సంపాదకీయం

రాజకీయ ‘రసాయనం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమి లేని ‘మడక’ దున్ని, నీరు లేని ‘నారు’ పోసి, కంకి లేని ‘చేను’ కోద్దామా.. ఊరికంతా ‘విందు’ చేద్దామా!- అన్నది గ్రామీణ ప్రాంతాలలో ‘బైరాగులు’ పాడుకునే పాట..! ఈ పాటలో గొప్ప వేదాంతముందట. ‘జగత్ మిథ్యా’ అద్వైత సారం నిహితమై ఉందట. కానీ జీవన వ్యవహారంలో ఈ ‘మిథ్య’ సత్యంగా కనిపిస్తోంది, రాజకీయాలలో ఇది మరింతగా ప్రస్ఫుటిస్తోంది.. అందువల్ల రాజకీయాలలో భూమి లేకుండా ‘నాగలి’తో దున్నడం కుదరదు. ‘కుదురుతుంది..’అని అంటున్న ప్రాంతీయ, రాజకీయ పక్షాల ‘పొత్తు’ల ప్రహసనం వింత గొలుపుతోంది. చట్టసభలకు త్వరలో జరుగనున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం ఈ ‘పొత్తు’ల ప్రహసనంలో సరికొత్త వింత! భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ‘ఏర్పడుతున్న’ మహాకూటమికి రాజకీయ ‘రూపశిల్పి’ తెలుగుదేశం పార్టీ- తెదేపా- అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ జాతీయ ‘మహాకూటమి’ ‘రూపం’- ఫిజిక్స్- ఏమిటో ‘శిల్పం’- కెమిస్ట్రీ- ఏమిటో ఇంకా స్పష్టం కాలేదు. కానీ ఈ ‘కూటమి’లో ప్రధాన పక్షం కాంగ్రెస్ కాగా, కీలక పక్షం ‘తెదెపా’ అన్నది జరుగుతున్న ప్రచారం. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ వరిష్ఠత- పొలిటికల్ సీనియారిటీ- తెలుగుదేశం పార్టీకి ఈ కూటమిలో ‘కీలక స్థానం’ లభించడానికి ప్రధాన కారణం! ఇంతకాలం జాతీయ రాజకీయాలలో ‘విదూషకుడి’గా, ‘నోటిలో కాలు పెట్టుకునే’ ప్రవృత్తికి సజీవ రూపంగా ‘అలరారిన’ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడు ‘రాజకీయ గాంభీర్యానికి’ ప్రతిరూపంగా మారాడు.. మారాడని ప్రచారం జరుగుతోంది. ఈ మహా మార్పునకు ప్రాతిపదిక చంద్రబాబు ప్రతిపాదించి ప్రచారం చేస్తున్న ‘్భజపా’ వ్యతిరేక జాతీయ మహాకూటమి! అందువల్ల జాతీయ మహాకూటమిలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్‌కూ, కీలక పక్షమైన ‘తెదెపా’కు మధ్య ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలలోను, శాసనసభ ఎన్నికలలోను పొత్తు ఏర్పడడం ఖాయమన్నది జనానికి కలిగిన తార్కికమైన, సహజమైన అభిప్రాయం! కానీ తమ పార్టీకి, ‘తెదెపా’కు మధ్య ఎలాంటి పొత్తు ఆంధ్రప్రదేశ్‌లో ఉండబోదన్నది బుధవారం విజయవాడలో కాంగ్రెస్ నాయకులు తేల్చిచెప్పిన మాట. ఇది కేవలం కాంగ్రెస్ ప్రాంతీయ నాయకుల అభిప్రాయం కాదట, కాంగ్రెస్ అధిష్ఠానం వారి నిర్ణయమట! తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నాడన్నది ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పిన మాట! కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ సంస్థాగత వ్యవహారాల నిర్వాహకుడు ఊమెన్ చాందీ కూడా ‘తెలుగుదేశంతో లేని పొత్తు’ను గురించి ధ్రువపరచడం ఇంకా పూర్తిగా ఏర్పడని ‘జాతీయ మహాకూటమి’లో కల్లోలం కలిగించవలసిన పరిణామం! ఆంధ్రప్రదేశ్‌లోని ఇరవై ఐదు లోక్‌సభ స్థానాలలోను, నూట డెబ్బయి ఐదు శాసనసభ స్థానాలలోను కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేయనున్నదట...
