సంపాదకీయం

సమాంతర ‘ప్రక్రియ’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాలన్న ప్రతిపాదన ప్రస్తుతం ప్రముఖంగా ప్ర చారం అవుతోంది. రాష్టప్రతి ప్రణవ్‌కుమార్ ముఖర్జీ అరవై ఎనిమిదవ గణతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యా ప్రసంగంలో కూడ జనవరి ఇరవై ఐదవ తేదీన ఈ సమాంతర ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రస్తావించారు. శాసనసభలకు, లోక్‌సభకు ఒకేసారి ప్రతి ఐదేళ్లకు నియతంగా ఎన్నికలు జరిపించాలన్న ‘ఆదర్శం’ మరింత ప్రాధాన్యం సంతరించుకొంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకొకసారి పార్లమెంట్-కాంగ్రెస్-లోని దిగువసభ ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’- ప్రతినిధుల సభ-కు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగేళ్లకొకసారి జరిగే అధ్యక్షుని ఎన్నిక సమయంలో కూడ ఈ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగేళ్లకొకసారి అధ్యక్షుని ఎన్నిక సమయంలో ఇలా దిగువసభకు ఎగువసభ ‘సెనేట్’లోని నూటరెండు స్థానాలలో మూడవ వంతునకు, యాబయి రాష్ట్రాల గవర్నర్ పదవులలో అధికశాతానికి, రాష్ట్రాల శాసనసభలకు, శాసనమండలిలోని మూడవ వంతునకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా వోటర్లు ప్రతి రెండేళ్లకొకసారి అనేక ‘శాసనీయ’ పదవుల ఎన్నికల్లో వోట్లు వేస్తున్నారు. ఈ రెండేళ్ల కాలవ్యవధి మధ్యలో అమెరికాలో ఏ ఎన్నిక కూడ జరిగే అవకాశం లేదు. మనదేశంలో కూడ ఐదేళ్లపాటు ఏ ఎన్నిక కూడ జరగని రీతిలో ఐదేళ్లకొకసారి నియతంగా శాసనసభలకు, లోక్‌సభకు ఎన్నికలు జరపాలన్నది ప్రజాస్వామ్య ఆదర్శమై కూచుంది. ఇలా నియతంగా ఏకకాలంలో ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగ ప్రక్రియ పనితీరు కూడ నియతంగా ఉండాలి. అధ్యక్ష ప్రజాస్వామ్యం ఉన్న అమెరికాలో కార్యనిర్వాహక రాజ్యాంగ విభాగానికి అంటే మంత్రివర్గానికి శాసన నిర్మాణశాఖ- అంటే పార్లమెంటు దిగువసభ విశ్వాసంతో నిమిత్తం లేదు. పార్లమెంటు దిగువసభను రద్దుచేసే అధికారం అధ్యక్షునికి లేదు. అందువల్ల రెండు విభాగాలు నియతమైన గడువు పూర్తయ్యేవరకూ పనిచేయడం సహజం. ఎన్నికలు నియతంగా నిర్దిష్ట కాలవ్యవధిలో జరగడానికి వీలుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న మనదేశంలో ఈ నిర్దిష్టత లేదు. మంత్రివర్గం నిరంతరం పార్లమెంటు దిగువసభ విశ్వాసాన్ని, రాష్ట్రాలలో శాసనసభ విశ్వాసాన్ని నిలబెట్టుకోవలసి ఉంది. లోక్‌సభ విశ్వాసాన్ని కోల్పోయిన మంత్రివర్గం అధికార చ్యుతికి గురవుతుంది. ప్రత్యామ్నాయ ప్రభుత్వం- మంత్రివర్గం- ఏర్పడడానికి వీలున్న సమయంలో లోక్‌సభ ఐదేళ్లపాటు కొనసాగగలదు. లేనట్టయితే ‘సభ’ రద్దుకావడం ఖాయం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘దిగువసభ’కు మంత్రివర్గాన్ని రద్దు చేసే అధికారం ఇలా ఏర్పడింది. మంత్రివర్గం సలహాపై లోక్‌సభను రద్దు చేసే అధికారం రాష్టప్రతికి ఉంది. ఈ సూత్రం రాష్ట్రాలకు కూడ వర్తిస్తోంది. అందువల్ల నిర్దిష్టత లేదు.
అన్ని శాసనసభలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు ఏదో ఒక సంవత్సరంలో జరిపించవచ్చు. అమెరికాలో ఎన్నికలు ఆయా రెండేళ్ల, నాలుగేళ్ల వ్యవధిలో నిర్దిష్టంగా నవంబర్ మొదటి సోమవారం తరువాత వచ్చే మంగళవారం నాడు మాత్రమే జరుగుతున్నాయి. మన దేశంలో ఇలాంటి నిర్దిష్టతను ఏర్పాటు చేయవచ్చు. కానీ, ఎన్నికలు పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఐదేళ్లపాటు పనిచేస్తాయన్న హామీ లేదు. 1979వ, 1991వ, 1997వ సంవత్సరాలలో వలె, 1999వ సంవత్సరంలో వలె కేంద్ర మంత్రివర్గం ‘సభ’ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడనప్పుడు లోక్‌సభ రద్దయి ఐదేళ్ల లోపు ఎన్నికలు జరుగవలసిన అనివార్యత ఏర్పడుతుంది. 1998లో ఎన్నికల తర్వాత ఏర్పడిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం ఇలా విశ్వాసాన్ని కోల్పోయినందున 1999లో మళ్లీ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 1979లో చౌధురీ చరణ్‌సింగ్, 1991లో చంద్రశేఖర్, 1997లో ఐకె గుజ్రాల్ ‘నడమంత్రపు’ ప్రధానమంత్రిత్వాలు రద్దయి లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఏకకాలంలో ఎన్నికలు జరిగిన తరువాత భవిష్యత్‌లో ఇలాంటి స్థితి కేంద్రంలో ఏర్పడితే ఐదేళ్లకంటే ముందే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయి. అలాంటి స్థితిలో శాసనసభలన్నింటినీ కూడ రద్దుచేసి ఏకకాలంలో ఎన్నికలు జరిపిస్తారా? అలాంటి విచిత్రం సంభవించవలసిందేనా??
