సంపాదకీయం

ఆ చెట్లను కొట్టకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలోని ‘కెబిఆర్’ పార్కు ప్రాంగణంలోని దాదాపు రెండువందల డెబ్బయి పచ్చని చెట్లను పరిమార్చడానికి రంగం సిద్ధం కావడం ప్రతీక మాత్రమే. విస్తృత హైదరాబాద్ మహానగర పాలిక-జిహెచ్‌ఎంసి-వారు ఆర్భాటంగా అమలు జరుపున్న వ్యూహాత్మక పథ ప్రగతి ప్రణాళిక-ఎస్‌ఆర్‌టిసి-కు దాదాపు మూడువేల వంద మహావృక్షాలు బలి కానుండడం పెద్దగా ప్రచారానికి నోచని వైపరీత్యం. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు దేశమంతటా పచ్చదనం నానాటికి కుంచించుకొని పోతుండడం సమస్య విస్తృతికి అద్దం. వాణిజ్య ప్రపంచీకరణ ఆకుపచ్చతనానికి ప్రబల శత్రువన్నది ప్రజలు గుర్తించవలసిన మహా విషయం. అసలు సమస్య ఇదీ...ప్రపంచీకరణలో భాగంగా సమాచార సాంకేతిక ప్రాంగణాలు-ఐటి పార్కులు- ఏర్పడుతున్నాయి. వస్త్రోత్పత్తి ప్రాంగణాలు-టెక్స్‌టైల్ పార్కులు-,పారిశ్రామిక ప్రాంగణాలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, వాణిజ్య నగరాలు, లావణ్య నగరాలు, అమృత పట్టణ వాటికలు ఏర్పడుతున్నాయి. వరిపొలాలు, అరటితోటలు, మామిడి తోటలు చెఱకుతోటలు తమలపాకు తోటలు ఉండిన చోట రాజధాని నగరాల సిమెంటు వనాలు పెరగనున్నాయి. కానీ దేశం మొత్తంమీద హరిత వన ప్రాంగణాలు ఎన్ని ఏర్పడినాయి, ఏర్పడబోతున్నాయి? కొత్తగా ఉద్యానవన ప్రాంగణాలు పెరగడం తరువాత సంగతి..ఉన్నవాటిల్లో ఎన్ని పాడుబడిబోతున్నాయి. ప్రకృతి మాత పచ్చని ‘చేలము’ నిండా కాలుష్యపు కన్నాలు పడిపోతుండటం ప్రపంచీకరణ యుగధర్మం. పోస్కో అన్న దక్షిణ కొరియా సంస్థవారి పారిశ్రామిక కాలుష్య వాటిక నిర్మా ణం కోసం ఒరిస్సాలోని జగత్ సింగ్ పూర్ జిల్లాలో రెండేళ్లలో లక్షా డెబ్బయి వేల చెట్లను నరికిపారేశారు. రైతుల కళ్ల ఎదుటనే తమలపాకుల తోటలను దగ్ధం చేశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దేశమంతటా జరిగిపోతున్న హరిత హనన తీవ్రతను ఊహించుకోవచ్చు. జంటనగరాలలో నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు మార్గం కోసం ఇప్పుటికే ఇరవై ఐదువేల పచ్చని చెట్లను నిర్మూలించారట. తెలంగాణలోని పట్టణ ప్రాంతాలలో ఉన్న హరిత ప్రాంగణాల స్థితిగతుల గురించి వివరాలను అందజేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్ హైకోర్టు ఆదేశించానికి ఇదంతా నేపథ్యం. హైదరాబాద్ మహానగర అభివృద్ధి మండలి -హెచ్‌ఎండిఎ- వారిని కూడ హరిత వివరాలు తెలుప వలసిందిగా హైకోర్టు కార్య నిర్వాహక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ భోంస్లే, న్యాయమూర్తి పి.నవీన్‌రావు ఆదేశించారట. హరిత ప్రాంతాలను విస్తరింపచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కె. ప్రతాప్‌రెడ్డి అనే న్యాయవాది దాఖలు చేసిన వినతి ఉన్నత న్యాయ చర్యకు ప్రాతిపదిక. రాజధానిలోని కెబిఆర్-కాసుబ్రహ్మానంద రెడ్డి- పార్కులోని చెట్లను నగరంలోని ఇతర చోట్ల హననం కానున్న చెట్లను రక్షించడానికై మొదలైన ఉద్యమం ఉద్ధృతం కావడం హైకోర్టు ఆదేశానికి సమాంతర పరిణామం. మరోసారి చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించడానికి సైతం తాము సిద్ధంగా ఉన్నామని హరిత రక్షణ ఉద్యమకారులు ప్రకటించడం హర్షణీయ పరిణామం. చెట్లను గొడ్డళ్ల బారినుండి రక్షించడానికై దశాబ్దుల క్రితం, చిప్కో ఉద్యమం సాగింది. ప్రముఖ హరిత ఉద్యమ నాయకుడు సుందర్‌లాల్ బహుగుణ చిప్కో రూపకర్త. చిప్కో కార్యకర్తలు చెట్లకు అడ్డంగా నిలబడి, చెట్లను కౌగలించుకొని గొడ్డళ్లు ధరించిన వృక్ష హంతకులను ప్రతిఘటించడం చరిత్ర. తమ ప్రాణాలను బలిపెట్టి అయినా చెట్లను రక్షించాలన్న చిప్కో స్ఫూర్తి జంటనగరాలలో ఇలా మళ్లీ విస్తరించడం హర్షణీయం.
