సంపాదకీయం

స్వచ్ఛతా స్వప్నం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు భారతీయ స్వచ్ఛతను భగ్నం చేస్తుండడం వౌలిక సమస్య. ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- భారతీయతకు ‘గొడ్డలి’లా దాపురించి ఉంది. ప్రపంచీకరణ వల్ల భారత జాతీయ సాంస్కృతిక స్వచ్ఛత ‘కల్తీ’ అవుతోంది, భారతీయుల జీవన ‘విలాసం’- పాషన్- మారిపోతోంది, మారిపోయింది. భారతదేశపు భౌతిక స్వచ్ఛత అడుగంటిపోతుండడానికి ఇది దోహదం చేస్తోంది. ‘ప్లాస్టిక్’ విషాల వల్ల భరతభూమిపై అనాదిగా ప్రభవిస్తున్న సాంస్కృతిక పరిమళాలు కాలుష్యవంతవౌతున్నాయి. వర్షం కురిసిన తర్వాత కమ్మని మట్టివాసనలు కొలువుతీరడం లేదు, ఘ్రాణేంద్రియాలను గగ్గోలు పరుస్తున్న దుర్గంధం దూసుకొని వస్తోంది. వికేంద్రీకృత పారిశ్రామిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన ‘కేంద్రీకరణ’ పాశ్చాత్యుల ప్రదానం, ప్రపంచీకరణ ‘ప్రసాదం’.. తమిళనాడులోని తూత్తుకుడిలో నెలకొన్న ‘స్టెర్‌లైట్- వేదాంత’ వారి ‘రాగి ఉత్పాదక పరిశ్రమ’ ఈ కాలుష్య కేంద్రీకరణకు ఒక ఉదాహరణ మాత్రమే! ఏటా నాలుగు లక్షల టన్నుల రాగి లోహాన్ని ఉత్పత్తి చేస్తున్న ఈ బహుళ జాతీయ వాణిజ్య కర్మాగారం నుంచి ఏటా నలబయి లక్షల టన్నుల విష రసాయన వ్యర్థాలు కూడ వెలువడుతున్నాయి. ఈ రసాయన కాలుష్యాలు రగిలించిన మంటలకు పది మంది స్వచ్ఛతా ఉద్యమకారులు ఆహుతి అయిపోవడం విస్మయకరమైన వర్తమానం! గతంలో ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ‘పోస్కో’ సంస్థ వారి ఉక్కు పరిశ్రమ నిర్మాణ ప్రహసనం అనేక మంది ప్రాణాలను బలిగొనింది. ఈ పైశాచిక పరిశ్రమకు వేల ఎకరాల భూమిని సేకరించి పెట్టే యత్నంలో ప్రభుత్వం వారు తమలపాకుల తోటలను, అరటితోటలను పొలం కాపుల కళ్లముందే తగలబెట్టడం చరిత్రలో చెరగని విషాదం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, మహారాష్టల్రోను, ఉత్తర దేశంలోను, పశ్చిమ బెంగాల్‌లోను ఈ కేంద్రీకృత పారిశ్రామిక నిర్మాణాల పైశాచిక పథకాలు ప్రజల ప్రాణాలను బలిగొనడం చరిత్ర.. వికేంద్రీకృత భారతీయ పరిశ్రమల్లో సర్వోత్కృష్టమైన లోహాలు, మిశ్రమ ఖనిజాలు ఉత్పత్తి కావడం సహస్రాబ్దుల చరిత్ర. పాశ్చాత్యుల దురాక్రమణ ఈ చరిత్రను చెరపింది. ప్రపంచీకరణ భారతీయతను దిగమింగుతోంది.
వౌలికమైన ఈ ‘కేంద్రీకృత పారిశ్రామిక విధానం’ తొలగనంత వరకూ, ‘వికేంద్రీకృత’ పరిశ్రమలు దేశమంతటా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించనంత వరకూ ‘స్వచ్ఛ భారత పునర్ నిర్మాణం’ స్వప్నంగానే మిగిలి పోగలదు. విడివిడిగా సంభవించినట్టు, సంభవిస్తున్నట్టు భ్రాంతిని గొలుపుతున్న ‘కాలుష్య’ పరిణామాలు నిజానికి ఒకదానితో ఒకటి ముడివడి ఉన్నాయి. ‘ప్లాస్టిక్’ పదార్థాల వల్ల కాలుష్యం కట్టలుగా గుట్టలుగా కొలువుతీరుతోందని తెలిసినప్పటికీ నిత్యం ‘ప్లాస్టిక్’ భోజనాలను ఆరగిస్తూనే ఉన్నాము, ‘ప్లాస్టిక్’ పానీయాలను క్రోలుతూనే ఉన్నాము. సీసాలలోని మంచినీటిలో ప్లాస్టిక్ విషాలు కలసిపోతూనే ఉన్నాయి. అరటి, మోదుగ వంటి ఆకులలో తిన్నవారు ఆరోగ్యంగా జీవించడం యుగయుగాల అనుభవం. ఇప్పుడు ‘ప్లాస్టిక్’ విస్తళ్లలో తింటున్నవారి శ్వాసకోశాలు క్రమంగా చెడిపోతున్నాయి. ఇది తెలిసినప్పటికీ ‘ప్లాస్టిక్’ను వదలలేక పోవడం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ మారీచ మాయాజాలం! ‘ప్లాస్టిక్’ పదార్థాలతో పొట్టలు నిండిన ఆవులు, పశువులు అకాల మరణం పాలవుతున్నాయి. తిండి అవశేషాలతో ‘ప్లాస్టిక్’ ముక్కలను మెక్కిన కుక్కలు కక్కి కక్కి ప్రాణాలను కోల్పోతున్నాయి. ‘నమామి గంగే’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆరంభించిన ‘నిర్మల గంగానదీ పునరుద్ధరణ పథకం’ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. గురువారం కొత్త ఢిల్లీకి వచ్చి ఉన్న నెదర్‌లాండ్స్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే ‘స్వచ్ఛ గంగ’ పథకం పట్ల ఆసక్తిని కనపరచడం సరికొత్త ఉదాహరణ. కానీ గంగానదిలోను, దేశమంతటా ఉన్న నదుల్లోను ‘ప్లాస్టిక్ పర్వతాలు’ కొట్టుకొని వస్తున్నాయి...
విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలోను, ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాలలోను ‘ప్లాస్టిక్’ సామగ్రిని వాడరాదని పంతొమ్మిదవ తేదీన ‘విశ్వవిద్యాలయ నియంత్రణ సంస్థ’- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- యూజీసీ-వారు ఆదేశించడం హర్షణీయం. ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ భోజనం డబ్బాలు, పాత్రలు, జుర్రుడు గొట్టాలు- వంటివి ఈ విద్యా నిలయాలను కాలుష్య వలయాలుగా మార్చివేశాయి. వీటిని వాడకుండా నిగ్రహాన్ని చూపగలిగితే స్వచ్ఛ విద్యాలయ ప్రాంగణాలు విస్తరిస్తాయి. కానీ ఈ ఉత్తరువును ఎవరు అమలు జరుపుతారు? అనేక మహానగరాలలో, పట్టణాలలో, ధార్మిక క్షేత్ర ప్రాంగణాలలో ప్రభుత్వాలు పదే పదే ప్లాస్టిక్ సామగ్రిని నిషేధించాయి. తిరుమల దివ్య క్షేత్రం ప్రాంగణంలో కొంతవరకూ నిషేధం విజయవంతమైంది. కానీ ఈ నిషేధాల తరువాత ద్విగుణీకృత ఉత్సాహంతో వ్యాపారులు, వినియోగదారులు ప్లాస్టిక్ సంచులను వాడుతుండడం బహిరంగ రహస్యం. తెలంగాణ రాజధాని నగరంలోని కాలువలలో ప్లాస్టిక్ పదార్థాలు వరదలెత్తుతున్నాయన్నది ఆధికారిక నిర్ధారణ.. అందువల్ల సకల వివిధ ప్లాస్టిక్ సంచులను, పట్టీలను నిషేధించాలని మహానగర పాలక సంస్థ వారు నిశ్చయించారట! అమలు జరుపగలరా? గతంలో పలుచని- యాబయి మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ సంచులను, పట్టీలను ‘విస్తృత హైదరాబాద్ మహానగర పాలిక’- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్- జిహెచ్‌ఎంసీ- వారు నిషేధించి ఉన్నారు. ‘నిషేధించారు కాబట్టి మేము ప్లాస్టిక్ సంచులలో సరకులు, కూరగాయలు, పండ్లు ఇవ్వం’ అని వ్యాపారులు ప్రకటించారు. రెండు, మూడు, నాలుగైదు రూపాయలను వినియోగదారుల నుంచి గుంజుకొని యథావిధిగా ప్లాస్టిక్ సంచులను విక్రయించడం వ్యాపారులు కనిపెట్టిన ఉపాయం.. నిషేధం తరువాత వినియోగదారులకు కలిగిన మేలు ఇదీ! ఇప్పుడు హైదరాబాద్ నగరపాలిక వారు యాబయి మైక్రాన్లు, ఆపైన మందం ఉన్న ప్లాస్టిక్ సంచులను, పట్టీలను కూడ నిషేధిస్తారట! ప్లాస్టిక్ పదార్థాలు ఉత్పత్తి కాకుండా, దిగుమతి కాకుండా ప్రభుత్వాలు ఎందుకని నిషేధించడం లేదు? వినియోగాన్ని మాత్రం నిషేధించడం, ఉత్పత్తులను యథావిధిగా కొనసాగించడం విడ్డూరం! ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌ను ఉత్పాదక కేంద్రాలలో ఏమి చేసుకోవాలి?
ఉత్పత్తులను నిషేధించినట్టయితే, దిగుమతులను నిరోధించినట్టయితే ప్లాస్టిక్ విష పదార్థాలు వ్యాపారులకు లభ్యమే కావు. కానీ ప్లాస్టిక్ బట్టీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ‘ఘరానా’ సంస్థలు ఈ ‘ఉత్పత్తి’ నిషేధాన్ని అడ్డుకుంటున్నాయి. గతంలో రైలుపెట్టెలలో ‘ప్లాస్టిక్ చిప్పల’ను ప్రభుత్వం నిషేధించింది, ‘మట్టి డిప్పల’లో కాఫీ, తేనీరు వంటి పానీయాలను ప్రయాణీకులకు సరఫరా చేయాలని నిర్దేశించింది. పదేళ్లు గడిచిపోయినప్పటికీ ఈ ఉత్తరువు అమలు జరగలేదు. మట్టి పిడతలు, మట్టి పాత్రలు తయారుచేసే కుటీర పరిశ్రమలకూ, ప్లాస్టిక్ చిప్పలను తయారుచేసే భారీ పారిశ్రామికవేత్తలకూ మధ్య వాణిజ్య సమరం ఆరంభమైంది. భారీ పారిశ్రామికవేత్తలదే పైచేయి కావడం బహిరంగ రహస్యం! ప్రభుత్వ విధానాలను ఈ ‘ప్లాస్టిక్’ వర్గాల వారు నిర్దేశిస్తున్నారు!!