మరొక రకమైన విచిత్ర స్థితి కూడ సంభవించే ప్రమాదం లేకపోలేదు. ఏకకాలంలో ఎన్నికలు జరిగి రాష్ట్రాలలో, కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఏదో ఒక రాష్ట్రంలో ప్రభుత్వం శాసనసభ విశ్వాసం కోల్పోయి కూలిపోవచ్చు. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవచ్చు. ఇలా ఎన్నికలు జరిగిన తరువాత ఏడాదికో రెండేళ్లకో రాజకీయ సంక్షోభం ఏర్పడవచ్చు. ఒక ఏడాది పాటు ఆ రాష్ట్రంలో రాష్టప్రతి పాలన కొనసాగినప్పటికీ ఐదేళ్ల ‘సమాంతర’ కాలవ్యవధి ముగిసేలోగానే ఆ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగక తప్పదు. అలాంటప్పుడు లోక్‌సభను, మిగిలిన రా ష్ట్రాల శాసనసభలను రద్దు చేసి ఆ ‘సంక్షుభిత’ రాష్ట్ర శాసనసభతో పాటు వీటికి కూడ ఎన్నికలు జరిపిస్తారా? ఇలాంటి విచిత్ర స్థితిని అతిగమించడానికి విప్లవాత్మకమైన ఎన్నికల సంస్కరణలు, రాజ్యాంగ సంస్కరణలు అనివార్యం. ఈ సంస్కరణల స్వరూప స్వభావాలు ఏమిటన్నది స్పష్టం కాలేదు. కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ నియమించిన అధ్యయన బృందం వారి సిఫార్సులేమిటన్నది వెల్లడి కాలేదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ముగిసినప్పటికీ, ఇప్పుడు ఒకే రాజకీయ పక్షానికి లోక్‌సభలో మెజారిటీ ఉంది. చాలా రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల ‘సమాంతర’మైన ఎన్నికల ప్రక్రియలో ఈ అనిశ్చిత స్థితి నిరంతరం నిలదీస్తూనే ఉంది. 1952లో మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు మాత్రమే లోక్‌సభతో పాటు అన్ని శాసనసభలకూ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1957లోను, 1962లోను, 1967లోను లోక్‌సభతో పాటు అత్యధిక రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పటికీ అన్ని అసెంబ్లీలకు మాత్రం సమాంతరంగా ఎన్నికలు జరుగలేదు. 1953లో ఉమ్మడి మదరాసు రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడిన ‘ఆంధ్రరాష్ట్రం’లో 1955లో మధ్యంతరంగా ఎన్నికలు జరగడం చరిత్ర. 1967 ఎన్నికల తర్వాత ఎనిమిది రాష్ట్రాల్లో ఏ ఒక్క పార్టీకి శాసనసభలో మెజారిటీ రాలేదన్నది కూడ చరిత్ర. సంకీర్ణ ప్రభుత్వాల శకం భారీఎత్తున అప్పుడే మొదలైంది. ఏకకాలంలో ఎన్నికలు జరిగే ప్రక్రియ అప్పటి నుంచి పెద్దఎత్తున భగ్నమైంది. 1971లో లోక్‌సభకు తొలిసారిగా మధ్యంతర ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ, శాసనసభల కాలపరిమితి ఐదేళ్లు. కానీ రాజకీయ ప్రత్యేకతను సంతరించుకున్న జమ్మూ కశ్మీర్‌లో మాత్రం శాసనసభ కాలపరిమితి ఆరేళ్లు. ఇలా ఏకకాలంలో ఎన్నికలు జరుగకుండా ‘రాజ్యాంగ వ్యవస్థ’ కూడా ఏర్పడి ఉంది. దీన్ని ఎలా తొలగిస్తారు?
ఏకకాలంలో ఎన్నికలు జరగాలంటే లోక్‌సభ, శాసనసభలు నిర్ణీత కాలవ్యవధి కంటె ముందుగా రద్దుకాని రీతిలో రాజ్యాంగ వ్యవస్థలో మార్పులు జరగాలి. ఏదో ఒక పార్టీకి లోక్‌సభలో, శాసనసభలో మెజారిటీ లభించే విధంగా ఎన్నికల ప్రక్రియను సంస్కరించాలి. మొదటి ‘వరుస’ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీలుగా కాని, అతిపెద్ద కూటములుగా గాని అవతరించిన ‘రెండు’ మాత్రమే ‘మలి’ వరుస ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు కల్పించాలి. ఈ రెండవ ‘వరుస’- సెకండ్ రౌండ్- ఎన్నికల్లో ‘రెండు’ మాత్రమే పోటీ చేస్తాయి గనుక ఒక పార్టీకి లేదా కూటమికి మెజారిటీ వస్తుంది. దీనిపై విస్తృత అధ్యయనం జరగాలి.