సంపాదకీయం

గుబాళించిన ‘గులాబీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాదేశం ఆవిష్కృతమైంది. తెలంగాణలో ‘గులాబీ’ల పరిమళం మరోసారి గుబాళించింది. గుబాళించడం మాత్రమే కాదు, ప్రజా హృదయ క్షేత్రంపై మరింతగా విస్తరించింది. తెలంగాణ సుమవనంలో వికసించిన ఈ సుగంధ సుమాల సంఖ్య- 2014 నాటితో పోలిస్తే- గణనీయంగా పెరిగిపోవడం ఈ విస్తరణకు నిదర్శనం.. అధికార ‘తెలంగాణ రాష్ట్ర సమితి’వారి రాజకీయ వ్యవసాయం అద్భుతమైన విజయ ఫలాలను ప్రసాదించడం తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికలలో మంగళవారం ఆవిష్కృతమైన చారిత్రక దృశ్యం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని ‘తెలంగాణ రాష్ట్ర సమితి’- తెరాస- మరోసారి చరిత్రను సృష్టించగలిగింది. 2014 జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ‘తెరాస’ సృష్టించిన మొదటి చరిత్ర. ఆ చరిత్రకు మరో ఉజ్వల అధ్యాయాన్ని సమకూర్చడం మంగళవారం నాటి మహా పరిణామం! ప్రజలు ‘తెరాస’ విధానాల పట్ల విశ్వాసం ప్రకటించారు, తెరాస నాయకత్వంలోని ప్రభుత్వం అమలు జరుపుతున్న పథకాల ప్రగతి గతిని ఆమోదించారు, సంక్షేమ ప్రగతి కార్యక్రమాలను ప్రశంసించారు. ‘తెరాస’కు మరోసారి అధికారం అప్పగించడం వల్ల మాత్రమే 2014లో మొదలైన ఈ కార్యక్రమాలు, పథకాలు కుంటుపడకుండా కొనసాగ గలవన్నది ప్రజల అంతరంగం. కాకతీయ జలస్రవంతి కావచ్చు, భగీరథ సుజల వాహిని కావచ్చు, హరితహారం ఏర్పాటు చేయడం కావచ్చు, నిరుపేదలకు గృహ నిర్మాణం కావచ్చు, వివిధ ఉపేక్షిత జనశ్రేణులకు ‘భత్యం’- పెన్షన్- కల్పించే యోజనలు కావచ్చు, రైతుబంధు వంటి వ్యవసాయ హిత ప్రణాళికలు కావచ్చు- యథావిధిగా కొనసాగాలన్నదే తెలంగాణ ప్రజల అంతరంగం. ఈ అంతరంగం డిసెంబర్ ఏడవ తేదీన నిర్ణయించింది. ఈ నిర్ణయం మంగళవారం ఆవిష్కృతమైంది! శాసనసభలకు ఎన్నికలు జరిగిన మిగిలిన నాలుగు రాష్ట్రాలలోను మూడు చోట్ల ప్రజలు ‘మార్పు’ను కోరారు. మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీకీ శాసనసభలో మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడుతోంది. ఆయా రాష్ట్రాలలో వోటర్లు అధికార పక్షాలను నిరాకరించారు. తెలంగాణలో వోటర్లు మాత్రం మార్పును కోరలేదు. ఇందుకు ఏకైక కారణం గత నాలుగున్నర ఏళ్ల ‘తెరాస’ పాలన మంచిగా ఉందని జనం భావించడం! ఇతర పక్షాలకు ప్రభుత్వాన్ని అప్పగించినట్టయితే ఈ ‘మంచి’ మధ్యలోనే ఆగిపోతుందని భావించడం! ‘‘మధ్యలో వీళ్లను- తెరాస ప్రభుత్వాన్ని- మార్చినట్టయితే వీళ్లుచేస్తున్న మంచి పనులన్నీ ఆగిపోతాయి!’’ అని ‘పోలింగ్’కు ముందే గ్రామీణ ప్రాంతాలలోను పట్టణ ప్రాంతాలలోను సామాన్య ప్రజలు చెప్పిన మాట.. బహిరంగంగాను, జనాంతికంగాను!! ప్రజలు తమ మాటను నిలబెట్టుకున్నారు! రాష్ట్రంగా ‘తెలంగాణ’ ఏర్పాటు కావడానికి కారణం ‘తెరాస’ మాత్రమేనన్న వాస్తవాన్ని జనం మరచిపోకపోవడం ఈ ఘన విజయానికి మరో కారణం...
