సంపాదకీయం

అనివార్య పరిణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా చర్య తీసుకుంది.. ఐదారు సంవత్సరాలుగా హెచ్చరికలతోను బెదరింపులతోను ‘‘సరిపుచ్చిన’’ అమెరికా ప్రభుత్వం శుక్రవారం పాకిస్తాన్‌పై ‘బ్రహ్మాస్త్ర’ ప్రయోగం చేసింది, పాకిస్తాన్‌కు అందజేస్తున్న ‘రక్షణ సహాయం’ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. జిహాదీ ఉగ్రకలాపాలకు పాకిస్తాన్ ప్రభుత్వం పాల్పడుతున్నంతకాలం ఈ ‘రక్షణ నిధి’ని అందచేయరాదన్నది అమెరికా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన నిర్ణయం.. ఈ నిర్ణయం మన ప్రభుత్వానికి లభించిన వ్యూహాత్మక విజయం! ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్‌కు అమెరికా నుంచి ఈ ‘‘ఏడాది లభించవలసిన’’ దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయల సైనిక సహాయం ‘ఆగిపోయిందట’! దీర్ఘకాల పథకం కింద రానున్న సంవత్సరాలలో అమెరికా అందజేయగల మరో నాలుగువేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కూడ పాకిస్తాన్‌కు అందబోదు. ‘‘గత పదిహేను సంవత్సరాలు అమెరికా ప్రభుత్వం అమాయకంగా - తెలివిలేకుండా - పాకిస్తాన్‌కు దాదాపు రెండు లక్షల పదహైదువేల కోట్ల రూపాయల ఆర్థికసహాయం అందజేసింది..’’ అన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు రోజుల క్రితం చెప్పిన మాట! అయితే పాకిస్తాన్ మాత్రం తమ దేశాన్ని వంచించిందని, అబద్ధాలు చెప్పిందని అమెరికా అధ్యక్షుడు ఆరోపించాడు! పాకిస్తాన్ జిహాదీ బీభత్సకారులకు ‘స్వర్గం’గా మారిందన్నది అమెరికా అధ్యక్షుడు కొత్తగా ధ్రువపరచిన పాత నిజం!! ప్రత్యక్ష పరోక్ష బీభత్స చర్యలకు స్వస్తి చెప్పకపోయినట్టయితే ‘సహాయాన్ని’ ఆపివేస్తానని గత రెండేళ్లలో అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌ను అనేకసార్లు హెచ్చరించింది. పాకిస్తాన్ మాత్రం బీభత్స కలాపాలను మానలేదు. ఇటు మనదేశంలోకి అటు అఫ్ఘానిస్థాన్‌లోకి ‘టెర్రరిస్టుల’ను ఉసిగొల్పడం ఆపలేదు, కాని అమెరికా ప్రభుత్వం సైనిక కలాపాలకోసం, ఆయుధ సేకరణ కోసం పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం అందచేయడం ఆపలేదు! అందువల్ల నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక గత ప్రకటనలకు పునరావృత్తి మాత్రమేనన్న భావం కలిగింది. కాని డొనాల్డ్ ట్రంప్ తాను కేవలం మాటల వాడిని కానని, చేతల వాడినని నిరూపించుకున్నాడు. ఈ చర్యలకు కారణం అమెరికా ప్రభుత్వానికి మనదేశం పట్ల ఉన్న మైత్రీభావం మాత్రమేకాదు! చైనా వ్యూహాత్మక విస్తరణను అడ్డుకోవడంలో భాగంగా అమెరికా ప్రభుత్వానికి ఏర్పడిన అనివార్యం ఇది! అయినప్పటికీ ‘పాకిస్తాన్ చైనా’ల ఉమ్మడి ‘దురాక్రమణ’ను ప్రతిఘటించడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషికి శుక్రవారం నాటి అమెరికా నిర్ణయం బలం చేకూర్చగలదు!!
పదిహేను సంవత్సరాలుగా అమెరికా ప్రభుత్వం అమాయకంగానో, అజ్ఞానంతోనో పాకిస్తాన్‌కు సహాయం చేయలేదు. తమ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణలో భాగంగా మాత్రమే అమెరికా పాకిస్తాన్‌ను ‘మేపింది’. అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్లను అల్‌ఖాయిదాను అణచివేయడంలో పాకిస్తాన్ ప్రభుత్వం తమకు మద్దతునిస్తుందన్నది పదిహేను ఏళ్లుగా అమెరికా విశ్వాసం. 2001లో ‘తాలిబన్, అల్‌ఖాయిదా’ జిహాదీ హంతకులు తమ దేశంపై దాడి చేసి, న్యూయార్క్‌లోని ‘ప్రపంచ వాణిజ్య కేంద్రం’ - వరల్డ్ ట్రేడ్ సెంటర్ -ను ధ్వంసం చేసిన తరువాత మాత్రమే అమెరికా ప్రభుత్వం జిహాదీ ఉగ్రవాదంపై కత్తికట్టింది. అంతకుపూర్వం ఏళ్ల తరబడి మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వం జిహాదీ బీభత్సకారులను ఉసిగొల్పిన సంగతి అమెరికాకు తెలుసు! అయినప్పటికీ పాకిస్తాన్ తమకు అత్యంత మిత్ర దేశమని 2008వ 2012వ సంవత్సరాల మధ్య అమెరికా ప్రభుత్వం పదేపదే ప్రకటించింది!! అఫ్ఘానిస్థాన్‌లో ‘తాలిబన్ అల్‌ఖాయిదా’ మూకలను అణచివేయడానికి సహకరించినంతవరకు, పాకిస్తాన్ ప్రభుత్వపు భారత వ్యతిరేక బీభత్స చర్యలను పట్టించుకోరాదన్నది అమెరికా విధానమైంది!!
