సంపాదకీయం

వెక్కిరిస్తున్న చైనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవుతలను అమర్చుకొని గోవాకు వచ్చిన ‘చైనా తో డేలు’ తిరిగి వెళ్లిన వెంటనే విషపు కోరల సొంత ముఖాన్ని వికృతంగా ప్రదర్శించింది! ఉగ్రవాదంతో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ముడి పెట్టడం సరికాదన్న వాదాన్ని మళ్లీ వినిపించింది! గోవాలో ఈనెల 15, 16 తేదీల్లో జరిగిన ‘బ్రిక్స్’ ప్రభుత్వాధినేతల సమావేశంలో రూపొందించిన ‘ఉగ్రవాద వ్యతిరేక’ ఉమ్మడి విధాన పత్రాన్ని అంగీకరించినట్టు చైనా అధ్యక్షుడు ఝీ జింగ్ పింగ్ అభినయించాడు! మన దేశంలోని ‘ఊరీ’ ప్రాంతంలో ఇటీవల బీభత్సకారులు దాడి చేసి మన సైనికులను హత్య చేయడాన్ని ఈ సంయుక్త ప్రకటనలో నిరసించారు. దాడి చేసిన బీభత్సకారులను పాకిస్తాన్ ఉసిగొల్పిందన్నది జగమెరిగిన సత్యం. అందువల్ల ‘బ్రిక్స్’- బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాల కూటమి- ఈ ఉమ్మడి ప్రకటన ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స చర్యలను అభిశంసించింది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పేరు పెట్టి పేర్కొనకపోయినప్పటికీ ‘ఊరీ’పై దాడులను, మన దేశంలో హత్యాకాండను నిర్వహిస్తున్న జిహాదీలను పాకిస్తాన్ ఉసిగొలుపుతోందని అన్ని దేశాలకూ తెలుసు. చైనాకు మరింత స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ‘గోవా సంయుక్త ప్రకటన’ వెలువడిన తరువాత ఇరవై నాలుగు గంటలలోనే చైనా మాట మార్చింది! ‘మాట మార్చింది..’ అన్నది వాస్తవం. కానీ, ‘మాట మార్చలేదు..’ అని సమర్థించుకొనడానికి వీలైన భూమికను సమావేశం సందర్భంగానే ముందుగా చైనా అధ్యక్షుడు సిద్ధం చేసుకుని వెళ్లాడు. సంయుక్త ప్రకటనలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్‌లో నెలకొని ఉన్న బీభత్స సంస్థలను కాని పేర్కొనక పోవడం ఈ భూమిక! బీభత్సకారులు తమ భూ భాగాన్ని వినియోగించుకొని ఇతర దేశాల ప్రజలను హత్య చేయడానికి ఏ దేశం కూడా వీలు కల్పించరాదన్నది సంయుక్త ప్రకటన స్ఫూర్తి. దీన్ని ‘బ్రిక్స్’ దేశాలన్నీ సమర్థించాయి, చైనా కూడా. కానీ, ఈ ప్రకటనను ‘బ్రిక్స్’లోని మూడు ప్రధాన దేశాలు భారత్, రష్యా, చైనాలు మూడు విభిన్న రీతులలో అర్థం చేసుకున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఇలా తన భూ భాగాన్ని బీభత్సకారులకు అప్పగించడం, అక్కడ జిహాదీలు స్థావరాలను స్థాపించుకొనడం వాస్తవం. ఈ వాస్తవాన్ని మన ప్రభుత్వం చాటింది. మన ప్రధాని నరేంద్ర మోదీ ‘గోవా’ వేదికపై చాటి చెప్పాడు. కానీ పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలు లేవన్నది చైనా చెప్పదలచిన, చాట దలచిన అబద్ధం. కానీ ఈ అబద్ధాన్ని చైనా అధ్యక్షుడు గోవాలో చెప్పలేదు. ఇక్కడ వౌనం వహించాడు! పాకిస్తాన్ బీభత్స చర్యలను చైనా కూడా నిరసించిందని, ఇది మన ప్రభుత్వ విధానానికి విజయమని జరిగిన ప్రచారానికి ఇదీ ప్రాతిపదిక!
