సంపాదకీయం

‘ఉత్తర’ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారం దేశ ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. దేశంలోనే అతి పెద్ద రాష్టమ్రైన యుపిలో దేశ జనాభాలోని ఆరవవంతు నివసిస్తుండం ఇందుకు ఒక కారణం! సమాజ్‌వాదీ పార్టీ చీలిక కావడం, మళ్లీ ముక్కలు రెండు అతుక్కుపోవడం మళ్లీ చీలిపోవడం వంటివి మరో కారణం. రెండున్నర ఏళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో అభూతపూర్వకమైన విజయం సాధించిన భారతీయ జనతాపార్టీ ఈ విజయ చరిత్రను శాసనసభ ఎన్నికలలో పునరావృత్తం చేయగలదా? అన్నది ఉత్కంఠకు మరో కారణం! గత ఏడాది ప్రముఖంగా ప్రచారమైన ‘కయిరానా’ వలసల గురించి మళ్లీ చర్చ జరుగుతుండడం మరో కారణం! ముజఫర్ ప్రాంతంలో జిహాదీలు లైంగిక, భౌతిక బీభత్సకాండను కొనసాగించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో మత ఉద్రిక్తతలు నెలకొనడం ‘కయిరానా’ వలసలకు కారణమన్నది అప్పుడు జరిగిన ప్రచారం. దేశరాజధాని ఢిల్లీకి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో నెలకొని వున్న ‘కయిరానా’ ప్రాంతం నుంచి హిందువులు భారీ సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం గత ఏడాది మే, జూన్ నెలలలో సంచలనం సృష్టించింది. జిహాదీ మూకలు బెదిరించడం వల్లనే ‘కయిరానా’ నుంచి, కాంద్లా నుంచి వందలాది హిందూ కుటుంబాల వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారని భారతీయ జనతాపార్టీ పార్లమెంటు సభ్యుడు హుకుం సింగ్ అప్పుడు ఆరోపించాడు. ఈ వలసలకు కారణం జిహాదీల బెదిరింపుకాదని మతపరమైన విద్వేషానికి, ఈ వలసలకు సంబంధం లేదని కూడ సమాంతరంగా ప్రచారమైంది. ఆర్థిక కారణాల వల్ల, దుర్భిక్షం నెలకొన్నందు వల్ల మాత్రమే ఆ హిందువులు స్వస్థలాలను వదిలి వెళ్లినట్టు కూడా ప్రచారమైంది. ఆర్థిక కారణాల వల్ల, ఉపాధిరాహిత్యం వల్ల మాత్రమే జనం వలసపోయినట్టయితే ఇస్లాం మతస్తులు కూడ కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఉండాలి. ఈ ప్రశ్నకు సమాధానం లభించలేదు. ఏమైనప్పటికీ వలస వెళ్లిన హిందువులకు మళ్లీ కయిరానా, కాంద్లా ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పించాలన్నది స్థానిక జనాభీష్టం. కేంద్ర ప్రభుత్వం కూడ ఈ సమస్యను చర్చించింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆ హిందువులకు పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని దేశ వ్యవహారాల మంత్రి రాజనాధ్ సింగ్ స్వయంగా కోరడం సమస్య సంతరించుకున్న ప్రాధాన్యానికి నిదర్శనం. వలస వెళ్లినవారు తిరిగి మళ్లీ స్వస్థలాలకు ఇప్పటికీ తిరిగి రాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఉపాధి దొరకని సమయంలో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిపోవడం నిరుపేదల జీవనరీతిగా మారింది. కానీ ఇలా వెళ్లినవారు తిరిగి వస్తారు. కయిరానా ప్రాంతం హిందువులు స్వస్థలాలకు ఎందుకని తిరిగి రావడం లేదు? జిహాదీల బీభత్సకాండ వలసలకు నిజంగా కారణమై ఉంటే ఇది కేవలం ఉత్తరప్రదేశ్‌కు పరిమితమైన సమస్య కాజాలదు, దేశంలోని సర్వమత సమభావ వ్యవస్థకు చెందిన విస్తృత సమస్య కాగలదు!
హిందువులు అల్పసంఖ్యాకులుగా మారిన ప్రాంతాల నుంచి మాత్రమే వారు తరిమివేతకు గురికావడం, హత్యాకాండకు, లైంగిక బీభత్స కాండకు బలికావడం చరిత్ర. అఖండ భారత్ నుండి విడివడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ఇది జరిగింది. అవశేష భారత్‌లోని కశ్మీర్‌లోయ ప్రాంతం నుండి హిందువులు నిర్మూలనకు గురి కావడం మరో ఉదాహరణ. హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ఏ ప్రాంతం నుంచి కూడ అల్పసంఖ్యాక మతాల వారు తరిమివేతకు గురికాలేదు, వలస పోలేదు! కానీ హిందువులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతం నుంచి కూడ వారు వలస పోవడం సరికొత్త జిహాదీ ప్రమాదం! పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ బీభత్సం నుంచి కయిరానా ప్రాంత హిందువులకు భద్రత కల్పించడం సహజంగానే ఎన్నికల సమస్యగా మారింది! ఇది జిహాదీ సమస్య కాకపోయినట్టయితే కేవలం ఆర్థక సమస్య అయినట్టయితే హిందువులు మాత్రమే ఉపాధి కోల్పోయి ఇతర చోట్లకు ఎందుకని వలస పోయారన్నది కూడ ప్రభుత్వం, ప్రభుత్వ నిర్వాహక పక్షం సమాధానం చెప్పవలసిన ప్రశ్న. అఖిలేశ్‌యాదవ్ ముఖ్యమంత్రిత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ పరిపాలనలో ఉత్తరప్రదేశ్‌ని దాదాపు అన్ని జిల్లాలలోను అరాజక శక్తులు, అసాంఘిక మూకలు పేట్రేగిపోతున్నాయట. ముకీమ్ కలా అనేవాడు నడుపుతున్న నేరస్థుల ముఠా కయిరానా ప్రాంతంలోను, సమీపంలో హర్యానాలోను భయంకరమైన హత్యాకాండను కొనసాగిస్తోందట! స్థానికులను బెదిరించి హత్యచేసి, పారద్రోలి వారి భూములను కబ్జా చేయడం ఈ ముఠావారి ప్రధాన వృత్తి.
