సంపాదకీయం

కేంద్రీయ ‘నేర’ మండలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రీయ నేర పరిశోధక మండలి- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్- సిబిఐ-‘కేంద్రీకృత అవినీతి నేర మండలి’గా మారిందన్న ఆరోపణ ‘‘సరికొత్త ఉదాహరణ’’. దాదాపు అన్ని రాజ్యాంగ విభాగాలలోను ‘అవినీతి, అక్రమాల పుట్టలు’ పగులుతుండడం ‘ఉదాహరణల’ చరిత్ర.. ‘సిబిఐ’కి చెందిన ఇద్దరు అత్యున్నత అధికారులు తాత్కాలికంగా పదవీ బాధ్యతల నుండి వైదొలగవలసి రావడం ‘పరిశోధకులు’ నేరస్థులుగా మారారన్న ఆరోపణకు వౌలిక ధ్రువీకరణ! ‘సిబిఐ’ నిర్దేశకుడు- డైరెక్టర్- ఆలోక్ వర్మ, ‘సిబిఐ’ ప్రత్యేక నిర్దేశకుడు- స్పెషల్ డైరెక్టర్- రాకేశ్ ఆస్థాన ‘కొంతకాలం పాటు’ తమ పదవీ బాధ్యతలకు దూరంగా ఉండనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం స్వయంగా ప్రకటించడం ‘అవినీతి ప్రకంపనల తీవ్రత’కు ప్రబల నిదర్శనం. గత ఏడాదికి పైగా ఆస్థాన మూడు కోట్ల రూపాయల ‘లంచం’ తీసుకున్నాడన్నది ఆయనకు వ్యతిరేకంగా ‘సిబిఐ’ స్వయంగా నమోదు చేసిన ఆరోపణ! ఆలోక్ వర్మ తనను వేధిస్తున్నాడని, ఈ వేధింపులలో భాగంగానే తనకు వ్యతిరేకంగా ‘ప్రథమ ఆరోపణ పత్రం’- ఫస్ట్ ఇన్‌ఫర్‌మేషన్ రిపోర్ట్- ఎఫ్‌ఐఆర్- నమోదు చేశారని రాకేశ్ ఆస్థాన ‘కేంద్ర నిఘా సంస్థ’- సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ - సివిసి- వారికి నివేదించడం సమాంతర విపరిణామం. అందువల్ల అత్యున్నత అధికారులు ఇద్దరూ కూడ ఆరోపణగ్రస్తులయ్యారు. నిజానిజాలు నిర్ధారితమయ్యేవరకూ ఈ ఇద్దరూ పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ‘సివిసి’ సూచించారన్నది అరుణ్ జైట్లీ చేసిన వెల్లడి. ఈ సూచన మేరకు ఆలోక్ వర్మ, రాకేశ్ ఆస్థాన పదవుల నుంచి తప్పుకోవడం తప్పనిసరి అయిపోయింది! ‘సిబిఐ’లో సంస్థాగత సౌశీల్యాన్ని - ఇన్‌స్టిట్యూషనల్ ఇంటెగ్రిటీని- పరిరక్షించడంలో భాగంగానే ఇలా వీరిని తప్పించవలసి వచ్చిందట! లేనట్టయితే, అతి పెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ అయిన మన దేశపు ‘నేర పరిశోధన’ ప్రపంచ దేశాల మధ్య ‘నవ్వులాట’కు గురి అయిపోయేదట..! అందువల్ల వీరిద్దరికి వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలను గురించి ‘ప్రత్యేక బృందాలు’ దర్యాప్తు జరిపే సమయంలో ఇద్దరిలో ఎవ్వరు కూడ పదవిలో ఉండరాదన్నది ‘సంస్థాగత సౌశీల్య పరిరక్షణ’లో భాగమట.. కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ‘సిబిఐ’ని నియంత్రిస్తున్నారన్నది దశాబ్దులుగా ప్రతిపక్ష రాజకీయవాదులు చేసిన ఆరోపణ. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహక పక్షం వారు ‘సిబిఐ’ని దురుపయోగం చేసినట్టు నిరంతరం ఆరోపణలు వెల్లువెత్తడం కూడ చరిత్ర.. కానీ ప్రస్తుతం కొత్త చరిత్ర నడుస్తోంది! ‘సంస్థ’లోని అధికారులు ‘ఆధిపత్య’ సమరం జరుపుకొంటున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు- ఇదీ కొనసాగుతున్న ఆరోపణ! నేరాలను పరిశోధించవలసిన వారు, నేరాలను విచారించవలసిన వారు స్వయంగా నేరాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడం ఇది మొదటిసారి మాత్రం కాదు..
