సంపాదకీయం

‘ప్రగతి’కి ప్రాతిపదిక..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవుల నిర్మూలనకు మార్గం మరింత సుగమం కావడం గత ఐదేళ్ల చరిత్ర. హరిత పరిరక్షణ- ఆకుపచ్చదనాన్ని పంచే అడవుల రక్షణ- నియమాలను అతిగా పాటించరాదన్నది మాజీ ప్రధాని మన్‌మోహన్ నేర్పిన ప్రగతి పాఠం. ఇలా హరిత పరిరక్షణ నియమాలను అతిగా పాటించిన పర్యావరణ మంత్రి జైరామ్ రమేశ్‌ను మన్‌మోహన్ సింగ్ కోప్పడడం 2014వ సంవత్సరానికి ముందు నడచిన చరిత్ర. జైరామ్ రమేశ్‌ను పర్యావరణ శాఖ నుంచి మన్‌మోహన్ సింగ్ బదిలీ చేయడం కూడ చరిత్ర. పర్యావరణ పరిరక్షణ నియమాలు అతిగా పాటించినట్టయితే పారిశ్రామిక ప్రగతి ఆగిపోతుందన్నది మన్‌మోహన్ నేర్పిన పాఠం. పారిశ్రామిక ప్రగతి ఆగిపోయినట్టయితే ‘ప్రపంచీకరణ’ ఫలితంగా మన దేశంలోకి చొరబడిపోతున్న విదేశీయ, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల- మల్టీ నేషనల్ కంపెనీస్- మనుగడకు విఘాతం కలుగుతుంది. ‘ప్రపంచీకరణ’ ఫలితంగా వ్యవస్థీకృతమైన ‘స్వేచ్ఛా విపణి’- మార్కెట్ ఎకానమీ-కి మూల స్తంభాలు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’. ఉత్పత్తుల ధరలు, వస్తువుల ధరలు పెంచడంలో కాని తగ్గించడంలో కాని ప్రభుత్వానికి ఏమాత్రం ప్రమేయం ఉండరాదన్నది ‘స్వేచ్ఛా విపణి’ స్వభావం! వస్తువుల ‘లభ్యత’, వస్తువులకున్న ‘గిరాకీ’ ప్రాతిపదికగా ధరలు పెరుగుతుండాలట, తగ్గుతుండాలట! ‘లభ్యత’ను, ‘గిరాకీ’ని నియంత్రించే గురుతర బాధ్యతను ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ నెత్తికెత్తుకున్నాయి. ఇదీ స్వేచ్ఛా వాణిజ్యం! అందువల్ల ఈ ‘మార్కెట్ ఎకానమీ’ నిర్వాహకులైన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’లు కృత్రిమంగా కొరతను సృష్టించగలవు, ధరలను పెంచగలవు. ప్రపంచీకరణ వల్ల భారతీయ వాణిజ్య సంస్థలు కూడ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ స్వభావాన్ని పుణికిపుచ్చుకున్నాయి. ప్రజల అవసరాలు, న్యాయం, అన్యాయం, మానవత్వం వంటి భారతీయ ‘పరిభాష’ అంతరించి పోవడం ‘మార్కెట్ ఎకానమీ’ ప్రభావం. ‘గిరాకీ’, ‘లభ్యత’, ‘‘సర్జ్’’- వినియోగదారు ఆత్రుత-, డైనమిక్ ప్రయిజింగ్- జనం తొందరపడి లేదా అత్యవసరం కొద్దీ కొనుగోలు చేయడం వల్ల ధరలను పెంచడం- వంటివి ‘బహుళ జాతీయ వాణిజ్య నాగరికం’ కనిపెట్టిన అంతర్జాతీయ పరిభాష! రైతుల వద్ద వ్యాపారులు రెండు రూపాయలకు నాలుగు కిలోల చొప్పున ‘ఉల్లిగడ్డలు’, ‘టమాటాలు’ కొంటున్న సమయంలోనే, వ్యాపారుల వద్ద వినియోగదారులు ఇరవై రూపాయలకు కిలో చొప్పున ఉల్లిగడ్డలు, పాతిక రూపాయలకు కిలో చొప్పున టమాటాలు కొంటున్నారు. ఇదీ ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’- మార్కెట్ ఎకానమీ- కారణంగా ఏర్పడిన ‘డైనమిక్ ప్రయిజింగ్’! ఈ ‘వ్యవస్థ’ ఏర్పడడానికి ‘హరిత నియమాల’ను అతిగా పాటించడం అడ్డువస్తోంది, అడవులు, పచ్చని పొలాలు అడ్డువస్తున్నాయట! మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆచరించి ప్రచారం చేసిన ఈ పాఠాన్ని 2014 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వారు మరింత చిత్తశుద్ధితో అధ్యయనం చేసి ఆచరిస్తున్నారు!