కల్లోల ప్రకంపనలు వినిపించకపోవడానికి ఒక ప్రధాన కారణం బుధవారం కాంగ్రెస్‌లో సంభవించిన మరో మహాపరిణామం. తన సోదరి ప్రియాంకా వాద్రాను రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఈ మహాపరిణామం. రెండవది చంద్రబాబు ఏర్పాటు చేయతలపెట్టిన ‘్భజపా’ వ్యతిరేక ‘జాతీయ మహాకూటమి’కి ఇంకా ‘కెమిస్ట్రీ’కాని ‘్ఫజిక్స్’కానీ ఏర్పడకపోవడం! ‘రాజకీయ శాస్త్రం’లోకి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం ఎప్పుడు చొరబడిపోయాయన్నది ‘పరిభాష’ అర్థం కాని ప్రజలు అడుగుతున్న ప్రశ్న.. ఏ రాజకీయవేత్త ఏ పార్టీలోకి ఎప్పుడు చొరబడిపోతున్నాడు? ఏ రాజకీయవేత్త ఏ పార్టీనుంచి ఎప్పుడు ఉడాయిస్తున్నాడు?? అన్నవి మాత్రమే జనానికి అర్థవౌతున్న మహా విషయాలు! అందువల్ల ‘కెమిస్ట్రీ’ ‘్ఫజిక్స్’ ప్రాతిపదికగా రాజకీయాలను విశే్లషిస్తున్న ‘కుతూహల జనకుల’కు విజయవాడలో గురువారం కాంగ్రెస్ నిర్వహించిన రాజకీయ విస్ఫోటన రవాలు ఇంకా వినబడినట్టు లేదు. వీరందరూ ప్రియాంకమ్మకు పార్టీ పదవి లభించడం వల్ల సంభవించబోయే పరిణామ ప్రభావ పరిమాణం గురించి, విస్తృతికి గురించి చర్చించడంలో నిమగ్నులై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వోట్ల సంఖ్య పదిహేడు శాతానికి పెరిగిందన్న అంచనాలు నిజమైతే, కాంగ్రెస్ ఒంటరి పోరువల్ల ‘తెదెపా’, వైఎస్‌ఆర్ కాంగ్రెస్- వైకాపా- రాజకీయ భవితవ్యాలు ప్రభావితం కాకమానవు! 2014లో తుడిచిపెట్టుకొనిపోయిన కాంగ్రెస్ పార్టీకి పెరిగిన వోట్లు ఏ పార్టీకి తరిగిపోయాయన్నది ‘కెమిస్ట్రీ’ విశే్లషకులు నిగ్గుతేల్చదగిన ‘ఉత్కంఠ జనకమైన’ వ్యవహారం.. కుతూహలంతో కుతకుతలాడిపోతున్న వారికి ఇది కొండంత ‘మేత’..
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కూ ‘తెదేపా’కు మధ్య ‘పొత్తు’లేనట్టయితే లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో మాత్రం ఉభయ పక్షాల మధ్య ‘కలసికట్టుతనం’ ఎలా కొనసాగ గలదు? జాతీయ స్థాయిలో ‘ భాజపా’ వ్యతిరేక ‘సంఘటన’ ఏర్పడడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి ప్రధాన ప్రేరణ కాంగ్రెస్ నుంచి లభిస్తోంది. ప్రాంతీయ స్థాయిలో లేని ‘పొత్తు’ జాతీయస్థాయిలో విచ్చుకోగలదన్నది ‘నేల విడిచి’ సాము చేయడం మాత్రమే కాగలదు. రాజకీయాలలో సైద్ధాంతిక సారూప్యం, భాగస్వామ్య పక్షాల సమీకృతి వంటివి అవాఙ్మనస గోచరమైన బ్రహ్మపదార్థం వంటివి. గోచరమవుతున్నది ఏయే పక్షానికి ఎన్ని స్థానాలలో ఎంత బలం ఉందన్నది మాత్రమే! ఇదీ రాజకీయ వ్యవహార వాస్తవం! అందువల్ల ప్రధాన ప్రత్యర్థిని- ప్రస్తుతం ‘ భాజపా’ను- కలిసికట్టుగా ఎదిరించదలచిన పక్షాలు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడ పరస్పరం తలపడరాదు. అలా తలపడడం ‘కూటమి’ స్ఫూర్తికి విరుద్ధం, ప్రధాన ప్రత్యర్థికి లాభదాయకం! ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై ఐదు స్థానాలలో పరస్పరం తలపడే ‘తెదెపా’, కాంగ్రెస్‌లు పరస్పరం దూషణ, తిరస్కార, ఆరోపణలకు పాల్పడక మానవు. అలాంటప్పుడు ఇక్కడ పరస్పరం తిట్టుకుంటూ, తిట్లు మితిమీరినప్పుడు ‘కొట్టుకుంటూ’ జాతీయ స్థాయిలో మాత్రం మైత్రిని అభినయించడంలో ఔచిత్యం ఏమిటి? జాతీయ స్థాయిలోని ఈ ‘ఉత్తుత్తి’ మైత్రి ‘్భమి లేనిచోట నాగలితో దున్నడం’ వంటిది! జాతీయ స్థాయి మైత్రివల్ల కాంగ్రెస్‌కు కాని, తెదెపాకు కానీ ఏ నియోజకవర్గంలో ఎంత మేలు జరుగుతుంది? కర్నాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని ‘లౌకిక జనతాదళ్’ పరస్పరం ఢీకొన్నాయి, కార్యకర్తల మధ్య కుమ్ములాటలు కొట్లాటలు తిట్లాటలు జరిగాయి. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈ రెండు పార్టీలు కలసిపోయాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత కూడ ఇలా పరస్పరం ఎన్నికలలో తలపడిన సైద్ధాంతిక వైరుధ్య పక్షాలు కలసిపోవచ్చు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు! దానికోసం ఎన్నికలకు ముందుగా ‘కూటమి’ని ఏర్పాటు చేయనక్కరలేదు. ‘కూటమి’అంటే కూటమి లోని పక్షాలు కలసికట్టుగా ప్రధాన ప్రత్యర్థితో తలపడాలి, పరస్పరం తలపడరాదు. ‘స్నేహ పూర్వతమైన పోటీ’ అన్నది రాజకీయ ఆత్మవంచన..
భాజపా వ్యతిరేక కాంగ్రెస్ ‘సహిత’ మహాకూటమి నిర్మాణంలో నిహితమై ఉన్న వైరుధ్యాలకు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నిర్ణయం సరికొత్త ప్రతీక! ఎనబయి లోక్‌సభ స్థానాలున్న అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లోనే ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్ కూటమికి దూరంగా ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ కూడ కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తునకు సుముఖంగా లేదు.. తమిళనాడు, కర్నాటక, మహారాష్టల్రలో మాత్రమే కాంగ్రెస్‌తో జట్టుకట్టడానికి ఇతర పక్షాలు సిద్ధంగా ఉన్నాయి.. దీనివల్ల జాతీయ మహాకూటమి ఎలా సాధ్యం...? ‘కెమిస్ట్రీ’ ఏదీ??