సంపాదకీయం

పతక ప్రతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడోత్సాహంతో మొదలై భావోద్వేగంతో ముగిసింది ఆసియా ఆటల జాతర. పతకాల జాతకాలు తేరిపార చూడాల్సిన తగవు లేకుండా- మళ్లీ చైనా, జపాన్, కొరియాలను ప్రస్తావించాల్సిన దృశ్యమే గోచరమైంది. మరి- భారత్ ఆకాంక్ష మాటేమిటి? ఆరంభ అంచనాలకు ముగింపు వాస్తవాలకు లంగరేది? అన్న ప్రశ్నకు మాత్రం తడబాటే సమాధానం. పతకాల లెక్కలు పక్కనపెడితే, పాఠాలు నేర్చుకునే అవకాశం సుసంపూర్ణం. క్రీడా సంరంభంలో ఒక దేశం సత్తా ‘మెడలు’ చుట్టూ పరిభ్రమించకూడదని కాసేపు తీర్మానించుకుంటే.. భారత్ బలాన్ని, బలగాన్నీ తక్కువ చేయలేం. 572 మంది అథ్లెట్లు... తర్ఫీదునిచ్చిన శిక్షకులు.. నడిపించే నిర్వాహకులు.. మంచిచెడ్డలు చూసే అధికారులు.. ఇలా ఎకాయెకిన తగు సరంజామాతో సంరంభానికి తరలివెళ్లిన దండు -అచ్చంగా ఎనిమిది వేలు. దశాబ్దాలుగా అసాధ్యమనుకున్న భిన్న క్రీడాంశాల్లో సత్తా చూపిన తీరూ పదివేలు. జాతీయ రికార్డులు బద్దలయ్యాయి, ఆసియా రికార్డులు తిరగబడ్డాయి. ఇలా- సంరంభంలో చరిత్ర సృష్టించిన ఆటగాళ్లకు వినమ్ర ప్రశంసలు. జకార్తా, పాలెంబాగ్ నుంచి విజయ దరహాసంతో అడుగిడుతున్న ఆటగాళ్లకు సాదర స్వాగతాలు. ఇనుపగుండు విసరడంలో ఆరితేరిన షాట్‌పుటర్ తేజిందర్ తూర్.. దవడ నొప్పిని దిగమింగుతూ ఏడు క్రీడాంశాలను ఏకబిగిన ప్రదర్శించిన హెప్ట్థ్లాన్ స్వప్న బర్మన్.. అవరోధాలను పాదాల కింద అదిమిపట్టి పరుగుల సునామీ సృష్టించిన ధుతీ చంద్.. ఈటె విసరడంలో మేటికాడైన నీరజ్ చోప్రా.. పట్టు సడలని కుస్తీని ప్రదర్శించిన బజరంగ్ పునియా.. ముష్టిఘాతాల సత్తా మసకబారనివ్వని వినీశ్ ఫొగట్.. కలల సాకారానికి కడపటి క్షణాలే కాల్బలం చేసుకున్న మన్జీత్ సింగ్... ఒకరేమిటి? ప్రపంచం కళ్లు పెద్దవి చూసేలా బహుముఖీన సత్తా ప్రదర్శించిన క్రీడా క్షిపణులు ఉపఖండానికి కొదువకాదు. పదో తరగతి పోరగాళ్లు సౌరభ్, ప్రణబ్‌ల ‘షూటింగ్’ గురి.. 60 ఏళ్ల వృద్ధులు బర్దన్, శిబినాథ్ ‘బ్రిడ్జి’బరి.. వయసుతో నిమిత్తం లేని భారత స్వయం క్రీడా ప్రతిభను చాటి చెప్పినోళ్లే. రక్తమోడుతూనే పాటవ ప్రదర్శనలో ప్రాణాలకు తెగించిన ఆర్మీ కుర్రోడు అమిత్ ఫంగల్‌ను మరువగలమా? భవిష్యత్ తరాలకు వీళ్లే గురువులు. క్రికెట్ మైకం వీడి సంప్రదాయ క్రీడలపై దృష్టి సారించే కుర్రతరానికి పెద్ద దేవుళ్లు. సందేహం లేదు.
