సంపాదకీయం

సీసాల నీటి ‘చిత్రం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రాంతం ‘ప్రతీక’ మాత్రమే. మంచినీటి కాలుష్యం గురించి హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం వారు సోమవారం ఆవిష్కరించిన వాస్తవాలు తెలుగు ప్రాంతాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు సమానంగా వర్తిస్తున్నాయి. ‘ఖనిజధాతు జలం’- మినరల్ వాటర్- పేరుతో జనం నోళ్లలోకి, కడుపులలోకి ప్రవహిస్తున్న నీరు కలుషితమై ఉందన్నది బహిరంగ రహస్యం. ఈ కఠోర వాస్తవం గురించి ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి టి.బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి వి.రామసుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ఈ వాస్తవానికి సరికొత్త ధ్రువీకరణ! నీటిని దేశవ్యాప్తంగా దోపిడీ చేస్తున్న వాణిజ్య సంస్థలకు తీవ్ర అభిశంసన, ప్రభుత్వాల దశాబ్దుల వైఫల్యం పట్ల నిరసన!! సీసాలలో నింపిన నీరు- బాటిల్డ్ వాటర్-ను ఖనిజ ధాతువులతో నిండిన ఆరోగ్యదాయకమైన నీరు- మినరల్ వాటర్-గా చెలామణి చేస్తున్న సంస్థలను నియంత్రించడానికి చేపట్టిన చర్యల గురించి రెండు రోజుల్లోగా వివరాలను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించడం హర్షణీయ పరిణామం. తెలంగాణ ప్రభుత్వం ‘కిన్ లే’ అన్న సంస్థకు వ్యతిరేకంగా చర్యలను చేపట్టింది. ఈ ‘కిన్ లే’ సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా నీళ్లను సీసాలకెత్తి జనం నోళ్లకెత్తుతోందన్నది తెలంగాణ ప్రభుత్వం వారి ఆరోపణ. హైకోర్టు వ్యాఖ్యలతో ‘బిస్లరీ’ అన్న మరో నీటి వ్యాపార సంస్థకు వ్యతిరేకంగా సైతం తెలంగాణ ప్రభుత్వం చర్యలను చేపట్టవలసి వస్తోంది. ‘తీగె లాగితే డొంక మొత్తం కదిలింది..’ ‘కిన్‌లే’ వారు సరఫరా చేస్తున్న ‘నీటి సీసా’లపై ఉత్పత్తిదారుల, విక్రేతల చిరునామా కానీ సంబంధిత వివరాలు కానీ ప్రదర్శించడం లేదన్నది తెలంగాణ ప్రభుత్వం వారు ఉన్నత న్యాయస్థానంలో చేసిన నివేదన. ‘బిస్లరీ’ అన్న ఘరానా సంస్థవారు కూడ తమ ‘నీటి సీసా’లపై ఇలాంటి సంబంధిత వివరాలను ప్రదర్శించడం లేదన్నది ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సోమవారం స్వయంగా చేసిన ఆవిష్కరణ..
