సంపాదకీయం

‘రాగి తేలిన’ స్వచ్ఛత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడులోని తూత్తుకుడిలో నెలకొని ఉండిన ‘స్టెరిలైట్’ రాగి లోహపు కర్మాగారం మూతపడడం ప్రతీక మాత్రమే. కాలుష్య వలయాలను సృష్టించి ఊపిరి ఆడకుండా నిరోధిస్తున్న కేంద్రీకృత పారిశ్రామిక పద్ధతికి వ్యతిరేకంగా దేశ ప్రజలు ఉద్యమిస్తుండడం వర్తమాన వాస్తవం. పరిశ్రమలను, ఆర్థిక ప్రగతిని వికేంద్రీకరించడం భారతీయ జీవన పద్ధతి. అనాదిగా ‘స్వయం సమృద్ధ గ్రామాలు’ భారత మహాప్రవాహపు జలబిందువులు! బ్రిటన్ దురాక్రమణ కాలంలోను, పాశ్చాత్య ప్రభావం విస్తరించిన సమయంలోను ఈ ‘వికేంద్రీకృత ప్రగతి కేంద్రాలు’ పాడుపడినాయి. కేంద్రీకరణతోపాటు పెట్టుబడిదారీ వ్యవస్థ పాదుకొంది. గ్రామీణ పరిశ్రమలు మూతపడి భారతీయత మూలబడింది. నిరుద్యోగ, దారిద్య్రగ్రస్తమైన గ్రామాల నుంచి జనం పట్టణాలవైపు పరుగులు తీయడం దశాబ్దుల వైపరీత్యం. భారతీయతను ‘చంద్రుడిని రాహువువలె’ గ్రసించింది! ఈ గ్రహణం నుండి భారతదేశం విముక్తమై వికేంద్రీకృత స్వయం సమృద్ధ గ్రామాలు మళ్లీ వికసించాలన్నది బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమర లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేరకముందే భారత జాతిని - సూర్యుడిని కేతువువలె- దిగమింగడానికి ప్రపంచీకరణ చొచ్చుకొని వచ్చింది, చొరబడిపోతోంది. పారిశ్రామిక కేంద్రీకరణతోపాటు కాలుష్యం కేంద్రీకృతం అవుతుండడం ‘ప్రపంచీకరణ’ స్వభావం. విస్తరించిపోతున్న ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ పారిశ్రామిక సామ్రాజ్యాలు కాలుష్యాన్ని కొలువుతీర్చుతున్నాయి. ‘తూత్తుకుడి’ని ‘టూటీకోరన్’ అని పలుకుతున్నవారు- ‘గుత్తి’ని ‘గూటీ’అని పలికినట్టు- సృష్టించిన ‘కాలుష్యం’ ఇది. భారతీయుల వాణిజ్య సంస్థలు కూడ ‘బహుళ జాతీయ వాణిజ్య’ వికృత ప్రవృత్తిని సంతరించుకున్నాయి. భారతీయులకు అధిక భాగస్వామ్యం కల ‘వేదాంత’ సంస్థ ఇందుకు ఒక ప్రతీక మాత్రమే. ఈ ‘వేదాంత’ సంస్థకు అనుబంధమైన స్టెరిలైట్ ‘రాగి’ కర్మాగారం వారు ప్రారంభం నుంచీ కూడ, 1996 నుంచి కూడ పర్యావరణ పరిరక్షణ నియమాలను అతిక్రమించడం ‘ప్రపంచీకరణ’ పనితీరుకు ఉదాహరణం. సముద్ర తీరానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంగా ఈ రాగి పరిశ్రమను ఏర్పాటు చేయడానికి అనుమతి లభించగా పదకొండు కిలోమీటర్ల దూరంలోనే ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారట! సముద్ర తీర గ్రామాలు మాత్రమే కాదు సముద్ర జలాలు కూడ భయంకర కాలుష్యంతో నిండిపోవడం ఇరవై రెండేళ్ల వ్యథ. తమిళనాడు ప్రభుత్వం ఇన్నాళ్లకు ఈ ‘కాలుష్యపు కార్ఖానా’ను మూసివేసింది. ప్రజలు ఉద్యమించిన తరువాత..! అనేక మంది ఉద్యమకారుల ప్రాణాలు పోయిన తరువాత!! దేశమంతటా ఇదే ‘తీరు’ కొనసాగుతోంది. ‘ప్రపంచీకరణ’ కాలుష్యాన్ని నింపుతోంది. ఈ కాలుష్యం భౌతికమైనది, బౌద్ధికమైనది..
