సంపాదకీయం

ఒబామా వాచాలత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వమత సమానత్వం గురించి మన దేశానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా పాఠాలు చెప్పడానికి యత్నించడం విచిత్రమైన పరిణామం. పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్య రచించిన ఒక పాటలోని సారాంశం ఈ సందర్భంగా స్ఫురించడం సహజం. చీకటి ఉన్న చోట దీపం వెలిగించాలి కాని సూర్యుని వెలుగులు సభతీరి ఉన్నచోట కాగడా వెలిగించినందువల్ల ఫలమేమిటన్నది అన్నమయ్య గీతంలోని సారాంశం! ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి దేశ విదేశాలలో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా అమెరికాలోను ఐరోపా దేశాలలోను ఈ ప్రచార ఆర్భాటం దశాబ్దులుగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థ వౌలిక స్వభావం సర్వమత సమభావం. సర్వమత సమభావం అనాదిగా హైందవ జాతీయ స్వభావం! ఈ సనాతన స్వభావానికి మన రాజ్యాంగం ధ్రువీకరణ మాత్రమే! రాజ్యాంగంలో ‘‘మనది సర్వమత సమభావ వ్యవస్థ’’ అని పేర్కొన్నందువల్ల మనది సర్వమత సమభావ వ్యవస్థ కాలేదు. అనాదిగా మనది, ఈ స్వజాతిది, సర్వమత సమభావ స్వభావం కాబట్టి ఈ సంగతిని మన రాజ్యాంగంలో పేర్కొన్నాము. ఏ దేశంలోనైన రాజ్యాంగ వ్యవస్థలు ఆయా దేశాల ప్రజల సమష్టి స్వభావానికి అనుగుణంగా మాత్రమే రూపొందుతుండడం చరిత్ర! 1947లో అఖండ భారత్‌లో యథాపూర్వంగా సర్వమత సమభావ వ్యవస్థ కొనసాగుతోంది. ఇందుకు కారణం అఖండ భారత్‌లో వలెనే 1947 తరువాత అవశేష భారత్‌లో కూడ ప్రజల సమష్టి స్వభావం ‘సర్వమత సమభావం’ కావడం. కానీ అఖండ భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్‌లో సర్వమత సమభావ వ్యవస్థ ఏర్పడలేదు, ఏక మత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది. ఎందుకంటె భారత్ నుంచి విడిపోయిన నాటికి పాకిస్తాన్‌లోని ప్రజల సమష్టి స్వభావం మతోన్మాదం కావడం సమష్టి స్వభావానికి ‘అపవాదం’ - ఎక్సెప్షన్ - అతికొద్ది మందిలో ఉండవచ్చుగాక! కానీ ప్రజల సమష్టి స్వభావం - కలెక్టివ్ నేచర్ - ప్రతి దేశంలోను ‘గతి’ని నిర్దేశిస్తూ ఉంది! ఏకమత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడడం ప్రజాస్వామ్య వౌలిక స్వభావానికి విరుద్ధం. పాకిస్తాన్‌లో మాత్రమేకాదు ప్రపంచంలోని అనేక దేశాలలో ఇప్పటికీ ఏకమత రాజ్యాంగ వ్యవస్థలు పాదుకొని ఉన్నాయి. ఇస్లాం మత రాజ్యాంగాలు ఉన్న దేశాలు ఈ ‘ఏక మత వ్యవస్థ’ - థియోక్రాటిక్ స్టేట్ - లకు కొనసాగుతున్న నిదర్శనాలు. ‘వాటికన్’ క్రైస్తవ మత రాజ్యాంగమున్న దేశం! బరాక్ ఒబామా వంటి వారు ఆయా దేశాలకు వెళ్లి ‘ఏకమత’ అంథకారంలో ‘సర్వమత సమభావ’ జ్యోతులను వెలిగించాలి! సర్వమత సమానభావ కాంతి మండలమైన భారతదేశంలో ఒబామా వంటివారు మళ్లీ అగ్గిపుల్లలను వెలిగించడం, సూర్యుడికి దివ్వెటితో దారి చూపించడం అతార్కికమైన అన్యాయమైన వ్యవహారం...