బస్సులలోను, రైళ్లలోను, ఇతర చోట్ల, జనం ఎక్కువగా గుమికూడే ప్రతిచోట మంచినీరు అమ్ముతుండడం ఆధునిక నాగరిక వ్యవస్థలోని జీవన ‘విలాసం’- ఫ్యాషన్-! ఒకప్పుడు గ్రామాలలో కూరగాయలు పాలు పెరుగు వంటివి అమ్మేవారు కాదు. వీటిని వాణిజ్య వస్తువులుగా మార్చడం భారతీయ గ్రామీణులకు తెలియని విద్య! పెద్ద నగరాలలో పట్టణాలలో బహుశా అమ్మేవారు. గ్రామాలలో మాత్రం ఎవరికివారు కూరగాయలు పొలంలోను, పెరడులలోను ఉత్పత్తిచేసుకొనేవారు. అన్ని రకాల ఆకుకూరలు ప్రతి పల్లెలోను సమృద్ధిగా లభించేవి. ప్రతి ఇంటా ‘పాడి’ సమృద్ధిగా ఉండేది. కానీ పండించలేని వారికి, పాడి పశువులు లేని వారికి ఉన్నవారు ఉచితంగా ఇచ్చేవారు. అందువల్ల మంచినీరు అమ్మడం అన్నది కొన్ని దశాబ్దుల క్రితం వరకూ భారతీయులు ఊహించని వ్యవహారం. ఆంగ్లేయుల పాలన ఫలితంగా జరిగిన పాశ్చాత్య భావ వ్యవస్థీకరణ, ఆంగ్లేయులు నిష్క్రమించిన తరువాత మరింత ముదిరింది. ఇలా ముదిరిన ఫలితమే మంచినీరు సైతం విక్రయ వస్తువుకావడం. సంస్కృతి- సంస్కారాల సమాహారం- భారతదేశ స్వభావం కావడం అనాది చరిత్ర. ఈ చరిత్రను బ్రిటన్ వాణిజ్య రాజకీయ తస్కర ముష్కర మూకలు చెరిచిపోయాయి. అందువల్ల మన జాతీయ స్వభావం నుంచి సంస్కార సమాహారం క్రమంగా తొలిగి ‘వాణిజ్యం’ చొరబడి పోయింది. తాగే నీళ్లను సైతం అమ్మడం ఆరంభమైంది. ‘విక్రయించడం’, ‘కల్తీ చేయడం’ కవల పిల్లలన్నది పాశ్చాత్య వాణిజ్య దురాక్రమణకారులు వ్యవస్థీకరించిన నీతి. ఈ అవినీతి వాణిజ్య ‘ప్రపంచీకరణ’ ఫలితంగా మరింత విస్తరించింది. నీటి వ్యాపారం జనాన్ని దోచుకోవడానికి సులభమైన ఉపాయం..! నీరు అత్యంత వౌలికమైన అవసరం కాబట్టి! పాలు లేకపోయినా జీవించవచ్చు..
నీటి దోపిడీకి మరో రూపం శీతల పానీయాల అమ్మకం! ‘పెప్సీ’, ‘కోకో’ వంటి సంస్థలు ఉత్పత్తి చేస్తున్న శీతల పానీయాలలో శరీరానికి పుష్టిని చేకూర్చే పదార్థాలు సున్న. తీయటి విష రసాయనాలకు ఆకర్షణీయమైన రంగులు వేసి జనాన్ని ప్రలోభపెడుతున్నారు. కల్తీ నీరు చేస్తున్న హాని కంటె ఈ శీతల పానీయాలు తాగడం వల్ల జరుగుతున్న ప్రమాదం ఎక్కువ. సీసాలకొద్దీ పీపాలకొద్దీ కృత్రిమ పానీయాలు తాగుతున్నవారు క్రమంగా చిత్రవిచిత్రమైన రోగాలకు గురవుతుండడం ప్రచారం కాని వాస్తవం! కొబ్బరి నీరు, చెఱకు, పాలు, పండ్ల రసాలు తాగడం గతమైపోతోంది. ఈ శీతల పానీయ విష రసాయనాలను సేవించడం విలాసమైపోయింది. శీతల పానీయాల కర్మాగారాలు వెలసినచోట భూగర్భ జలాలు లుప్తమైపోతున్నాయి, భూగర్భం ఎండిపోయింది. అయినప్పటికీ దశాబ్దుల తరబడి దేశమంతటా ప్రభుత్వాలు నీటి కర్మాగారాలకు, శీతల పానీయాల కర్మాగారాలకు అనుమతినిస్తూనే ఉన్నాయి.. ‘శ్రీసిటీ’ అన్నది