సంపాదకీయం

నర్మదా సరోవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలాలతో అనుసంధానం జనం మధ్య అనుసంధానానికి దోహదం చేస్తుండడం కల్యాణకరమైన చరిత్ర మరోసారి రూపొందుతుండడానికి మరో నిదర్శనం. నర్మదానదిపై నిర్మాణమయిన ‘సర్దార్ సరోవరం’ ఆదివారం జాతికి అంకితం కావడం ఈ చారిత్రక ప్రస్థానంలో మరో శుభఘట్టం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించిన ఈ మహా జలాశయ వినిర్గత స్రవంతులు నాలుగు రాష్ట్రాలలోని వ్యవసాయ క్షేత్రాలను సతత శ్యామల కోమలంగా తీర్చిదిద్దనుండడం వినూతన అనుసంధానానికి శ్రీకారం. ఈ శ్రీకారం స్వాతంత్య్ర సమర సేనాని సర్దార్ వల్లభభాయి పటేల్ స్వప్నానికి సుందర సాకారం! గుజరాత్‌లోని బరూచ్ సమీపంలోని నవ్‌గామ్ వద్ద నిర్మాణమైన ఈ జలాశయం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రాంతాలలోని పదివేల గ్రామాలను సేద్యపు నీటితో అనుసంధానం చేయనుంది. ‘అనుసంధానం’ జాతీయ భావ సమైక్య పరిరక్షణకు వౌలిక ప్రాతిపదిక! నర్మదానదీ జలాలు ఈ అనుసంధానాన్ని పునరావిష్కృతం చేయగలిగాయి. వివాదంగా మారి దశాబ్దులపాటు ప్రాంతాల మధ్య విభేదాలకు ఈ పథకం ప్రాతిపదిక కావడం ఇప్పుడు గతం.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాత్రమే కాదు ‘పర్యావరణ’ పరిరక్షణ పేరుతో ఉద్యమాలను నిర్వహించినవారికీ, ప్రభుత్వాలకు మధ్య కూడ ‘సర్దార్ సరోవరం’ వివాదాలకు వైరుధ్యాలకు కేంద్ర బిందువు కావడం ఈ గతం... ప్రపంచబ్యాంకు సహకారం అందీఅందని త్రిశంకుస్థితి కొనసాగడం కూడ మరో వివాదం! పూర్వం నిర్ధారితమైన సరోవరం ఆనకట్ట ఎత్తు పెంచడం వల్ల ముంపునకు గురి అయిన ప్రాంతాల ప్రజల పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాథి మరో సుదీర్ఘ ప్రహసనం! ఈ గతాన్ని అధిగమించిన ‘సర్దార్ సరోవర’ ప్రస్థానం పంట పొలాలవైపుగాను, మంచినీటి గొట్టాలలోను పరుగులు తీయడానికి సిద్ధం కావడం వర్తమాన వాస్తవం! మరో సతత హరిత సస్య విప్లవానికి కోట్లాది ప్రజల క్షుదార్తి నివారణకు, దాహార్తి నివారణకు దోహదం చేయగల ‘జల సూర్య’ శుభోదయం! సుందర భవిష్యత్తునకు జలసోపానక్రమం.. సరోవరాన్ని ఆరంభించిన నరేంద్రమోదీ చెప్పినట్లు ఈ మహాజలవాహిని విదేశాల నిధులతో కాక, ప్రపంచబ్యాంకు సహకారంతోకాక భారత జన శ్రమజీవన స్వేదంతో జీవం పోసుకుంది... దాదాపు పద్దెనిమిది వేల గ్రామాల ప్రజలకు మంచినీటిని అందించనుంది, దాదాపు నలబయి ఏడు లక్షల ఎకరాలను పండించనుంది... ప్రధాని చెప్పినట్లు ‘‘ఈ సరోవరం మన స్థాపత్య అద్భుతం- ఇంజనీరింగ్ మార్వెల్-’’ ప్రపంచంలోనే ఈ జలాశయం రెండవ అతిపెద్ద ఆనకట్ట కావడం దేశానికి గర్వకారణం. భారతీయ స్వయం సమృద్ధికి జలకేతనం...
