సంపాదకీయం

‘ప్రయాణ’ వైపరీత్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రయాణీకులను ‘వీలు’ను బట్టి దోపిడీ చేయడం నడుస్తున్న చరిత్ర! ఇలా దోపిడీ చేయడాన్ని గతంలో ‘నల్లబజారు’- బ్లాక్ మార్కెటింగ్- అని పిలిచేవారు, ‘బ్లాక్ మార్కెటింగ్’ చేసేవారిని ప్రభుత్వాలు శిక్షించేవి, ప్రజలు నిరసించేవారు. ప్రస్తుతం ఇలాంటి దోపిడీ సక్రమ వ్యవస్థగా చెలామణి అవుతోంది! వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ‘్ధర’ను ‘వెల’ను ‘శుల్కాన్ని’ ‘సుంకాన్ని’ పెంచడం గతంలో ‘బ్లాక్ మార్కెటింగ్’.. ప్రస్తుతం ఈ ‘నల్లబజారు’ను నల్లబజారు అనడానికి వీలులేదు.. ఇలా అవసరాన్ని ఆసరాగా చేసుకొని వినియోగదారులను, ప్రయాణీకులను, సేవలను పొందే వారిని దోచుకొనడానికి ప్రస్తుతం ‘ప్రీమియమ్ ప్రయిసింగ్’- ప్రాధాన్యాన్ని బట్టి వెలను నిర్ణయించడం-, ‘డైనమిక్ ప్రయిసింగ్- బహముఖ క్రియాశీలతను బట్టి వెలను నిర్ణయించడం- వంటి గౌరవప్రదమైన పేర్లను పెట్టారు! ఇలాంటి చిత్ర విచిత్ర నామధేయాల వల్ల ‘నల్లబజారు’ వంటి వికృతులు నాగరిక పద్ధతులుగా చెలామణి అవుతుండడం ప్రపంచీకరణ సృష్టించిన మాయ.. సినిమా టిక్కెట్టును అసలు వెలకంటె రూపాయికి అధికంగా అమ్మిన ‘‘మురికి బట్టల వాణ్ని’’ పోలీసులు కసిగా కొట్టుకుంటూ స్టేషన్‌కు ఈడ్చుకువెళ్లి శిక్షించేవారు.. ఇది గతం... ప్రయాణీకుల అవసరాన్ని బట్టి ‘ఆటోరిక్షా’ ‘క్యాబ్’ ‘బస్సు’ ‘రైలు’ విమానం ధరలను పెంచిపారేసి ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్న ‘‘మురికి హృదయాల’’ వాణిజ్యవేత్తలను పోలీసులు శిక్షించడం లేదు.. ఇది వర్తమానం! గతంలో ‘బ్లాక్ మార్కెట్’-నల్లబజారు- పేరుతో నిరసనలకు, శిక్షలకు గురి అయిన పద్ధతులన్నీ ఇప్పుడు ‘ప్రీమియమ్ ప్రయిసింగ్’ ‘డైనమిక్ ప్రయిసింగ్’ వంటి గౌరవప్రదమైన పేర్లతో చెలామణి అవుతున్నాయి. జనానికి ‘్ధ్యసలేదు.. ఇలా సేవల- సర్వీసెస్- పేరుతో దోపిడీ జరుగుతోంది. దోపిడీ చేస్తున్న వాణిజ్య సంస్థలను శిక్షించడం అసంభవమన్నది ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- వ్యవస్థీకరించిన వికృత వాస్తవం! వాణిజ్య సంస్థల యజమానులు ప్రభుత్వ నిర్వాహకులకు లంచాలిచ్చి విధానాన్ని ప్రభావితం చేయడం గత చరిత్ర. ఇలా ప్రభావితం చేయడం కూడ ‘అపవాదం’మాత్రమే.. కొన్ని సందర్భాలలో మాత్రమే కొన్ని పథకాలు, పరిశ్రమలు, కొనుగోళ్లు వ్యవహారాలలో మాత్రమే ఈ ప్రభావ వైపరీత్యం ప్రస్ఫుటించేది. వాణిజ్య అక్రమ లాభార్జనపరులు రాజకీయవేత్తలుగా, ప్రభుత్వ నిర్వాహకులుగా రూపమెత్తి ఉండడం ‘ప్రపంచీకరణ’ వ్యవస్థ మొదలైన తరువాత నడిచిపోతున్న అక్రమ కలాపం. అక్రమ కలాపాలు ‘సక్రమం’గా మారిపోతుండడానికి మరో పేరు ‘ప్రపంచీకరణ’! ‘బ్లాక్ మార్కెటింగ్’ ప్రస్తుతం ‘ప్రీమియర్ ప్రయిసింగ్’ పేరుతో, ‘డైనమిక్ ప్రయిసింగ్’ పేరుతో కొనసాగుతోంది!!
