సంపాదకీయం

నిగ్గుతేలనున్న బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-ఇజ్రాయెల్ మధ్య సరికొత్త రీతిలో ఆర్థిక బంధాన్ని, శాస్త్ర, సాంకేతిక, రక్షణ రంగాల్లో సరికొత్త అనుబంధాన్ని పెంపొందించే లక్ష్యంతో మొదలైన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకూ ఇటు ధనిక దేశాల్లోనూ, అటు వర్థమాన దేశాల్లోనూ ఎన్నో సార్లు ఆయన పర్యటించినప్పటికీ ఇజ్రాయెల్ పర్యటనకు ఎనలేని ప్రాముఖ్యత ఉండటానికి కారణం ఇరు దేశాల మధ్య బలంగా కొనసాగుతున్న దీర్ఘకాల బంధమే! భారత్‌లోని భిన్న రంగాలతో ముఖ్యంగా వ్యవసాయ రంగంతో ఇజ్రాయెల్‌కు ఉన్న సహకార బంధం ఎంతో కీలకమైనది. కేంద్రంలో మోదీ సారథ్యంలో ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతర దేశాలతో ఏ విధమైన సంబంధాలను కొనసాగించాలన్న దానిపై విధానపరమైన కసరత్తు బలంగా, లోతుగానే జరిగింది. పైగా ఇది ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం ఇరు దేశాల సంబంధాల్లో ఉత్తేజభరితమైన మార్పులకు ఆస్కారం ఇచ్చే పరిణామం. భారత ప్రధాని ఇజ్రాయెల్ వెళ్లడం ఇదే మొదటిసారి అయినప్పటికీ వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2003లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరాన్ భారత్‌లో పర్యటించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. అనేక దేశాల్లో పర్యటించిన భారత ప్రధానులు ఇజ్రాయెల్‌లో పర్యటించే విషయంలో మీనమేషాలు లెక్కపెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. అది వామపక్ష వాదుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచన కావచ్చు లేదా దేశంలోని ముస్లిం వర్గాలకు దూరం అవుతామన్న ఆందోళనా కావచ్చు..! ఏది ఏమైనా గతానికి భి న్నంగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన చేపట్టి ఇరు దేశాల మధ్య సరికొత్త రీ తిలో సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు గట్టి ప్రయత్నం చేయడం అభినందనీయం. అరబ్బు దేశాలకు దూరం కాకుండా ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు ఎందుకు పాదుగొల్పుకోకూడదన్న విశాల దృక్పథమే మోదీ తాజా పర్యటనకు దోహదం చేసిందని చెప్పడం వాస్తవ విరుద్ధమేమీ కాదు. తమని అజెండాలకు అతీతంగా సాగే అంతర్జాతీయ సుహృద్భావ ఆలోచనేనన్న ఆదర్శనీయ భావననే మోదీ తన చర్య ద్వారా తెరపైకి తెచ్చారు. నిజానికి 1947లో ఇజ్రాయెల్ ఆవిర్భవించినప్పటి నుంచి ఇజ్రాయెల్ అనేక రకాలుగా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంది.
పాలస్తీనాతో దీనికి ఏర్పడ్డ వివాదం అంతర్జాతీయ సమస్యగా అంతిమంగా ఎంతకీ చల్లారని పశ్చిమాసియా రగడగానే మారింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వాస్తవాలు, పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం, బాధ్యత వర్తమాన దేశాల్లో రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఎదుగుతున్న భారత్‌కు ఎంతో ఉంది. ఇటు పాలస్తీనాకు అన్యాయం జరుగకుండా, ఇజ్రాయెల్‌తో తన సంబంధాలు దెబ్బతినకుండా ముస్లిం దేశాలనూ ఆకట్టుకునే విధంగా ముందుకు వెళ్లడమంటే అసాధారణమైన దౌత్య నీతి, రీతి అవసరం. ఆ లక్షణాల్ని ప్రధానిగా పుణికి పుచ్చుకున్న మోదీ తన సత్తాను ఎన్నో సందర్భాల్లో రుజువు చేసుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌లో పర్యటించడం ద్వారా భారత దేశానికి అన్ని దేశాలు కావాలి.. అలాగే అన్ని దేశాలకూ భారత్ అవసరం ఉందన్న వాస్తవాన్ని చాటి చెప్పారు. మోదీ పర్యటనను అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవడానికి నెతన్యాహు సారధ్యంలోని ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఎంతో ఉత్సాహాన్ని కనబరచడం వెల్లివిరిసిన సుహృద్భావానికి నిదర్శనం. ఇరు దేశాలు కీలక పరిస్థితుల్లో పరస్పరం సహకరించుకున్న సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. 1962లో భారత్‌పై చైనా దండెత్తిన సమయంలో భారత్‌కు ఇజ్రాయెల్ సైనిక సాయాన్ని అందించిన విషయాన్ని మర్చిపోలేం. అలాగే 1965, 1071 సంవత్సరాల్లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధ సమయాల్లో కూడా ఇజ్రాయెల్ ఎంతగానో సహకరించింది. భారత్ కూడా ఇజ్రాయెల్ రుణం తీర్చుకుంది. 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్‌కు ఎంతోగానో తోడ్పడింది. ఇదీ ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా బలపడుతూ వచ్చిన సహకారం బంధం. కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ తీవ్ర స్థాయిలో ఫిరంగి గుళ్ల కొరతను ఎదుర్కొన్నప్పుడు దాన్ని తీర్చింది ఇజ్రాయెలే కావడం గమనార్హం. రక్షణ పరంగా పరస్పరం సహకరించుకోవడంలో కూడా ఇరు దేశాలు ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తూనే వచ్చాయి. ఎక్కువ స్థాయిలో యుఎవిలను భారత్ దిగుమతి చేసుకున్నది ఇజ్రాయెల్ నుంచేనన్నదీ ఈ నేపథ్యంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం.