‘తెరాస’కు అధికార చ్యుతిని కలిగించాలన్న లక్ష్యంతో ఇతర విపక్షాలతో కలసి ‘మహాకూటమి’ని ఏర్పాటుచేసి ఆర్భాటంగా ప్రచారం చేసిన ‘కాంగ్రెస్’, ‘‘ఎక్కడ వేసి ఉన్న గొంగళి అక్కడే ఉన్న’’ చందంగా కూలబడిపోవడానికి కారణం కూడ ఇదే.. మంచి చేస్తున్న పథకాలు మధ్యలో ఆగిపోతాయన్న వోటర్ల భయం! ‘కూటమి’వారు ప్రతి ప్రభుత్వ పథకం వల్ల జరిగిన మంచిని గుర్తించలేదు. ‘‘అమలు జరపడంలో అవినీతి జరిగిందని’’ మాత్రమే వారు కనిపెట్టారు. ‘‘మిషన్ భగీరథ’’ను ‘‘కమిషన్ భగీరథ’’గా అభివర్ణించడం ఒక ఉదాహరణ మాత్రమే! ఇళ్లలోని ‘నల్లా’లలోని నీరు తాగుతున్న వారికి ఈ ‘ఆరోపణలు’ నచ్చలేదు! ఈ ఆర్భాటం పట్టలేదు! ఉన్న పథకాలను అమలు జరుగుతున్న పథకాలను తాము మరింత మెరుగైన రీతిలో అమలు జరుపుతామని చెప్పడం మినహా ‘కూటమి’వారు కొత్తగా రూపొందించిన పథకాలు ఏవన్నది మేధావులకు సామాన్య జనాలకు అర్థం కాలేదు. అందువల్లనే కాంగ్రెస్‌కు 2014లో దాపురించిన దుస్థితి ఈ ఎన్నికలలో సైతం యథాతథంగా పునరావృత్తమైంది! గెలిచినట్టయితే ‘తెరాస’ పథకాలకు ‘పర్యాయ’- సబ్‌స్టిట్యూట్- పథకాలను మాత్రమే కాంగ్రెస్ కూటమి అమలు జరుపగలదని ‘కూటమి’ స్వయంగా ప్రకటించుకుంది. అంతేకాని ‘కూటమి’కి ‘ప్రత్యామ్నాయ’- ఆల్టర్‌నేటివ్- పథకాలు కాని, విధానాలు కాని లేవన్నది జనం గుర్తించిన వాస్తవం! ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు దీటైన ప్రత్యామ్నాయ నాయకుడిని ‘కూటమి’వారు జనం ముందు నిలబెట్టలేకపోయారు! లక్షల గొర్రెలను గ్రామీణ ప్రాంతాలలో పెంచడానికి ‘తెరాస’ ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని యద్దేవా చేయడం ద్వారా కాంగ్రెస్ నాయకులు గ్రామీణ ప్రాంతాల వారి ఆగ్రహానికి గురి అయ్యారు! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని ‘తెలుగుదేశం’తో కాంగ్రెస్ జట్టుకట్టడం ‘అనైతిక చర్య’ అని జనం నిర్ధారించారు. మంగళవారం ప్రస్ఫుటించిన జనాదేశానికి ఇదీ ప్రాతిపదిక..