ఆసియా సంరంభం ఆరంభ క్షణాల్లో దిగ్గజ చైనా చేసిన ప్రతిన -200 స్వర్ణాల సాధన. లక్ష్యానికి 70 పతకాల దూరంలో ఆగింది. అయినా -జపాన్, కొరియా సాధించిన మొత్తం స్వర్ణాలకంటే అధికం. భారత్ దక్కించుకున్న మొత్తం మెడల్స్‌కు రెండొంతులెక్కువ. పతకాల విషయంలో మన మాటలు ఆటల్ని దాటుతున్నాయి. అందుకే -తొట్టతొలిసారి స్వర్ణం లేకుండా కబడ్డీ జట్టు తిరిగొచ్చింది. సంచలనాల చరిత్ర ఉన్న హాకీ జట్టు రిక్తహస్తంతో దిక్కులు చూస్తోంది. సంప్రదాయ క్రీడ కుస్తీలోను, సహజ సిద్ధమైన ధనుర్విద్యలోనూ మన ఖ్యాతి మసకబారుతోంది. 2010 గ్వాన్ జౌ ప్రదర్శనను పుంజీడు పతకాలతో అధిగమించి 69లోకి అడుగుపెట్టామన్న గొప్పలు భారత్ ప్రతిభకు గీటురాళ్లు కానేకావు. పతకాల పట్టికలో మళ్లీ ఎనిమిదో స్థానానికే పరిమితమైన మనకు, ఆసియా ఖండంలో ఎవరికీ అందనంత అగ్రపీఠికన కుదురుకున్న చైనాకు మధ్య యోజనాల అంతరం ప్రస్ఫుటం. టోక్యో- 2020 ఒలింపిక్స్ లక్ష్యంగా 18వ ఆసియా క్రీడల్ని రిహార్సల్స్ చేసుకోవాలన్న చైనా ఆలోచనే భారత్‌ది కూడా. కాకపోతే అక్కడ అగ్రస్థానం. ఇక్కడ అష్టమస్థానం. న్యూఢిల్లీ వేదికగా 1951లో సాగిన తొలి ఆసియా సంరంభంలో సాధించిన ‘పసిడి పదిహేను’ పాటనే 18వ ఆసియా క్రీడల తరువాతా పాడుకునే దుస్థితిలో ఉండటం సిగ్గుచేటు. ‘ఈతలో అద్భుతాలు సృష్టిస్తున్న మేము తినేది కాయగూరలు, చేసేది కఠోర సాధనం’టూ అంతర్జాతీయ మీడియా ముందు మైకుపెట్టిన పదిహేనేళ్ల చైనా పసిదాని మాటల నుంచి భారత్ పాఠాలు నేర్వాలి. ఆసియాడ్‌కు కాళ్లుజాపి.. ఒలింపిక్స్ వైపుకళ్లుపెట్టి.. పతకాల కలలు కనడం మానాలి. నాలుగేళ్ల వయసు పిల్లలు నాలుగు లక్షల మంది నాలుగు దఫాల తరువాత వచ్చే ఒలింపిక్స్ కోసం చైనా స్కూళ్లలో కఠోర శిక్షణలో ఉన్నారు. మెరికల్లాంటి ఒలింపియన్ల సృష్టిలో బీజింగ్ తలమునకలై ఉంది. 32 కోట్ల జనాభా కూడా లేని అమెరికా 2,400 ఒలింపిక్ పతకాలు సాధిస్తే, 130 కోట్ల జనాభాతో కిటకిటలాడే భారత్ 30 ఒలింపిక్ పోటీల్లో దక్కించుకున్న పతకాలు కేవలం 26. ఈ గణాంకాల్లోని వాస్తవాలను గ్రహించాలి.