సర్దార్ వల్లభభాయి పటేల్ పేరుతో నిర్మాణమైన ఈ ‘సరోవరం’ నాలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానానికి ప్రతీక కావడం చారిత్రక ఔచిత్యం. ఉప ప్రధానమంత్రిగా, దేశ వ్యవహారాల మంత్రిగా సర్దార్ పటేల్ దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేయగలిగారు. జన సమైక్య సాధకుడయ్యాడు. సనాతమైన ఈ అనుసంధానం విదేశీయుల పాలనలో ముక్కలు చెక్కలయింది! కలియగంలో మూడువేల ఎనిమిది వందల ఏళ్లు కొనసాగిన భారత సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ఆ తరువాత దాదాపు పదమూడు వందల ఏళ్లపాటు ఛిన్నాభిన్నం అయింది. ఇందుకు కారణం విదేశీయుల దురాక్రమణ, ఈ దురాక్రమణకు వ్యతిరేకంగా భారత జాతి నిరంతరం సంఘర్షణ సాగించవలసి రావడం.. క్రీస్తుశకం 1948 సెప్టెంబర్ నెలలో ఈ సంఘర్షణ పరాకాష్టకు చేరింది. సెప్టెంబర్ 17వ తేదీన ‘తెలంగాణ’కు స్వాతంత్య్రం రావడం ఈ సంఘర్షణకు దాదాపు ముగింపు. ఈ స్వాతంత్య్ర ప్రదాత సర్దార్ వల్లభభాయి పటేల్! విదేశీయుల ‘‘‘పాలన’’ నుంచి దాస్యం నుంచి మొత్తం దేశానికి విముక్తి లభించిన తరువాత పదమూడు నెలలకు కాని తెలంగాణకు విముక్తి లభించలేదు. అందుకు కారణం 1947 వరకు రాజకీయ బీభత్సకాండను కొనసాగించిన బ్రిటిష్ పెత్తందార్లు సమీకృత రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేయడం, దేశంలో దాదాపు ఐదువందల అరవై సంస్థానాలను సృష్టించడం. సర్దార్ పటేల్ ఈ సంస్థానాలను మళ్లీ దేశంలో విలీనం చేయగలిగిన సమైక్య సమరయోధుడు. సమీకృత రాజ్యాంగ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించిన సర్దార్ పటేల్‌ను సెప్టెంబర్ 17న స్మరించుకోవడం ‘సమైక్య స్ఫూర్తి’కి నివాళి! సర్దార్ సరోవరం సమీపంలోనే నూట ఎనబయి రెండు అడుగుల ‘సర్దార్ పటేల్ విగ్రహం’ నెలకొననుండడం ఈ సమైక్య ప్రదాతకు జాతి ప్రకటిస్తున్న కృతజ్ఞత. నర్మదా జలాలతో ఉత్పత్తికానున్న వందలాది మెగావాట్ల జలవిద్యుత్తు ఈ కృతజ్ఞతా దీపాలను సముజ్వలం చేయనుంది! దాదాపు నాలుగు కోట్లమందికి ప్రత్యక్ష జల ప్రదాయిన అయిన ఈ ‘సరోవరం’ ఇలా ‘వల్లభ మంత్రి’కి నూట ఇరవై అయిదు కోట్ల మంది సమర్పించిన అర్ఘ్యం!
నదులు జనజీవనాన్ని పండిస్తున్న పెంచి పోషిస్తున్న సుధాస్రవంతు లు.. తూర్పుగా సాగుతు న్న స్రవంతులు నదు లు, పశ్చిమ సముద్రం తో సంగమిస్తున్న స్రోతస్వినులు నదాలు! అఖండ భారత్‌లో ‘సింధు’ అతిపెద్ద నద ము. అవశేష భారత్‌లో ‘నర్మద’ అతి ప్రముఖమైన నదము! నర్మదానదీ ప్రస్థానం భారత జాతీయ జీవన ప్రస్థానంతో పెనవేసుకొని ఉంది! గండకీ నది ‘సాలగ్రామ’ సమూహానికి నిలయం! నర్మద లింగాకృతిని ధరిస్తున్న శిలలకు నిలయం! ‘సాలగ్రామం’ సృష్టిస్థితికి సంకేతం. ‘లింగం’ సృష్టి ప్రస్థానానికి చరమలక్ష్యం! విష్ణుదేవుని ‘దుహిత’ అయిన ‘గంగ’ పరమశివుని ‘దయిత’ కావడం ఈ ప్రస్థానానికి ప్రతీక! అందుకే నర్మదానది మరో ‘గంగ’... నదుల మధ్య సహజమైన అనుసంధానం ఇది! ప్రతి జలకణం పంట పొలాలకు చేరడం అనుసంధానానికి లక్ష్యం! ఈ అనుసంధానం పట్ల ప్రజలకు ప్రభుత్వాలకు పెరుగుతున్న శ్రద్ధకు నిష్ఠకు ‘సర్దార్ సరోవరం’ మరో కేంద్రం! మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘నర్మద’కు ఇరువైపులా కోట్లాది మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది! తెలంగాణ ప్రభుత్వం వారి ‘్భగీరథ’ ‘కాకతీయ’ జల ఉద్యమాలు, ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టిన నదుల అనుసంధానం ప్రగతి ధునులకు ప్రతీకలు! జగ్గీ వాసుదేవ ధర్మాచార్యుని ‘ఈశ’ సంస్థవారు నిర్వహిస్తున్న అనుసంధాన యాత్ర - ర్యాలీ ఫర్ రివర్స్ - పెరుగుతున్న జల ధ్యాసకు చిహ్నం...
క్రీస్తునకు పూర్వం ఐదవ శతాబ్దం నాటి ఆదిశంకరాచార్యుడు నర్మదానదిని దాటి ఉత్తర దిశగా వెళ్లడం అపురూప చారిత్రక ఘట్టం. శంకరాచార్యులు జాతీయ సమైక్య సాధకుడు... సర్దార్ పటేల్ కూడ! శతాబ్దుల ఈ పరంపరకు సజీవ అనుసంధానం నర్మదా సరోవరం...