సంపాదకీయం

ధ్వని బీభత్సం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాలల సమీపంలోని రహదారుల మీద పరుగులు తీసే వాహనాలు ‘కూతలు’ వేయరాదన్నది ఆదర్శం! ఈ ఆదర్శం ఇన్ని దశాబ్దులుగా ఆచరణకు రాలేదన్నది ఇప్పుడు బయటపడిన వాస్తవం. తెలంగాణ ప్రాంతంలోను ప్రధానంగా రాజధాని భాగ్యనగరంలోను బడులలోని బుడుతలు ఇన్నాళ్లుగా ఈ వాహన యంత్రాల ‘కారు’కూతలను వింటూనే ఉన్నారన్నది హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం వారి దృష్టిని ఆకర్షించిన వైపరీత్యం. ఈ వైపరీత్యం గురించి, ‘‘బొయ్ బొయ్’’మని వాహన చోదకులు పాఠశాలల సమీపంలో ‘కొమ్ము’- శృంగం- హార్న్-లను మోగించడం గురించి హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి డాక్టర్ విపిన్ శ్రీవాత్సవ ఉత్తరం వ్రాశాడట! పాఠశాలల సమీపంలో మాత్రమే కాదు, వైద్యశాలల సమీపంలోను, జనావాస ప్రాంగణాల- రెసిడెన్షియల్ కాలనీస్-లోను గార్ద్భ స్వరాల వంటి, శునక రోదనల వంటి చిత్ర విచిత్ర ‘శృంగాల’ను మోగిస్తున్న విచక్షణ శూన్యులైన వాహన చోదకులు ప్రశాంతికి భంగం కలిగిస్తున్నారు. ఈ ధ్వని కాలుష్య బీభత్సం గురించి ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చిన భూతపూర్వ ఉపకులపతి శ్రీవాత్సవ అభినందనీయుడు. ఈ వికృత రవాల గురించి దేశంలోని అన్ని పట్టణాలలోని నగరాలలోని ప్రజలందరికీ తెలుసు. అందరూ వింటూనే ఉన్నారు. అందరూ ‘వౌనం’ వహిస్తుండడం, వౌనంగా సహిస్తుండడం, ధ్వని బీభత్సాన్ని అనుభవిస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఈ చరిత్రను గురించి తన ఉత్తరంలో వివరించిన వాడు డాక్టర్ శ్రీవాత్సవ! ఉన్నత న్యాయస్థానం వారు ఈ ఉత్తరాన్ని ‘ప్రజాప్రయోజన వివాదం’- పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్- పిల్-గా పరిగణించి విచారణ చేపట్టడం ముదావహం. పాఠశాలలు వైద్యశాలలు జనావాసాలు నెలకొన్న స్థలాలను ‘శృంగచాలన నిషిద్ధ ప్రాంగణాలు’- నో హాంకింగ్ జోన్స్- గా ప్రకటించాలని ప్రభుత్వాలను ఆదేశించాలని డాక్టర్ శ్రీవాత్సవ తన ఉత్తరంలో ఉన్నత న్యాయస్థానం వారిని అభ్యర్థించాడట. ఇలాంటి ప్రాంగణాలలోని రహదారులపై ఇష్టం వచ్చినట్టు ‘హార్న్’లను గట్టిగా మోగించి వికృత ధ్వనులతో బడిపిల్లలను, వ్యాధిగ్రస్తులను, ఇళ్లలోని ‘ఉయ్యాల’లోని పసిపాపలను, వృద్ధులను హడలగొడుతున్న వాహన చోదకులను కఠినంగా శిక్షించడానికి వీలైన నిబంధనలను రూపొందించ వలసిందిగా ప్రభుత్వాలను ఆదేశించాలని కూడ డాక్టర్ శ్రీవాత్సవ అభ్యర్థించడం ధ్వని కాలుష్యం పట్ల వారి నిరసనకు నిదర్శనం. చోదన- డ్రయివింగ్- నిబంధనలు సరిగా తెలియని వారికి ‘రహదారి రవాణా అధికారులు’ ‘చోదక అనుమతి పత్రం’ - డ్రయివింగ్ లైసెన్స్- మంజూరు చేయడం పట్ల కూడ శ్రీవాత్సవ ఆందోళనను వ్యక్తం చేశాడట... ప్రజాహితం పట్ల శ్రీవాత్సవకున్న తపనకు ఇదంతా నిదర్శనం.
శ్రీవాత్సవ ఉత్తరాన్ని ‘పిల్’గా స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం వారు కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ‘విస్తృత హైదరాబాద్’ నగర పాలిక- జిహెచ్‌ఎమ్‌సి- వారికి సమాధానం చెప్పవలసిందిగా ఆదేశాలను జారీచేశారట. ఈ ప్రభుత్వాలు సమాధానాలు చెప్పవలసి ఉంది. ఈ ధ్వని కాలుష్య సమస్యకు సర్వసమగ్రమైన పరిష్కారం కనుగొనాలన్నది ఉన్నత న్యాయస్థానం వారికి శ్రీవాత్సవ చేసిన విజ్ఞప్తి! చోదక అనుమతులను పొంది వాహనాలను నడుపుతున్న వారిలో చాలామందికి నియమాలను గురించి అవగాహన లేదు. అందువల్ల నియమాలను ఉల్లంఘిస్తున్నామన్న ధ్యాస కూడా వారికి లేదు. ఈ సంగతిని డాక్టర్ శ్రీవాత్సవ తమ ఉత్తరంలో పేర్కొన్నారట. ప్రధాన న్యాయమూర్తి టి.బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి వి.రామసుబ్రహ్మణ్యం పంపించిన ప్రశ్నలకు ప్రభుత్వాలు ఏమి సమాధానం చెప్పగలవు? సమాధానం ప్రభుత్వాల వద్ద లేదు. ఎందుకంటె పాఠశాలలు తదితర నిర్దిష్ట స్థలాల వద్ద ‘హార్న్ కొట్టరాదు..’- అన్న ప్రకటనలు దర్శనమిస్తూనే ఉన్నాయి. అయినా నిబంధనలను పట్టించుకోకుండా వికృత ధ్వనులతో బాదేస్తున్న వాహన చోదకులు ‘విబుధ దైత్యులు’, చదివిన రాక్షసులు! వీరిని నియంత్రించలేని ప్రభుత్వ యంత్రాంగానికి కారణం అవినీతి, క్రూరమైన నిర్లక్ష్యం..
