సంపాదకీయం

రాజకీయ కుంభమేళా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివేణీ సంగమ స్థలి ప్రయాగ క్షేత్రంలో జరుగుతున్న ‘కుంభమేళా’- హైందవ జాతీయ సాంస్కృతిక ప్రతీకలలో అతి ప్రధానమైనది. రాజకీయ వేత్తలు ‘కుంభమేళా’ సంగమ స్థలికి వరదలెత్తుతుండడం నడుస్తున్న కథ. ఈ దేశపు సంస్కృతి ఈ జాతికి ఆత్మ వంటిది. అందువల్ల రాజకీయవేత్తలు ఆత్మతత్త్వాన్ని, జాతీయ ఆత్మతత్త్వాన్ని గ్రహించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్న మహా విషయం. దేశం నలుచెఱగుల నుంచి మాత్రమే కాక విదేశాల నుంచి సైతం వస్తున్న యాత్రికులు ఈ సాంస్కృతిక సమారాధనలో భాగస్వాములు అవుతున్నారు. కోట్ల మంది గంగా యమున సరస్వతీ నదుల కూడలి వద్ద స్నానం చేయడం ‘కుంభమేళా’ సందర్భంగా ప్రస్ఫుటిస్తున్న మహాదృశ్య మాలిక! ఈ దృశ్య మాలిక నిర్ణీత కాలవ్యవధిలో పునరావృత్తం అవుతుండడం అనాది.. యుగయుగాలుగా ‘ప్రయాగ’వద్ద కుంభమేళా- ‘కుంభమేలా’ జరుగుతోంది. పనె్నండు ఏళ్లకొకసారి పునరావృత్తం అవుతున్న ఈ ‘దృశ్యాలు’ అనాదిగా పునరావృత్తం అయ్యాయి, అనంతంగా పునరావృత్తం కానున్నాయి. సంస్కృతి ‘సనాతనం’. అంటే శాశ్వతమైనది. దేశం, జాతి శాశ్వతమైనవి. రాజకీయం, రాజ్యాంగ వ్యవస్థలు మారవచ్చుకాక.. రాజకీయవేత్తలకు ‘సంస్కృతి’ స్ఫురించడం అందువల్ల సహజం కావాలి! కానీ మన దేశంలోని రాజకీయవేత్తలలో అత్యధికులకు ‘సాంస్కృతిక తత్త్వం’ గురించిన ధ్యాస లేదు. ఎన్నికలలో గెలవాలన్నది మాత్రమే రాజకీయవేత్తలకు ప్రధానమైన లక్ష్యమన్నది నిరాకరింపజాలని నిజం.. అయితే ప్రస్తుతం ప్రయాగ వద్ద జరుగుతున్న ‘కుంభమేలా’ రాజకీయవేత్తలకు ‘సంస్కృతి స్ఫురణ’ను కలిగించినట్టు గొప్ప ప్రచారం జరుగుతోంది. ‘జన వాక్యంతు కర్తవ్యం’- ప్రజల మాట పాటించదగినది- అన్నది పాలకులకు మన దేశంలో తరతరాలుగా మార్గదర్శక సూత్రం. అందువల్ల జనం నడచిన బాటలో తాము కూడ అన్నట్టు మన దేశంలో పాలకులు నడవడం చరిత్ర. ఇదీ ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఈ స్ఫూర్తి మన దేశంలోనే అంకురించింది, పల్లవించింది, ఫలించింది, పరిమళించింది. కానీ శతాబ్దుల విదేశీయుల దురాక్రమణ ఈ స్ఫూర్తిని దిగమింగింది. విదేశాల నుంచి వచ్చిపడిన బీభత్సకారులు ‘పాలకులు’గా చెలామణి అయ్యారు. ఈ ‘పాలకులు’ నిజానికి దొంగలు, దోపిడీకారులు, బీభత్సకారులు, ఈ మాతృభూమి పట్ల మమకారం లేనివారు.. ఈ వైపరీత్యం స్వజాతీయులను సైతం ఆవహించడం, చిత్తవృత్తిని ప్రభావితం చేయడం తరువాతి కథ. బ్రిటన్ విముక్త భారత్‌లో ఈ వైపరీత్యం నుంచి విముక్తమై ‘సంస్కృతి’ ధ్యాసను జాతీయతా నిష్ఠను పొందగలిగిన రాజకీయవేత్తల సంఖ్య చాలా తక్కువ. జాతీయతను ‘మతం’గాను, జాతీయ సాంస్కృతిక నిష్ఠను ‘మత తత్త్వం’గాను చిత్రీకరించిన బ్రిటన్ మేధావులు మన ‘జాతి’ని వివిధ కృత్రిమ సిద్ధాంతాలతో విడగొట్టడానికి యత్నించారు. జాతీయ ఉత్సవాలు ‘మత’ఉత్సవాలుగాను, జాతీయ మహాపురుషులను కేవలం ఒక మతానికి పరిమితమైన ‘సంకుచిత’ జీవనులుగాను బ్రిటన్ వారు ప్రచారం చేసి వెళ్లారు! అందువల్ల రాజకీయవేత్తలు ‘జాతీయత’ను ‘మతోన్మాదం’గా భావించి, భ్రమించి జాతీయ ప్రధాన స్రవంతికి దూరంగా సమాంతర పదవీ స్వామ్యస్రవంతులను ప్రవహింపచేశారు...
