సంపాదకీయం

ఎన్నికల ‘సంత’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ జిల్లాలో నగదు పట్టివేత- అన్నది ‘వోట్ల సంత’లోని విపరిణామక్రమంలో ఇప్పటికి సరికొత్త ఘట్టం! ‘సంత’ మరో మూడు వారాలపాటు సాగుతుంది కనుక ఇంకెన్నిచోట్ల ఎంతెంత ‘నల్లడబ్బు’ పట్టివేతకు గురి కానుందన్నది కుతూహలగ్రస్తులకు ఉత్కంఠను కలిగిస్తున్న అంశం! పవిత్రమైన ప్రజాస్వామ్య ప్రక్రియ ఎన్నికల కార్యక్రమం. ఈ ఎన్నికల కార్యక్రమంలో మరింత ప్రాధాన్యవంతమైనది ‘మతదానం’...- పోలింగ్-! అందువల్ల ‘వోట్లు’ కార్యక్రమాన్ని ‘సంత’తో పోల్చడం ఏమిటన్న ప్రశ్నకు తావులేదు! ‘సంత’ మరింత పవిత్రవంతమైనది! జీవన వ్యవహారం నడవడానికి ‘వస్తువినిమయం’ ప్రాణం వంటిది. ఈ ప్రాణం నిలిచి పెంపొందేందుకు ‘మాధ్యమం’ సంత! అందువల్ల ‘వోట్ల కార్యక్రమాన్ని’ ‘సంత’తో సరిపోల్చడం అపచారం కాజాలదు! ఎటొచ్చీ యుగాలు తరాలు గడిచాక ‘సంత’ స్వరూప స్వభావాలు మారిపోయాయి. ‘వ్యాపారం’ దేశమనే దేహాన్ని పరిపుష్టంగా ఉంచడానికి అవసరమైన వినిమయ వ్యవస్థ.. దేహంలో ‘సిరలు’, ‘ధమనులు’ రక్తప్రసారాన్ని జరిపినట్టు దేశంలోని ‘పంపిణీ’ వ్యవస్థ కూడ ‘అన్నాన్ని’ ‘అవసరాలను’ నిరంతరం ప్రసారం చేస్తోంది. ఇది భారతీయ వాణిజ్యం- తరతరాల సంత! కానీ ప్రస్తుతం ‘సంత’లు దోపిడీ కేంద్రాలుగా మారి ఉన్నాయి, దోపిడీ చేస్తున్నది విదేశీయ వాణిజ్య సంస్థలు! ఈ మాతృదేశం- దేహం- పట్ల మమకారం లేని ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ దోపిడీ చేస్తున్నాయి, దోపిడీకి గురి అవుతున్నది ఈ దేశం పట్ల మాతృ మమకారం కలిగిన సామాన్య ప్రజలు.. ఇది ‘ప్రపంచీకరణ’ వాణిజ్యం, ‘ఆధునికత’ అన్న ముసుగు వేసుకున్న విదేశీయమైన సంత! ‘ప్రపంచీకరణ’ భారతీయతను దిగమింగుతున్న దృశ్యాలు ఈ ‘సంత’లో ఆవిష్కృతవౌతున్నాయి. ఇలాంటి ‘సంత’ను పవిత్రమైన ప్రజాస్వామ్య ప్రక్రియతో పోల్చవచ్చునా? అన్నది మరో ప్రశ్న! దీనికి సమాధానం ‘దొన్నూదొనే్న’ అంటే రెండూ రెండే! ‘ప్రజాస్వామ్య ప్రక్రియ’ కూడ లేదా ‘ప్రజాస్వామ్యం’ పేరుతో నడుస్తున్న ప్రక్రియ కూడ ప్రపంచీకరణ ప్రభావానికి గురై ఉంది! ‘‘జన వాక్యంతు కర్తవ్యం’’- ప్రజల మాట ప్రకారం పాలకులు తమ కర్తవ్యాన్ని నిర్వహించాలన్నది వేల లక్షల ఏళ్ల భారతీయ ప్రజాస్వామ్య స్వభావం.. స్వరూపంతోపాటు స్వభావం మారిపోయింది. ప్రజల ఆదేశాన్ని పొందడానికి మాధ్యమం ‘ఎన్నికల ప్రక్రియ’- విజయం సాధించడం, న్యాయంగా పాలించడానికి మాత్రమే! కానీ కొన్ని దశాబ్దులుగా ‘విజయం’ సాధంచడం ఆ తరువాత అక్రమ పద్ధతి ద్వారా సంపాదించుకొనడానికి! అత్యధిక శాతం ప్రజాప్రతినిధులు ఇదే చేస్తుండడం బహిరంగ రహస్యం! న్యాయంగా పాలించడానికి ఎన్నికల ద్వారా ‘జనాదేశం’ పొందుతున్న వారి సంఖ్య తక్కువ! అందువల్ల ఎన్నికల ప్రక్రియ కూడ ‘పెట్టుబడి’ పెట్టి గెలిచి ఆ తరువాత లాభాలను దండుకునే ‘వ్యాపారం’గా మారి ఉంది! అందువల్ల ‘అభ్యర్థులు’ పోటీపడి పెట్టుబడులు పెడుతున్నారు!