ఒబామా ఇలా అతార్కిక ప్రవర్తనకు ఒడిగట్టడానికి వెనుక పాశ్ఛాత్య దురహంకారం తొంగి చూస్తోంది, భారత దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికై కొనసాగుతున్న అంతర్జాతీయ షడ్యంతం నక్కి ఉంది, నిక్కి నిక్కి చూస్తోంది... భారతదేశం ముస్లింలను పోషించాలని, వికసింప చేయాలని ఒబామా వాక్రుచ్చాడు. ఈ ‘వాక్రుచ్చుడు’నకు సమయం సందర్భం ఏమిటన్నది అంతుపట్టని వ్యవహారం. భారతదేశం ‘సహిష్ణుత’ను నిలబెట్టుకోవాలన్నది ఒబామా ఇచ్చిన మరో సందేశం. ఢిల్లీలో జరిగిన ‘నాయకత్వ సదస్సు’లో పాల్గొనడానికి విచ్చేసిన ఒబామా సంబంధిత వ్యవహారం గురించి మాట్లాడడం మాని ఈ అసందర్భమైన వాచాలత్వాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యకరం కాదు. మన దేశానికి వస్తున్న విదేశీయ ప్రముఖులు మనకు ఇలాంటి ఉచిత సలహాలను ఇవ్వడం పరిపాటి అయిపోయింది! అల్పసంఖ్యలోని మతాల వారికి అధిక సంఖ్య మతస్థులతో సమానమైన హక్కులు, అవకాశాలు, అధికారాలు, ప్రోత్సాహకాలు లభిస్తున్న ఏకైక దేశం మనదేశం. ప్రపంచంలోని మరే దేశంలోను కూడా మన దేశంలోవలె సర్వసమగ్రమైన సర్వమత సమభావ వ్యవస్థ ఏర్పడ లేదు. కానీ ఒబామా ‘‘ముస్లింలకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు’’ ధ్వనించేలాగా మనకు సలహాలనివ్వడం మన ప్రభుత్వం తక్షణం ‘‘నోరు మూసుకోండి’’ అని ఒబామాకు చెప్పకపోవడం విచిత్రమైన వ్యవహారం, దేశంలోని ముస్లింలు ‘మిలాద్ ఉన్ నబి’ పండుగను జరుపుకుంటున్న శుభ సమయంలో ఒబామా ఇలా అపస్వరాలను పలుకడం మన అంతర్గత వ్యవహారాలలో అక్రమ ప్రమేయానికి నిదర్శనం...
అఖండ భారత విభజన జరిగిన సమయంలో పశ్చిమ పాకిస్తాన్‌లో అల్పసంఖ్యలోని హిందువులు మొత్తం జనాభాలో ఇరవై మూడు శాతం. ప్రస్తుతం వీరి సంఖ్య పాకిస్తాన్ జనాభాలో ఒక శాతం కంటె తక్కువకు దిగజారింది. బంగ్లాదేశ్‌గా మారిన తూర్పు పాకిస్తాన్‌లో సైతం ‘మైనారిటీ’ హిందువుల సంఖ్య ముప్పయి ఒక్క శాతం నుంచి ఎనిమిది శాతానికి దిగజారిపోయింది! ఒబామా వంటివారు పాకిస్తాన్‌కు వెళ్లి సర్వమత సమభావం - సెక్యులరిజమ్ - గురించి, మత సహిష్ణుత - రిలిజియస్ టోలరెన్స్ - గురించి పాఠాలు చెప్పి రాగలరా? ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, సిరియా, ఖతార్ వంటి దేశాలలో సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థలను ఏర్పాటు చేయించగలరా?? అవశేష భారత్ అంతటా సర్వమత సమభావం - అనాదిగా అఖండ్ భారత్‌లో వలెనే - వికసిస్తోంది, పరిమళిస్తోంది. అందువల్లనే 1947లో అవశేష భారత్ జనాభాలో ఆరుశాతం ఉండిన ఇస్లాం మతస్థుల సంఖ్య 2011 నాటి లెక్కల ప్రకారం పదునాలుగు శాతానికి చేరింది! ముస్లింలు భారతదేశంలో హాయిగా జీవిస్తున్నారన్న వాస్తవానికి ఇది తిరుగులేని సాక్ష్యం! ఒబామావంటి ‘కుహనా’ లౌకికవాదులకు ‘నకిలీ’ సర్వమత సమభావ వాదులకు ఇదంతా తెలుసు. కానీ ‘మెతక’వారిని చూస్తే అందరికీ మొత్త బుద్ధి వేస్తుంది. చైనాకు వెళ్లి ఇలాంటి పాఠాలను ‘ఒబామా’ చెప్పలేడు, చెబితే వెంటనే విమానమెక్కించి తరిమివేస్తారు!! మన దేశమంతటా సర్వమత సమభావం సంభావమై ఉంది. అందువల్లనే ‘మైనారిటీ’లు ఎక్కడ కూడ తరిమివేతకు గురికాలేదు. కానీ మన దేశంలో అనాదిగా భాగమై ఉన్న, భరతమాతకు ‘తల’ వంటిదైన ‘కశ్మీర్ లోయ’ ప్రాంతంలో మాత్రం సర్వమత సమభావం హతమైంది, గతమైంది. 1947 నాటికి ‘లోయ’లో అల్ప సంఖ్యాకులుగా మారిన హిందువులను జిహాదీలు 1990 నాటికి నిశే్శషంగా నిర్మూలించారు! ఒబామాను ‘కశ్మీర్’కు వెళ్లి ‘హురియత్’ వంటి జిహాదీ ముఠాలకు పాఠం చెప్పిరమ్మని మన ప్రభుత్వం సలహా ఇవ్వాలి...
ప్రపంచంలో అణచివేతకు తరిమివేతకు గురైన పారశీకులకు, యూదులకు ఆశ్రయమిచ్చిన జాతి హైందవ జాతి అని అమెరికాలోని చికాగోలో 1893లో వివేకానందుడు చెప్పివచ్చాడు. మసీదుల నుంచి ‘నమాజ్’కు పిలుపు వచ్చిన సమయంలో ప్రధాని నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని ఆపివేశాడు. ఒబామాకు చరిత్ర తెలియదా?? వర్తమాన దృశ్యం కనిపించడం లేదా??