సంపాదకీయం

డొనాల్డ్ ‘ఘన’పాఠం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా వాణిజ్య ద్వారాల తలుపులు మూసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఈ ‘తలుపులు మూసే’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ ‘తాను చేతల మనిషిని’ అని నిరూపించుకొంటున్నాడు! ‘విస్తృత ప్రశాంత సాగర వాణిజ్య భాగస్వామ్యం’- ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్ షిప్- టిపిపి- వ్యవస్థ నుంచి తమ దేశం వైదొలగుతున్నట్టు వినూతన అమెరికా అధ్యక్షుడు సోమవారం ప్రకటించడం సభ్యదేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది! ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఆవిష్కరించిన తీరును అమెరికా ప్రజలు సైతం విస్మయంతో తిలకించడం చారిత్రక మహా విపరిణామం. ‘అమెరికాలో తిష్టవేసి ఉన్న అక్రమ ప్రవేశకులను వెళ్లగొడతాను, వారు అమెరికా నుంచి నిష్క్రమించాలి లేదా జైళ్లకు వెళ్లాలి’ అని గత నవంబర్ ఎనిమిదవ తేదీ నాటి ఎన్నికల్లో గెలిచిన వెంటనే ట్రంప్ ప్రకటించాడు. అమెరికాలో ముప్పయి లక్షల మంది అక్రమ ప్రవేశకులు తిష్ట వేసి ఉన్నారన్నది ట్రంప్ నిర్ధారణ! ‘ఆయన వెళ్లగొట్టగలిగేది అక్రమ ప్రవేశకులను కాబట్టి మనకు ఢోకా లేదు..’ అని వివిధ విదేశాల సక్రమ ప్రవేశకులు ఊపిరి పీల్చుకొన్నారు. కానీ ట్రంప్ మోగిస్తున్న ‘సంకుచిత’ వాణిజ్య సమరభేరి జనవరి ఇరవయ్యవ తేదీన ఈ ‘సక్రమ ప్రవేశకుల’ గుండెల్లో కలవరం సృష్టించింది. ‘అమెరికా వస్తువులనే కొనండి, అమెరికా పౌరులకే ఉద్యోగాలివ్వండి..’ అన్నది నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవ ప్రసంగపు ఇతివృత్తం! క్రమంగా విదేశీయులను ఉద్యోగాల నుంచి తొలగించి, అమెరికా పౌరసత్వం ఉన్నవారికి మాత్రమే ఉద్యోగాలను కల్పించాలన్న కార్యక్రమం ‘ప్రపంచీకరణ’- ‘గ్లోబలైజేషన్’- ‘గ్లోబల్ విలేజ్’- పుడమిపల్లె- వంటి వాణిజ్య ఆదర్శాలకు విఘాతకరం! ఈ వాణిజ్య ఆదర్శాలను ఇరవై నాలుగేళ్లపాటు ముగ్గురు అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్- జార్జి బుష్, బరాక్ ఒబామా- ప్రపంచ దేశాలకు మప్పారు. ఈ ‘మప్పడం’ నిజానికి దౌత్య దౌర్జన్యం. ఇంతగా ప్రపంచీకరణ కోసం కృషి చేసిన అమెరికా ఇప్పుడిలా సంకుచిత జాతీయ- ప్రొటక్షనిస్ట్- వాణిజ్య గీతాన్ని ఆలపిస్తుండడం విచిత్రమైన పరివర్తనకు చిహ్నం. ఇలా ‘హైర్ అమెరికన్’- అమెరికన్లకే ఉద్యోగాలివ్వండి- అని పిలుపునివ్వడం వల్ల ప్రవాస భారతీయులతో పాటు వివిధ దేశాల ఉద్యోగుల గుండెల్లో గుబులు చెలరేగుతోంది! అయితే, అమెరికాలో ఇదివరకే ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులను ప్రధానంగా భారతీయులను తొలగించడం దాదాపు అసాధ్యమన్నది ట్రంప్ గ్రహిస్తున్న వాస్తవం. ఎందుకంటే వివిధ విద్యల్లో నిపుణులైన ఈ విదేశీయులను తొలగించినట్టయితే అమెరికా పారిశ్రామిక, సేవా రంగాలు కూలబడిపోతాయి. ప్రవాస భారతీయులను, విదేశీయులను తొలగించిన తర్వాత ఆ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అమెరికన్లు లేరు.. అందుకని!
అమెరికా పారిశ్రామిక రంగం కుదేలుమన్నట్టయితే అమెరికా జాతీయ ఉత్పత్తులు పడిపోగలవు. అందువల్ల ట్రంప్ ఆదేశించినట్టు అక్కడ కొనడానికి ‘అమెరికా వస్తువులు’ ఉండవు. దిగుమతులు పెరుగుతాయి. అందువల్ల ‘అమెరికా వస్తువులు కొనండి, అమెరికా ప్రజలకే ఉద్యోగాలివ్వండి’ అన్న నినాదాలు విఘాతకరమైనవి. అమెరికాలో ఉత్పత్తులు యథాతథంగా కొనసాగాలన్నా, ఇంకా పెరగాలన్నా- అమెరికా పౌరులు అమెరికా వస్తువులను మాత్రమే కొనడానికి వీలుగా విదేశీయుల సేవలు అనివార్యం. అమెరికా ప్రజలు మొదటి నినాదాన్ని ‘అమెరికా వస్తువులు కొనడం’ పాటించదలచినట్టయితే రెండవ నినాదం ‘ అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వడం’ వమ్మయిపోతుంది. రెండవ నినాదాన్ని చిత్తశుద్ధితో పాటిస్తే మొదటి నినాదం తుస్సుమంటుంది. అందువల్ల సర్వ సమగ్ర స్వదేశీయ వాణిజ్య వ్యవస్థ ప్రవర్దమాన దేశాల ‘మానవీయ సంపత్తి’పై ఆధారపడి బలిసిన అమెరికా వంటి సంపన్న దేశాలకు సాధ్యం కాదు. ప్రవర్ధమాన దేశాల వారిని చౌకగా ఉద్యోగాలలో నియుక్తి చేయడం సంపన్న దేశాల వాణిజ్య వ్యవస్థలకు అధిక లాభాలను సముపార్జించి పెడుతున్న ఆర్థిక నీతి. కొత్తవారిని కుదుర్చుకోకపోవచ్చు కాని ఉన్న విదేశీయులను ఉద్యోగాల నుంచి తొలగించడం ట్రంప్ ప్రభుత్వానికి సాధ్యం కాదు.
