సంపాదకీయం

‘బొగ్గు’పాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొగ్గు పాల కడుగ పోవునా మలినంబు?- అన్నది వేమన శతకంలోని ఒక పద్య పాదం. మన భాష విదేశీయ భాషలతో కల్తీ అయిపోయిన తరువాత ‘విశ్వదాభి రామ వినుర వేమ’ అన్న పద్యాల గురించి చాలామంది నాగరికులకు తెలియడం లేదు. బొగ్గును పాలతో కడగడం మతిమాలిన చర్య. కానీ, బొగ్గు పాలలోనే చొరబడిపోతుండడం నడుస్తున్న చరిత్ర. మూసీ నది ప్రవహిస్తున్న హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని ప్రజలకు బొగ్గు, సీసంతో కలుషితమైన పాలు సరఫరా అవుతున్నాయన్నది కొంతమంది పరిశోధకులు ఇటీవల నిర్ధారించిన నిజం. అన్ని ‘ప్యాకెట్ల’లోను ‘బొగ్గుపాలు’ సరఫరా అవుతున్నాయా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కానీ అత్యాధిక క్షీరం మాత్రం ‘మూసీ’లో ఉత్పత్తవుతున్న ‘సీసం’తోను, బొగ్గు విషాలతోను కలుషితం అవుతోందట! పారిశ్రామిక ప్రగతి పేరుతో పాలు కల్తీ అవుతుండడం విచక్షణ రహితమైన విధ్వంసం ఫలితం. ప్రకృతి విధ్వంసమైపోయి పరిశ్రమలు విస్తరించాయి. ఫలితంగా ఒకప్పుడు పరిశుభ్రమైన ఔషధీ జలాలతో నిండి ఉండిన ‘ముచికుందా నది’ కాలుష్య దుర్గంధ జలాల ‘మూసీ’గా మారిపోయింది. రెండు వం దల నలబయి కిలోమీటర్ల పొడవైన ఈ నదిని పరిశ్రమల నుంచి, మరుగుదొడ్ల నుంచి, చెత్తకుప్పల నుంచి, మురికి వీధుల నుంచి వచ్చి చేరిన విషజలాలు ‘వైతరణి’గా మార్చివేశాయి. నగరాలు న రకాలుగా మారుతుండడానికి ఈ మూసీ వైతరణి ప్రత్యక్ష సాక్ష్యం! ఈ మురికినీటిలో విషపునీటిలో నదీ పరీవాహక ప్రాంతం పొడవునా దాదాపు నలబయి వేల ఎకరాలలో- పదహారు వేల హెక్టారులలో- గడ్డి, కూరగాయలు, పండ్లు- ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ మూసీ మురుగునీటిలో నిండిన సీసం, బొగ్గు ఇంకా అనేక విషాలు, రసాయనాలు ఈ పంటలలోకి, గడ్డిలోకి ప్రాకృతిక ప్రక్రియ ద్వారా బదిలీ అయిపోతున్నాయట! ఇది మొదటి దశ. ఈ ‘మూసీ’ గడ్డిని భోంచేస్తున్న ఆవులు, గేదెలు, ఇతర పశువులు ఈ సీసపు విషాల ప్రభావానికి గురి అవుతున్నాయి. రకరకాల రోగాలకు బలై నశించిపోతున్నాయి. ఇది రెండవ దశ. ఇలా ‘మూసీ’ గడ్డి ద్వారా పశువుల కడుపులలోకి చేరిన బొగ్గు, సీసం అక్కడ నుంచి పాలలోకి చేరిపోతున్నాయట! ఇది మూడవ దశ. ఈ పాలు ప్యాకెట్లలో చేరిపోయి రాష్ట్ర రాజధాని నగరంలోను, జిల్లాలలోను ఇంటింటికీ సరఫరా అవుతున్నాయి. ఇలా ‘బొగ్గు’, ‘సీసం’ విషాలు కలిసిన పాలను తాగుతున్న జనం చిత్ర విచిత్రమైన శారీరక మానసిక రుగ్మతలకు గురికావడం ఖాయమని మూసీ పరీవాహక ప్రాంతంపై పరిశోధన చేసిన శాస్తవ్రేత్తలు నిగ్గు తేల్చారట! ఇది నాలుగవ దశ. పారిశ్రామిక కాలుష్యాలు నీటి ద్వారా, గడ్డి ద్వారా, పాలద్వారా మానవ శరీరాలలోకి చొరబడిపోతుండడం క్రమానుగత పరిణామం! ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కరెంట్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్’ పత్రికలో ఈ పరిశోధన వివరాలను ప్రచురించారట!
