సంపాదకీయం

సింగపూర్ రంగస్థలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవీయ నైతిక నిష్ఠను అక్రమ వాణిజ్య సామ్రాజ్య విస్తరణ విలాసం- ఫాషన్- ఆవహించి ఉండడం అమెరికా, ఉత్తర కొరియాల మధ్య కుదిరిన ఒప్పందానికి నేపథ్యం. ఈ ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియా ప్రభుత్వం అణ్వస్త్ర నిర్మాణ కార్యక్రమాన్ని, అణుపాటవ పరీక్షలు శాశ్వతంగా నిలిపివేస్తుంది. అణుపాటవ పరీక్షా ప్రాంగణాలను, అణ్వస్త్ర ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేస్తుందట! అమెరికా ప్రభుత్వం ఉత్తర కొరియా భద్రతను కాపాడుతుంది. ఇలా అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఒప్పందం కుదరడానికి ఉభయ దేశాల అధినేతలు సింగపూర్‌లో జరిపిన చర్చల వేదిక వెనుకనుంచి చైనా వాణిజ్య ఆధిపత్యం తొంగి చూసింది! ఈ ‘సింగపూర్ ఒప్పందం’ చైనాకు అమెరికాకు మధ్య, చైనాకు ఐరోపాకు మధ్య నడుస్తున్న ప్రాబల్య యుద్ధంలో వర్తమాన ఘట్టమన్నది ప్రచారం కాని ‘రహస్యం’. ఇలా మానవత్వం కంటె వాణిజ్యానికి అత్యధిక ప్రాధాన్యం సమకూడడం ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సింగపూర్‌లో మంగళవారం జరిపిన సమావేశానికి పూర్వరంగం! అణు నిరాయుధీకరణ- డిన్యూక్లియరైజేషన్-, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం- న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్- పేరుతో నడుస్తున్న తతంగం నిజానికి అమెరికా, చైనాల మధ్య నడుస్తున్న వాణిజ్య ఆధిపత్య సమరం. కొరియాను అటు జపాన్ ఇటు రష్యా, చైనాలు శతాబ్దుల తరబడి ముక్కలు చెక్కలు చేయడం చరిత్ర. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రెండుగా విడిపోయిన- నిజానికి అగ్రరాజ్యాల కుట్ర ఫలితంగా విభజనకు గురైన కొరియా ఇప్పటికీ పునరేకీకృతం కాకపోవడం చారిత్రక విషాదం. ఈ విషాదాన్ని సోవియట్ యూనియన్, అమెరికా, చైనాలు తమ ప్రాబల్య క్రీడగా మార్చుకోవడం 1950వ దశకం నుంచి కొనసాగుతున్న అంతర్జాతీయ తతంగం! 1991లో సోవియట్ యూనియన్‌లో కమ్యూనిజం అంతరించి రష్యాగాను, మరో పదునాలుగు దేశాలుగాను విడిపోయింది. 1950వ దశకం నుంచి దక్షిణ కొరియా- రిపబ్లిక్ ఆఫ్ కొరియా- అమెరికా ప్రాబల్య మండలంగా మారింది. ఉత్తర కొరియా- డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా- 1991 తరువాత చైనా ఆధిపత్య క్షేత్రంగా అవతరించింది. ఉత్తర కొరియా దశాబ్దులుగా అణుప్రయోగాలు జరపడం అణ్వస్త్ర నిర్మాణానికి యత్నించడం చైనా ప్రభుత్వ ‘ప్రచ్ఛన్న’ కార్యక్రమంలో భాగం. చైనా ప్రభుత్వం ఉత్తర కొరియాకు అణు పరిజ్ఞాన పదార్థాలను ఉపకరణాలను సమకూర్చింది, శిక్షణనిచ్చింది. అందువల్ల మంగళవారం ఉత్తర కొరియాకు, అమెరికాకు మధ్య కుదిరిన ‘అణు పాటవ’ నిరోధక ఒప్పందం నిజానికి అమెరికా, చైనాల మధ్య ఏర్పడిన తాత్కాలిక సయోధ్యకు చిహ్నం. ఉత్తర కొరియా చైనా ‘ఆడిస్తున్న బొమ్మ’! ఈ బహిరంగ రహస్యం తమకు తెలియనట్టు మూడు దేశాలూ అభినయించడం ఆధిపత్య సమరంలోని వాణిజ్య రహస్యం- ట్రేడ్ సీక్రెట్!!
ఒప్పందం కుదిరినప్పటికీ విశ్వాసం కుదరలేదు. సింగపూర్ ఒప్పందాన్ని ఉత్తర కొరియా అమలుజరుపుతుందా? లేదా? అన్న అనుమానం డొనాల్డ్ ట్రంప్ దొరను పీడిస్తోంది. ఉత్తర కొరియాపై తాము విధించిన ఆర్థిక, ఆయుధ ఆంక్షలను ఇప్పుడప్పుడే ఎత్తివేయడం లేదని అమెరికా ప్రకటించడం ఇందుకు నిదర్శనం. ఈ ఆంక్షలను అమెరికా రద్దుచేసినా చేయకపోయినా ఉత్తర కొరియాకు ఒరిగేది లేదు, ఎందుకంటె ఉత్తర కొరియాకు అవసరమైన ‘సర్వే సమస్తం’ చైనా నుండి సరఫరా అవుతోంది. అమెరికా ఆంక్షలను చైనా పాటించడం లేదు. ఆంక్షలను ఎత్తివేసినట్టయితే ఉత్తర కొరియాకు తమ సామగ్రిని అమ్ముకోవాలని ఉవ్విళ్లూరుతున్న అమెరికా వాణిజ్య సంస్థలకు మాత్రమే ఈ ఆంక్షల వల్ల నష్టం. తొంబయి శాతం ఉత్తర కొరియా వాణిజ్యం చైనాతో జరుగుతోంది! తమ దేశం నుంచి సింగపూర్‌కు ఉత్తర కొరియా అధినేత- ఛైర్‌మన్- కిమ్‌జోంగ్ ఉన్ చైనావారి విమానమెక్కి రావడం ఉభయ దేశాల మధ్యకల అవినాభావ సంబంధం. అందువల్ల ‘ఆంక్షల’ను వెంటనే ఎత్తివేయకపోవడం డొనాల్డ్ ట్రంప్ మేకపోతు గాంభీర్యం. ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ అమెరికా సంస్థల వస్తువులకు కొత్త గిరాకీ ఉండదు!
