సంపాదకీయం

పాకిస్తాన్‌కు శృంగభంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ప్రజలు బీభత్సకాండను ప్రోత్సహిస్తున్న తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవించే రోజులు సమీపిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మరో అంతర్జాతీయ ప్రకంపనం... కేరళ రాష్ట్రంలోని కోఝికోడ్‌లో భారతీయ జనతా పార్టీ ‘జాతీయ ప్రతినిధి మండలి’ సమావేశాల సందర్భంగా ఏర్పాటైన సార్వజనిక సభలో శనివారం సాయంత్రం నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ప్రభుత్వంపట్ల ఆవిష్కృతవౌతున్న నిరసన దృశ్యాలకు అద్దం... పాకిస్తాన్ ప్రభుత్వ వికృత బీభత్స జిహాదీ స్వరూపం ఈ అద్దంలో మరోసారి కన్పించింది. ఆదివారం ‘్భజపా’ ప్రతినిధి మండలి సమావేశంలో నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రభుత్వ హంతక స్వభావాన్ని మరోసారి వివరించారు. ఆకాశవాణి ద్వారా ఆవిష్కృతమైన ఆయన ‘మనసులోని మాట’ - మన్ కీ బాత్ - ప్రధాన ఇతివృత్తంకూడా ఇదే... కశ్మీర్‌లోని ‘ఉరీ’ పట్టణం సమీపంలో పాకిస్తానీ ప్రభుత్వ ప్రేరిత ఉగ్రవాదులు పంధొమ్మిదిమంది మన సైనికులను దొంగచాటుగా హత్య చేయడం ప్రపంచవ్యాప్తి నిరసనలకు నేపథ్యం, మన ప్రధానమంత్రి హెచ్చరికలకు నేపథ్యం... ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బన్‌కీ మూన్ స్వయంగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అభిశంసించడం పాకిస్తాన్ ప్రభుత్వ మతోన్మాద జిహాదీ ఉగ్రవాద విధానంపట్ల పెరుగుతున్న అంతర్జాతీయ అవగాహనకు సరికొత్త సాక్ష్యం... తాము జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాద మృగాలను ఉసిగొల్పుతున్న వాస్తవాన్ని కప్పిపుచ్చుకోవడానికై పాకిస్తాన్ ప్రభుత్వం ‘‘కశ్మీర్ వివాదాన్ని’’ పదేపదే ఐక్యరాజ్య సమితిలోను, అంతర్జాతీయ వేదికలపైన ప్రస్తావిస్తోంది. మన ప్రభుత్వం కశ్మీర్‌లో మానవ అధికారాలను మంటగలుపుతోందని అసత్య ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం ఇప్పుడు బెడిసికొట్టింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో సెప్టెంబర్ 21న ప్రసంగించిన సందర్భంగా నవాజ్ షరీఫ్ చెప్పిన అబద్ధాలను ప్రపంచ దేశాల దృష్టికి తేవడంలో సమితిలోని మన ప్రతినిధులు కృతకృత్యులయ్యారు. ‘సమితి’లోని మన ప్రతినిధులు సయ్యద్ అక్బరుద్దీన్, రూపేంద్ర టాండన్, ఈనమ్ గంభీర్ పాకిస్తాన్ ప్రధాని వాదంలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేసిన తీరు ప్రపంచ దేశాలలో మన ప్రతిష్ఠను పెంచింది. మహిళా దౌత్య ప్రతినిధి ఈనమ్ గంభీర్ పాకిస్తాన్ వాదంలో అసత్యాలను బట్టబయలు చేయడమేకాక పాకిస్తాన్ ఉగ్రవాదులు కశ్మీర్‌లో కొనసాగిస్తున్న బీభత్స కృత్యాలను ఉదాహరణలతో నిరూపించగలిగింది. ఉరీ హత్యాకాండతో తమకు సంబంధం లేదని చెప్పడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఇలా ‘సమితి’లో విఫలం కావడం మనకు లభించిన మరో దౌత్య విజయం.