ఇది కలియుగం అన్న సంగతి మనలో అత్యధికులకు ధ్యాస లేదు. కానీ, ఇది ‘కల్తీ’ యుగమన్నది మనకు నిరంతరం గుర్తుకు వస్తున్న వాస్తవం. అందువల్ల మనం తాగుతున్న పాలలో కల్తీ జరుగుతోందన్నది కొత్త సంగతి కాదు. ప్రభుత్వ రంగానికి చెందిన ‘విజయ’ పాలలో సైతం ఇతర పదార్థాలు చేరిపోయినట్లు గత ఏడాది ప్రచారమైంది. శాసనసభలో సైతం ఈ సంగతి చర్చకు వచ్చింది. పాల నమూనాలను పరీక్షించిన అధికారులు, నిపుణులు లోపాలను కనిపెట్టారు. కానీ ప్రభుత్వేతర రంగానికి చెందిన సంస్థలే తెలుగు రాష్ట్రాలలోను ఇతర చోట్ల అత్యధికంగా పాలను విక్రయిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రభుత్వేతర సంస్థల పాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవన్నది నిరాకరింపజాలని వాస్తవం! కల్తీపాలు, కాలుష్యం నిండిన పాలు ఈ ప్రభుత్వేతర సంస్థల ‘పాకెట్ల’ నుంచి పొరలి ప్రవహించడం చరిత్ర. కొన్ని సంస్థల పాలను వివిధ రాష్ట్రాలలో నిషేధించారు. కేరళలో ఇలా నిషేధానికి గురి అయిన సంస్థలలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఘరానా సంస్థలు కూడా ఉన్నాయి. అందువల్ల పాలకల్తీ కొత్తకాదు. మూసీ నది పరీవాహక ప్రాంతంలోని పాలలో బొగ్గు, సీసం చేరాయన్న దుర్వార్త మాత్రమే మనకు కొత్త! ఈ ‘అధ్యయన’పు వివరాలు దేశంలోని అన్ని నదుల పరీవాహక ప్రాంతాలకూ వర్తిస్తాయి. అందువల్ల తెలంగాణలోని ఈ మూడు జిల్లాలలోనే గాక నదీ తీరంలోని గడ్డిని భోంచేస్తున్న పాడి పశువుల పాలు సీసంతోను, బొగ్గుతోను ‘సంకరం’ అయి ఉండే ప్రమాదం ఉంది! సీసం, బొగ్గు పదార్థాలు పారిశ్రామిక రసాయన కాలుష్య ఫలితం. ఈ కాలుష్య ప్రవాహాలు దేశమంతటా అన్ని నదులలోనూ కలుస్తున్నాయి..