తెలంగాణలో అధికారపు అందలం ఎక్కలేకపోయినప్పటికీ, మిజోరమ్‌లో అధికార పీఠం నుంచి వైదొలగవలసి వచ్చినప్పటికీ ఈ ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో అతి ప్రధాన విజేత కాంగ్రెస్ పార్టీ. 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి, ‘సభ’లో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల ఫలితాల వల్ల పునరుజ్జీవనం కలుగనుంది! వరుసగా వివిధ శాసనసభల ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం పాలుకావడం నాలుగున్నర ఏళ్ల చరిత్ర. పంజాబ్ శాసనసభ ఎన్నికలు మాత్రమే అపవాదం- చివరికి, కర్నాటక శాసనసభలో తన బలంలో సగం కూడ లేని ‘లౌకిక జనతాదళ్’ నాయకుడు హెచ్.డి.కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడానికి సైతం కాంగ్రెస్ వారు సిద్ధం కావలసి వచ్చింది. ఇప్పుడు ‘ఎమ్‌ఎన్‌ఎఫ్’ ఘన విజయం సాధించిన మిజోరమ్‌లో సైతం కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఇలా వరుస పరాజయాలతో అస్తిత్వ సంక్షోభానికి గురి అవుతుండిన కాంగ్రెస్‌కు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో స్పష్టమైన విజయం లభించడం, మధ్యప్రదేశ్‌లో భాజపాకు దీటుగా శాసనసభలో స్థానాలను కైవసం చేసుకోవడం కొండంత నైతిక బలం. కాంగ్రెస్ ఈ రెండు రాష్ట్రాలలో విజయం సాధించడానికి కారణం ప్రజలు ‘మార్పు’ను కోరడం మాత్రమే! రాజస్థాన్‌లో జనం ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార పార్టీని గద్దె దింపుతున్నారు. రెండున్నర దశాబ్దులుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ప్రస్తుత కాంగ్రెస్ విజయానికి, భారతీయ జనతాపార్టీ ఓటమికి కారణం! ఛత్తీస్‌గఢ్‌లోను, మధ్యప్రదేశ్‌లోను పదహైదు సంవత్సరాలపాటు ‘్భజపా’కు అధికారం అప్పగించిన ప్రజలు ఈసారి మార్పును కోరారు! మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు ‘‘్భజపాకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీకి దిక్కులేదు కనుక కాంగ్రెస్‌కు వోటర్లు పట్టం కట్టారు’’. ఏమయినప్పటికీ రెండు రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోవడం, మధ్యప్రదేశ్‌లో మెజారిటీ సాధించలేక పోవడం భారతీయ జనతాపార్టీకి దాపురించిన ఘోర వైఫల్యం. మరో ఆరునెలలలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఈ పరాజయాలు ‘్భజపా’ పాలిట ప్రమాద ఘంటికలు! రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో అరవై ఐదు లోక్‌సభ స్థానాలున్నాయి! మాయావతి నాయకత్వంలోని ‘బహుజన సమాజ్ పార్టీ’ ప్రభావం ఈ మూడు రాష్ట్రాలలోను విస్తరిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ‘్భజపా’ ఘోర పరాజయానికి ఇది కూడ కారణం!
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేని, భాజపా లేని రాజకీయ కూటమిని ఏర్పాటుచేయడానికి తక్షణం ప్రయత్నాలు ప్రారంభించనున్నట్టు శాసనసభా సమర ఘన విజయం సాధించిన తరువాత ‘తెరాస’ అధినేత చెప్పిన మాట! రాజకీయ పార్టీలనుకాక ప్రజలను సమైక్యం చేయడం ద్వారా గుణాత్మకమైన పరివర్తనను, ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను, ప్రత్యామ్నాయ ఆర్థిక పద్ధతిని సాధించడం ఆయన లక్ష్యమట! ‘కాంగ్రెస్ ముక్త’, ‘్భజపా’ముక్త రాజకీయ కూటమి జాతీయ స్థాయిలో ఎలా ఏర్పడుతుంది? ఏర్పడినప్పటికీ అలాంటి- భాజపా వ్యతిరేక, కాంగ్రెస్ వ్యతిరేక- కూటమికి లోక్‌సభలో రెండువందల డెబ్బయి రెండు స్థానాలు ఎలా లభిస్తాయి? అన్న ప్రశ్నలకు సమాధానం లభించవలసి ఉంది! చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయతలపెట్టిన ‘కాంగ్రెస్ ముక్త’ భాజపా వ్యతిరేక కూటమికీ, చంద్రశేఖరరావు కూటమికీ మధ్య ఉన్న ఈ ‘అంతరం’ జాతీయ స్థాయిలో ఎవరికి లాభం..?