‘అడవులు అంతరించి పోయినప్పటికీ నష్టం లేదు.. పరిశ్రమలు పెరగాలి, ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పడాలి! కాలుష్యం కేంద్రీకృతం కావాలి, కాలుష్య నిరోధం కోసం మళ్లీ పథకాలను రచించాలి! అమలు జరపాలి...’ ఇదీ మన్‌మోహన్ సింగ్ నేర్పిన పాఠం. అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్త నేర్పిన పాఠం! అందువల్ల అడవులను నరికివేసి, ఆకు పచ్చదనాన్ని చెరచివేసి ‘ఆర్థిక మండలాల’ను ఏర్పాటు చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం 2014 తరువాత హరిత నియమాలను మరింత సడలించింది.. ఫలితంగా పరిశ్రమలను, కాలుష్య కేంద్రాలను ఏర్పాటుచేయడానికి వీలుగా రూపొందిన పథకాలన్నింటికీ 2014 తరువాత కేంద్ర ప్రభుత్వం వారు అనుమతిని ప్రసాదించారట! 2009నుంచి 2013వరకు కాంగ్రెస్ నిర్వహణలోని కేంద్ర ప్రభుత్వం వారు ‘హరిత’ అనుమతి కోసం వచ్చిన పారిశ్రామిక ప్రతిపాదనలలో ‘ఎనబయి శాతం’ ఆమోదించారట! 2014- 2017 సంవత్సరాల మధ్య పరిశీలనకు వచ్చిన ఆరువందల ఎనబయి ఏడు ‘దరఖాస్తుల’లో ఆరువందల ఎనబయి రెండు ప్రతిపాదనలను నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఆమోదించిందట! ఇలా పారిశ్రామిక ప్రగతి- ఆకుపచ్చదనాన్ని హరించివేసే అభ్యుదయం- వేగం పుంజుకొంటోంది..ట!! ఇలా హరిత హననం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరోవైపు హరిత ప్రాంగణాలను ఏర్పాటు చేస్తుండడం సమాంతర పరిణామం...