‘పాలను కలసిన జలమును పాల విధంబుననె ఉండు, పరికింపంగా పాల చవి చెరచు’ అన్న సుమతీ శతకంలోని సూక్తిని ఇప్పుడు వందరకాల కాలుష్యాలకు వర్తింప చేసుకోవలసి వస్తోంది. పాలలో కలసి మన కడుపులోకి చేరుతున్న సీసపు పదార్థాల వల్ల మూత్రపిండాలు చెడిపోయే ప్రమాదం ఉందట. హృదయ సం బంధ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి రావటానికి సైతం ఈ ‘సీసపు పాలు’ దోహదం చేస్తాయట. ‘సీసం’ ఎక్కువగా శరీరంలో కలవడం వల్ల అంధత్వం ప్రాప్తించే ప్రమాదం పొంచి ఉంది. కానీ ఈ వైపరీత్యాలను కనిపెట్టడం ఎవరి తరం? కల్తీ జరిగినట్టు ఆరోపణలు రాగానే ‘మా పాలు మంచివి.. కావాలంటే పరిశీలించండి.. పరీక్షించండి..’ అంటూ ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలు ఆర్భాటం చేస్తున్నాయి. అనేక సందర్భాలలో పరీక్షల కొరకు పంపించే పాలు స్వచ్ఛంగానే ఉంటున్నాయన్నది ప్రచారం. వివాదం సమసిపోగా యధావిధిగా మళ్లీ కల్తీపాలు సరఫరా అవుతుంటాయి. పాల విషయంలోనే కాదు, ఉప్పు దగ్గరి నుంచి పప్పుల వరకూ మనం ఆరగిస్తున్న ప్రతిదీ ‘కల్తీ’ అయిపోతుండడం ‘ప్రపంచీకరణ’ వైపరీత్యం. బహుళ జాతీయ సంస్థలు కల్తీ ఐస్‌క్రీములు, కల్తీనూనెలు, కల్తీ చాక్లెట్లు, కల్తీ రొట్టె- బ్రెడ్-లు, కల్తీమందులు, కల్తీ పద్ధతులు, కల్తీ నాగరికతలు మనకు అంటగట్టడం ‘ప్రపంచీకరణ’.. ‘నెస్లే’ కంపెనీ వారు భయంకర విష రసాయనాలను కలిపిన ‘సేమ్యా’లను దశాబ్దులుగా మనకు అమ్ముతున్నారు. ఈ విష రసాయనాల వల్లనే ‘మ్యాగీ సేమ్యాల’కు అంతటి రుచి ఏర్పడింది. గుట్టు రట్టయిన తరువాత కల్తీకి అలవాటు పడిన మనం మళ్లీ ‘నెస్లే’ కంపెనీ సేమ్యాలనే కొంటుండడం ‘ప్రపంచీకరణ’ బంగారుజింక మాయాజాలం.. ఆవులు సైతం కల్తీ అయిపోయాయి. ‘జెర్సీ’ ఆవులలో ఆవు స్వభావం కంటె ఇతర జంతువుల స్వభావం అధికం. అయినప్పటికీ మనం జెర్సీ ఆవు పాలనుకొని ఆరగిస్తున్నాము. అభిషేకాలు చేయిస్తున్నాము. ఆవుతో సంబంధం లేకుండానే పాలు తయారు చేస్తున్న ముఠాలు దేశమంతటా విస్తరించాయి. పామోలిన్ నూనె, యూరియా ఎరువు, సోడా, సుగంధ ద్రవ్యాలు కలిపి కృత్రిమంగా పాలను తయారు చేస్తున్నారట..
విదేశీయత పట్ల మక్కువను మనం మన శిశువులకు పాలతో నేర్పిస్తున్నాము. శిశువుల కోసం స్వదేశీయ సంస్థలు పాలపొడి- బేబీ ఫుడ్- ని తయారు చేస్తున్నాయి. విదేశీయ సంస్థలూ తయారుచేసి మన నెత్తికెత్తుతున్నాయి. కానీ స్వదేశీయ ‘బేబీ ఫుడ్’ కంటె సరిగ్గా రెట్టింపు ధరలను పెట్టి ‘నెస్లే’ వంటి విదేశీయ సంస్థల పాలపొడి డబ్బాలను కొంటున్నాము. ఇదీ ప్రపంచీకరణ.. డాక్టర్లు కూడా విదేశీయ ఉత్పత్తులనే కొనాలని శిశువుల తల్లిదండ్రులకు సలహాలు ఇస్తున్నారు. మన జీవన విధాన కల్తీ ఇది..!