హైదరాబాదు వంటి నగరాలలో ‘ఓలా’ ‘ఉబర్’ వంటి సంస్థలు ‘క్యాబ్’లను ‘ఆటోరిక్షాల’ను నడిపిస్తున్నాయి. ఈ సంస్థల ‘క్యాబ్’లు రంగప్రవేశం చేయకముందు దేశవ్యాప్తంగా నగరాలలో పెద్ద పట్టణాలలో ‘కిరాయి కార్లు’- టాక్సీలను రహదారిపై నిలబడిన ప్రయాణీకులు కుదుర్చుకునేవారు. ‘టాక్సీ’లను యజమానులు నడిపేవారు లేదా యజమానుల వద్ద ‘టాక్సీ’లను అద్దెకు తీసుకొని ‘చోదకులు’- డ్రయివర్లు- నడుపుకునేవారు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎంత సొమ్ము చెల్లించాలన్నది ప్రభుత్వాలు నిర్ణయించేవి! ‘ఓలా’ ‘ఉబర్’ సంస్థలు రంగప్రవేశం చేసిన తరువాత దేశవ్యాప్తంగా లక్షల మంది యజమానుల ‘కార్’-టాక్సీ- క్యాబ్-లు స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయాయి. ఈ ఘరానా సంస్థల పోటీకి తట్టుకోలేక చిన్న చిన్న ‘ప్రయాణ సేవల సంస్థలు’ మూతపడిపోయాయి. అందువల్ల గతంలోవలె ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాలలోను, పెద్ద పట్టణాలలోను ప్రయాణీకులు ‘టాక్సీస్టాండ్’వద్ద కాని, రహదారిపై నిలబడి కాని ‘కారు’- టాక్సీ- క్యాబ్-ను కుదుర్చుకొనడానికి వీలులేదు. అలాంటి సదుపాయం గతమైంది, హతమైంది.. హతం చేసిన వారు ‘ఓలా’ ‘ఉబర్’ సంస్థల వారు. ప్రభుత్వాలు ఈ ‘వాణిజ్య హంతకుల’ను శిక్షించడం లేదు, ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటె వివిధ రాష్ట్రాలలోని ప్రభుత్వ నిర్వాహకులకు ఈ సంస్థలలో భాగస్వామ్యం ఉందట.. ఉందా? లేదా? అన్నది ధ్రువపడని అంశం! కానీ ‘ఓలా’ ‘ఉబర్’ సంస్థలు తమ ‘క్యాబ్’లలో ఎక్కి ప్రయాణిస్తున్నవారిని రాత్రింబగళ్లు దోపిడీ చేస్తుండడం మాత్రం ధ్రువపడిన వాస్తవం! ప్రభుత్వ నిర్వాహక రాజకీయ వేత్తలు ప్రజల, ప్రయాణీకుల అవసరాల పట్ల క్రూరమైన పాశవికమైన పైశాచికమైన ఘోరమైన నిర్లక్ష్యం వహించి ఉండడం ‘ఓలా’ ‘ఉబర్’ వంటి సంస్థల ఆర్థిక నేరాలు సక్రమమైన కలాపాలుగా సాగిపోతుండడానికి కారణం..