‘సిబిఐ’ ప్రతీక మాత్రమే! ఉన్నత సైనిక అధికారులు పరస్పరం తీవ్రమైన ఆరోపణలు చేసుకోవడం పునరావృత్తికి గురి అయిన పరిణామ క్రమం. రక్షణోత్పత్తుల రంగంలోని పరిశోధక విభాగాలలోను, అంతరిక్ష పరిశోధన రంగంలోను కూడ ఆధిపత్య సమరాల గురించి ప్రచారం జరిగింది. విశ్వవిద్యాలయాల నిర్వాహకులు, కులపతులు, ఉప కులపతులు, ఆచార్యులు కూడ ఈ ఆధిపత్య సమరానికి అతీతులు కాలేదు! రాజ్యాంగ వ్యవస్థలోని మూడు విభాగాలలోని సర్వశ్రేష్ఠ విభాగం న్యాయవ్యవస్థ. కానీ న్యాయవ్యవస్థలో సైతం సర్వోన్నత స్థాయిలో ‘ఆధిపత్య’ స్పర్థలు మొదలైపోయాయన్నది బహిరంగ రహస్యం! సర్వోన్నత న్యాయమూర్తులు బహిరంగంగా సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి పనితీరును విమర్శించడం ‘పరాకాష్ఠ’.. న్యాయమూర్తులు తమకు ‘‘ప్రధాన న్యాయమూర్తి వల్ల జరిగిన’’ అన్యాయం గురించి, తమకు ‘‘కలిగిన’’ అసౌకర్యం గురించి రాష్టప్రతికి ‘్ఫర్యాదు’ చేసి ఉండవచ్చు. కానీ బహిరంగంగా ప్రధాన న్యాయమూర్తిపై విమర్శలను గుప్పించడం, దేశ ప్రజలను విస్మయ చకితులను చేయడం సమీప గత చరిత్ర. ఇలా వివిధ రంగాలలోని వారు, అత్యున్నత విద్యావంతులు, ప్రముఖులు, దేశహితం పట్ల సమాజ అభ్యుదయం పట్ల ధ్యాస ఉన్నవారు ‘అనుశాసన హీనత’ను అవలంబించడం దశాబ్దుల వైపరీత్యం. అందువల్ల ‘సిబిఐ’ వ్యవస్థలో సైతం ఆధిపత్య సంఘర్షణ అంకురించడం, వేళ్లూని వృక్షం కావడం ఆశ్చర్యకరం కాదు. 2016 డిసెంబర్ నుంచి దాదాపు నెల రోజులపాటు రాకేశ్ ఆస్థాన ‘సిబిఐ’కి తాత్కాలిక నిర్దేశకుడుగా వ్యవహరించాడు. శాశ్వత ప్రాతిపదికపై తనకు ఆ పదవి దక్కుతుందని బహుశా ఆయన భావించి ఉండవచ్చు. అలా దక్కలేదు. 2017 జనవరిలో ఆలోక్ వర్మ నిర్దేశకుడుగా నియుక్తుడయ్యాడు. ఉభయుల మధ్య ‘ఆధిపత్య స్పర్థ’ బహుశా అప్పుడే మొదలయి ఉంటుంది..
