సంపాదకీయం

ఆర్థిక సమీకృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వస్తు సేవల పన్ను- గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్- వ్యవస్థీకృతం కావడం సర్వ సమగ్ర ఆర్థిక సమీకృతికి సరికొత్త మాధ్యమం. దేశమంతటా ఒకే విధమైన పన్నులు విధించడానికి రాజ్యాంగ పరమైన వ్యవస్థ ఏర్పడడం ఈ ‘సమీకృతి’. అసమంజస ఆర్థిక లాభ నిరోధక సూత్రం- డాక్టరిన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అన్‌జస్ట్ ఎన్‌రిచ్‌మెంట్- నిరంతరం అమలు జరగాలన్నది ప్రజాస్వామ్య వౌలిక ఆదర్శాలలో ఒకటి! వస్తు సేవల పన్ను- జిఎస్‌టి- విధించే వ్యవస్థ ఏర్పడడం వల్ల అసమంజసమైన ఆర్థిక లాభం పొందడానికి వీలుండదన్నది కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతున్న మాట. ఈ సూత్రం వ్యాపార వర్గాలకు, పారిశ్రామిక సంస్థలకు మాత్రమే కాదు పాలనాయంత్రాంగానికి కూడా సమానంగా వర్తిస్తోంది. ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వాలు పన్నులను పెంచడానికి వీలుండదు, కొత్త పన్నులను విధించడానికి కూడా వీలుండదు. అందువల్ల వినియోగదారులను సాధారణ ప్రజలను ఆర్థిక వంచనకు గురి చేయడం ఇకపై కుదరదన్నది ‘జిఎస్‌టి’ అనుకూల ప్రచారం వల్ల ఏర్పడుతున్న విశ్వాసం. అసమంజస ఆర్థిక లాభం- అన్‌జస్ట్ ఎన్‌రిచ్‌మెంట్- పొందగల అవకాశం ఉన్నవారు ఇలా నియంత్రణకు గురి కావడం సామాజిక న్యాయ సాధనకు, ఆర్థిక సమానత విస్తరణకు దోహదం చేయగలదన్నది కలుగుతున్న విశ్వాసం. ఈ విశ్వాసం వాస్తవమా? లేక ‘ప్రపంచీకరణ’ మారీచ మృగం కల్పిస్తున్న అనేక ‘వాస్తవ భ్రాంతుల’లో ఇది కూడా ఒకటా? అ న్నది వేచి చూడదగి న పరిణామం. ఏమైనప్పటికీ ‘జిఎస్‌టి’ వ్యవస్థ ఏర్పడడం వినూతన చరిత్రకు మరో అంకురార్పణ! దేశమంతటా ఆయా వస్తువుల ధరలు స మాన స్థాయిలో ఉండడం ఈ వినూతన చరిత్ర.. కానీ ఉండకుండా చేయడానికి ‘జిఎస్‌టి’ వ్యవస్థను ‘సరఫరా-గిరాకీ’- సప్లయ్ అండ్ డి మాండ్- సూత్రంలో ప్రభావితం చేయడానికి ‘ప్రపంచీకరణ’లో భాగమైన ‘స్వేచ్ఛావిపణి’- మార్కెట్ ఎకానమీ- వ్యవస్థ దోహదం చేస్తూనే ఉంటుందన్నది సమాంతరంగా జరుగుతున్న వ్యతిరేక ప్రచారం. ‘జిఎస్‌టి’ వల్ల పన్నులు దేశమంతటా సమానం.. కానీ వస్తువుల ధరలు, వినియోగదారుడు చెల్లించవలసిన సేవా శుల్కాన్ని- సర్వీస్ ఛార్జెస్- మాత్రం సమానంగా ఉండబోవన్నది వ్యతిరేక ప్రచారంలోని ఇతివృత్తం! ‘జిఎస్‌టి’ని ‘మార్కెట్ ఎకానమీ’ దిగమింగుతుందట! దిగమింగకుండా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు నిరోధించగలవా?