పాకిస్తాన్ ప్రభుత్వం చెపుతున్న ఈ అబద్ధాల చరిత్ర ఏళ్లతరబడి కొనసాగుతోంది. మన దేశంలో జిహాదీ ఉగ్రవాదులు సాగిస్తున్న బీభత్సకాండతో తమ సంబంధం లేదన్నది పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్న అబద్ధం. పాకిస్తాన్ ప్రభుత్వ శిక్షిత, ప్రభుత్వ ప్రేరిత జిహాదీ మతోన్మాదులు దశాబ్దాలుగా మన దేశంలో చొరబడి మన ప్రజలను హత్య చేస్తుండడం వాస్తవం. జమ్మూకశ్మీర్‌లో తిష్ఠ వేసి ఉన్న ప్రచ్ఛన్న, ప్రత్యక్ష జిహాదీ బీభత్సకారులు నిరంతరం పోలీసులపై, సైనికులపై దాడి చేస్తుండడం వాస్తవం. సైనికులు జరిపిన ఎదురు కాల్పులలో కొంతమంది జిహాదీలు హతవౌతున్నారు. ఇలా హతమైన వారిలో ‘హిజ్‌బుల్ ముజాహిదీన్’ జిహాదీ ముఠాలోని ప్రధాన హంతకుడు బుర్హన్ వనీ ఒకడు. కానీ సైనికులు కశ్మీర్‌లో మానవత్వపు హక్కులను మంటకలుపుతున్నారని పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా అసత్య ప్రచారం చేస్తోంది. ఇప్పుడు నవాజ్ షరీఫ్ పనికట్టుకొని ఐక్యరాజ్యసమితికి వెళ్లి ఈ ప్రచారం చేసి వచ్చాడు. బుర్హన్ వనీ యువనాయకుడని అతగాడిని మన సైనికులు ‘అన్యాయం’గా చంపారని నవాజ్ షరీఫ్ అబద్ధం చెప్పాడు. పాకిస్తాన్ ప్రభుత్వం 1947 నుంచి చెబుతున్న వౌలికమైన అబద్ధం ‘‘కశ్మీర్ వివాదానికి’’ ప్రతిక్రియగా కశ్మీర్‌లో బీభత్సకాండ పుట్టుకొచ్చిందన్నది... కానీ పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్సకాండను ప్రారంభించడం కొనసాగించడం తథాకథిక - సోకాల్డ్ - కశ్మీర్ వివాదానికి కారణం! మన దేశంలో భాగమైన జమ్మూ కశ్మీర్‌లోని పాకిస్తాన్ కిరాయి హంతకులు, పాకిస్తాన్ ప్రభుత్వ దళాలు 1947 అక్టోబర్‌లో చొరబడడం వల్ల, వేలాదిమంది హిందువులను హత్యచేయడం వల్ల మాత్రమే తథాకథిత ‘‘కశ్మీర్ సమస్య’’ ఏర్పడింది. పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స జిహాదీ స్వభావంవల్ల ఇలా ‘‘కశ్మీర్ వివాదం’’ ఏర్పడింది. అంతేకాని ‘‘కశ్మీర్ వివాదం’’ పట్ల ప్రతిక్రియగా జిహాదీ బీభత్సం మొదట రాలేదు. జిహాదీ బీభత్సకాండ స్వభావాత్మకం, శతాబ్దుల తరబడి అంతర్జాతీయంగా ఇది కొనసాగుతోంది. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను నిర్మూలించి ఇస్లాంను ఏకైక మతంగా నిలబెట్టడం ‘జిహాద్’ స్వభావం! అందువల్ల జిహాదీ బీభత్సకాండను నిర్మూలించడం ఒక్కటే ‘‘కశ్మీర్ వివాదానికి’’ పరిష్కారం!
కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తం వాస్తవాలను తల్లకిందులు చేయడానికి యత్నిస్తోంది! ఈ ప్రయత్నం పదేపదే బెడిసి కొట్టడం చరిత్ర! 1994లో ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ వంచనకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌లో మన ప్రభుత్వం మానవాధికారాలను భగ్నం చేస్తోందన్న అసత్యపు ఆరోపణతో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు సూచన మేరకు పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతాపార్టీ వరిష్ఠనేత అటల్ బిహారీ వాజ్‌పేయి ఐక్యరాజ్య సమితికి వెళ్లారు, మన ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి పాకిస్తాన్ వాదాన్ని తిప్పికొట్టారు. పాకిస్తాన్ తీర్మానం వీగిపోయింది. ఆ తరువాత కూడా అనేకసార్లు ‘సమితి’లో పాకిస్తాన్ మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హక్కుల తీర్మానాల కోసం విఫలయత్నాలను కొనసాగించింది. గతంలో వలెనే ప్రస్తుతం కూడా నవాజ్ షరీఫ్ చేసిన ప్రయత్నం ఇప్పుడు మళ్లీ బెడిసికొట్టింది. ‘ఉరీ’ హత్యాకాండ తరువాత ఒకటి తరువాత ఒకటిగా ఇరుగుపొరుగు దేశాలు పాకిస్తాన్ బీభత్స చర్యలను బహిరంగంగా నిరసిస్తుండడంతో పాకిస్తాన్ అబద్ధాల గుట్టు అంతర్జాతీయంగా రట్టయిపోయింది! పాకిస్తాన్‌లో జరుగవలసి ఉన్న దక్షిణాసియా ప్రభుత్వాధినేతల సమావేశాన్ని రద్దు చేయాలని మరో దేశంలో జరపాలని అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం బహిరంగంగా కోరింది. బంగ్లాదేశ్, శ్రీలంక ప్రభుత్వాలు కూడా పాకిస్తాన్‌ను బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. భూటాన్ ప్రభుత్వం తొలి నుండీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థగానే భావిస్తోంది.
పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాద సమర్ధక వ్యవస్థ’ - స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజమ్- గా నిర్ధారించడానికి వీలైన ‘బిల్లు’ను అమెరికా ‘కాంగ్రెస్’ - పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం వర్తమాన ఘటనాక్రమంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామం! ఈ ‘బిల్లు’ చట్టంగా మారినట్టయితే అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌ను బీభత్సకాండను ప్రోత్సహిస్తున్న దేశంగా గుర్తించవలసి ఉంటుంది! అదే జరిగినట్టయితే పాకిస్తాన్‌కు ఇంతవరకు లభించిన అమెరికా ఆర్థిక ఆయుధ సహాయం పూర్తిగా నిలిచిపోతుంది. గతంలో పాకిస్తాన్‌కు వత్తాసు పలికిన ఐరోపా దేశాలు సైతం ఇప్పుడు పాకిస్తాన్ బీభత్స చర్యలను గుర్తించడం మన దేశానికి లభిస్తున్న దౌత్యవిజయం. ఒకే ఒక దేశం ఆసియాలోను ప్రపంచంలోను జరుగుతున్న బీభత్స కృత్యాలకు ప్రేరక కేంద్రమన్న నరేంద్ర మోదీ మాటను ప్రపంచ దేశాలు అంగీకరిస్తున్నాయి. ఆ ఒకే ఒక దేశం పాకిస్తాన్!!