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సముత్కర్ష శాస్త్ర విజ్ఞానాన్ని సనాతన జీవన పద్ధతులను పరిపుష్టం చేయడానికి వినియోగించగలమా? అన్నది దశాబ్దులుగా సాగుతున్న మీమాంస. ‘ఇంటి తనాన్ని’ నిలబెట్టడానికి ‘ఇంటి తనాన్ని’ ఆచరించడానికి ఇంటిలోని వారు నిబద్ధులై ఉండడం సనాతనమైన అంటే, శాశ్వతమైన జీవన పద్ధతి.. భారతీయత అనాదిగా మన ఇంటితనం, భారతదేశం మన ఇల్లు! ఈ ‘ఇంటితనం’ జాతీయత.. ఈ స్వజాతీయ సంస్కృతికి, విదేశాల నుంచి విరుచుకొని పడిన వికృతికి మధ్య శతాబ్దుల క్రితం ఆరంభమైన సంఘర్షణ దశాబ్దులుగా తీవ్రతరం అవుతుండడం నడుస్తున్న చరిత్ర. తూత్తుకుడిలో రాగి కర్మాగారం సృష్టించిన కాలుష్యం ప్రతీక మాత్రమేనన్నది పునరుక్తి కావచ్చు. కానీ మన సముద్ర జలాలు, తీరాలు, జలచరాలు కాలుష్యం కాటుకు గురి అవుతుండడం నిరంతర పునరావృత్తి.. వందలాది ‘తిమింగలాల’కు ఊపిరి ఆగిపోయి కళేబరాలు గుట్టలుగా కట్టలుగా తీరానికి కొట్టుకొని వచ్చాయి. తూత్తుకుడి తీరంలో సైతం ఈ ఘోర దృశ్యాలు ఆవిష్కృతం కావడానికి స్టెరిలైట్ ‘రాగి’ కర్మాగారం వంటివి కారణం. ప్రభుత్వాలు ఏళ్ల తరబడి కాలుష్య కారకులను శిక్షించలేదు. ‘ప్రపంచీకరణ’ తెచ్చిపెట్టిన వాణిజ్య జీవన విలాసం భారతీయ మానసిక బౌద్ధిక స్వచ్ఛతను భంగపరచడం ఇందుకు కారణం. దాదాపు అన్ని రాజకీయ పక్షాలవారు బహుళ జాతీయ వాణిజ్య సంస్థల- మల్టీ నేషనల్ కంపెనీస్- ఎమ్‌ఎన్‌సిలు-నుండి భారీగా విరాళాలు స్వీకరించి భోంచేసి ఎన్నికలలో గెలుస్తున్నారు, ఓడుతున్నారు. ఓడినవారికీ గెలిచినవారికి మధ్య ఉన్న సమానత్వం విరాళాలను భోంచేయడం..
అందువల్లనే కేంద్ర, రాష్ట్రాలలో ఏ రాజకీయ పక్షం అధికారం నిర్వహించినప్పటికీ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ నియమ రాహిత్యాన్ని శిక్షించడం లేదు. ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ ప్రభుత్వాల విధానాలను ప్రభావితం చేస్తున్నాయా? లేక ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ నిర్వాహకులు ప్రభుత్వ విధానాలను నిర్ణయిస్తున్నారా? అన్నది కొనసాగుతున్న మీమాంస. ‘స్టెరిలైట్’ సంస్థ ఇనే్నళ్లపాటు కాలుష్యాన్ని పెంచి, పంచి శిక్షను తప్పించుకొనడానికి ఇదీ కారణం! ‘మానసిక స్వచ్ఛ్భారత్’- విదేశీయుల దురాక్రమణ కారణంగా, వాణిజ్య ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- కారణంగా మలిన పడిన ‘మానసిక స్వచ్ఛ్భారత్’- మళ్లీ ఎప్పుడు అవతరిస్తుంది?? అది అవతరించేవరకు ‘్భతిక స్వచ్ఛ భారత్’ పునరుద్ధరణ అసంభవం. ఈ వీధిలో ఊడ్చిన చెత్తను ఆ వీధిలో పోయడం వల్ల ‘స్వచ్ఛ భారత్’రాదు.. తిమింగలాల వందల మృతదేహాల వార్త మాసిపోకముందే తమిళనాడు తీరానికి వేలాది ‘తాబేళ్ల’ మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి. కూర్మావతారం ‘కుదురు’.. భారతీయ మానస క్షీర మథనానికి ఈ ‘తాబేలు’ యుగాలుగా ‘కుదురు’. ‘కుదురు’ను బహుళ జాతీయ సంస్థలు పగులగొట్టాయి. అందువల్ల ‘కుదురు’ లేదు, ‘కవ్వం’ లేదు, చిలకడమూ లేదు. ‘ప్లాస్టిక్’ పొట్లాలలోని రసాయనపు వాసనల మజ్జిగను కొని తాగుతున్నాము!! పాల స్వచ్ఛత చెడింది, పాపాయిల స్వచ్ఛత ‘రాగి’ తేలిపోతోంది!!
నాలుగు లక్షల టన్నుల ‘రాగి’ ఒకేచోట ఉత్పత్తి కావాలా? వంద కిలోల లేదా వెయ్యి కిలోల ‘రాగి’ని మాత్రమే ఉత్పత్తిచేయగల చిన్న పరిశ్రమలను వేల పరిశ్రమలను దేశమంతటా నెలకొల్పడానికి వీలైన వ్యవస్థను అత్యాధునిక పరిజ్ఞానంతో పునరుద్ధరించలేమా?? అలాంటి వికేంద్రీకృత పరిశ్రమల వ్యవస్థ ఈ దేశంలో ఒకప్పుడు ఉండేది. ఒక్కొక్క ‘బట్టీ’లో ఒక్కొక్క పల్లెలో ‘వీసెడు’ లేదా ‘మణుగు’ చొప్పున ‘రాగి’, ‘ఉక్కు’, ‘కంచు’, ‘ఇత్తడి’ తయారయ్యేవి. ఈ ‘వికేంద్రీకృత’మైన బట్టీలలో తయారైన ‘లోహాల’తో ఓడలు నిండేవి. ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యేవి. అత్యాధునిక విజ్ఞానం వల్ల ‘స్టెరిలైట్ రాగి’ వంటి ‘రాక్షసి’ సంస్థలు మాత్రమే ఏర్పడాలా? ఈ విజ్ఞానం గ్రామగ్రామాన చిన్నచిన్న ‘రాగి’బట్టీలను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడదా? సువర్ణ శోభల భారతీయ స్వచ్ఛత ‘రాగి’తేలుతోంది.. ‘తాబేళ్ల’ను కాలుష్యం కాటేసిన సంగతిని మరచిపోకముందే లక్షలాది కోట్లాది చేపల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొని వస్తున్నాయి..
‘స్వచ్ఛ భారత్’ చిరునామా ఎక్కడ?