సంపాదకీయం

‘గిరాకీ’ ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరాలలోను పట్టణాలలోను తిరుగుతున్న ‘టాక్సీ’ల యజమానులు, చోదకులు కనీసపు శుల్కం కంటె నాలుగురెట్లు వరకు ప్రయాణీకులవద్ద వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించడం స్వేచ్ఛావిపణి- మార్కెట్ ఎకానమీ- వల మరింతగా బిగిసిపోతోందన్న వాస్తవానికి మరో నిదర్శనం. వికేంద్రీకృత భారతీయ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేసిన ‘ప్రపంచీకరణ’ కబంధ బంధంలో ప్రభుత్వాల విధానాలు చిక్కుకొని ఉన్నాయనడానికి ఇది మరో సాక్ష్యం! అన్ని రంగాలలోను కేంద్రీకరణ వ్యవస్థితవౌతోంది. కేంద్రీకరణ భారతీయ వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది! చిన్న దుకాణాలు మూతపడుతున్నాయి, ఒకే సంస్థ వారి దుకాణాలు గల్లీగల్లీలోను ప్రతి పట్టణంలోను దేశమంతటా విస్తరిస్తున్నాయి. కేంద్రీకరణకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే! కేంద్రీకరణ పాశ్చాత్యుల కమ్యూనిజమ్- సామ్యవాదం- స్వభావం. కేంద్రీకరణ పాశ్చాత్యుల పెట్టుబడిదారీ వ్యవస్థ- కాపిటలిజమ్- స్వభావం! కమ్యూనిజమ్ ప్రపంచాన్ని ముంచెత్తిన సమయంలో దాని ప్రభావం మన దేశంలో పెద్దగా లేదు. కాని 1980వ 1990 దశకాలలో ‘కమ్యూనిజమ్’ అనేక దేశాలలో కుప్పకూలిన తరువాత, ‘కాపిటలిజమ్’ అన్ని దేశాలనూ ముంచెత్తుతోంది. ఇలా ముంచెత్తడం పేరు ‘ప్రపంచీకరణ’, స్వేచ్ఛావిపణి, అంతర్జాతీయ వాణిజ్య అనుసంధానం, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల చొరబాటు! ప్రపంచీకరణ ఫలితంగా కేంద్రీకరణ మొదలైపోయింది. లక్షలాది ‘టాక్సీ’ల యజమానులు, చోదకులు మన దేశంలో కేవలం రెండు దళారీ సంస్థలకు వాణిజ్యపు బానిసలుగా మారిపోవడం ఈ కేంద్రీకరణలో భాగం! మనం నగరాలలో పట్టణాలలో ఎక్కడికైనా వెళ్లాలంటె గతంలో రహదారి మీద ‘టాక్సీలు’ లభించేవి! రైల్వేస్టేషన్ల వద్ద బస్‌స్టేషన్‌లవద్ద, వాణిజ్య ప్రాంగణాల వద్ద ‘టాక్సీ’లు దొరికేవి! ఆటోరిక్షాను పిలుచుకున్నట్టుగా ‘టాక్సీ’ని పిలుచుకొనడానికి వీలుండేది! ఆ వీలు ఇప్పుడు లేదు. మీకు ‘టాక్సీ’ కావాలంటే ‘ఉబర్’ సంస్థకు, ‘ఓలా’ సంస్థకు ఫోన్ చేయాలి! వారు మనకు ‘టాక్సీ’ని కేటాయిస్తారు. ‘టాక్సీ’అనకూడదు... ‘క్యాబ్’ అనాలి. ప్రపంచీకరణ ప్రభావంతో అమెరికావారి పదజాలం దిగుమతి అవుతోంది. ఈ ‘ఉబర్’, ‘ఓలా’ సంస్థలు రంగప్రవేశం చేయకముందు ఇలాంటి దళారీ సంస్థలు చాలా ఉండేవి. ప్రతి నగరంలోను వేరువేరు సంస్థలుండేవి! ఇప్పుడవన్నీ క్రమంగా మూతపడిపోయాయి. ‘ఉబర్’, ‘ఓలా’ సంస్థలు దేశమంతటా విస్తరించిపోయాయి. ‘ఉబర్’ దళారీ సంస్థను ట్రావిస్ కలానిక్ అనేవాడు స్థాపించాడట! కానీ భారత్‌లో తమది విదేశీయ సంస్థకాదని కలానిక్ బుకాయిస్తున్నాడు....
