్రభుత్వం మానవ అధికారాలను ఉల్లంఘిస్తోందన్న తీర్మానాలను గతం లో అనేకసార్లు ఆమోదించారు. ఈ తీర్మానాలకు ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారి పరిశోధనలు నిర్థారణలు ప్రాతిపదిక! చైనాలోను కమ్యూనిస్టు దేశాలలోను గతంలో భయంకరమైన రీతిలో జరిగిన మానవ అధికారాల హననం గురించి ఈ ఆమ్నెస్టీ ప్రచారం చేసింది. ఇప్పుడు కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థలున్న దేశాల సంఖ్య తగ్గిపోయింది. చైనా కాని సైనిక నియంతృత్వ వ్యవస్థలున్న దేశాల ప్రభుత్వాలు కాని ఈ సంస్థ ప్రతినిధులను తమ తమ దేశాలలో అడుగుపెట్టడానికి అనుమతించడంలేదు. అందువల్ల పారదర్శకత, స్వేచ్ఛ, సర్వమత సమభావం, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న మనదేశంలో మాత్రమే ఈ ఆమ్నెస్టీ విచ్చలవిడిగా కలాపాలను నిర్వహించుకోగలుగుతోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా అన్నది ఈ బ్రిటన్ సంస్థకు భారతీయ విభాగమట! కశ్మీర్‌లోని దేశంలో ఎక్కడ కాని టెర్రరిస్టుల, మావోయిస్టుల, ఇతరేతర అసాంఘిక శక్తుల మానవీయ అధికారాలకు ఎలాంటి భంగం కలగడం లేదు. ఈ దేశ వ్యతిరేకులు పోలీసులపైన సైనికులపైన దాడులు చేస్తున్నారు, పోలీసులు సైనికులు మరణించినప్పుడు ఆమ్నెస్టీ పట్టించుకోదు. ఎదురు దాడిలో దేశవ్యతిరేకులు మరణించినప్పుడు మాత్రమే ఆమ్నెస్టీకి హక్కులు గుర్తుకు వస్తున్నాయి. అమెరికాలోను, ఐరోపాలోను కూడ పోలీసులు టెర్రరిస్టులను వధిస్తున్నారు. ఆమ్నెస్టీ దృష్టిలో అదంతా హక్కుల ఉల్లంఘన కాదు...
ఆమ్నెస్టీ ఇండియాకు మాత్రమే కాదు దేశంలోని అనేకానేక స్వచ్ఛంద సేవ ముసుగేసుకున్న ఎన్‌జివోలలో కొన్ని విదేశాలనుంచి భారీగా నిధులను పొందుతున్నాయి. నిధులను సమకూర్చుతున్న విదేశాల వారు ప్రధానంగా ఐరోపా దేశాలవారు మన దేశంపట్ల ప్రేమతో ఈ నిధులను పంపిణీ చేయడంలేదు! మన దేశం అన్ని రంగాల్లోను బలపడి స్వయం సమృద్ధం కావడం శక్తిమంతం కావడం ఇష్టంలేని దేశాలవారు మన ప్రగతిని వ్యూహాత్మకంగా అడ్డుకుంటున్నారు. ఈ వ్యూహంలో భాగం విదేశాలనుంచి నిధులు తరలిస్తుండడం. జిహాదీ ముఠాలకు రహస్యంగా నిధులను సమకూర్చుతున్న అరబ్ దేశాలలోని సంపన్నులు మన దేశంలో బీభత్సకాండను ప్రోత్సహిస్తున్నారు. కానీ జకీర్ నాయక్ వంటి ప్రచ్ఛన్న బీభత్సకారులు అధ్యయనం, పరిశోధన వంటి పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి సంస్థలకు బాహాటంగానే విదేశాలనుంచి నిధులు వచ్చిపడుతున్నాయి. మనదేశంలోని వివిధ సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని సృష్టించడం, డబ్బు ను ఎరచూపి మతం మార్చడం వంటి కలాపాలను అధికాధిక ఎన్‌జివోలు కొనసాగిస్తుండడం బహిరంగ రహస్యం. పదిహేను సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన ఒక సదస్సులో తథాకథిత ఎన్‌జివోల సమాఖ్య చేసిన భారత వ్యతిరేక ప్రచారం తరువాత కూడ మన ప్రభుత్వాలు జాగ్రత్త పడలేదు. ఆ సదస్సులో ఈ ప్రపంచ ఎన్‌జివోల సమాఖ్య ఒక అధ్యయన పత్రాన్ని సమర్పించింది. మనదేశంలోని ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు విదేశీయుల పాలనలో మగ్గుతున్నట్టు ఆ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. అంటే ఈశాన్య ప్రాంతాలు మన దేశంలో భాగం కాదని నిర్ధారించడం ఆ సమాఖ్య లక్ష్యం...
భౌతికమైన ఈ ప్రమాదాలను మాత్రమే కాక ఆర్థిక సాంస్కృతిక రంగాలను సైతం అస్తవ్యస్తం చేయడానికి స్వచ్ఛందం ముసుగేసుకున్న సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మన చరిత్రను సంప్రదాయాలను కించపరిచే రీతిలో పరిశోధక నిర్ధారణలను చేయడం ఈ కుట్రలో భాగం. మూడీస్, స్టాండర్డ్ అండ్ పూర్స్ వంటి సంస్థలు మన పరపతి స్థాయిని నిర్ధారించడం, సంస్కరణలు చేయాలని హెచ్చరికలు చేయడం అంతర్జాతీయ ఆర్థిక బీభత్సంలో భాగం! ఇలాంటి స్వచ్ఛంద ఆర్థిక అధ్యయన సంస్థలు బహుళ జాతీయ వాణిజ్య సంస్థల దళారీలు...ఈ ఎన్‌జిఓల అవినీతి కలాపాలను సమీక్షించడానికి పూనుకున్న తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర జరుగుతోందని ప్రధాని నరేంద్రమోదీ గత ఫిబ్రవరి 21న ఆరోపించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. విదేశాలనుంచి వచ్చి పడుతున్న అక్రమ నిధులపై ప్రభుత్వం నిఘా పెంచడం ఇటీవలి పరిణామం. ఈ ఆమ్నెస్టీ నిధుల గురించి ప్రభుత్వం ఆరా తీస్తోందట!! నకిలీ ఎన్‌జిఓలనుంచి దేశాన్ని రక్షించుకొనడానికి సమగ్రమైన చట్టాలను రూపొందించవలసిన అనివార్యం ఏర్పడింది...