ప్రత్యేక ఆర్థిక మండలాల ఏర్పాటు పేరుతో జరిగిపోయిన వాణిజ్య బీభత్సం గురించి జనంలో మళ్లీ ధ్యాస పెరుగుతుండడం మంచి పరిణామం. ప్రత్యేక ఆర్థిక మండలాల- స్పెషల్ ఎకనమిక్ జోన్స్- సెజ్‌లు- వరి పొలాలు కాలిపోయాయి, దగ్ధమయ్యాయి, తమలపాకుల తోటలు అరటి తోటలు కొబ్బరి తోటలు మామిడి తోటలు కూలిపోయాయి, ధ్వంసమయ్యాయి. గత ఐదేళ్లుగా ఈ దగ్ధకాండ, విధ్వంసకాండ తగ్గిపోయాయన్న భావం ఏర్పడింది. ఈ భావం ‘భ్రాంతి’ అన్నది ఇప్పుడు ధ్రువపడిన వాస్తవం. అటవీ హననం గురించి ప్రచారం కాలేదు. జరుగుతున్న ప్రచారమంతా కొత్తగా పెట్టుబడులు వస్తుండడం గురించి మాత్రమే! లేదా ‘లావణ్య’-స్మార్ట్- నగరాలు, అంతర్జాతీయ స్థాయి నగరాలు రూపొందుతుండడం గురించి ప్రచారవౌతోంది. ‘అమరావతి’ని పరిపాలనకు మాత్రమే పరిమితమైన అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మించి ఉండవచ్చు! నాలుగయిదు వేల ఎకరాల స్థలంలో చిన్న రాజధానిని ‘ఉద్యానవనాల’ నగరంగా నిర్మించి ఉండవచ్చు. కానీ ముప్పయిమూడు వేల ఎకరాలలో పచ్చదనాన్ని పాడుచేశారు, పొలాలను తోటలను నిర్మూలించారు. ఇప్పుడైనా పదివేల ఎకరాలలోపు భూమిపై రెండంతస్థులకు మించని విధంగా నగరాన్ని నిర్మించవచ్చు! మిగిలిన భూమిని తోటలు కూరగాయల మొక్కలు పెంచడానికి వినియోగించవచ్చు. చరిత్రలో ప్రపంచ ప్రసిద్ధికెక్కిన హంపీ విజయనగరాన్ని ఇలా నిర్మించారన్నది ధ్రువపడిన వాస్తవం! ఇళ్ల ప్రాకారం చుట్టూ తోటలు, పొలాలు.. తోటల పొలాల ప్రాకారాల మధ్య ఇళ్లు.. అదీ ఆ నిర్మాణ పద్ధతి. మన దేశపు ఈ ప్రాచీన పద్ధతి నిర్మాణాలను అమెరికా తదితర దేశాలవారు ఇప్పుడు అనుసరిస్తున్నారు!! అమెరికాలోని ‘ఇల్లినాయ్’ రాష్ట్రంలోని అంతర్జాతీయ స్థాయి నగరమైన ‘చికాగో’ మధ్యలో పెద్దపెద్ద అడవులు యథాపూర్వకంగా కొనసాగుతున్నాయట! కానీ మనం మాత్రం విదేశాల కృత్రిమ నాగరిక ప్రభావంతో పది, ఇరవై అంతస్థుల ‘సిమెంటు’ కట్టడాలను నిర్మిస్తున్నాము. వంద అంతస్థుల భవనాలు కూడ ‘అమరావతి’లో అవతరిస్తాయన్న ప్రచారం జరిగింది.. ప్రకృతి పచ్చదనాన్ని కోల్పోతోంది, భూమాత- భరతమాత- విలపిస్తోంది?? పాలకులు ఎప్పటికి గ్రహిస్తారు??
ప్రజలు ఎప్పుడో గ్రహించారు, మరింతగా ఇప్పుడు గ్రహిస్తున్నారు. కాకినాడ కేంద్రంగా ‘ప్రత్యేక ఆర్థిక మండల బాధిత కర్షక సంక్షేమ సంఘం’- సెజ్ ఫార్మర్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్- ఏర్పడిందట! దేశవ్యాప్తంగా నిరుపయోగంగా పడి ఉన్న ‘ప్రత్యేక ఆర్థిక మండలాల’ భూమిని తిరిగి రైతులకు అప్పగించాలని కోరుతూ ఈ ‘సంఘం’ వారు సర్వోన్నత న్యాయస్థానంలో ‘న్యాయ యాచిక’ను దాఖలుచేశారట! అడవులు, అడవి ప్రాణులు హర్షించదగిన ముచ్చట ఇది, ప్రకృతి పరవశింపదగిన పరిణామం ఇది.. భూమాత- భరతమాతకు ఆనంద కారకం ఇది! ‘సెజ్’ల కోసం రైతులను, అడవులను హింసించి, సేకరించి ‘బహుళ జాతీయ సంస్థల’కు ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా కట్టబెట్టిన భూమిలో నలబయి శాతం నిరుపయోగంగా పడి ఉందట! ఎంత దురుపయోగం అయిందో..??