సంపాదకీయం

మద్యపానానికి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యపాన ప్రవృత్తిని పెంపొందించడంలో పరిపాలకుల ‘మానవీయ చిత్తవృత్తి’ ప్రస్ఫుటిస్తుండడం వర్తమాన ‘నాగరికం’..ఈ నాగరికానికి సరికొత్త చిహ్నం పంజాబ్ శాసనసభ ‘మద్యపానాన్ని రహదారుల పక్కన యథావిధిగా కొనసాగించడానికి’ వీలైన బిల్లును శుక్రవారం ఆమోదించడం! ఈ ‘బిల్లు’ను నిరసిస్తూ పంజాబ్‌లోని ప్రతిపక్షాలు శాసనసభనుంచి నిష్క్రమించాయి. ఇలా నిష్క్రమించిన ప్రతిపక్షాలు అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను నిర్వహిస్తున్నాయి! ఆయా రాష్ట్రాలలో ఈ పక్షాలవారు మద్యపాన ప్రోత్సాహక నియమ నిబంధనలను ‘మానవీయ’ దృష్టితో అమలు జరుపుతునే ఉన్నాయి. గుజరాత్, బిహార్‌లలో తప్ప దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలోను మద్యపానం చేయడం తప్పుకాదు, నాగరికంలో భాగం. ‘కొద్దిగా పుచ్చుకుంటాను’ అని కవులు, పండితులు, కళాకారులు, పత్రకారులు, రాజకీయవేత్తలు, న్యాయకోవిదులు, రాజ్యాంగ విజ్ఞాన ధిషణాధురీణులు, అధ్యాపకులు, ఆడపిల్లలు, మగపిల్లలు, వాణిజ్యవేత్తలు, శాస్తవ్రేత్తలు...ఒకరేమిటి, అన్ని రంగాలకు చెందిన నాగరికులలో అధిక శాతం రాత్రి భోజనం తరువాతనో, రాత్రి భోజనం చేస్తున్న సమయంలోనో ప్రకటిస్తుండడం మన దేశంలో జీవనరీతిగా మారిపోయింది! అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జనాభ ప్రాతిపదికగా మద్యం దుకాణాలను ప్రతిచోట ప్రారంభించాలన్న విధానాన్ని అమలు చేస్తోంది. ఇలా ‘జన నైష్పిత్తిక సూత్రాన్ని వైద్య శాలలను ఏర్పాటు చేయడానికి, పప్పులు ఉప్పులు బియ్యం నూనెలను చౌక ధరలకు సరఫరా చేయగల ప్రభుత్వ దుకాణాలను ఏ ర్పాటు చేయడానికి, పోలీస్ స్టేషన్లను, పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు ప్రాతిపదికగా స్వీకరించడం గతం! మద్యం దుకాణలను ఏర్పాటు చేయడానికి ఇలా జనాభా దామాషాను కొలబద్ద తీసుకొనడం నడుస్తున్న నాగరికం! జనాభా విష్పత్తిని పరిగణించి నిష్పత్తికి తగినన్ని లేని చోట కొరతను తీర్చడానికి వీలుగా రాష్ట్రంలో మరో ఎనబయి మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని ప్రసాదించిందట! తెలంగాణ ప్రభుత్వం సైతం రాత్రిపూట పనె్నండు గంటల వరకు మద్యం దుకాణాలు, పానకేంద్రాలు తెరిచి ఉంచడానికి నిర్ణయించినట్టు గతంలో ప్రచారమైంది. ‘బీరు’ మాత్రమే తాగడానికి వీలుగా కర్నాటకలోను మహారాష్టల్రోను దశాబ్దులుగా కేంద్రాలు వెలసి ఉన్నాట, అదే స్ఫూర్తితో తెలంగాణలో సైతం 2015లో ప్రత్యేక బీరు బార్‌లు! అయితే పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ఆమోదించిపచేసిన ‘బిల్లు’నకు ఈ ‘విస్తరణ, ‘నిష్పత్తి’ స్ఫూర్తి కాలేదు! సర్వోన్నత న్యాయస్థానం గత డిసెంబర్‌లో రహదారుల పక్కన మద్యం దుకాణాలను మూసి వేయాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పును వమ్ము చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలివిగా ఒక మార్గాన్ని కనిపెట్టిందన్న ప్రచారం పంజాబ్ ప్రభుత్వానికి స్ఫూర్తి...
