సంపాదకీయం

‘కల్తీ’కి కారణం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహార పదార్థాలను ‘కల్తీ’ చేసేవారికి యావజ్జీవ కారాగార నిర్బంధాన్ని విధించాలన్నది ప్రతిపాదన. దేశంలోని ఆహార, పానీయ పదార్థాలలో దాదాపు అన్నీ ‘కల్తీ’ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన వెలువడడం హర్షణీయం. ‘్భరత ఆహార స్వచ్ఛత, ప్రమాణాల పరిరక్షణ సంస్థ’- ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-వారు చేసిన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే కల్తీచేస్తున్న ముఠాలకు, వ్యాపారులకు ఎంతోకొంత భయం ఏర్పడుతుంది. వ్యాపారులు, పంపిణీదారులు, ఉత్పత్తిదారులు, దళారీలు రకరకాల పద్ధతులలో దేశమంతటా భయంకరమైన ‘కల్తీ’చేస్తున్నారు. కల్తీ పదార్థాలను తింటున్న జనం రకరకాల రోగాలకు గురికావడం తాత్కాలిక పరిణామం, రోగగ్రస్తులు మరణించడం దీర్ఘకాల పరిణామం. కల్తీ చేస్తున్న నేరస్థులకు కనీసం ఏడేళ్లు జైలుశిక్ష విధించాలని నిర్దేశిస్తూ 2006 నాటి ‘ఆహార స్వచ్ఛత, ప్రమాణాల చట్టాన్ని’ సవరించాలని భారత ఆహార స్వచ్ఛత ప్రమాణాల పరిరక్షణ సంస్థ- ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ- వారు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారట. కల్తీ తీవ్రతను బట్టి యావజ్జీవ కారాగార శిక్షను కూడ నేరస్థులకు విధించాలని చట్టంలో నిర్దేశించాలన్నది ‘సంస్థ’ ప్రతిపాదన. నేరస్థులకు పది లక్షల రూపాయల వరకు జరిమానా విధించాలని కూడ సంస్థ ప్రతిపాదించింది. చట్టం చేయడం వల్ల ‘కల్తీ’ నేరాలను నిరోధించడానికి వౌలిక ప్రాతిపదిక ఏర్పడుతుంది. కానీ ఆహార పదార్థాలు వివిధ దశలలో ‘కల్తీ’ అవుతున్నాయి. ఉత్పత్తిదారులు కల్తీ చేస్తున్నారా? పంపిణీ దశలో కల్తీ అవుతోందా? వినియోగదారులకు అమ్ముతున్న దుకాణదారు కల్తీ చేస్తున్నాడా? అన్నది కచ్చితంగా కనిపెట్టగల వ్యవస్థ, సాధనాలు ఇంతవరకు ఏర్పడలేదు. ప్రముఖ ‘ఆహార శుద్ధి సంస్థల’ పేర్లతో ముద్రించిన కాగితాలతో అందంగా ఆకర్షణీయంగా పొట్లాలు- పాకెట్స్- తయారుచేసి, పంపిణీ చేసిన ముఠాల గుట్టురట్టయింది. రట్టుకాని ముఠాలు ఎన్ని ఉన్నాయో? ప్లాస్టిక్ పదార్థాలతో ఎఱువులను, పురుగుల మందులను, సబ్బులను కలిపి సుగంధ ద్రవ్యాలను చేర్చి పాలను, నెయ్యిని, నూనెలను తయారుచేసిన ముఠాలు బయటపడినాయి. ఎముకలను ఉడకబెట్టి నెయ్యిని, నూనెలను తయారుచేసి ‘టిఫిన్ సెంటర్ల’కు విక్రయిస్తున్న ముఠాల గుట్టు బయటపడింది. స్వచ్ఛమైన ఆహారాన్ని నాసిరకం పదార్థాలతో కలిపి అమ్ముతున్న దుకాణం నిర్వాహకులు కూడ వేలాదిగా బయటపడ్డారు. కానీ చివరికి నేరం ఋజువుకాక ఈ భయంకర వాణిజ్య బీభత్సకారులలో అత్యధికులు న్యాయస్థానాలలో నిర్దోషులుగా నిగ్గుతేలుతున్నారు. అందువల్ల ‘కల్తీ’ కామందులు విస్తరించారు!