పాల సముద్రంపై పడుకొని ఉండిన విష్ణుదేవుని బొడ్డులోని కమలపత్రం నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆ నాలుగు తలల పసిబాలుడు ప్రశాంతంగా కమల ప్రాంగణంలో ఆడుకున్నాడు. వెలుగును చూసి ఓర్వలేక పోవడం చీకటి లక్షణం. అందువల్ల ‘మధువు’ ‘కైటభుడు’ అన్న జంట రాక్షసులు రంగప్రవేశం చేశారు. మధుకైటభులు బ్రహ్మదేవుడు ఆడుకుంటూ ఉండిన ‘శతపత్ర’ పుష్పానికి ఇరువైపులా నిలిచారు, గట్టిగా అరిచారు. బ్రహ్మదేవుడు- పసిబాలుడు.. ఆ కర్ణకఠోర వికృత రావాలకు హడలిపోయాడు. వెంటనే చేతులతో చెవులను మూసుకున్నాడట. బ్రహ్మదేవునికి ఎనిమిది చెవులున్నాయి, చేతులు మాత్రం నాలుగే ఉన్నాయి. నాలుగు చేతులతో నాలుగు చెవులను మూసుకున్నాడు. కానీ మిగిలిన నాలుగు చెవుల ద్వారా ‘రాక్షస ధ్వనులు’ వినిపిస్తూనే ఉన్నాయి. అందువల్ల బ్రహ్మదేవుడు భరించలేక గట్టిగా ఏడ్చాడట! విష్ణుదేవునికి మెలకువ వచ్చింది! ఆ చరిత్ర ఇంకా ఉంది.. కానీ నిష్కారణంగా ‘అరచి’ హడలగొట్టడం మధుకైటభుల రాక్షస ప్రవృత్తి. వాహనాల ద్వారా ధ్వని కాలుష్యాన్ని సృష్టిస్తున్నవారు మధుకైటభుల వారసులు! రహదారిపై మనం మన వాహనంలో వెడుతుంటాము.. అకస్మాత్తుగా వెనుకనుంచి కుక్కలు గట్టిగా అరచిన ధ్వని వినిపిస్తుంది. ‘రోడ్డు మధ్యకు కుక్కలు చేరిపోయి అరుస్తున్నాయి..’ అని భావించి వెనక్కి చూసినట్టయితే అక్కడ కుక్కలుండవు. ఆ కుక్కల ధ్వని మన వెనుకనుంచి వస్తున్న వాహనం నుంచి దూసుకొని వస్తుంది. ఆ వాహనంలో సైతం కుక్కలు లేవు. అది వాహనానికి అమర్చిన ‘శృంగం’- హార్న్- మోగించినందువల్ల పుట్టుకొచ్చే ‘శునక రోదనం’..
ఇలాంటి శునక రావాలను వింటున్న చిన్నిపిల్లలు, బడిపిల్లలు తమ పాఠశాలలలోకి కరిచే కుక్కలు జొరబడిన విభ్రాంతికి గురవుతున్నారు. కుక్కల కూతలు మాత్రమే కాదు.. పిల్లికూతలు, భల్లూకాల గురగురలు, ఇంకా రకరకాల వికృత కంఠాల కూతలు ‘హార్న్’రూపం వలె, ‘రహదారుల’ను హడలగొడుతుండడం నడుస్తున్న వికృతి. ‘కార్ల’లోను ఇతర వాహనాలలోను వినబడుతున్న ఇలాంటి ధ్వనుల వల్ల వీధికుక్కలకు చెడ్డపేరు వస్తోంది. పాపం.. ఆ వీధికుక్కలు తోక ముడుచుకొని శరీరాన్ని ఉండచుట్టుకొని వీధుల పక్కన పడుకొని ఉంటాయి, ఎవరి జోలికీ వెళ్లవు. అలాంటి మూగజీవులకు అపకీర్తి తెస్తున్న వాహన చోదకులు మధుకైటభుల వారసులు. భాగ్యనగరంలోను ‘ఆటోరిక్షాల’ను, ‘క్యాబ్’లను ఎక్కి చూడాలి. ప్రయాణం చేస్తున్నంతసేపూ- ‘ఢమ ఢమ’మంటూ వికృత ‘‘సంగీతం’’ వినబడుతుంది. బస్సులలో మరింత వి‘చిత్ర’ వికృత సంగీతం... ‘‘ఢమ ఢమ చప్పుడురా...! ఢమాల్ ఢమాల్ ఢమాల్‌మని చప్పుడురా...! ఢమాలు చప్పుడు విన్నవారికి గుండెలందున నొప్పులురా....!’’