పరిమితికి మించి ఎన్నికల కోసం వ్యయం చేయడం చట్టానికి విరుద్ధం! నేరం. కానీ పరిమితికి మించి కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్న అభ్యర్థులు ‘రహస్యం’గా ఈ పనిచేస్తున్నారు! ఇది బహిరంగ రహస్యం! పట్టుబడే వరకు ‘నల్లడబ్బు’ ‘నల్లా’లోని నీళ్లవలె అభ్యర్థుల నిధుల నుంచి ప్రవహిస్తూనే ఉంటోంది. ‘ఎన్నికల సంఘం’ అధికారులు అప్పుడప్పుడు అడ్డుకుంటున్నారు. కానీ ఎన్నికల సందర్భంగా పట్టుబడుతున్న అక్రమ ధనం కంటె పట్టుబడకుండా చెలామణి అయి చేతులు మారుతున్న నల్లడబ్బు ఎంత? వంద రెట్లా? వేయి రెట్లా? అందువల్ల ఆదివారం వరకు నల్లగొండ జిల్లాలో అధికారులకు పట్టుబడిన కోటిన్నర లక్షల ‘అక్రమ ధనం’ సముద్రంలో ‘కాకిరెట్ట’ మాత్రమే కావచ్చు. గత నెల ఇరవయ్యవ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ఒక వాహనంలో తరలివస్తున్న పది కోట్ల రూపాయల ‘లెక్కలు లేని’ డబ్బును పోలీసులు పట్టివేశారట! ఇలా ఎన్నికల కార్యక్రమం వెల్లడైన నాటి నుంచి ‘అక్రమ ధనం’ పట్టుబడుతూనే ఉంది. గతంలో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడ భారీగా ‘నల్ల డబ్బు’ బయటపడడం చరిత్ర! శాసన సభల ఎన్నికల ప్రచారం ఊపందుకొంది కాబట్టి ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాలలోను నల్లడబ్బు పట్టుబడుతూనే ఉంది! అన్ని రాజకీయ పక్షాల ‘ప్రచార’ ప్రదర్శనలలోను భారీగానే జనం పాల్గొంటున్నారు. వీరందరూ పార్టీల కార్యకర్తలా? స్వచ్ఛందంగా తరలివస్తున్న వోటరులా? ‘కాదు, కానేకాదన్నది గల్లీగల్లీలోని బస్తీ బస్తీలోని పట్టణాలలోని పల్లెలలోని జనానికి తెలిసిన నిజం’.. జనం వెల్లడిస్తున్న నిజం!