క్రమంగా ఈ కృత్రిమ రాజకీయ ప్రవాహాలు జాతీయ మహాప్రవాహంలో కలసిపోతుండడం శుభ సూచకం. ‘‘జన వాక్యంతు కర్తవ్యం!’’ ఈ పరిణామం ప్రస్తుతం మరింతగా ప్రస్ఫుటిస్తోంది. ప్రయాగ ‘కుంబమేళా’కు తరలివెడుతున్న జనం వెంట రాజకీయ నాయకులు కూడ తరలి వెడుతున్నారు- కొందరు జనం కంటె ముందే ప్రయాగ- అలహాబాద్-ను చేరుకుని తీర్థయాత్రికులకు స్వాగతం చెపుతున్నారు. ‘జనం మెచ్చే పనులు చేయాలన్నది..’ రాజకీయ నాయకులకు ఇప్పుడు వంటబట్టిన పాఠం! జనం మెచ్చే పనులను కొందరు రాజకీయవేత్తలు చేస్తున్నారు. ఇది వారి స్వభావం... జాతీయతా తత్త్వ నిష్ఠ ఈ స్వభావానికి ప్రాతిపదిక! ‘జనం మెచ్చే పనులను చేస్తున్నట్టు’ అధికాధిక రాజకీయవేత్తలు అభినయిస్తున్నారు.. ఇది కృత్రిమత్వం. ‘అధికారం’ పరమావధి అయిన పదవీ స్వామ్యం ఈ ‘కృత్రిమ తత్త్వాని’కి ప్రేరణ కలిగిస్తోంది. ఎవరు నిజంగా జాతీయ నిష్ఠాపరులు? ఎవరు అభినయవేత్తలు?? అన్నది ప్రజలకు తెలుసు... అందువల్ల కొందరి ‘సహజత్వం’, మరికొందరి ‘కృత్రిమత్వం’ రానున్న లోక్‌సభలో పరస్పరం ఢీకొననున్నాయి. ప్రయాగకు పరుగులుతీసి స్నానాలు చేస్తున్న రాజకీయవేత్తలు ఈ సంగతిని గ్రహించాలి! నిజంగా అభిజ్ఞత పెరిగి, మానసిక పరివర్తన జరిగి రాజకీయవేత్తలందరూ జాతీయ భావనిష్ఠులు కావచ్చు.. అందుకు రానున్న ‘ఎన్నికలు’, ‘జయాపజయాలు’ పరమావధి కాదు. ఈ పరివర్తనకు ప్రాతిపదిక సుదీర్ఘ, శాశ్వత జాతీయ జీవన లక్ష్యాలు...