చైనా కూడా పాకిస్తాన్ చర్యలను నిరసించినట్టు జరిగిన ప్రచారాన్ని నిజానికి చైనా ‘నీతి’ గురించి అవగాహన ఉన్నవారు నమ్మలేదు! అందువల్లనే గోవా ప్రకటన వెలువడిన సమయంలోనే చైనా అధ్యక్షుని వౌనంలో నిహితమై ఉన్న వంచనను, ఈ అవగాహన ఉన్న వారు గుర్తించారు. చైనా అధ్యక్షుడు భారత్ నుంచి దాటుకున్న వెంటనే చైనా ప్రభుత్వం మాట మార్చుతుందని చారిత్రక అవగాహన ఉన్న వారికి స్పష్టంగా తెలుసు. అది ఇరవై నాలుగు గడవక ముందే ధ్రువపడింది. ‘పాకిస్తాన్ చేస్తున్న త్యాగాలను అంతర్జాతీయ సమాజం గుర్తించాల’ని చైనా రాజధాని బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువా చున్నీ యింగ్ అనే మహిళామణి సోమవారం చేసిన విజ్ఞప్తి మన దౌత్యనీతిని వెక్కిరించడం.. బీభత్సకాండను రూపుమాపడానికి పోరాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఈ త్యాగాలను చేసిందట! ‘సీతమ్మను అపహరించిన వారిని రావణాసురుడు శిక్షించాడు’.. అని చైనా చెప్పినట్టయింది. ‘కౌరవులు ద్రౌపదిని అవమానించలేదు’.. అని వాక్రుచ్చినట్టయింది. ‘పాకిస్తాన్ భారత వ్యతిరేక బీభత్సకారులను ఉసిగొల్పడం లేదు’ అని చైనీయ ప్రభుత్వ ప్రతినిధి చెప్పడం ఇలాంటి అబద్ధాల పరంపర! తాను చంకనెత్తుకుని ఉన్న పాకిస్తాన్ బీభత్స రూపాన్ని నాగరిక రూపంగా చిత్రీకరించడానికి చైనా ప్రభుత్వం ఎంతటి స్థాయికైనా దిగజార గలదు, ఎన్ని అబద్ధాలైనా చెప్పగలదు! మన దేశంలోని జిహాదీ ఉగ్రవాదులను పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతోంది, పాకిస్తాన్‌ను ఉసిగొల్పుతున్నది చైనా! అందువల్లనే మసూద్ అఝార్‌ను కానీ అతగాడి జాయిష్ ఎ మహమ్మద్- జెఇఎమ్- ముఠాను కాని, హఫీజ్ సరుూద్‌ను కాని అతగాడి ‘లష్కర్ ఎ తయ్యబూ’- ఎల్‌ఇటి-ను కాని ‘జమాత్ ఉద్ దాలా’ను కాని గోవా తీర్మానంలో ప్రస్తావించకుండా చైనా నియంత ఝీ జింగ్ పింగ్ అడ్డుకోగలిగాడు..
అందువల్ల ‘గోవా తీర్మానం’ అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేకం మాత్రమేనని, పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకం కాదని ఝీ జింగ్ పింగ్ గోవాలో ధ్వనింపజేశాడు. బీజింగ్‌లో హువా చున్నీ యింగ్ ధ్రువీకరించింది. నిజానికి మాట మార్చిన చైనా తనది ‘మాట మార్చడం’ కాదని, కేవలం స్పష్టీకరణ మాత్రమే అని సమర్థించుకొనడానికి వీలైన ‘తర్కం’ కూడా చైనా ద్వంద్వ నీతిలో ఇమిడి ఉండడం దశాబ్దుల వాస్తవం! 2004- 2014 మధ్య చైనా అధ్యక్షులు, ప్రధాన మంత్రులు మన దేశానికి వచ్చినపుడల్లా మన ప్రభుత్వ ప్రతినిధులు ప్రధానంగా ఒక విషయాన్ని ప్రచారం చేశారు. ‘ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనకు చైనా మద్దతునిచ్చింది..’ అన్నది ఆ ప్రచారం. మన దేశంలో ఉన్నంత సేపూ చైనా ప్రభుత్వ అధినేతలు ఈ విషయమై ‘వౌనం’ వహించేవారు. బీజింగ్‌కు తిరిగి వెళ్లిన వెంటనే ‘అబ్బే.. మేము మద్దతు ప్రకటించలేదు’ అని స్పష్టీకరణలు ఇచ్చేవారు. ఈ ద్వంద్వ నీతిని గుర్తెరిగిన మన ప్రభుత్వం గత రెండేళ్లుగా ఈ ‘మద్దతు’ గురించి మాట్లాడడం లేదు. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్టలను కట్టి నీటిని మళ్లించుకుంటున్న చైనా ఈ విషయంలో పదే పదే పరస్పర విరుద్ధమైన స్పష్టీకరణలు ఇస్తుండడం నడుస్తున్న చరిత్ర.. బీజింగ్‌కు వెళ్లిన తర్వాత ఝీ జింగ్ పింగ్ గోవా తీర్మానాన్ని వెక్కిరించడం ప్రచారమవుతున్న ప్రహసనం... గోవాలో ఉండగానే ఝీ జింగ్ పింగ్ మన ప్రధానిని వెక్కిరించడం ప్రచారం కాని ప్రహసనం! మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వంచన జూదంలో చిక్కుకున్నాడు..
నేపాల్ ప్రధానమంత్రి మావోయిస్టు మహానేత పుష్పకమల్ దహల్ ప్రచండతో కలసి ఝీ జింగ్ పింగ్ మన ప్రధానిని వెక్కిరించి వెళ్లాడు. ‘బ్రిక్స్’ సమావేశంలో సమాంతరంగా గోవాలో జరిగిన ‘బిమ్‌స్టెక్’ సమావేశానికి ప్రచండ విచ్చేశాడు. ‘బిమ్‌స్టెక్’- ‘బంగాళాఖాత ప్రాంత దేశాల సాంకేతిక ఆర్థిక సహకార సమాఖ్య’లో చైనాకు సభ్యత్వం లేదు. ‘బ్రిక్స్’లో నేపాల్‌కు సభ్యత్వం లేదు. అందువల్ల గోవాలో నేపాల్, చైనాలతో కలసి మన దేశం త్రైపాక్షిక సమావేశం జరపడానికి ప్రాతిపదిక లేదు. ఉభయ దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపి ఉండవచ్చు. కానీ ప్రచండ ‘నాయకత్వం’లో పదహారవ తేదీన మోదీ, జింగ్ పింగ్ సమావేశమయ్యారు. ‘ప్రచండ’ చైనాకు రాజకీయపు దళారీ.. ఈ త్రైపాక్షిక సమావేశం ద్వారా తమకు భారత్, చైనాలు సమానమని ప్రచండ చాటగలిగాడు! నేపాల్‌తో మన యుగాల నాటి ప్రత్యేక బంధం ఏమయినట్టు??