జాతీయ మహాపథాల-నేషనల్ హైవేస్-కు ఇరువైపులా ఐదు వందల మీటర్ల దూరం వరకూ అడ్డంగా వ్యాపించి ఉన్న ప్రాంతంలోని మద్యం దుకాణాలను శాశ్వతంగా మూసివేయాలన్నది సర్వోన్నత న్యాయ స్థానం డిసెంబర్ పదిహేనవ తేదీన ఇచ్చిన తీర్పు. ప్రాంతీయ మహాపథాల-స్టేట్ హైవేస్-కు ఇరువైపులా రెండు వందల మీటర్ల పరిధిలోని మద్యం దుకాణాలను కూడ మూసివేయాలని, ఉభయ మార్గాల పక్కన కొత్తగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయరాదని కూడ సుప్రీంకోర్టు గత డిసెంబర్‌లో ఆదేశించింది! ఈ తీర్పును సమీక్షించాలన్న విజ్ఞప్తులను గత మార్చిలో సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఫలితంగా దేశమంతటా ఈ రహదారుల పక్కన గల మద్యం దుకాణాలు మూతపడినాయి! తెలంగాణలో అక్టోబర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో జూలై నుంచి మాత్రమే ఈ తీర్పును అమలు జరపాలన్న ఈ ప్రభుత్వాల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరించిందట, అనుమతించిందట! అందువల్ల ప్రధానమైన ఈ రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలను జూలై ఒకటవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూయించవలసి ఉంది...
ఇలా మూయించకుండ నిరోధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ‘కిటుకు’ను కనిపెట్టిందట! ఆ కిటుకు పంజాబ్ ప్రభుత్వానికి స్ఫూర్తి! పంజాబ్ ప్రభుత్వం న్యాయస్థానాల తీర్పులను వమ్ము చేసే పథంలో మరింత ముందుకెళ్లింది! జాతీయ, మహా పథాల-నేషనల్ హైవేస్-కు ఆ హోదా రద్దు చేయడం తమకు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. అందువల్ల కేవలం రాష్టస్థ్రాయి రాజమార్గాల-స్టేట్ హైవేస్-పక్కన ఉన్న మద్యం దుకాణాలు యథాతథంగా కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉపాయం కనిపెట్టిందట! రాష్టస్థ్రాయి రహదారులకు ఆ హోదాను రద్దు చేయడం ఆ ఉపాయం! అందువల్ల రాష్ట్రంలోని రాష్టస్థ్రాయి రాజపథాలకు ఆ హోదాను రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులను సిద్ధం చేసిందట! ఈ ఉత్తరువు అమలు జరిగి రాష్టస్థ్రాయి రహదారులు ‘స్థానిక’ మార్గాలుగా మారిపోతాయట! ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు ఈ రహదారులకు వర్తించదు. మద్యం దుకాణాలు యథాతథంగా స్టేట్ హైవేస్‌కు ఇరువైపులా కొనసాగవచ్చు! కానీ ‘నేషనల్ హైవేస్’కు ఇరువైపులా ఉన్న ‘మత్తు’ అంగళ్లు మాత్రం మూతపడక తప్పదు. ‘ఏమీ రామాయణమని’ పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బిల్లును రూపొందించిందట! శుక్రవారం శాసనసభ ఆమోదించిన ఈ సవరణ బిల్లులో జాతీయ స్థాయి బాటల పక్కన గల మద్యం ప్రాంగణాలలోను, హోటళ్లలోను, భోజన శాలలలోను యథావిధిగా మద్యాన్ని సరఫరా చేయవచ్చునని నిర్దేశించారట! ఐదు వందల మీటర్ల పరిధిలోని మద్యం కేంద్రాలనుంచి మద్యాన్ని బయటికి మాత్రం తీసుకుని పోరాదట...
ఇలా దుకాణాలను సరఫరా కేంద్రాలను మూయించాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశానికి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర శాసనసభ చట్టం చేయవచ్చునా? అలాంటి చట్టానికి రాజ్యాంగ నిబద్ధత ఉంటుందా? ఉన్నట్టయితే అన్ని రాష్ట్రాల వారు ఇలాంటివి చేసుకున్నట్టయితే దేశమంతటా సర్వోన్నత న్యాయనిర్ణయం అమలు జరగదు! అలాంటప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించి మాత్రం ఫలితం ఏమిటి? పంజాబ్ చట్టాన్ని బహుశా ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలు రద్దు చేయవచ్చు! దేశమంతటా సమగ్రమైన మద్యపాన నిషిద్ధ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది రాజ్యాంగంలోని నలబయి ఏడవ అధికరణం నిర్దేశిస్తున్న మార్గదర్శక సూత్రం.. దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు! ఇప్పుడు సర్వోన్నత న్యాయ నిర్ణయాన్ని కూడ ‘చట్ట బద్ధం’గా ధిక్కరిస్తారట!