సంపాదకీయం

గోవులకు దిక్కెవరు..??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోసంతతి పరిరక్షణకు దోహదం చేయగల ఉత్తరువును కేంద్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఉపసంహరించుకొనడం అంతుపట్టని వ్యవహారం. గత మే నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తరువును జారీ చేసినప్పుడు దేశ ప్రజలు సంతోషించారు! గోవధను సంపూర్ణంగా నిషేధిస్తూ పార్లమెంటు సమగ్రమైన చట్టం చేయగలదన్న విశ్వాసం బలపడింది. కానీ ఇప్పుడు ఆ ఉత్తరువును ఉపసంహరించుకొనడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసింది, నిర్నిరోధంగా ఆవులను, దూడలను, కోడెలను, ఎద్దులను హత్య చేసి, మాంసాన్ని విదేశాలకు భారీ ఎత్తున ఎగుమతి చేయడానికి వీలు కల్పించింది! దేశ ప్రజలలోని అతి తక్కువ శాతం - ఒకటిన్నర శాతం - నియతంగా గోమాంసం తింటున్నారన్నది ‘సర్వే’లలో నిగ్గు తేలిన వాస్తవం. ఇలా వారు తినడం వల్ల ఆవుల సంఖ్య, ఆల జాతుల సంఖ్య తగ్గిపోలేదు. విదేశాలకు దశాబ్దుల తరబడి గోసంతతి మాంసం ఎగుమతి చేయడం వల్ల మాత్రమే గోసంతతి నిరంతరం నశించిపోతోంది. యాంత్రిక వధశాలల ద్వారా పెద్ద సంఖ్యలో ఆవులను పెయ్యలను దూడలను కోడెలను చంపడం వల్ల శతాబ్ది క్రితం జీవించిన గోసంతతిలో కేవలం పదిశాతం మాత్రమే బతికి ఉంది. దేశంలో మొత్తం రెండు వందల ‘జాతుల’ ఆవులు ఉండేవి. ప్రస్తుతం ఇరవై తొమ్మిది జాతుల దేశవాలి ఆవుల జాతులు మాత్రమే మిగిలి ఉండడానికి ఏకైక కారణం ‘గోసంతతి’ని ఇష్టం వచ్చినట్లు హత్య చేసి విదేశాలకు మాంసం ఎగుమతి చేయడం. బంగ్లాదేశ్‌కు భారీ సంఖ్యలో మన దేశపు ఆవులను గోసంతతిని భారీగా తరలించుకొని పోతున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ దొంగ రవాణాను బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది, నిరోధించడంలో మన ప్రభుత్వం విఫలమైంది! బంగ్లాదేశ్‌కు లక్షలాది ఆవులు దూడలు తరలిపోతుండగా అధికారులు కొన్ని వేల గోసంతతిని మాత్రమే పసికట్టి తరలిపోకుండా నిరోధించగలుగుతున్నారు. గత ఏడాది దాదాపు పదహారు వేల పశువులను ఇలా నిరోధించగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మరో పదకొండు వేల ఆవులను దూడలను పట్టుకోగలిగారు! వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు గోవధ నిషేధం చట్టాలను అమలు జరుపుతున్నాయి. గోహంతకులకు పదునాలుగేళ్ల కారాగార శిక్షను విధించడానికి వీలు కల్పించే ‘బిల్లు’ను గుజరాత్ శాసనసభ గత మార్చి నెలలో ఆమోదించడం గోసంరక్షణకు మరింత స్ఫూర్తినిచ్చిన పరిణామం! ఈ నేపథ్యంలో మొత్తం దేశానికి వర్తించగల గోసంరక్షణ నియమావళిని మే 26వ తేదీన కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. కానీ ఆరునెలల తరువాత ప్రభుత్వం మాట మార్చింది! ‘నియమావళి’ని ఉపసంహరించింది...