ఒక సిమెంటు కట్టడం లేచిన చోటల్లా వందలాది ఆకుపచ్చని చెట్లు అంతరించి పోతుండడం అభివృద్ధి స్వభావం. భూమిని చదును చేయడాన్ని భూమి ప్రగతి భావించి మురిసిపోతుండడం నాగరిక చిహ్నం. చదును చేయడం అనగానే హరిత శోభలతో అలరారే మహావృక్షం మొదలు ఆకుపచ్చని గరికపోచ వరకు నిర్మూలించడం. చెట్లు, చేమలు, పొదలు తీగెలు, గడ్డివాములు పచ్చిక మైదానాలు, ఉన్న ప్రాంతాలు కనబడగానే ఈ ప్రాంతం ఇంకా వెనుకబడి ఉంది...డెవలప్ కాలేదు..అని ముక్కులను చిట్లించి వికృత వదనాలను ప్రదర్శించడం నాగరిక లక్షణమైపోయింది. బస్సులలో, రైళ్లలో, కార్లలో కిరాయి శకటాలలో ప్రయాణం చేస్తున్న వారిలో అత్యధికులకు పచ్చిక మైదానాలు వాటిలో విహరిస్తూ విందులారగిస్తున్న ఆవులు గేదెలు మేకలు గొర్రెలు వెనుకబడిన తనానికి చిహ్నాలు. డెవలప్‌మెంట్ అని అంటే పంటపొలాలను పాడి పశువులను పచ్చని చెట్లను నిర్మూలించి భూమిని చదును చేసి, కుళ్లగించి అంతస్థులున్న భవానలను నిర్మించడం మాత్రమే. ఇలా అంతస్థుల భవనాలను నిలువున నిర్మించడం వల్ల నగరాలలో జనాభా, వాహనాల రద్దీ, కాలుష్యం, మంచినీరు లేని స్థితి కేంద్రీకృతమవుతున్నాయి. ఉష్ణోగ్రత భయంకరంగా పెరిగిపోతుండడానికి ఈ అంతస్థుల భవనాలు ఏకైక కారణం. 1999వ 2009వ సంవత్సరాల మధ్య హైదరాబాద్ నగరంలో గృహ నిర్మాణ సాంద్రత నాలుగు వందల శాతం పెరిగిందట. అంటే 1999లో వంద ఇళ్లు ఉన్నచోట 2009నాటికి ఐదు వందల ఇళ్లు ఏర్పడినాయి. స్థలం, విస్తీర్ణం పెరగలేదు. కానీ ఒక ఇల్లు ఉన్నచోట ఐదు ఇళ్లు పెరిగాయి. చెట్లు పెరగడం పాతకథ. ఇళ్లు పైని పెరగడం వొత్తి వ్యధ. స్థిరాస్తి వ్యాపారులు ఐదారు ఇళ్లు కొనడం, కూలగొట్టి అదే చోట ఐదారు అంతస్థుల భవనం నిర్మించడం..ఐదు ఇళ్లు ఉన్నచోట ఐదు అంతస్థులలో పాతిక ఇళ్లు పెరగడం అంటే ఇదే మరి. ఒక కుటుంబం ఉండిన చోట ఐదు కుటుంబాలు నివసించడం వల్ల భూగర్భ జలాలు ఐదురెట్లు ఖర్చయ్యాయి. ఒక వాహనం నిలచిన చోట, నడచిన చోట ఐదు వాహనాలు నిలిచాయి, నడుస్తున్నాయి. భూగర్భం ఎండిపోవడానికి ఇదీ కారణం. మహానగరంలోని రహదారులు వాహనాలు పట్టక పగిలిపోతుండడానికి ఇదే కారణం. రాకపోకలు స్తంభించపోతుండడానికి, ఊపిరి ఆడనివ్వని కాలుష్యం కేంద్రీకృతం కావడానికి హైదరాబాద్ మహానగరం మధ్యలో దశాబ్దుల పాటు జరిగిన అంతస్థుల భవన నిర్మాణం కారణం. అధికార అవినీతి, రాజకీయ అవినీతి, వాణిజ్య అవినీతి ముప్పేటగా కలిసి సాధించిన ప్రగతి ఇది. అందువల్ల ప్రతిసారీ విస్తరించిన రహదారులు ఐదేళ్ల తరువాత ఇరుకై పోతున్నాయి. మళ్లీ రోడ్ల విస్తరణ, చెట్లను నరికివేయడం-కెబిఆర్ పార్క్ వద్ద చెట్లను నరికే పథకానికి ఈ విస్తరణ విస్మయకరమైన నేపథ్యం...
కెబిఆర్ పార్కు వద్ద ఉన్న చెట్లను నరికే కార్యక్రమాన్ని రెండు నెలలు వాయిదా వేయాలన్న ఉద్యమకారుల కోర్కెను అధికార్లు అంగీకరించాలి. ఈ చెట్లన్నీ పాతికేళ్ల కంటే ఎక్కువ వయసున్నవట. అందువల్ల ఈ వృక్షాలను ఇతర చోట్లకు తరలించి రక్షించాలని ఉద్యమకారులు రూపొందించిన పథకం అద్భుతం. ఇందుకోసం అయ్యే ఖర్చును భరించడానికి అవసరమయ్యే భూమిని సమకూర్చడానికి స్వచ్ఛంద సంస్థలు, వదాన్యులు సిద్ధంగా ఉన్నారట. ప్రభుత్వానికి దమ్మిడీ ఖర్చు కాదు. వర్షాకాలం రాగానే ఈ చెట్లను కెబిఆర్ పార్కునుంచి తరలించి, మరోచోట ప్రాణ ప్రతిష్ఠ చేస్తారట. ఉద్యమకారుల ప్రయత్నం జీవకారుణ్యానికి అద్దం. ప్రభుత్వం సహకరించాలి.