సంపాదకీయం

ఆలస్యమైనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్ల క్రితం కేంద్రంలో పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్‌డిఏ సర్కార్ ఆర్థిక సంస్కరణలకు ఎప్పటికప్పుడు పదునుపెడుతూనే వస్తోంది. సమయం వచ్చినప్పుడు సంస్కరణల చిట్టావిప్పుతూ సరికొత్త దారులు తీస్తూనే ఉంది. అలాంటి వాటిలో కీలకమైనది నష్టాల కూపంలో ఏళ్లతరబడి కునారిల్లుతున్న ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ..ఎయిర్ ఇండియాతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఐదు సంస్థల్నీ విక్రయించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ సూత్ర ప్రాయంగా అంగీకరించడమన్నది దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓ కీలక సంస్కరణల డిమాండ్‌ను నెరవేర్చడమే! నిజానికి ఎయిర్ ఇండియాను ఎప్పుడో విక్రయించి ఉంటే కోటానుకోట్ల రూపాయల భారాన్ని కేంద్రం మీద వేసుకోవాల్సి వచ్చేది కాదు. ఆలస్యంగానైనా ఓ పెనుభారాన్ని దించుకోవడం అన్నది సమయోచితమైన నిర్ణయం. ఏ సంస్థ అయినా రాణించాల్సింది స్వీయ శక్తితోనే తప్ప ఇతరత్రా అందే సహాయ సహకారాలతో కాదు. అన్ని విధాలుగా విస్తరించిన ప్రైవేటు రంగం లాభాల బాటలో పరుగులు పెడుతూ దేశ విమాన ప్రయాణికుల్లో దాదాపు 80 శాతం మందిని తనవైపు తిప్పుకోగలిగిందంటే అందుకు ప్రధాన కారణం.. అవసరానుగుణంగా మారుతూ, మార్పులను సంతరించుకుంటూ ముందుకు దూసుకుపోవడమే..! ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ ఏడాదికాఏడాది ఎయిర్ ఇండియా నష్టాల భారాన్ని మోస్తూ..ఏ విధంగానూ దాన్ని పోటీ సంస్థగా తీర్చిదిద్దలేని పరిస్థితులూ తీవ్రమవుతున్నప్పుడు అమ్మేయడమే సరైన పరిష్కారం అవుతుంది. ఆ విధంగా ప్రభుత్వ ఖజానాపై ఓ పెనుభారం తీరినట్టే అవుతుంది. అలాంటి నిర్ణయానే్న కేంద్ర మంత్రి వర్గం తీసుకుని తన ఆర్థిక సంస్కరణల నిబద్ధతను మరింతగా చాటుకుంది. ఇనే్నళ్లుగా ఎయిర్ ఇండియా నడించిందంటే..దివాలా అంచుల్లోకి వెళ్లకుండా తన ఉనికిని కాపాడుకోగలిగిందంటే అందుకు కారణం ప్రభుత్వ పరంగా లభించిన ఆర్థిక సాయమేనని చెప్పక తప్పదు. వ్యవస్థ, నిర్వహణ పరంగా ఎయిర్ ఇండియాతో ఏ మాత్రం సరితూగలేని ప్రైవేటు విమానయాన సంస్థలు లాభాల్లో నడుస్తున్నప్పుడు ఈ ప్రభుత్వ సంస్థ నానాటికీ వెనుకబడి పోవడానికి కారణాలేవిటన్నది లోతుగా విశే్లషించాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఎందుకంటే మిగతా ప్రభుత్వ సంస్థలూ ఇదే విధంగా భారంగా మారకుండా ఉండేందుకు ఈ రకమైన విశే్లషణ ఎంతగానో దోహదం చేస్తుంది. నష్టాలను పూడ్చుకునే మార్గాంతరంపై దృష్టి పెట్టకుండా, తమకు అండగా ప్రభుత్వం ఉందన్న ధీమా ఉన్నంత కాలం ఎన్నో ఎయిర్ ఇండియాలు పుట్టుకొస్తాయి. అలాంటి పరిస్థితి ఎక్కడా పునరావృతం కాకుండా ఉండాలంటే నష్టాల్లో కునారిల్లుతున్న సంస్థల్ని సరైన దారిలో పెట్టేందుకు కేంద్రం ఈ తరహా నిర్ణయాలకు వెనుకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి సంస్థల్ని పోషించి ఆర్థిక భారాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోయే కంటే వాటిని వదిలించుకోవడం వల్ల మిగిలే నిధుల్ని కీలకమైన వౌలిక సదుపాయాలు, జన హితానికి ఉద్దేశించిన పథకాలకు వినియోగించుకునే అవకాశాలు బలపడతాయి. ఇప్పటికే ఆశయ సిద్ధి ఉన్నా నిధుల పుష్ఠి లేని ప్రభుత్వ పరమైన కీలక కార్యక్రమాలెన్నో ఉన్నాయి. