సంపాదకీయం

‘చైనా’పై చైనా దాడి..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తైవాన్‌ను తమ దేశంలో కలుపుకొని తీరుతామని చైనా ప్రభుత్వం హెచ్చరించడం చైనా దురాక్రమణ చరిత్రలో భాగం.. టిబెట్, సింకియాంగ్, మంచూరియా, మంగోలియా భూభాగాలను శతాబ్దుల తరబడి దురాక్రమించిన చైనా ఇప్పుడు తైవాన్‌పై కనే్నసింది. తైవాన్‌ను తమ దేశంలో కలుపుకొనడానికై బలప్రయోగం చేయడానికి వెనుకాడబోమని నియంతృత్వ రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి ఉన్న, నవ చైనా అధ్యక్షుడు ఝీ జింగ్‌పింగ్ బుధవారం బెదిరించడం ఇరుగుపొరుగు దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతున్న వైఖరికి మరో నిదర్శనం. ఆర్థికంగా తెగబలసి ఉన్న ఈ ‘కమ్యూనిస్టు’ చైనా ఆగ్నేయ, పూర్వ ఆసియా ప్రాంతాల దేశాలకు వ్యతిరేకంగా యుద్ధోన్మాదాన్ని ప్రకటిస్తుండడం దశాబ్దుల చరిత్ర. చైనాకు, వియత్నాంకు, ఫిలిప్పీన్స్‌కు మధ్య ఉన్న సముద్ర జలాలలోను, చైనాకు, జపాన్‌కు మధ్య ఉన్న సముద్ర జలాలలోను అనేక చిన్నచిన్న ద్వీపాలు నెలకొని ఉన్నాయి. ఈ దీవులను దురాక్రమించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాల పట్ల వియత్నాం, పిలిఫ్పీన్స్ తదితర ఆగ్నేయ ఆసియా దేశాలు, జపాన్, దక్షిణ కొరియా వంటి ఈశాన్య ఆసియా దేశాలు నిరసనలను తెలుపుతూనే ఉన్నాయి. 1949లో చైనాలో కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థ నెలకొన్నప్పటి నుంచి ఈ తూర్పు ఆసియా ప్రాంత ప్రజాస్వామ్య దేశాల పట్ల, ఇతరేతర నియంతృత్వ దేశాల పట్ల చైనా శత్రుత్వం వహిస్తోంది. చైనా దురాక్రమణను ప్రతిఘటించడం లక్ష్యంగా ‘ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి’- అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్- ఆసియాన్- ఏర్పడడం చరిత్ర. ఈ శతాబ్ది ఆరంభం వరకూ ‘కమ్యూనిస్టు’దేశంగా ఉండిన సమయంలో చైనా అభివృద్ధిని సాధించలేదు. ‘కమ్యూనిస్టు’ ఆర్థిక సిద్ధాంతాలను వదిలించుకున్న చైనా ‘వికేంద్రీకృత వ్యవసాయ వ్యవస్థ’ను ఏర్పాటు చేసుకొంది. ఈ వికేంద్రీకృత వ్యవస్థ వేల లక్షల ఏళ్లుగా భారతదేశంలో పరిఢవిల్లిన దోపిడీకి అవకాశం లేని మానవీయ ఆర్థిక రీతి. కానీ ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత చైనా క్రమంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది, ఇతర దేశాలకు వ్యతిరేకంగా వాణిజ్య దురాక్రమణను కొనసాగిస్తోంది. ఈ ఆర్థిక దురాక్రమణ ద్వారా పెద్ద ‘స్వేచ్ఛా విపణ’గాను ‘వాణిజ్య సామ్రాజ్య’ శక్తిగాను అవతరించిన నియంతృత్వ నవ చైనా రాజకీయ దురాక్రమణకు పూనుకొనడం నడుస్తున్న చరిత్ర. ఈ రాజకీయ దురాక్రమణలో భాగం ‘తైవాన్’ను తమ దేశంలో కలుపుకుంటామన్న హెచ్చరిక! ప్రశాంత మహాసాగరానికి పడమరగా వ్యాపించి ఉన్న అంతర్జాతీయ సముద్ర జలాలను తమ సార్వభౌమ జలాలుగా మార్చుకొనడానికి దశాబ్దికి పైగా చైనా చేస్తున్న యత్నాలు బుధవారం నాడు ఝీ జింగ్‌పింగ్ ఆవిష్కరించిన దురాక్రమణ వ్యూహానికి వికృతమైన నేపథ్యం!