ఇలా ఇది ‘కల్తీ’యుగం..! సృష్టిగత కాలగణనలో ప్రస్తుతం ‘కలియుగం’ నడుస్తోందన్న ధ్యాస ‘చదువుకున్న వారి’లోను, ‘చదువుకుంటున్న’ వారిలోను చాలామందికి లేదు! ‘చదివిన వారి’కి బ్రిటన్ దురాక్రమణదారులు మన నెత్తికెత్తిపోయిన ‘క్రీస్తుశకం’ ధ్యాస మాత్రమే ఉంది. మన ‘జాతీయ శకం’ శాలివాహన శకమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఉంది, అరవై ఒక్క ఏళ్లుగా ఈ జాతీయ శకాన్ని ‘ఆకాశవాణి’లోను ఆ తరువాత ‘దూరదర్శన్’లోను ప్రభాత ప్రసారాల ఆరంభంలో చెబుతున్నారు కానీ- ‘ఇది ఏమిటోలే.. మనకెందుకు?’ - అన్న ధోరణి ‘చదివిన’ వారి బుద్ధిని ఆవహించి ఉంది. కలియుగంలో ఇది 5,120వ సంవత్సరమని, జాతీయ శకం ప్రకారం ఇప్పుడు 1940వ సంవత్సరం నడుస్తోందని విద్యావంతులలో అధికులకు తెలియకపోవడానికి కారణం బ్రిటన్ దొరలు చేసిన ‘కల్తీ’. భారతీయుల బుద్ధి‘కల్తీ’ అయి ఉండడం అన్ని జీవన రంగాలలోను జరిగిన ‘కల్తీ’కి కారణం. ‘కల్తీ’ కనిపించడం లేదు, ‘కాటు’మాత్రం వేస్తోంది. మనం తింటున్న తిండి, తాగుతున్న నీరు, పీలుస్తున్న గాలి కల్తీ అయిపోయాయి. భూమి విష రసాయనాలతో కల్తీ అయింది. ప్రకృతి పరిసరాలు ‘ప్లాస్టిక్’తో కల్తీ అయిపోయాయి. పాలు మాత్రమే కల్తీ కాలేదు, ఆవులు కల్తీ అయ్యాయి. స్వచ్ఛమైన ఆహార పదార్థాలను ‘శుద్ధి’- ప్రాసెసింగ్- ప్రక్రియ పేరుతో ‘పరిమిత’ రసాయనాలతో కల్తీ చేస్తున్నారు. ఇలా ‘పరిమితి’కి మించని రీతిలో కృత్రిమ రసాయనాలను వాడడానికి ప్రభుత్వమే అనుమతించింది. ‘పరిమితి’ని మించి రసాయనాలను వాడినప్పుడు మాత్రమే చట్ట ప్రకారం అది ‘కల్తీ’ అవుతోంది. కాయలను ‘బలవంతంగా మగ్గబెట్టి’ పండ్లుగా మార్చుతున్నారు. ఈ ప్రక్రియకు ‘ఎథిలిన్’ అన్న రసాయనాన్ని, వాయువును వాడడానికి ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి. ఇది ‘చట్టబద్ధమైన’ కల్తీ! కానీ వ్యాపారులు, కొన్ని సందర్భాలలో రైతులు కూడ ‘కాల్షియం కార్బయిడ్’ అన్న విషం కలిసిన ‘ఎథిలిన్’ను వాడుతున్నారు. ‘పరిమితి’కి లోబడి ‘ఎథిలిన్’ను అనుమతించడం ద్వారా ప్రభుత్వమే ‘కల్తీ’చేయడం లేదా?