ఈ శాశ్వత జాతీయ జీవన లక్ష్యాలను పరిరక్షించడం పెంపొందించడం అనాదిగా ఈ దేశ ప్రజల స్వభావం! ఈ స్వభావం ‘‘మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః’’- భూమి తల్లి, నేను ఆమె బిడ్డడను- అని వేదం వివరిస్తున్న సృష్టిగత వాస్తవ భూమికపై వికసించింది. వికసిస్తోంది! ఈ ప్రాకృతిక సత్యం భారతీయులకు మాత్రమే కాదు, భూమిపై పుట్టి పెరుగుతున్న ఇతర దేశాల వారికి, సమస్త జీవజాలానికి సనాతనం- శాశ్వతం-గా అన్వయం అవుతోంది. మానవేతర జంతుజాలం జీవజాలం ఈ వాస్తవాన్ని గుర్తించినట్టు మానవులకు తెలీదు. కానీ భారత ఖండంలోని ప్రజలు మాత్రం అనాదిగా సృష్టిగతమైన ఈ సత్యాన్ని జీవన వాస్తవంగా మలచుకోగలిగారు. అందువల్లనే భూమిపట్ల కల ఈ మాతృభావం ఈ దేశంలోని వివిధ మత భాషా ప్రాంతీయ ‘జన సముదాయాల’ను ఒక జాతిగా ఒకే జాతిగా అనాదిగా వికసింపచేసింది. అనంతంగా ఈ దేశ ప్రజలు ఒకే జాతిగా కొనసాగడానికి ఈ స్వభావ పరిరక్షణ వౌలికమైనది. స్వభావం తత్త్వం.. ఉత్సవం ఈ స్వభావాన్ని ప్రస్ఫుటింపచేసే స్వరూపం! పర్వతాలు, నదులు, వివిధ ప్రాంతాలు ఈ స్వభావాన్ని ప్రస్ఫుటింపచేస్తున్న స్వరూప మాధ్యమాలు. అందువల్ల ఉత్సవ స్థలాలు భరత భూమి స్వరూపమంతటా విస్తరించాయి. పనె్నండు ప్రధానమైన నదులకు పనె్నండు సంవత్సరాలలో జరిగే పుష్కర ఉత్సవాలు ఈ సనాతన జాతీయతత్త్వ నిష్ఠను ప్రస్ఫుటించే ప్రతీకలు.. ప్రయాగ, ఉజ్జయిని, నాసికా త్య్రంబక, హరిద్వార క్షేత్రాలలో జరుగుతున్న ‘అర్ధ కుంభమేలా’, కుంభమేలా, పూర్ణకుంభమేలా ఉత్సవాలు భరతమాత స్వరూప సందర్శనను కలిగిస్తున్న శుభంకర మాధ్యమాలు. నూట నలబయి నాలుగు ఏళ్లకోసారి జరిగే ‘మహా పూర్ణకుంభమేలా’ జాతీయ జీవన ప్రస్థానంలో ‘కాలగణన’కు మరో శాశ్వత చిహ్నం. ఒక కుటుంబం వారు మరో కుటుంబాన్ని సందర్శించినట్టు సింహళం నుంచి కైలాసం వరకు విస్తరించిన భరతభూమి సందర్శనకు ఈ ఉత్సవాలు మాధ్యమాలు కావడం చరిత్ర.. ఇదంతా జాతీయ కుటుంబ ప్రాంగణం! ఈ స్వరూపంలో నిహితమై ఉన్న స్వభావం ‘వసుధైవ కుటుంబం’- ‘ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం’!
రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక కథలో ‘‘ఒక దొంగ దొంగతనం చేసి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. పట్టుబడకుండా ఉండడానికై ఒక భక్తబృందంలో చేరిపోతాడు. కానీ సజ్జన సాంగత్యం వల్ల కొన్నాళ్లకు ఈ ‘నకిలీ భక్తుని’లో పరివర్తన వచ్చింది. అతడు దొంగతనాలు మానేసి మంచి మనిషిగా జీవించాడు.. ప్రయాగకు పరుగుతీసి ‘కృత్రిమ’ సాంస్కృతిక నిష్ఠను ప్రదర్శిస్తున్న రాజకీయవేత్తలు ఈ ‘సాంగత్యం’తో ఈ ప్రభావంతో నిజమైన, సహజమైన జాతీయ సంస్కృతి నిబద్ధులు కావచ్చు.. అలా జరిగితే జాతీయతకు అది మరో విజయం.. భరతమాతకు, భరతమాత బిడ్డలందరికీ ఆనందకరం..