మే ఇరవై మూడవ తేదీన రూపొందిన ‘జిఎస్‌ఆర్ 493-ఇ-’ అన్న ఆదేశం ప్రకారం గోసంతతిని వధించడం కోసం సంతలలో అమ్మడాన్ని కొనడాన్ని ప్రభుత్వం నిషేధించింది. పశువులను సంతకు తోలే ‘పాలకులు’ ఆ పశువులను హత్య చేయడం కోసం కాక పెంచుకొనడానికై మాత్రమే కొనుగోలు చేయగలవారికి అమ్మాలి! ఇలా పశువులను - ఆవులను, దూడలను, కోడెలను, ఎద్దులను - వధించబోమని హామీ ఇచ్చినవారికి మాత్రమే వాటిని అమ్మాలి! ఈ నియమావళిని అమలు జరుపడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉంది. కొన్నవారు కనీసం ఆరునెలల వరకూ ఆ గోసంతతిని మళ్లీ సంతలకు తోలి ఇతరులకు విక్రయించడానికి వీలు లేదని కూడ ‘నియమావళి’లో నిర్దేశించారు! ఈ నియమావళి వల్ల వ్యవసాయ, పాడి పరిశ్రమల ప్రయోజనాల కోసం మాత్రమే గోసంతతిని కొనుగోలు చేయడానికి అమ్మడానికి వీలు కలిగింది! దీనివల్ల గోసంతతి అభివృద్ధి చెందుతుందని, గోఆధార సేంద్రియ వ్యవసాయం దేశమంతటా మళ్లీ పుంజుకోగలదని భావించిన వారి ఆశలు ఇప్పుడు అడియాసలయ్యాయి.
ఈ ‘నియమావళి’ని రద్దు చేయాలని కోరుతూ గోసంరక్షక సంప్రదాయ వ్యతిరేకులు బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ‘ప్రతినిధులు’ న్యాయస్థానాలను ఆశ్రయించడం ఆశ్చర్యకరం కాదు! దేశవాళి ఆవుల పేడ, ‘గవ్యాలు’ - ఆవుపేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యి - వ్యవసాయ భూమికి అనాదిగా ఆహారం, మానవాళి ఆరోగ్య పరిపోషకమైన ఔషధం, పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షించగల ప్రాకృతిక వరం... ఈ సహజ వ్యవస్థ దశాబ్దులపాటు నష్టభ్రష్టమైపోయింది, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇందుకు ప్రధాన కారణం. ఆవుల వల్ల అడవుల వల్ల లభించే సహజమైన ఎఱువులు లేని వ్యవసాయ వ్యవస్థ నెలకొంది! ఫలితంగా కృత్రిమమైన, విషరసాయన భరితమైన, ఎఱువులు వరదలెత్తడం ఆరంభమైంది. విదేశాల నుంచి లక్షల కోట్ల రూపాయల విలువైన రసాయనపుటెఱువులను, క్రిమిసంహార ఔషధాలను దిగుమతి చేసుకోవలసిన దుస్థితి దాపురించింది! వాణిజ్య ప్రపంచీకరణ మొదలైన తరువాత బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు చొరబడిపోయాయి, వ్యవసాయాన్ని రాజేస్తున్నాయి. ఈ సంస్థలు తయారు చేస్తున్న కృత్రిమ రసాయన పదార్థాలకు అతిపెద్ద విపణి మన దేశం! మన దేశం వంటి ప్రవర్థమాన దేశాల వ్యవసాయాన్ని గుల్ల చేసి, వ్యవసాయ క్షేత్రాలను డొల్ల చేసి నిస్సారవంతంగా మార్చి తిండిగింజలకు కొరతను సృష్టించడం ‘బహుళ జాతీయ సంస్థల’, సంపన్న దేశాల కుట్రలో భాగం! గోసంతతి సంఖ్య పెరిగినట్టయితే దేశమంతటా మళ్లీ సేంద్రియ వ్యవసాయం విస్తరించినట్టయితే ఈ ‘రసాయన’ సంస్థల ఉత్పత్తులకు గిరాకీ ఉండదు, ఆ ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకొనే అవసరం ఉండదు. గో ఆధార వ్యవసాయం క్రమంగా మళ్లీ విస్తరిస్తోంది. సిక్కిం రాష్ట్రంలో మొత్తం వ్యవసాయం సేంద్రియ పద్ధతిలో జరుగుతోంది! కేరళలోని అనేక ప్రాంతాలు సంపూర్ణ సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలుగా నిర్థారితమయ్యాయి.
అందువల్లనే బహుళ జాతీయ సంస్థల ‘దళారీ’లు గోవధ నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారు! కేంద్రప్రభుత్వం ఈ ‘వాణిజ్య కబంధ బంధం’ నుంచి ముక్తి కాకపోవడం జాతీయ వైపరీత్యం! ఈ ‘నియమావళి’ గురించి వివిధ ఉన్నత న్యాయస్థానాలు విభిన్నమైన తాత్కాలిక ఆదేశాలను జారీ చేశాయి. జులై పదకొండవ తేదీన సర్వోన్నత న్యాయస్థానం ‘నియమావళి’ అమలు జరుగరాదని తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. ‘సర్వోన్నత న్యాయస్థానం’లో ‘నియమావళి’ని సమర్థిస్తూ వాదించవలసిన కేంద్రప్రభుత్వం, సర్వోన్నత న్యాయ నిర్ణయం కోసం వేచి ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం నిరసించదగిన విపరిణామం.