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆహార శుద్ధి ప్రక్రియ- ఫుడ్ ప్రాసెసింగ్-లో వందల రకాల ‘రసాయనాలు’ వాడుతున్నారు. వీటిని ‘ప్రిజర్వెంట్స్’- ఆహారం నెలల తరబడి నిలువ ఉండడానికి దోహదం చేసే రసాయనాలు-, ‘ఫ్లేవర్స్’- మంచి వాసనలు- అన్న పేర్లతో చట్టబద్ధం చేశారు. ఈ ‘ప్రిజర్వెంట్స్’, ‘ఫ్లేవర్స్’ నిజానికి విష రసాయనాలు. ఒక్కసారి ప్రాణం తీయవు, దీర్ఘకాలం పాటు ప్రభావితం చేసి, రకరకాల వ్యాధులను కలిగిస్తున్నాయి. ‘ప్లాస్టిక్ బియ్యం’ కూడ విపణి వీధులను కల్తీచేసినట్టు ప్రచారమైంది. ‘నెజల్’- నెస్లే బహుళ జాతీయ వాణిజ్య సంస్థవారు తయారుచేస్తున్న ‘చాక్లెట్ల’లో లేత ఆవుల దూడల మాంసం పదార్థాలు- రెనె్నట్- కల్తీ అయినట్టు పదకొండేళ్ల క్రితమే ప్రచారమైంది. ఈ ‘కిట్‌క్యాట్’ అన్న చాక్లెట్లను భారతదేశంలో విక్రయించరాదని తాము నిర్దేశించినట్టు సంస్థ యాజమాన్యం ఆ తరువాత వివరణ ఇచ్చిందట! ‘నిషిద్ధ’ చాక్లెట్లు మన దేశంలోకి ఎలా వచ్చాయి? బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ‘పెప్సీకో’ ‘కోకో కోలా’ తయారుచేస్తున్న శీతల పానీయాల నిండా క్రిమిసంహారక విషాలు నిండి ఉన్నట్టు పదిహేను ఏళ్లక్రితమే ధ్రువపడింది. ఎవ్వరూ ఈ దుర్మార్గపు సంస్థలను శిక్షించిన దాఖలా లేదు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్‌లోని ‘శ్రీనగరం’లో వీటిలో ఒక సంస్థకు అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం ఏర్పడి ఉందట! భారతీయ ప్రమాణాల సంస్థ- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్- బిఐఎస్-వారు అనుమతించిన పరిమాణం కంటె ‘ఇరవైనాలుగు రెట్లు’ వరకు అధికంగా ఈ సంస్థల శీతల పానీయాలలో క్రిమి సంహారక రసాయనాలు ఉన్నట్టు 2013లో ధ్రువపడింది. కొన్ని సీసాలలోని పానీయాలలో ‘లిండేన్’ అన్న విష రసాయనం అనుమతించిన పరిమాణం కంటె- నూట నలబయి రెట్లు అధికంగా ఉన్నట్టు ‘శాస్త్ర అధ్యయన, పర్యావరణ సంస్థ’- సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్- సిఎస్‌ఇ-వారు 2004 ఆగస్టులో వెల్లడించారట! ‘న్యూట్రోటాక్సిన్’, ‘క్లార్పిరిషోస్’ అన్న రసాయనాలు కూడ రెండువందల రెట్లు ఉన్నట్టు ఈ సంస్థ ధ్రువీకరించింది. ‘హెప్టాక్లోర్’ అన్న రసాయన విషాన్ని మన దేశంలో అమ్మరాదట, వాడరాదట. కానీ ‘కోకో’, ‘పెప్సీ’ పానీయాలలో ఈ ‘విషం’ కూడ కలిసి ఉన్నట్టు 2006లో ధ్రువపడింది.
ఇలాంటి విష రసాయనాలు ‘కాన్సర్’ వ్యాధిని కలిగించగలవు. ఈ కార్సినో జెనిక్- కాన్సర్ వ్యాధిని కలిగించే- పదార్థాలు కలిసిన పానీయాలను వినియోగదారులు సీసాలతో, పీపాలతో తాగేస్తూనే ఉన్నారు. చట్టం చేయటంతోనే సరిపోదు. ‘అనుమతించిన ప్రమాణంలో ఈ విషాలను ‘ప్రిజర్వెంట్స్’గాను ‘ఆర్ట్ఫిసియల్ ఫ్లేవర్స్’గాను వాడవచ్చునన్న విధానం మారాలి! ఎలాంటి రసాయనాలను కలుపని రీతిలో ‘ఆహార శుద్ధి’ ప్రక్రియను వ్యవస్థీకరించాలి. వేల ఏళ్లుగా భారతీయ గృహాలలో నాయనమ్మలు, అమ్మమ్మలు ఎలాంటి రసాయన విషాలు కలుపకుండా ‘శుద్ధి’ ప్రక్రియ ద్వారా నెలల తరబడి నిలువ ఉండే ఆహార పదార్థాలను తయారుచేశారు. ఆవకాయలు, అప్పడాలు, వడియాలు, ఒరుగులు, బొరుగులు, అటుకులు, పేలాలు, మసాలాలు.. మరి ఇప్పడు శుద్ధిప్రక్రియను ‘రసాయనాల’తో ఎందుకు కల్తీ చేయాలి? ప్రభుత్వాలు ఎందుకు అనుమతి ఇవ్వాలి??