వివిధ దేశాలు కలసి ఒకే దేశంగా ఏర్పడడం, ఒకే దేశంగా ఉండిన ప్రాంతాలు విడిపోయి ప్రత్యేక స్వతంత్ర దేశాలుగా ఏర్పడడం చరిత్ర. కానీ రెండు దేశాలు పరస్పరం అంగీకారంతో కలసిపోవచ్చు. 1989-1990లో ఉభయ జర్మనీ దేశాలు కలసిపోయి మళ్లీ ఏకీకృత జర్మనీ ఏర్పడింది. 1945 నుంచి, రెండవ ప్రపంచయుద్ధం ముగిసినప్పటి నుంచి 1989వరకు రెండు జర్మనీలు కొనసాగాయి. రెండు వియత్నాంలు కూడ కలసిపోయి ఏకీకృత వియత్నాం ఏర్పడింది. రెండు కొరియాలు కలసిపోవాలన్న ఆకాంక్ష కూడా ప్రజలలో వ్యక్తం అవుతోంది. ఈ ‘ఏకీకరణ’ స్వచ్ఛందంగా జరిగినప్పుడు పేచీ లేదు. ఒక దేశాన్ని బలవంతంగా మరొక దేశం ఆక్రమించడం అన్యాయం, అమానవీయం. 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయిన ‘బంగ్లాదేశ్’ను మళ్లీ కలుపుకుంటామని పాకిస్తాన్ పాలకులు ప్రకటించినట్టయితే బంగ్లాదేశ్ ప్రజలు ఊరుకోరు, ప్రతిఘటిస్తారు! కమ్యూనిస్టు రష్యా దశాబ్దులపాటు పదునాలుగు స్వతంత్ర దేశాలను ఆక్రమించి కలుపుకొంది. ఈ బలవంతపు ‘ఏకీకరణ’ ఎంతో కాలం నిలువలేదు, 1990లో కమ్యూనిస్టు నిరంకుశ వ్యవస్థ కూలిపోగానే ఇష్టం లేని ఏకీకరణకు గురైన పదునాలుగు దేశాలు రష్యా నుంచి విడిపోయాయి, స్వతంత్ర దేశాలుగా ఏర్పడినాయి. ఈ ‘చరిత్ర’ తెలిసినప్పటికీ తైవాన్‌ను బలవంతంగా తమ దేశంలో కలుపుకోనున్నట్టు నియంతృత్వ చైనా ప్రకటించడం దురహంకార ప్రదర్శనం..!
ఒకే చైనా రెండు చైనాలుగా ఏర్పడడం 1949లో మావో సేటుంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ వారు తుపాకీ గొట్టం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకున్న ఫలితం. క్రీస్తుశకం 1644 నుంచి చైనాలో నెలకొని ఉండిన క్వింగ్- మంచూ- రాజుల పాలన 1911లో ముగిసింది, చైనాలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. సన్ యట్ సేన్ తరువాత చైనా నాయకత్వం స్వీకరించిన చాంగ్ కయ్ షేక్ కాలంలో అంతర్యుద్ధం చెలరేగింది. వివిధ వర్గాల మధ్య, ప్రాంతీయ శక్తుల మధ్య ఆరంభమైన ఈ ‘లోపలి కుమ్ములాట’ క్రమంగా జాతీయతా శక్తులకూ, కమ్యూనిస్టులకూ మధ్య సమరంగా మారింది. 1949లో ఈ సమరం ముగిసేనాటికి రెండు ‘చైనాలు’ఏర్పడినాయి. చైనా ప్రధాన భూభాగాన్ని- అప్పటికి దాదాపు ముప్పయి ఒక్క లక్షల చదరపు మైళ్ల లేదా ఎనబయి నాలుగు లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని- కమ్యూనిస్టులు ఆక్రమించుకున్నారు. అందువల్ల చాంగ్ కయ్ షేక్ నాయకత్వంలోని జాతీయతా శక్తులు ప్రధాన భూభాగంనుంచి వైదొలగిపోయారు. ప్రధాన భూమికి ఆగ్నేయంగా సమీపంలోని సముద్రంలో నెలకొని ఉన్న తైవాన్ ద్వీపానికి ‘వలస’పోయారు. ఇలా తైవాన్‌ను మాత్రమే తమ అధీనంలో ఉంచుకోగలిగిన జాతీయతా శక్తులు తమ దేశానికి ‘జాతీయ చైనా’అని పేరు పెట్టుకున్నారు. క్రమంగా ‘జాతీయ చైనా’లో బహుళపక్ష ప్రజాస్వామ్యం వ్యవస్థీకృతమైంది. కేవలం పదునాలుగు వేల చదరపు మైళ్ల- ముప్పయి ఆరువేల చదరపు కిలోమీటర్ల- దాదాపు రెండున్నర కోట్ల జనాభాకల చిన్న దేశమైన ‘జాతీయ చైనా’ను 1971వరకు ఐక్య రాజ్యసమితి మాత్రమేకాక అత్యధిక దేశాలు అసలు చైనాగా గుర్తించాయి. ప్రధాన భూభాగాన్ని ఆక్రమించుకొని ‘ఏకపక్ష నియంతృత్వ రాజ్యాంగ వ్యవస్థ’ను ఏర్పాటుచేసిన మావో సేటుంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టులు తమ దేశానికి ‘నవ చైనా’అని పేరు పెట్టుకున్నారు. ఇలా రెండు స్వతంత్ర చైనా దేశాలు ఏర్పడినాయి. ఐక్యరాజ్యసమితి 1945లో ఏర్పడినప్పుడు, ఐదు దేశాలకు ‘సమితి’ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఈ శాశ్వత సభ్యదేశాలు. 1949 తరువాత ‘సమితి’ సభ్యత్వం, భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం చిన్నదైన ‘జాతీయ చైనా’కు లభించాయి. కమ్యూనిస్టు ‘నవ’చైనాకు సమితిలో సభ్యత్వం లభించలేదు. అప్పటి మన ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1949-1962 సంవత్సరాల మధ్య ఈ కమ్యూనిస్టు చైనాకు ‘సమితి’లో సభ్యత్వం కల్పించాలని ప్రచారం చేశాడు. నవ చైనాకు ‘సభ్యత్వం’ లేకపోవడం వల్లనే విశ్వశాంతికి విఘాతం కలిగిపోతోందని నెహ్రూ అంతర్జాతీయ వేదికలపై అనేకసార్లు అభిభాషించడం చరిత్ర.. మన ప్రధాని చేసిన ఈ ప్రచారానికి ‘కృతజ్ఞత’ను 1962లో ‘నవ’చైనా ఆవిష్కరించింది, మన దేశాన్ని దురాక్రమించింది. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ‘జాతీయ చైనా’ను ‘‘సముద్రంలో ముంచాడు’’, కమ్యూనిస్టు చైనాతో చేతులు కలిపాడు! ఫలితంగా 1971లో ‘జాతీయ చైనా’ను ‘సమితి’ నుంచి వెళ్లగొట్టారు. ‘నవ చైనా’కు ‘సమితి’లో సభ్యత్వం, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభించాయి.
జాతీయ చైనా తన పేరుమార్చుకొని ‘‘ఐక్యరాజ్యసమితి సభ్యత్వం లేని’’ తైవాన్ దేశంగా స్థిరపడింది. కమ్యూనిస్టు నియంతృత్వ దేశమైన నవ చైనా, పెట్టుబడిదారీ- కాపటలిస్ట్- చైనాగా రూపుమార్చుకొనడం ‘ప్రపంచీకరణ’ ఫలితం! నిజానికి తైవాన్ అనాదిగా చైనాలో భాగం కాదు. ఇతర దేశాలను ఆక్రమించినట్టుగానే తైవాన్‌ను కూడ చైనా 1683లో ఆక్రమించింది. 1895 నుంచి 1945వరకు తైవాన్ జపాన్ అధీనంలో ఉండేది. అందువల్ల మన నేతాజీ సుభాస్ చంద్రబోసు 1945లో తైవాన్ రాజధాని తైపీకి వెళ్లగలిగాడు..