ఇటీవలే ఇరు దేశాల మధ్య దాదాపు 13వేల కోట్ల రూపాయల విలువైన క్షిపణి వ్యవస్థకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. దీని సాయంతో 70కిలోమీటర్ల దూరంలోని ఏ లక్ష్యాన్నయినా భారత్ సునాయాసంగా నేలకూల్చగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుంది. దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడే క్షిపణుల్ని సైతం ఇరు దేశాలు ఇప్పటికే సంయుక్తంగా నిర్మించుకోవడం కూడా రక్షణ పరమైన సహకార విస్తరణకు నిదర్శనం. ఇజ్రాయెల్ భారత్‌కు సరఫరా చేసిన క్షిపణులు కూడా పాటవ పరీక్షలో నిగ్గుదేలాయి. ఉగ్రవాద నిరోధనపై ఇప్పటికే సంయుక్త గ్రూపులను ఏర్పాటు చేసిన ఈ దేశాలు ఈ దిశగా పరస్పర సహకారాన్నీ పెంచుకున్నాయి. రక్షణ పరంగానే కాకుండా దౌత్య పరంగా నూ ఇరు దేశాల మధ్య జరిగిన పరస్పర పర్యటనలు లోతైన అవగాహనను పెం పొందించాయి. నిజానికి మోదీ పర్యటనపై ఇంతగా ఆశావహ పరిస్థితులు నెలకొనడానికి కారణం ఆశించిన రీతిలో దీన్ని విజయవంతం చేసుకోవడానికి రెండు దే శాలు కనబరిచిన ఆసక్తే.. మోదీ ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి ముందే అద్వానీ సహా భారత ప్రముఖులు ఇజ్రాయెల్‌లో పర్యటించారు. మంత్రుల బృందాలు, ఉన్నత స్థాయి అధికార బృందాలు జరిపిన పర్యటన అనేక విధాలుగా మోదీ పర్యటన సాఫల్యతావకాశాల్ని మరింతగా పెంచింది. 2014లో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ జరిపిన పర్యటన కూడా రెండు దేశాల్లో నెలకొన్న పరస్పర విశ్వాసానికి మరింత పదును పెట్టింది. ఐఎన్‌ఎస్ ముంబయి, ఐఎన్‌ఎస్ త్రిశూల్, ఐఎన్‌ఎస్ ఆదిత్య తదితర భారత యుద్ధనౌకలు దౌత్య సంబంధాలు పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాదిలోనే సుహృద్భావ పర్యటన జరిపాయి. వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్‌తో భారత్‌కు ఉన్న అనుబంధం చాలా లోతైనదే. వచ్చే ఏడాది వరకూ అమలు అయ్యే రీతిలో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికా రూపుదిద్దుకుంది. పరస్పర అవగాహన పెంచుకుంటూ దశాబ్దాలుగా సాగిన భారత్-ఇజ్రాయెల్ సహకార బంధం మోదీ పర్యటనతో కొత్త పుంతలు తొక్కుతుందన్న నమ్మకం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ తాను పర్యటించిన ప్రతి దేశం నుంచీ భారీగా పెట్టుబడుల కోసం పిలుపునిచ్చిన మోదీ అదే రీతిలో ఇజ్రాయెల్ వ్యాపార, వాణిజ్య వర్గాలను ఆకట్టుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉభయతారక రీతిలో మోదీ-నెతన్యాహు చర్చలు సఫలమై.. ఇబ్బండి ముబ్బడిగా కుదిరే ఒప్పందాలు అనుకున్న ఫలితాలను అందిస్తే ఈ రెండు దేశాల అనుబంధానికి తిరుగే ఉండదు. ఈ లక్ష్యాన్ని మోదీ సాధించి తీరుతారనడంలోనూ ఎలాంటి సందేహానికీ ఆస్కారం లేదు.