తెలుగు పేరు-ట-! భాష ఇలా ‘కల్తీ’ అయిపోయింది. ‘శ్రీ సిటీ’వద్ద అతిపెద్ద శీతల పానీయాల ఉత్పత్తి కర్మాగారం ఏర్పడడం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గొప్ప గర్వకారణం. తీయని రసాయనాల రంగు నీరు ఎంత ఎక్కువ తాగిస్తే అంత గొప్ప. నీటి ‘కల్తీ’కి పరాకాష్ఠ ఈ రంగురంగుల విషపు నీరు, శీతల పానీయాలు! తెలిసి తెలిసి తాగేస్తున్న జనం ‘కల్తీ’ని ప్రోత్సహిస్తున్నారు! అనేక శీతల పానీయాలలో ఎంతోకొంత మద్యం- ఆల్కహాల్- కలసి ఉందట! ‘ప్లాస్టిక్’ సీసాలలో నిలువ ఉంచిన నీరు తాగడం వల్ల రోగాలు దాపురిస్తున్నాయని అనేక పరిశోధనలలో ధ్రువపడింది. కానీ ప్లాస్టిక్ నీరు తాగడం దాదాపు అన్ని ఇళ్లలోను- పల్లెలలో సైతం- నిత్యకృత్యం అయిపోయింది. నీటి వనరులను వాణిజ్య ప్రాతిపదికగా చేసుకోవాలన్నది అంతర్జాతీయ అనుసంధానంలో భాగమైపోయింది. ‘ప్రపంచీకరణ’ ‘స్వేచ్ఛా వాణిజ్యం’- మార్కెట్ ఎకానమీ- విస్తరింపచేస్తున్న మాయాజాలం ఇది. ప్రవర్ధమాన దేశాలలో మంచినీటిని, సేద్యపు నీటిని అమ్మడం ద్వారా భారీ లాభాలను గడించాలన్నది సంపన్న దేశాల వాణిజ్య సంస్థలు అమలు జరుపుతున్న అంతర్జాతీయ అనుసంధానంలో భాగం. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2010 ఏప్రిల్‌లో ‘ప్రపంచ బ్యాంకు’ ఒక ఉన్నతస్థాయి అనధికార సమావేశం నిర్వహించింది. అనధికార సమావేశం కాబట్టి అన్ని దేశాల ప్రతినిధులనూ పిలవలేదు. సంపన్న దేశాల ప్రతినిధులు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ప్రతినిధులు ‘గుమికూడి’ నీటి వ్యాపారం గురించి చర్చించారట! ప్రపంచంలో మంచినీటి సౌకర్యానికి నోచుకోని వంద కోట్ల మందికి నీరు అమ్మడం గురించి ఈ ‘దోపిడీ’ సంస్థల ప్రతినిధులు చర్చించారు. కానీ చౌకగా నీటిని అమ్మినట్టయితే జనం నీటిని వృథా చేస్తారట! అందువల్ల సీసాల నీటి ధరను పెంచాలన్నది ‘ప్రపంచీకరణ’ శక్తులు ఆ సమావేశంలో చేసిన నిర్ణయం..
‘కిన్‌లే’ సంస్థ నిబంధనలను ఉల్లంఘించిందన్న అభియోగంపై తెలంగాణ ప్రభుత్వం మెదక్ జిల్లాలోని ఆ సంస్థవారి ‘సీసా’ల నీటి ఉత్పత్తి కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానం సమీక్షిస్తోంది. సోమవారం నాటి వాదోపవాదాల సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ‘బిస్లరీ’ సీసాల నీటి గుట్టును రట్టుచేశారు. హైకోర్టు ‘కాంటీన్’ నుంచి ఒక ‘బిస్లరీ’ నీటి సీసాను ప్రధాన న్యాయమూర్తి తెప్పించాడట! ఈ ‘సీసా’మీద కూడ ఉండవలసిన వివరాలు లేవని ప్రధాన న్యాయమూర్తి కోర్టులో ప్రకటించారు. ‘కిన్‌లే’ చేసిన నేరాన్ని ‘బిస్లరీ’ కూడ చేసింది. దేశవ్యాప్తంగా ఇంకెన్ని సంస్థలు ఇలా నిబంధనలను నీరుకార్చుతున్నాయో??