ఇలా ఈ రెండు సంస్థల గుత్త్ధాపత్యం వల్ల ‘ప్రయాణీకుల’కు భయంకరమైన అసౌకర్యం ఏర్పడిపోయింది. ఎక్కడపడితే అక్కడ ‘క్యాబ్’ దొరకదు. ‘‘నాగరికుల’’ ప్రయాణ స్వాతంత్య్రాన్ని ఈ సంస్థలు హరించి వేశాయి. ‘ఓలా’క్యాబ్ ఎక్కాలి లేదా ‘ఉబర్’ క్యాబ్ కోసం పడిగాపులు పడి ఉండాలి! ఈ ‘క్యాబ్’ ఎక్కదలచినవారి వద్ద ‘లావణ్యవాణి’- స్మార్ట్ఫోన్- తప్పనిసరిగా ఉండాలి, దానికి ‘అంతర్జాల’- ఇంటర్‌నెట్ అనుసంధాన వ్యవస్థ- ఏర్పడి ఉండాలి! అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రయాణీకులు తాము ఉన్నచోట నుంచి గమ్యానికి పోవడానికి వీలుగా ‘ఓలా లేదా ‘ఉబర్’ - ‘క్యాబ్’ను రప్పించుకోగలరు. ‘ఇవి’ లేనివారు ఆటోరిక్షాను ఎక్కిపోవాలి, ‘బస్’కోసం నిలబడి ఉండాలి. లేదా ప్రయాణం రద్దు చేసుకోవాలి! బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు నెలకొల్పిన ‘బందిఖానా’లలో ప్రజలు బందీలుగా మారిపోతుండడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! గతంలో ఒకటి, రెండు, మూడు, నాలుగు ‘కార్ల’ను అద్దెకు నడిపిన యజమానులు, చోదకులు ప్రస్తుతం ‘ఓలా’ ‘ఉబర్’ సంస్థలలో వెట్టిచాకిరి చేస్తున్న కూలీలు! ఇలా వికేంద్రీకృత, మానవీయ భారతీయ ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృత స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థగా, పెట్టుబడుదారుల అక్రమ వాణిజ్య సామ్రాజ్యంగా మారిపోతుండడం ప్రపంచీకరణ... హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ నుంచి ఒక ప్రయాణీకుడు ‘ఓలా’ క్యాబ్ ఎక్కి సికిందరాబాద్ రైలుస్టేషన్‌కు వెళ్లి తిరిగి వచ్చాడు! వెళ్లినప్పుడు ‘క్యాబ్’ ప్రయాణ శుల్కం నూట యాబయి రూపాయలు, గంట తరువాత తిరిగి వచ్చినప్పుడు అదే దూరానికి నాలుగువందల యాబయి రూపాయలు.. ఇదీ ‘డైనమిక్’ ప్రయిజింగ్! ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’- విదేశీయ సంస్థల- వికృత స్వభావం స్వదేశీయ ప్రభుత్వేతర సంస్థలను ఆవహించి ఉంది. ప్రభుత్వేతర సంస్థల స్వభావం ప్రభుత్వరంగ సంస్థలను ఆవహించి ఉంది. ఇదీ ప్రపంచీకరణవల్ల మనకు జరిగిన ‘‘మేలు’’! అందువల్ల ఈ ‘డైనమిక్ ప్రయిసింగ్’ పద్ధతి ప్రభుత్వ సంస్థల బస్సులలోను, రైలు సంస్థలలోను కూడ అమలు జరుగుతోంది. పూణె నగరం నుంచి హైదరాబాద్‌కు ‘స్లీపర్ క్లాస్’- శయనయానం- టిక్కెట్టు వెల మూడువందల ముప్పయి రూపాయలు. కానీ ప్రీమియర్ ‘తత్కాల్’ టిక్కెట్టు ధర వెయ్యినుంచి పది హేనువందల రూపాయల మధ్య నడుస్తోందట! హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి ఒకే సంస్థవారి విమానంలో మూడువేల రూపాయలు ప్రయాణ శుల్కం కావచ్చు లేదా పదకొండు వేల రూపాయలు కావచ్చు! అదే విమానం, అదే ప్రయాణం.... దోపిడీ జరిగిపోతున్న తీరు ఇది!
హైదరాబాద్‌లో ‘ఆటోరిక్షా’లో పయనించడానికి ప్రభుత్వం నిర్ధారించిన కనీసపు ధర ఇరవై రూపాయలు. ‘ఓలా’ సంస్థవారు ఈ కనీసపు శుల్కాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకు పెంచేశారు. ఇలా వాణిజ్య సంస్థలు సమాంతర ప్రభుత్వాలను నిర్వహిస్తుండడం హరించిపోతున్న దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి మరో నిదర్శనం. అందువల్ల ‘ఆటోరిక్షాల’లో మీటర్లు తిరగవు. చోదకులు చెప్పినంత సొమ్మును ప్రయాణీకులు ఇవ్వాల్సిందే..!