అల్‌ఖాయిదా ముఠాకు చెందిన ఒసామా బిన్‌లాడెన్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో సురక్షిత స్థావరాన్ని కల్పించినట్టు ధ్రువపడిన తరువాత కూడ అమెరికా ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోలేదు. లాడెన్‌ను అమెరికా దళాలు వధించిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం కూడ ‘తేలు కుట్టిన దొంగవలె’ వౌనంగా ఉండిపోయింది! ఆ తరువాత కూడ అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు సైనిక కలాపాల కోసం ఆర్థిక సహాయం కొనసాగించింది! ఇందుకు మొదటి కారణం చైనా విస్తరణ. ‘సోవియట్ సమాఖ్య’ - సోవియట్ రష్యా - కమ్యూనిస్ట్ వ్యవస్థ కూలిపోయిన తరువాత, ‘సమాఖ్య’ పదిహేను దేశాలుగా విడిపోయిన తరువాత, రష్యా బలహీనపడింది. 1945 నుంచి సాగిన ‘ప్రచ్ఛన్న యుద్ధం’ ముగిసింది, అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా ఏర్పడింది! 1991 నుంచి పదిహేనేళ్లుకు పైగా కొనసాగిన ఈ అగ్రాధిపత్యానికి పోటీగా చైనా ఎదిగిపోవడం గత పదేళ్ల చరిత్ర! ఇప్పుడు ‘ప్రచ్ఛన్నయుద్ధం’ అమెరికాకు, చైనాకు మధ్య నడుస్తోంది. అందువల్ల పాకిస్తాన్ చైనాతో జట్టు కట్టకుండా నిరోధించడంలో భాగంగా అమెరికా ‘సాయాన్ని’ కొనసాగించింది! కానీ అమెరికా వైపున ఉండడంకంటె చైనాతో చేరిపోవడం ప్రయోజనమన్నది పాకిస్తాన్ విధానం! పాకిస్తాన్‌లోని ‘గ్వాదార్’ ఓడరేవును నిర్వహించడం మొదలైంది! గ్వాదార్ నుంచి సింకియాంగ్ వరకు ‘ఆర్థిక వాటిక’ను చైనా ఏర్పాటు చేస్తోంది! అఫ్ఘానిస్థాన్ నుంచి 2014లో అమెరికా దళాలు నిష్క్రమించిన తరువాత పాకిస్తాన్, చైనా ప్రభుత్వాలు ఆ దేశంలోకి వ్యూహాత్మకంగా చొరబడిపోయాయి! ఈ ‘ఆర్థిక వాటిక’లోకి అఫ్ఘానిస్థాన్ కూడా చేర్చుకొనడానికి పాకిస్తాన్, చైనాలు కృషి చేస్తున్నాయి! డొనాల్డ్ ట్రంప్ కనిపెట్టిన వంచనకు పరాకాష్ఠ ఇది! ఇలా పాకిస్తాన్ స్వయంగా అమెరికా నుంచి దూరంగా జరిగింది. అమెరికా ప్రభుత్వం వారి ‘సహాయం రద్దు’ ప్రకటన ఈ వికృత వాస్తవానికి ధ్రువీకరణ మాత్రమే!!
అమెరికా పాకిస్తాన్‌కు మాత్రమేకాదు, పశ్చిమ ఆసియాలోని ఉత్తర ఆఫ్రికాలోని అనేక ఇస్లాం మత రాజ్యాలకు కూడా అమెరికా ‘సైనిక వ్యవహారాల కోసం’ ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ దేశాలు పరోక్షంగా జిహాదీ బీభత్సకాండను ప్రోత్సహిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ సహా ఈ దేశాలన్నీ అమెరికా బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వద్ద ఆయుధాలు కొంటున్నాయి. ఇదీ.. ‘సహాయం’ ఇన్నాళ్లూ కొనసాగించడానికి రెండవ కారణం. ఏమయినప్పటికీ ట్రంప్ నిర్ణయంతో మనకు అమెరికాకు మధ్య మైత్రి మరింత బలపడగలదు.