‘ఉబర్’ ఉద్యోగులలో అధికాధికులు భారతీయులు. అందువల్ల తమది విదేశీయ సంస్థకాదని కలానిక్ విచిత్ర తర్కాన్ని వినిపిస్తున్నాడు. లాభాలను మాత్రం మనదేశంనుండి తరలించుకొనిపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఈ దళారీ సంస్థకున్నాయట! విదేశాల నుంచి వ్యాపించిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ‘అంతర్జాతీయత’ మన దేశంలోని ప్రభుత్వేతర సంస్థలను కూడ ఆవహించి ఉంది! ఈ వాణిజ్య అంతర్జాతీయ పరిధిలో దేశభక్తి, జాతీయత, మాతృభూమి పట్ల మమకారం, ‘్భరత్‌లో నిర్మించండి’- వంటివి ఇమడవు. సరిహద్దులను చెరిపివేసే ఈ ప్రపంచీకరణను మన్‌మోహన్‌సింగ్ ఆర్థికమంత్రిగా, ప్రధానిగా మన నెత్తికెత్తాడు. అప్పుడు ఈ ‘ప్రపంచీకరణను వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ అధికారం స్వీకరించిన తరువాత, 1998-2004 మధ్య, 2014 మే 26 నుంచి అదే ‘ప్రపంచీకరణ’ను మరింత బలంగా ప్రతిష్ఠ చేస్తుండడమే వైపరీత్యం. ‘అగ్రిగేటర్’- అనుసంధానకర్త-లుగా దోపిడీ చేస్తున్న ‘ఉబర్’, ‘ఓలా’ సంస్థలు మరింతగా దోచుకొనడానికి కేంద్ర ప్రభుత్వంవారి కొత్త మార్గదర్శక సూత్రాలు దోహదం చేస్తున్నాయి.ఈ మార్గదర్శక సూత్రాలు అమలు జరగడానికి పూర్వమే ‘ఉబర్’, ‘ఓలా’ సంస్థలు ఒకే దూరం ప్రయాణానికి వివిధ సందర్భాలలో వివిధ రకాల ఛార్జీలను వసూలు చేశాయి. ఇలా మారడానికి ప్రాతిపదిక ఏమిటన్నది ప్రయాణీకులకు అంతుబట్టలేదు. పదిహేను కిలోమీటర్ల ప్రయాణానికి ఈ రోజు నూటయాబయి నూట అరవై రూపాయలు చెల్లించిన ప్రయాణీకుడు రేపు అంతే ప్రయాణానికి మూడువందల యాబయి చెల్లించవలసి వస్తుంది. అంతేకాదు, ఒకచోటికి వెళ్లేటప్పుడు మూడువందలు ‘క్యాబ్’ మీటర్ ఛార్జి అవుతుంది. వచ్చేటప్పుడు అదే దూరానికి ఎనిమిది యాబయి రూపాయలు ‘క్యాబ్’వాడు వసూలుచేస్తాడు! అదేమంటే ‘క్యాబ్’ యజమాని లేదా చోదకుడు- డ్రైవర్- తనకు తెలియదని ‘కంపెనీ’ నిర్ణయిస్తుందని సమాధానం చెబుతాడు. ఆ కంపెనీ పేరు ‘ఓలా’ లేదా ‘ఉబర్’! ‘గిరాకీ’నిబట్టి ‘లభ్యత’నుబట్టి ఇలా ప్రయాణ శుల్కం మారుతుందన్నది ‘కంపెనీ’ చెబుతున్నమాట! దీని పేరు ‘డైనమిక్ ప్రయిజింగ్ అట!’ ‘ఆటోరిక్షా’వాడు ఐదు రూపాయలు ఎక్కువ తీసుకుంటే ‘మీటర్’లో మోసం ఉందని భూనభోంతరాలు దద్దరిల్లేలా ఆర్భాటం చేసే జనం ‘ఉబర్’, ‘ఓలా’ దళారీ సంస్థలు వందలు వేలు అధికంగా లాగుతున్నప్పటికీ నోరు మెదపడం లేదు! నోరు మెదిపినట్టయితే ‘డైనమిక్ ప్రయిజింగ్’ గురించి తమకు తెలియదన్న అపకీర్తికి గురికావలసి వస్తుంది! వస్తువుల సేవల ధరలు ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రంలేకుండా గిరాకీని లభ్యతనుబట్టి నిర్ధారణకావడం ‘స్వేచ్ఛావిపణి’ అదర్శమట! ప్రపంచ వాణిజ్య సంస్థవారి నిర్వచనం ఇది. అందువల్ల వాణిజ్య సంస్థలు కృత్రిమంగా కొరతను, గిరాకీని సృష్టించి ‘ఒకటికి మూడింతలు’ వసూలు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుండాలన్నది ‘ప్రపంచీకరణ’ సూత్రం. కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరికే ఉండలేదు. ఇప్పటికే కనీసపు శుల్కం కంటె రెండున్నర రెట్లు వసూలు చేస్తున్న ‘క్యాబ్’ కంపెనీలు - అగ్రిగేటర్లు- ఇకపై పగటిపూట మూడు రెట్లవరకూ వసూలు చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చేసింది! ఈ ‘ఉప్పెన ధర’- సర్జ్‌ప్రెయిజింగ్- రాత్రిపూట నాలుగు రెట్లకు పెరగవచ్చునట! గిరాకీని పట్టి ఇదంతా జరుగుతోంది!
‘ఉబర్’ ‘ఓలా’ సంస్థలకు ఒక్క కారు లేదు, ఒక పైసా పెట్టుబడి లేదు. కాని లక్షలాది ‘క్యాబ్’లను ‘కార్ల’ను ‘టాక్సీ’లను అనుసంధానం చేసి దళారీ వ్యాపారం సాగిస్తున్నాయి. ప్రయాణీకులు చెల్లించే ‘శుల్కం’లో ఇరవై శాతం ఈ ‘దళారీ’లకు లభిస్తోందట! లక్షలాది ‘కార్ల’ యజమానులు, చోదకులు-డ్రైవర్‌లు- ఈ దళారీ సంస్థలకు కట్టుబానిసలు. కోట్లాది ప్రయాణీకులకు స్వేచ్ఛగా ‘టాక్సీ’ని ఎంచుకొనే హక్కులేదు. ఈ రెండు దళారీ సంస్థలలో దేనికో ఒకదానికి ఫోన్‌చేసి లేదా ‘ఆన్‌లైన్’లో ‘క్యాబ్’ను బుక్ చేసుకోవాలి! ఈ రెండు సంస్థలూ కూడ కొన్ని సమయాలలో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. అరగంట వరకూ ‘క్యాబ్’ దొరకదు. అందువల్ల వంద రూపాయల ప్రయాణానికి రెండు వందలు మూడు వందలు లేదా నాలుగు వందల రూపాయలు చెల్లించాలి! లేదా నోట్లో, వేలు వేసుకొని ఉన్నచోటే నిలబడాలి....