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వల్ల, నిధుల దన్ను కల్పించడం వల్ల ఉపాధి పరమైన అవకాశాల్ని విస్తరించే వీలుంటుంది. ఎయిర్ ఇండియాను కాపాడుకునేందుకు గతంలోని యుపిఏ ప్రభుత్వం విశ్వ ప్రయత్నమే చేసింది. అందుకోసం వేలాది కోట్లతో ఉద్దీపన పథకాన్ని చేపట్టింది. ఆ ప్యాకేజీతోనే ఇప్పటి వరకూ ఈ మహా సంస్థ మనుగడ సాగిస్తూ వచ్చిందనడం అతిశయోక్తి కాదు. అప్పటి ప్రభుత్వంతో పాటు ఎన్నో బ్యాంకులు దీనికి రుణ విమోచనాన్నీ కలిగించాయి. ఇలా ఎందరి సహకారంతోనో ఏళ్ల తరబడి పెరుగుదల లేకుండా రాణించిన ఎయిర్ ఇండియాను నిరంతరం భరించడం కంటే ఆ భారాన్ని దించుకోవడమే సమంజసమని ప్రభుత్వం భావించడం ఇతర సంక్షేమ పథకాలకు నిధుల వెలుగునివ్వడంగానే భావించాలి. ఎయిర్ ఇండియాలో మేటవేసుకున్న నష్టాలు, బకాయిలు తలచుకుంటేనే భయం వేసే పరిస్థితి. ఎంతగా బేరసారాలు జరిపి దీన్ని విక్రయించినా ఆ విధంగా వచ్చే సొమ్ము ఈ బాకీలు తీర్చడానికే సరిపోయే పరిస్థితి లేదంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అమ్మేసినా దీని నష్ట భారాన్ని ఇటు ప్రభుత్వమో..అటు బ్యాంకులో మోయక తప్పదు. అంటే రుణ దాతలకు ప్రభుత్వం చెల్లించినా..ఇప్పటి వరకూ ఈ సంస్థకు ఇచ్చిన రుణాల్ని బ్యాంకులు మాఫీ చేసినా ఆ భారం పడేది నిజాయితీగా పన్నుచెల్లిస్తున్న వారిపైనే అవుతుందన్నది ఆర్థిక వాస్తవం.
అయితే ఈ భారాన్ని కొంతలోకొంతైనా తగ్గించుకునే మార్గాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే..ఎయిర్ ఇండియా నష్టాల్లో కూరుకు పోయినా దాని అనుబంధ సంస్థల్లో కొన్ని లాభాల్లోనే ఉన్నాయి. వీటిలో తన పెట్టుబడిని ఉపసంహరించుకోవడం ద్వారా ఎయిర్ ఇండియా బకాయిల్ని తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అన్న చందంగా ఎయిర్ ఇండియా విక్రయ వ్యవహారం ఉండకూడదు. గరిష్ఠ స్థాయిలో దీనికి తగ్గ రేటు వచ్చే రీతిలోనే విక్రయ ప్రక్రియ జరగాలి. తెగనమ్ముకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదుకాబట్టి పోటీరేటును రాబట్టుకునేందుకు వీలుగా స్వదేశీ, విదేశీ సంస్థల్ని స్వేచ్ఛాయుతంగా బిడ్డింగ్‌లో పాల్గొనేలా చూడాలి. ఇందుకు వీలుగా అవసరమైతే తన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలోనూ తదనుగుణమైన మార్పులు తీసుకురావడానికీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం. దీని విక్రయ వ్యవహారాలను ఖరారు చేసేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో ఏర్పాటయిన కమిటీ త్వరలోనే మార్గదర్శకాలను ఖరారు చేసే అవకాశం ఉంది. అంటే బాకీలను ఒకదానితర్వాత ఒకటిగా విక్రయించుకునే రీతిలో ముందుగా కీలకం కాని ఎయిర్ ఇండియా ఆస్తుల్ని విక్రయించే ప్రయత్నం జరగాలి. వాటి ద్వారా వచ్చే మొత్తంతో కొంత మేరకైనా దీని అప్పుల్ని దించేసుకోవచ్చు. ఆ విధంగా ఈ సంస్థ రుణదాతల్ని ఎంతగా వదిలించుకుంటే అంతగానూ దీన్ని కొనేందుకు దేశీయంగానే కాకుండా విదేశీ ఎయిర్‌లైన్స్ కూడా ఉత్సాహంగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇండిగోతో పాటు ఇతర సంస్థలూ ఎయిర్ ఇండియా కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు జైట్లీ కమిటీ అనుసరించే మార్గమే కీలకం అవుతుంది. ఆలస్యంగానైనా తీసుకున్న ఎయిర్ ఇండియా విక్రయ నిర్ణయం అదే బాటలో ఉన్న వాటిలో ఆర్థిక పరమైన నియంత్రణకు దోహదం చేయాలి. అప్పుడే ఈ నిర్ణయం సార్థకమవుతుంది.