ప్రతి ఏటా ‘వార్షిక ఆదాయ వ్యయ’- బడ్జెట్- సమర్పణ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను పెంచుతున్నాయి, దించుతున్నాయి, తుంచుతున్నాయి, కొత్త పన్నులను కనిపెడుతున్నాయి. ఇంతవరకూ నడచిన ఈ గందరగోళం ‘గతం’ కావడం ‘జిఎస్‌టి’ వల్ల ప్రస్ఫుటిస్తున్న శ్రీకారం. ‘వస్తుసేవల పన్నుల మండలి’- జిఎస్‌టి కౌన్సిల్-లో చర్చించి నిర్ధారించనిదే కేంద్ర రాష్ట్రాలు పన్నుల వ్యవస్థలో మార్పులు చేయలేవు. చట్టాన్ని రూపొందించనిదే పన్నులు విధించడానికి వీలు లేదని రాజ్యాంగంలోని రెండు వందల అరవయి ఐదవ అధికరణం స్పష్టం చేస్తోంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ప్రతి బడ్జెట్ సమయంలోను పన్నులను విధిస్తున్నాయి. బడ్జెట్ చట్టం కాదు. ఈ వైరుధ్యాన్ని నిరోధించడానికే బడ్జెట్‌కు చట్టం హోదా కల్పిస్తూ ‘ద్రవ్య వినియోగం’- అప్రోప్రియేషన్- బిల్లును చట్టసభలు ప్రతి ఏటా ఆమోదిస్తున్నాయి. ఈ తాత్కాలిక వ్యవస్థకు బదులు పన్నులను విధించడానికి శాశ్వతమైన, సమగ్రమైన, దేశవ్యాప్తమైన చట్టం రూపొందడం ‘వస్తుసేవల వ్యవస్థ’ వల్ల సంభవించిన శుభ పరిణామం. ‘వస్తు సేవల పన్ను’పై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు గాక, కానీ రాజ్యాంగ పరిణామం గురించి భిన్నాభిప్రాయం ఉండడానికి వీలులేదు. వ్యతిరేక అభిప్రాయం అతార్కికం..
ఒకే దేశంలో ఒకే రకమైన పన్ను అన్నది సమైక్య భావనకు చిహ్నం. కానీ ఇలా దేశమంతటా ఒకే విధమైన పన్నుల వ్యవస్థ వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అధికార పరిధి కుంచించుకొని పోతుందన్న ప్రచారానికి ‘జిఎస్‌టి కౌన్సిల్’ ఏర్పాటుతో తెరపడింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు అతి జాగ్రత్తగా కాపాడదలచుకున్న ‘సమాఖ్య స్ఫూర్తి’కి ఎలాంటి హాని కలుగలేదు. ఎందుకంటె వస్తు సేవల పన్ను మండలి- జిఎస్‌టి కౌన్సిల్- కేంద్ర రాష్ట్ర ప్రతినిధులతో ఏర్పడింది. బహుళ సమ్మతితో కాని సర్వ సమ్మతితో కాని మాత్రమే పన్నుల విధింపునకు సంబంధించిన నిర్ణయాలు జరుగుతాయి. అందువల్ల పన్నుల విధింపులో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల ప్రభుత్వాల వారు సమాన అధికారాలను చెలాయించగలరు. జూలై ఒకటవ తేదీ నుంచి అమలులోకి వచ్చిన పన్నుల వ్యవస్థ రూ పొందడానికి ‘జిఎస్‌టి కౌన్సిల్’ అ నేకసార్లు సమావేశం కావలసి వచ్చింది. వివిధ సమావేశాల్లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం వల్లనే ఇంత సుదీర్ఘ ప్రహసనం అవసరమైంది. ప్రతి సమావేశంలోను బహుళ సమ్మతి- మెజారిటీ- ప్రాతిపదికగా కాక సర్వ సమ్మతి- కానె్సన్‌నెస్- ద్వారానే నిర్ణయాలు జరగడం రాష్ట్రాలకు పెరిగిన ప్రాధాన్యానికి నిదర్శనం. పన్నుల వసూళ్లలో రాష్ట్రాల వాటా పదిశాతం మేర పెరగడం సమాఖ్య స్ఫూర్తి పెరిగిందనడానికి సంకేతం. సమాఖ్య స్ఫూర్తికి అనుగుణమైన ఆర్థిక సమీకృతి ఇలా ఏర్పడడం ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రస్థాన పథంలో మరో ప్రగతి పదం.
ఈ చారిత్రక శుభారంభానికి ప్రతీకగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరగడం ఔచిత్యవంతం. దీన్ని వ్యతిరేకించిన రాజకీయవాదులు చేసిన వాదం వక్రీకరణకు అద్దం. ఈ రాజకీయ వ్యతిరేకతలు ఎలా ఉన్నప్పటికీ ‘జిఎస్‌టి’ వ్యవస్థలో ‘మార్కెట్ ఎకానమీ’కి మధ్య వైరుధ్య స్వభావం నిహితమై ఉండడం నిరాకరింపజాలని నిజం. ‘జిఎస్‌టి’ వ్యవస్థ వల్ల చిన్న పరిశ్రమల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న స్వదేశీయ ఉద్యమ సంస్థల, ఆర్థిక నిపుణుల ఆందోళనకు ఇదీ ప్రాతిపదిక. ‘జిఎస్‌టి’ వెనుక నుంచి ‘ప్రపంచీకరణ’ తొంగి చూస్తోంది! ‘ప్రపంచీకరణ’ సృష్టించిన ‘మార్కెట్ ఎకానమీ’ నక్కి చూస్తోంది! ఇదీ అసలు సమస్య..!