ప్రతి ‘ఆటల జాతర’కూ ఉత్తమ జాతిరత్నాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కాకపోతే -స్వయం ప్రతిభతోనో, స్పాన్సర్ల సహకారంతోనే విశ్వ వేదికలనెక్కే అవకాశం దక్కుతోంది. క్రీడాసక్తి ఉన్నా ఆసరా దక్కక దిక్కులు చూసిన దీపా కర్మాకర్, హిమదాస్, స్వప్న బర్మన్ లాంటి ప్రతిభావంతులు కోకొల్లలు. మార్గనిర్దేశకత్వం, ప్రోత్సాహం, శిక్షణ, వౌలిక వసతులు కల్పిస్తే పతకాలు పండించగల మన్జీత్ సింగ్‌లకూ కొదువేం లేదు. పేదరికాన్ని, అనారోగ్యాన్ని అధిగమించి ప్రతిభకు సానపెట్టుకుని బరిలోకి దిగిన ప్రతిభావంతులు తాజా ఆసియా గేమ్స్‌లో తక్కువేం కాదు. కానీ, మన ప్రస్తుత పరిస్థితికి కారణం -మెరికల్ని ఎంపిక చేసి తగు శిక్షణతో విశ్వవేదికలనెక్కించే ప్రణాళికలు రూపుదిద్దుకోకపోవడం. క్రీడా సంఘాలు, సమాఖ్యలు సంకుచిత రాజకీయాలను వీడకపోవడం. దేశ రాజధానిలో పదోవంతులేని జపాన్, కొరియాలు పతకాల వేటలో వందలు దాటుతుంటే, అఖండ భారతావనికి పట్టుమని పది స్వర్ణాలు దక్కని దుస్థితికి కారణమిదే. భారత క్రీడా సామర్థ్య పరిపుష్టికి ప్రభుత్వం నుంచి కొత్తగా వినిపిస్తోన్న మాట ‘ఖేలో ఇండియా’. 2024 ఒలింపిక్స్ నాటికి ప్రపంచం అబ్బురపడేలా పతకాలు సాధించాలన్నది ప్రణాళిక. ఇది వినసొంపుగా ఉన్నా, ఆచరణలోనే అనుమానాలు పుట్టలు వేస్తున్నాయి. ‘ఖేలో ఇండియా’ రూపకర్త నీతి ఆయోగ్ మాటల్ని క్షేత్రస్థాయి వాస్తవాలు వెక్కిరించడమే ఇందుకు కారణం. పాఠశాలలకు ఆటస్థలాలు లేవు. క్రీడాసామగ్రి కనుమరుగైంది. విద్యా హక్కు చట్టం ఆచరణలో చట్టుబండ అవుతోంది. పాఠాలలో ఆటలను అంతర్భాగం చేసి, వ్యాయామ విద్యకు పదును పెడతామంటున్న కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మాటలపైనా నమ్మకం కుదరకపోవడానికి కారణం గత అనుభవాలే. మట్టిలో మాణిక్యాలను వెతికిపట్టి తగు ప్రోత్సాహం అందించి, తగిన శిక్షణతో అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లుగా రాటుదేల్చే పకడ్బందీ క్రీడావ్యవస్థే దేశానికి కరవైంది. ప్రస్తుత పతకాల పట్టికలో పతాక స్థాయిలో ఉన్న చైనా, జపాన్‌లు వచ్చే ఆసియా క్రీడలకు వేదికలవుతున్నాయి. పొరుగు మైదానాల్లోనే పోటెత్తిన ఆ రెండూ, సొంతగడ్డపై సునామీలు సృష్టించకపోవు. ఆ పరిస్థితిని ఎదుర్కోవాలంటే దృఢ లక్ష్యంతో దిద్దుబాటు చర్యలకు దిగక తప్పదు. ఆసియాడ్‌లో అధిగమించి ఒలింపిక్స్‌లోనూ సమధికం కావాలన్న పట్టుదలకు పదును పెట్టుకోక తప్పదు. అంతర్జాతీయ వేదికలపై దేశానికి క్రీడా ప్రతినిధులం కావాలన్న కాంక్షను పాఠశాల విద్యనుంచే ప్రేరేపించాలి. ఆ వాతావరణం నుంచి మెరికల్లాంటి పిల్లల్ని ఏరి, ఆసక్తి కనబర్చే క్రీడల్లో తర్ఫీదునిచ్చి సమస్తంగా ప్రోత్సహించేలా విధి విధానాల్ని ప్రక్షాళించాలి. ఆటల్ని ఆటవిడుపులా కాకుండా ఆర్మీలా అమలు చేసిన రోజున -లోకం చెవుల్లో భారత స్వర్ణ్భేరి రింగుమనకపోదు.