ఉత్తర కొరియా భద్రతకు అమెరికా ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడ ‘అజాగళ స్తనం.’ ఎందుకంటె అమెరికాతో తలపడడానికి చైనా కాని చైనాతో తలపడడానికి అమెరికా కాని సిద్ధంగా లేవు! ‘అణ్వస్త్రాల బెదిరింపులు’ సైతం ‘కుందేళ్ల పాలిట తాటాకు చప్పుళ్లు’గా మారి ఉండడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’ స్వరూపం, స్వభావం! అన్ని దేశాలలోను తమ వస్తువులను అమ్ముకోవడం అన్ని దేశాలలోను భారీగా తమ వాణిజ్య సామ్రాజ్యాలను నిర్మించి భారీగా భూమిని వేల లక్షల ఎకరాలలో కబ్జాచేయడం అమెరికా, చైనా సంస్థల లక్ష్యం. అమెరికా చైనాలమధ్య వాణిజ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. అన్ని దేశాలతోను ఈ దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’కు మైత్రి అవసరం! ఇలా మైత్రిని సాధించడం వల్ల మాత్రమే ‘సింగపూర్’ గొప్ప ధనిక దేశంగా ఎదిగింది. అక్రమ వాణిజ్య కలాపాలను సక్రమ కలాపాలుగా మార్చడానికి అంతర్జాతీయ దళారీ సంస్థలు ‘సింగపూర్’ను ‘సంగమస్థలి’గా వాడుకొంటున్నాయి. ఈ ‘సంత’-వాణిజ్య సంగమ స్థలి-ను ఏర్పాటు చేయడం పాశ్చాత్య దేశాల కుట్ర. చైనా రష్యాలకు సైతం ఈ ‘సంత’ అనుకూలం కావడం దశాబ్దుల చరిత్ర! ‘మలయా’ దేశంలో భాగంగా ఉండవలసిన ‘సింగపూర్’ స్వతంత్ర దేశంగా ఏర్పడడం ఈ కుట్ర. అంతర్జాతీయ ‘దళారీ’ సంస్థలకు ‘సింగపూర్’ అనుబంధ ప్రాంగణం- ఔట్‌పోస్ట్-గా ఏర్పడి ఉంది. జెనీవా, జకార్తా, వియెన్నా వంటిచోట్ల జరగవలసిన ఇలాంటి శాంతి సమావేశాలు సింగపూర్‌లో జరగడం ప్రపంచీకరణ ప్రభావం. ‘రాజకీయాల’కంటె వాణిజ్యానికి పెరిగిన అంతర్జాతీయ ప్రాధాన్యం ఇది. ఈ సమావేశం నిర్వహణకు సింగపూర్ ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను- కోటిన్నర డాలర్లను- ఖర్చు చేసిందట. వాణిజ్య సంస్థలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించినట్టు- స్పాన్సరింగ్! ‘కిమ్‌జోంగ్ ఉన్ ఫలానా హోటల్‌లో బసచేసాడు, డొనాల్డ్ ట్రంప్ ఫలానా హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నాడు. ఫలానా హోటల్‌లో ఉభయుల సమావేశం జరిగింది..’ ఇదీ వాణిజ్య ప్రకటన! ఆయా హోటళ్లలో ఉండే సౌకర్యాలకు అంతర్జాతీయ ప్రచారం!
గత నెలలో సింగపూర్ సమావేశాన్ని రద్దుచేసినట్టు ప్రకటించి ట్రంప్ మళ్లీ ఎందుకని మనసు మార్చుకున్నాడు? చైనాతో జరుగుతున్న ప్రచ్ఛన్న సమరం ప్రత్యక్ష సమరం కావడం అతగాడికి ఇష్టం లేదు. చైనాదీ ఇదే విధానం. అందువల్లనే చైనా దక్షిణ కొరియా అధినేతను ఒప్పించింది. కొరియాలు రెండూ మళ్లీ ఏకీకృతం కావడం నిజమైన శాంతికి ప్రాతిపదిక. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అగ్రరాజ్యాలు కొరియాను అడ్డంగా చీల్చారు. తల్లిదండ్రులు దక్షిణ కొరియాలోను పిల్లలు ఉత్తర కొరియాలోను మిగిలారు. బంధువులు, కుటుంబ సభ్యులు, ఒకే గ్రామం వారు పట్టణం వారు చెల్లాచెదరై ఉన్నారు. ఒక దేశం వారితో కలవడానికి కాని, ఒక కొరియావారు మరో కొరియాలో పర్యటించడానికి కాని అనుమతించని రాక్షస రాజకీయం దశాబ్దుల కొరియా చరిత్ర... అందువల్ల శాశ్వత పరిష్కారం- సింగపూర్ సంతలో కుదిరిన ఒప్పందం కాదు, ఉభయ కొరియాల ప్రజల పునరేకీకరణ.