ఈ సంగతి గ్రహించిన ట్రంప్ ఇప్పుడిప్పుడే విదేశీయుల ఉద్యోగాల జోలికి వెళ్లకపోవచ్చు. ఆయన సంకుచిత విధానం వల్ల మన దేశంలో సమాచార సాంకేతిక సేవల- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- ఐటి- సర్వీసెస్- పరిశ్రమ కుంటుపడుతుందన్న ఆందోళనకు సైతం తార్కిక ప్రాతిపదిక లేదు. దాదాపు పదిలక్షల కోట్ల రూపాయల ఉత్పాదకత విలువ కలిగిన మన దేశపు ఐటి పరిశ్రమ ప్రధానంగా ఎగుమతులపై ఆధారపడి ఉండవచ్చు. అమెరికా ఆయుధ పరిశ్రమ ప్రధానంగా ఎగుమతులపై ఆధార పడి ఉన్నట్టుగా.. ఈ మన ఐటి సేవలలో అరవైశాతం అమెరికాకు ఉపయోగపడుతున్నాయి. వీటిని ఒక్కసారిగా రద్దు చేయడం ట్రంప్‌కు సాధ్యం కాదు. ఎందుకంటే అమెరికా ఐటి రంగం మాత్రమే గాక, ఇతరేతర పారిశ్రామిక రంగాలు కూడా ఈ మన ఐటి సేవలపై ఆధారపడి ఉన్నాయి. కుందేళ్లు బెదిరిపోతాయన్న ధీమాతో మాత్రమే ట్రంప్‌దొర ‘తాటాకు చప్పుళ్ల’ను మరింత ఉద్ధృతం చేశాడు. ఇప్పుడు ‘కార్యాచరణ’కు దిగిన తరువాతనే ఆయనకు ఆర్భాటానికి, ఆచరణకు మధ్య ఉన్న అంతరం బోధపడగలదు. అందువల్లనే ఆయన మొదటి వేటు అంతగా ప్రసిద్ధం కాని ‘టిపిపి’ మీద వేశాడు. కానీ ఇలా ‘టిపిపి’ నుంచి వైదొలగిపోవాలన్న నిర్ణయంలోని ఔచిత్యం అమెరికా వాణిజ్య, విదేశాంగ విధానకర్తలకు సైతం అంతుపట్టడం లేదట! ఎందుకంటే ‘ప్రశాంత మహాసాగర ప్రాంతం’- పసిఫిక్ ఓషన్ రీజియన్-లో మాత్రమే కాక ప్రపంచమంతటా విస్తరించిపోతున్న చైనా వాణిజ్య దురాక్రమణను అరికట్టడం ‘టిపిపి’ లక్ష్యం. పర్యావరణ కాలుష్యానికి చైనా పారిశ్రామిక వ్యర్థాలు, పారిశ్రామిక నీతి ప్రధాన కారణమన్న వాస్తవాన్ని ట్రంప్ ఇటీవల పునరుద్ఘాటించాడు. కానీ చైనా వాణిజ్య సామ్రాజ్యవాదాన్ని అరికట్టడానికి ఏర్పడిన ‘టిపిపి’ని ప్రారంభంలోనే అంతం చేయడానికి అతగాడు పూనుకొనడమే విచిత్రం! ఈ పనె్నండు దేశాల ‘టిపిపి’ని ఏర్పాటు చేయాలన్న ఒప్పందం 2015లో కుదిరింది. ఇది అమలులోకి రానేలేదు. ట్రంప్ నిర్ణయం వల్ల ఈ ఒప్పందం, వ్యవస్థ రద్దు కాగలవు. అమెరికా లేని ‘కూటమి’ని మిగిలిన చిన్న దేశాలు కొనసాగించలేవు.
‘తన దాక వస్తేకాని తత్త్వం బోధపడదు’ అన్న లోకోక్తి ట్రంప్ విధానాలకు ఎంతవరకూ అన్వయిస్తుందన్నది తేలని వ్యవహారం. ఎందుకంటే ‘ప్రపంచీకరణ’ జాతీయ వాణిజ్య పరిధులను సరిహద్దులను చెరిపివేసింది. దీనివల్ల లాభపడింది ప్రవర్ధమాన దేశాలను దోపిడీ చేసిన అమెరికా వాణిజ్య సంస్థలు.. నష్టపోయినది మన దేశం వంటి వర్ధమాన దేశాలు.. ఈ దేశాలకు ట్రంప్ ‘జాతీయ నిష్ఠ’ గుణపాఠం..