ఆధిపత్యపు పోరాటం కంటె మించిన వైపరీత్యం అవినీతి.. ఆర్థిక అవినీతి, లైంగిక అవినీతి అన్ని ప్రభుత్వ విభాగాలను మాత్రమే కాదు, రాజ్యాంగ సంస్థలను సైతం కుదిపి వేస్తుండడం ‘‘్ధర్మ ప్రాణదేశం’’అన్న వాస్తవాన్ని నవ్వులపాలు చేస్తున్న విపరిణామం! ‘‘రాజకీయవేత్తలు, అధికారులు అవినీతిపరులు..’’ అన్నది ప్రజలలో పెరుగుతున్న విశ్వాసం. భౌతిక స్వచ్ఛ్భారత్ అంతరంగంలో నక్కి ఉన్న ‘మానసిక కాలుష్య క్రూర మృగం’ ప్రతి క్షణం జనంపైకి దూకుతూనే ఉంది. అత్యున్నత స్థాయి నుంచి అట్టడుగు స్థాయి వరకు అవినీతి వ్యవస్థీకృతం అయి ఉండడం జనం అనుభవ పూర్వకంగా గ్రహిస్తున్న భయంకర వాస్తవం. తొలగింపునకు గురి అయిన ఆలోక్ వర్మ సర్వోన్నత న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. ‘సిబిఐ’కి కొత్త తాత్కాలిక నిర్దేశకుడు నియుక్తుడయ్యాడు. ఒక ఉన్నత అధికారిని ‘అండమాన్’లోని పోర్ట్‌బ్లయర్‌కు బదిలీ చేశారట! కానీ ఇవన్నీ తాత్కాలిక పరిణామాలు. అవినీతి తొలగకపోవడం అన్ని రంగాలలోను కాలుష్యాన్ని కేంద్రీకరిస్తున్న కృత్రిమ నాగరికత! మూడు కోట్లు లంచాన్ని ఆస్థాన తీసుకున్నాడా? లేదా? అన్నది దర్యాప్తులలోను, న్యాయస్థానాలలోను ధ్రువపడవలసిన వ్యవహారం. కానీ దేశవ్యాప్తంగా వేల మంది ఉన్నతోన్నత విద్యావంతులు, ఎందుకని అవినీతికి పాల్పడుతున్నారు? ఆచార్యులు, ఉన్నత న్యాయమూర్తులు వంటి అతిశ్రేష్ఠులు సైతం అవినీతి పనులకు ఎందుకని దిగజారుతున్నారు..??
ఈ అవినీతి సమస్యలన్నింటికీ ఏకైక కారణం- విజ్ఞానాన్ని మప్పుతున్న విద్యాసంస్థలు. విద్యా విధానం విద్యార్థులకు సౌశీల్యాన్ని నేర్పడం లేదు. అందువల్లనే సౌశీల్యం లేని అత్యున్నత విద్యావంతులు తయారవుతున్నారు. బుద్ధి, తెలివి పెరిగిన ఈ విద్యావంతులు హృదయం లేని మానవత్వం లేని రాక్షసులుగా మారి ఉన్నారు. ఈ విబుధ దైత్యులు సాటి మానవుల పట్ల సహానుభూతి లేని వారు, మాతృభూమి పట్ల మమకారం లేని వారు. ‘సహానుభూతి’ లేనివారు సమాజాన్ని దోచుకుంటున్నారు.. ‘మమకారం’ లేనివారు దేశద్రోహులుగా, బీభత్సకారులుగా తయారవుతున్నారు. ఉన్నత స్థానాలలోని వారు ఉత్కృష్ట సంస్కారబద్ధులు కావడం విద్యల లక్ష్యం. ఆ విద్యలు నేడు లుప్తమయ్యాయి. ఇదీ అసలు సమస్య..!