వోట్లు పొందడానికి అభ్యర్థులు ‘నోట్ల’ను ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. పుచ్చుకొనడానికి ‘వోటర్లు’ సిద్ధంగా ఉండడం వ్యవహార వాస్తవం! ‘నోట్లు’ పుచ్చుకోకుండా వోట్లు వేస్తున్నవారి సంఖ్య బహు తక్కువ! పుచ్చుకుంటున్నవారి సంఖ్య ప్రతి ఎన్నికలలోను పెరిగిపోతోంది. నామాంకన పత్రాల- నామినేషన్‌లు- దాఖలు చేయడానికి అభ్యర్థులు ఊరేగింపుగా వెడుతున్నారు. ఈ ఊరేగింపులలో పాల్గొంటున్నవారిలో కార్యకర్తలు, అభిమానుల కంటె ‘నోట్లు’ పుచ్చుకొని జెండాలు పట్టుకొని నడుస్తున్నవారి సంఖ్య ఎక్కువ అన్నది నిరాకరింపజాలని నిజం. కేవలం కార్యకర్తలతోను, అభిమానులతోను కలసి వెళ్లిన అభ్యర్థులు కొంతమంది ఉండవచ్చు! వారి సంఖ్య తక్కువ! బహిరంగ సభలకు తరలివస్తున్నవారు అన్ని పార్టీల సభలకు హాజరవుతున్నారు. ఏయే పార్టీవారు ఏమేమి చెబుతారో విని, ఎవరికి వోటువేయాలన్నది నిర్ధారించుకోడానికి గతంలో ఇలా తరలివెళ్లారు. ప్రస్తుతం ఇలా అన్ని పార్టీల సభలకు హాజరై ‘జనం భారీగా వచ్చారు’ అన్న ప్రచారానికి ప్రాతిపదికలు అవుతున్న వారిలో అధిక సంఖ్యాకులు ‘నోట్లు’ పుచ్చుకొని వస్తున్న వారేనట! ‘ఒప్పందం’ కుదుర్చుకొని గల్లీల నాయకులు, బస్తీల నాయకులు ఈ జనాలను తరలించుకొని వెడుతున్నారు. సభలో పాల్గొన్న ఇలాంటి అద్దె జనానికి ‘‘రోజుకింత’’ ఇస్తున్నారట! ఈ డబ్బుకాక ‘్భజనం’ పొట్లాలు, మంచినీళ్ల సీసాలు అదనం! ముందురోజుననే మందు- మద్యం- సీసాలను కూడ ఇళ్లకు చేరవేస్తున్నారట. ఇదంతా ప్రచారంలో భాగం! ఈ అద్దె జనాలు కూడ ఈరోజున ‘్ఫలానా’ పార్టీ వారి ఊరేగింపులో ఆ పార్టీ జెండాలను పట్టుకొని నడుస్తున్నారు. మరుసటి రోజున మరో పార్టీ జెండాలను పట్టుకొని జైకొడుతూ నడుస్తుంటారు. అందరూ కాకపోవచ్చు!
ఇలాంటి ‘కిరాయి’ కార్యకర్తలకు రోజుకు ఎంత వేతనం ఇస్తున్నారన్నది ‘గిరాకీ’ని బట్టి మారుతోందట! నిన్న ఒక పార్టీవారు ‘వెయ్యి రూపాయలు’- తలకు- ఇచ్చినట్టయితే మరుసటి రోజున మరో పార్టీవారు అంతే ఇస్తారు. లేదా పెంచుతారు! ఒకేరోజున రెండు, ఎక్కువ పార్టీలకు ఈ ‘కార్యకర్తలు’, ‘అభిమానులు’ కావలసి వచ్చినట్టయితే ఏ పార్టీవారు ఎక్కువ మొత్తం చెల్లిస్తే ఆ పార్టీవారి ఊరేగింపులోకి ఈ ‘కార్యకర్తలు’ చేరిపోతున్నారు. ‘లభ్యత’ ‘గిరాకీ’- సప్లయ్ అండ్ డిమాండ్- ప్రాతిపదికగా స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ ఏర్పడి ఉండడం ప్రపంచీకరణ! ఈ స్వేచ్ఛావాణిజ్య ‘సంత’లు ఎన్నికల సమయంలో మరిన్ని జరుగుతున్నాయి. ‘లభ్యత’, ‘గిరాకీ’ ప్రాతిపదికగా ‘్ధరలు’ నిర్ణయవౌతున్నాయి! ఋజువుచేయడానికి వీలులేని ఈ ‘వ్యూహా’లను దాదాపు ప్రతి రాజకీయ పక్షం వారు అమలుజరుపుతున్నారట! ‘జనవాక్యంతు కర్తవ్యం’’ అన్న సనాతన నీతికి వికృతమైన అధునాతన రీతి ఇది! దశాబ్దుల క్రితం అభ్యర్థులు అలవాటు చేశారు, ఇప్పుడు ‘వోటర్లు’ దబాయించి అడిగి పుచ్చుకుంటున్నారు! అందరివద్ద పుచ్చుకుంటున్నవారు తమకు నచ్చినవారికే ‘వోటు’ వేస్తున్నారు! అంతవరకు నయం.. కానీ నల్లడబ్బు మాత్రం వెల్లువలెత్తుతూనే ఉంది! ఎవ్వరూ ఒప్పుకోరు, ఎవ్వరూ ఋజువు చేయలేరు!! అధికారుల ‘దాడులు’, ‘నిఘా’లు ‘‘పట్టుకొనడాలు’’ ఈ వెల్లువను నిరోధించలేకపోతుండడం నిష్ఠుర సత్యం..