మతోన్మాదుల హత్యాకాండకు భయపడి ప్రజలు ఇళ్లను, పల్లెలను వదిలి పారిపోకుండా నివారించడానికి ప్రతి జిల్లాలోను ఒక ప్రత్యేక భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు భారతీయ జనతాపార్టీ తన ఎన్నికల వాగ్దాన పత్రం-ఎలక్షన్ మేనిఫెస్టోలో పేర్కొనడానికి బహుశా కయిరానా ఉదంతం నేపథ్యం కావచ్చు! ఈ విభాగాన్ని డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నాడట! రామజన్మభూమి మందిర పునర్నిర్మాణ వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా రాజ్యాంగబద్ధంగా పరిష్కరించగలమన్న భాజపా వాగ్దానం చర్చకు గురి అవుతున్న మరో ప్రధాన అంశం! రాజ్యాంగబద్ధంగా రామజన్మభూమి మందిరాన్ని నిర్మించడానికి వలసిన అన్ని ప్రత్యామ్నాయాలను అనే్వషిస్తున్నట్టు భాజపా మరోసారి వా గ్దానం చేసింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా భాజపా ఇదే వాగ్దానం చేసింది! ఈ అనే్వషణ ఎంతకాలం సాగుతుంది? ఎప్పుడు రామజన్మభూమి మందిర పునర్ నిర్మాణం జరుగుతుంది? ఆన్న ప్రశ్నలకు భాజపా సమాధానం చెప్పడంలేదు! రామ్ మందిర్ ఔర్ వికాస్ సాథ్ సాథ్ చల్ సక్తేహై-రామమందిర నిర్మాణం, ప్రగతి కార్యక్రమాలు కలిసి మెలసి కొనసాగగలవు-అన్న వాక్యం కూడ గందరగోళాన్ని కలిగిస్తోంది. ఇలా చెప్పడం ద్వారా రామమందిరానికి, ప్రగతికి మధ్య కొంత వ్యతిరేకత ఉందేమోనన్న భ్రాంతి ఏర్పడడానికి అవకాశం ఉంది! రామమందిర నిర్మాణం కూడ ప్రగతిలోను, సుగతిలోను భాగం! రఘురాముడు ఈ దేశంలో పుట్టి, పెరిగి ఈ జాతిహితం కోసం శ్రమించిన జాతీయ మహాపురుషుడు! మహాత్మాగాంధీ వలె, ఛత్రపతి శివాజీవలె, యదుకుల కృష్ణుని వలె వీరందరి కంటె పూర్వుడైన రఘురాముడు భరతమాత వజ్రాల బిడ్డడు, కులమతాలతో నిమిత్తం లేకుండా భారతీయులందరికీ ఆరాధ్యుడు. అందువల్ల ఇది మత సమస్య కాదు, జాతి సమస్య! రెండు వేల వందల ఏళ్లకు పూర్వం విక్రమ సమ్రాట్ నిర్మించిన రామజన్మభూమి మందిరాన్ని విదేశీయ జిహాదీ బీభత్సకారుడైన మొఘలాయి బాబర్ కూల్చివేయడం చరిత్ర..ఈ చరిత్రను మరిచిపోవడం వల్లనే రామజన్మభూమి మందిరం వివాదగ్రస్తమైంది! వాస్తవ చరిత్రను ప్రచారం చేయడం వివాదానికి విముక్తి..
యుపిలో ఉత్కంఠ కలిగిస్తున్న మరో అంశం సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తు! ఈ పొత్తు భాజపా విజయాన్ని నిరోధించగలదా? అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాజ్ వాదీ పార్టీ సంస్థాపకుడు, మాజీ సిఎం ములాయంసింగ్ యాదవ్ స్వయంగా చెప్పాడు. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ ఎన్నికల పొత్తును తాను అంగీకరించడం లేదని, ఈ కూటమి తరఫున తాను ప్రచారం చేయబోనని స్పష్టం చేయడం ములాయం చెప్పిన సమాధానం.. తండ్రి ములాయం, కుమారుడు అఖిలేశ్ యాదవ్ ఇలా కూటమిని పరస్పర వ్యతిరేక దిశగా లాగుతున్నారు.