సంపాదకీయం

స్వయం సమర సమృద్ధి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్ నుంచి మన ప్రభుత్వం కొనుగోలు చేయనున్న ‘రాఫెల్’ బహుళ ప్రయోజన విమానాల వల్ల మన వైమానిక దళం సమర పటిమ మరింత విస్తరించనుంది. సంపూర్ణ స్వదేశీయ పరిజ్ఞానంతో సమగ్ర రక్షణ స్వయం సమృద్ధిని సాధించాలన్న లక్ష్యం ఎండమావిలోని మంచినీటి ప్రవాహం వలె ఊరిస్తోందన్న వాస్తవం కూడా ఈ కొనుగోలు ఒప్పందం వల్ల మరోసారి స్ఫురించింది. మన సైనిక బలం రక్షణ పటిమ పెరగడం అనివార్యమైన పరిణామం. చైనా ప్రభుత్వం వారు మన దేశాన్ని నలువైపుల దిగ్బంధించడానికి దశాబ్దాల తరబడి దురాక్రమణ వ్యూహాన్ని అమలుజరుపుతుండడం ఈ అనివార్య పరిణామానికి నేపథ్యం. బంగ్లాదేశ్‌లోని చిట్టగ్యాంగ్ ఓడరేవు నుంచి బర్మా, శ్రీలంక, మాల్‌దీవుల మీదుగా పాకిస్తాన్ లోని గ్వాడార్ ఓడరేవువరకూ తూర్పు నుంచి దక్షిణానికి పడమరకు మన దేశం మూడు వైపుల సముద్ర జలాలలో చైనా యుద్ధనౌకలు విహరించడం మొదలై దాదాపు దశాబ్దం అయింది. పాకిస్తాన్‌లో కలిసి అరేబియా సముద్ర ప్రాంతంలో చైనా నౌకాదళాలు ఉమ్మడి గస్తీ తిరుగుతున్నాయి. ఓడదొంగలను, సొమాలియా తీరంలో తిష్టవేసి హిందూ మహాసాగర ప్రాంతంలోను అరేబియా సముద్రం లోను వాణిజ్య నౌకలను కొల్లగొట్టిన నౌకాచోరులను నియంత్రించే నెపంతో చైనా తన యుద్ధనౌకలను ఈ ప్రాంతానికి తరలించుకుని వచ్చింది. ఓడదొంగలు అరేబియా ప్రాంతంలో సద్దుమణిగి రెండేళ్లయింది. అన్ని దేశాల వాణిజ్య నౌకలు రక్షణ సిబ్బందిని పెంచుకొనడం ఇందుకు ప్రధాన కారణం. కానీ చైనా నౌకాదళం గస్తీ మాత్రం ఆగలేదు. పాకిస్తాన్‌తో కలిసి మన దేశపు పడమటి తీరాన్ని నిరంతరం గమనించడం ఈ గస్తీ లక్ష్యం. పెద్దఎత్తున వామాన వాహక నౌకలను నిర్మించే కార్యక్రమాన్ని సైతం చైనా చేపట్టింది. అతి తక్కువ ఎత్తులో ఎగరడం ద్వారా ఇతర దేశాల ‘నిఘా వ్యవస్థ’ను తప్పించుకొని ఆయా దేశాల గగన సమర శకటాల- స్టెల్త్‌ఫైటర్ ప్లేన్స్‌ను కూడా చైనా భారీ సంఖ్యలో మన ఉత్తర సరిహద్దునకు సమీపంలోని టెబెట్ నెలకొల్పింది. పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్- పిఓకె-లోకి పదమూడు వేల చైనా సైనికులు చొబడి తిష్టవేసి ఉండడం ఆరేళ్లకు పైగా నడుస్తున్న చరిత్ర. చైనా నుంచి నిరంతరం పాకిస్తాన్‌కు సమర శకాటలు సరఫరా అవుతున్నాయి. ఎనిమిది జలాంతర్గాములను పాకిస్తాన్‌కు సరఫరా చేయాలన్న చైనా నిర్ణయం మన ప్రభుత్వం ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ‘రాఫెల్’ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి అత్యంత సమీపగతం.. ఈ విమానాల కోసం మన వైమానిక దళం పదహారు సంవత్సరాలు నిరీక్షించాల్సి వచ్చింది.
ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న ఆయుధ, సమర శకట వినిమయ అంగీకారాలు చాలా ఏళ్ల తరబడి ‘సాగు’తుండడం మన రక్షణ వ్యవస్థను ఆవహించిన వైపరీత్యం. రష్యా నుంచి కొనుగోలు చేసిన విక్రమాదిత్య విమానం వాహక నౌక తరలివచ్చి మన నౌకాదళంలో చేరడానికి దాదాపు పదకొండేళ్లు పట్టింది. 1987 నుంచి రష్యా ఉపయోగించిన ఈ నౌకను 2004లో మన ప్రభుత్వం కొనుగోలు చేసింది. కానీ మరమ్మత్తులు జరగడానికి పదేళ్లు పట్టింది. 2014లో ‘విక్రమాదిత్య’ నౌకాదళ ప్రవేశం చేసే వరకూ మనకు ఏకైక విమాన వాహక యుద్ధనౌక ‘విక్రాంత్’, మరో విమాన వాహన యుద్ధనౌక ‘విరాట్’ పాతబడి పగిలి పోవడానికి సిద్ధమైంది. ఈ రెండింటిని కూడా మన దేశం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసింది. ‘విరాట్’ ఇకపై పురాయుద్ధ వాహనంగా ప్రదర్శితం కాబోతోంది. చైనా దురాక్రమణ దృక్కులను నిరంతరం నిగిడిస్తున్న నేపథ్యంలో జల యుద్ధానికి, స్థల యుద్ధానికి, గగన యుద్ధానికి అవసరమైన వాహనాలను సమకూర్చుకొనడంలో మన దేశం గురి అవుతున్న విపరీత విలంబనానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! చివరికి ప్రముఖులు పయనించడం కోసం వైమానిక దళం సమకూర్చుకోదలచిన ‘అగస్టా’ హెలికాప్టర్లు సైతం ఏళ్ల తరబడి మన దేశానికి రాలేదు. చివరికి అవినీతి తుపానులో పడి ఈ ‘గగన శకటాల’ కొనుగోలు ఒప్పందం కొట్టుకొనిపోయింది. యుద్ధ విమానాలను, విమాన వాహక నౌకలను చైనా స్వయంగా నిర్మించకుంటోంది, కొనుగోలు చేయడం లేదు. పాకిస్తాన్ వంటి దేశాలకు పంపిణీ చేస్తోంది. మనం ఇలాంటి స్వయం సమృద్ధిని సాధించగలిగేది ఎప్పటికో?
ఇపుడు కొన్న రాఫెల్ యుద్ధ విమానాలు మొత్తం ముప్పయి ఆరూ మన దేశానికి తరలివచ్చినట్టయితే ఎఫ్-16 యుద్ధ విమానాలున్న పాకిస్తాన్ కంటే మన గగన పటిమ పెరిగిపోతుందట! కానీ మొదటి విమానం ఫ్రాన్స్ నుంచి మన దేశానికి చేరడానికి మరో మూడేళ్లు పట్టనున్నదట. మొత్తం విమానాలు తరలి రావటానికి ఆరేళ్లు పడుతుందట! అందువల్ల వీటి కారణంగా లభించననున్న బహుళార్థ ప్రయోజనం 2022 నాటికి మాత్రమే సిద్ధించనుంది. పదహారు ఏళ్ల క్రితమే ఈ ఒప్పందం కుదిరి ఉండినట్లయితే ఈ మొత్తం విమానాలు మనకు దాదాపు పదిహేడు వేల కోట్లకు లభించి ఉండేవి. ప్రస్తుతం మనం దాదాపు అరవై వేల కోట్ల రూపాయలకు పైగా చెల్లించవలసి వస్తోంది. ద్రవ్యోల్బణం ఒక్కటే ఇందుకు కారణం కాదు. మన ఈ విమానాలను కొనుగోలు చేయడం మన రక్షణ అనివార్యమన్న వాస్తవాన్ని గ్రహించిన ఫ్రాన్స్ ధరను సహజంగానే పెంచింది. కానీ ఈ వామానాలను, నిర్మాణ సమర రీతులను మన ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేయవలసి ఉందట! కానీ ఆరేళ్ల తరువాత అమెరికా నుంచి పాకిస్తాన్‌కు ‘ఎఫ్-16’ విమానాలు అందకపోవచ్చు! ఈ విమానాలను మరిన్నింటిని అమెరికా సంస్థ నుంచి కొనుగోలు చేయడానికి వీలుగా అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు రుణం ఇస్తోంది. కానీ ఈ ఏడాది నుంచి అప్పు ఇవ్వరాదని అమెరికా నిర్ణయించింది. అందువల్ల పాకిస్తాన్ ‘ఎఫ్-16’ విమానాలను ఇకపై కొనగపోవచ్చు. చైనా నుంచి మరో రకం విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందువల్ల ‘రాఫెల్’ గగన సమర పాటవాన్ని ‘ఎఫ్-16’ విమానాలతో సరిపోల్చడం సరికాదేమో. చైనా వారి విమానాలతో మత్రమే సరిపోల్చుకోవలసి ఉంటుంది. ఏమైనప్పటికీ ఏడు వందల కోట్ల రూపాయల ఉత్పాదక వ్యయంతో రూపొందుతున్న ఒక్కొక్క ‘రాఫెల్’ను మనం పదహారుర వందల యాభయి కోట్ల రూపాయలకు కొనుగోలు చేయవలసి రావడం ‘స్వయం సమృద్ధ’ సూత్రానికి విఘాతకరం.
అంతరిక్ష పరిశోధన రంగంలో అగ్రగామి కాగలిగిన మన దేశం, వివిధ దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోని భూ సమాంతర కక్ష్యలలో ప్రవేశపెట్టగలిగిన మనం రక్షణావసరలా కోసం ఇప్పటికీ విదేశాలపై ఆధారపడవలసిరావడం ఆందోళన కలిగించవలసిన వాస్తవం. స్వదేశీయ పరిజ్ఞానంతో మనం ‘తేజస్’ యుద్ధ విమానాలను నిర్మించగలుగుతున్నాము. ముప్పయి రెండేళ్ల మన రక్షణ శాస్తవ్రేత్తల నిర్విరామ కృషి ఫలితమిది. అయినప్పటికీ ‘రాఫెల్’ వలె భూతల గగనతల యుద్ధ వ్యూహాలను సమాంతరంగా అమలు జరుపగల విమానాలను మనం స్వయంగా ఎప్పటికి తయారుచేసుకోగలమో?