సంపాదకీయం

ఫిరాయింపుల ఘట్టం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గెలవడం మాత్రమే రాజకీయ పక్షాల అభ్యర్థుల ఎంపికకు ఏకైక ప్రాతిపదికగా మారి ఉండడం నడుస్తున్న ఎన్నికల చరిత్ర. నిర్లజ్జ అన్ని రాజకీయ పక్షాలనూ నిలువునా ముంచెత్తుతోంది. ‘మా ప్రత్యర్థులది అవకాశ వాదం, మాది ఆదర్శ తత్త్వం..’ అని ప్రతి రాజకీయ పక్షం వారూ హోరెత్తిస్తున్నారు. ‘మాది అరవింద దళం’ అని చెప్పుకుంటున్న ప్రతి రాజకీయ పక్షం నిజానికి ‘గురివింద గణం’గా మారి ఉండడం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మరింతగా ప్రస్ఫుటిస్తున్న వికృత చిత్రం! ఈ ‘వికృతి’ని ‘విలక్షణత’గా ప్రతి రాజకీయ పక్షం వారు ప్రచారం చేస్తున్నారు. ‘నిర్లజ్జ’కు ఇది నిదర్శనం! ‘్ఫలానా పార్టీవారు మా పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు..’ అని నిరసిస్తున్న, రుసరుసలాడుతున్న ప్రతి రాజకీయ పార్టీ వారు ఆ ఫలానా పార్టీ నుంచి తమ పార్టీలోకి నాయకులను ఫిరాయింపచేసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి భారతీయ జనతాపార్టీలోకి, భాజపా నుంచి తెలుగుదేశంలోకి, తెదేపా నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి... నిర్లజ్జావంతులు వెల్లువెత్తడం ఎన్నికల నామాంకన- నామినేషన్- ఘట్టంలోని ప్రధాన పరిణామం. ఇది ఉదాహరణ మాత్రమే. ఈ ఫిరాయింపుల వెల్లువ వ్యతిరేక దిశలో సైతం ముంచెత్తడం- అంటే భాజపా నుంచి కాంగ్రెస్‌లోకి, కాంగ్రెస్ నుంచి తెరాసలోకి, వైకాపా నుంచి తెదేపాలోకి- నామాంకన పర్వంలో వికృతంగా ఆవిష్కృతవౌతున్న విచిత్రం. ఇది కూడ మరో ఉదాహరణ మాత్రమే! ఏ పక్షం నుంచి ఏ పక్షంలోకి..? అన్న దానికి ‘నిర్దుష్ట’, ‘నిర్దిష్ట’ నియమాలు లేవు. ఒక రాజకీయ పక్షం నుంచి మిగిలిన అన్ని రాజకీయ పక్షాలలోకి, ఇతర అన్ని రాజకీయ పక్షాల నుంచి ‘ఒక’ రాజకీయ పక్షంలోకి నాయకులు ఫిరాయిస్తున్న దృశ్యాలు ఆర్భాటంగా విన్యాస ప్రదర్శనలు చేస్తున్నాయి. దేశమంతటా ఇవే దృశ్యాలు.. నిర్లజ్జ.. సిగ్గులేని తనం.. నిరసనకు గురి కావడం లేదు! ‘నిర్లజ్జ’ ఉదాత్తమైన, ఆదర్శకరమైన, అనుసరణీయమైన, అభిలషణీయమైన ‘సముత్కర్ష సద్గుణం’గా ప్రచారాన్ని పొందుతోంది! ‘ఆహార వ్యవహారేతు త్యక్త లజ్జా సుఖీభవేత్..’ ఆహారం తింటున్నప్పుడు, వ్యవహారం చేస్తున్నప్పుడు సిగ్గు విడిచినచో సుఖం పొందెదరు.. అన్నది అనుభవ విజ్ఞానం. ‘రాజకీయం జీవన వ్యవహార సర్వస్వం’ కావడం అనుభూతమవుతున్న వాస్తవం. అందువల్ల గెలవగల పురుషుడు లేదా విజయం సాధించగల మహిళ తమ పార్టీకి ప్రతి నియోజకవర్గంలోను తమ అభ్యర్థి కావాలన్నదే ప్రతి రాజకీయ పక్షం లక్ష్యం. ఇలాంటి ‘సమర్థులు’ లేదా ‘సమర్థలు’ తమ పక్షంలో లేనట్టయితే, దశాబ్దులుగా సిద్ధాంత నిష్ఠతో కాని ఇతరేతర నిబద్ధతతో కాని తమ పక్షంలో పనిచేస్తున్న వారికి ఈ ‘గెలవగల’ సమర్థత లేనట్టయితే ఏం చేయాలి? ఇతర పార్టీలోని ‘సమర్థుల’ను లేదా ‘సమర్థల’ను ఎరువు తెచ్చుకోవాలి. నిర్లజ్జగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రాజకీయ పక్షాల అధిష్ఠానాలు గ్రహించిన ‘ఘన పాఠం’ ఇది. తమ తమ అభ్యర్థులు నీతి, నిజాయితీ, సామాజిక నిష్ఠ, జనహిత నిబద్ధత కలవారా? లేనివారా? అన్న ప్రశ్నలకు ఈ పార్టీల అధిష్ఠానాల అంతరంగంలో తావులేదు! ‘గెలవగలగడం’ మాత్రమే ఏకైక శుభ లక్షణం. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతగాడు దుర్మార్గుడు. స్వపక్షంలోకి రాగానే- ఫిరాయించగానే- అతగాడు అత్యుత్తముడు, అనుసరణీయుడు’...
అందువల్లనే ఫిరాయిస్తున్న ప్రతి నాయకుడిని కొంతమంది కార్యకర్తలు- వాస్తవానికి ఈ ‘తథాకథిత’ కార్యకర్తలు గూండాలు కావచ్చు- అనుసరిస్తున్నారు. వారిని కూడ కొత్త పార్టీ అధినేతలు వేదిక మీదకు పిలిచి రకరకాల రంగుల కండువాలను కప్పుతున్నారు. అదో పెద్ద ప్రదర్శన, ఫిరాయింపు ప్రహసనం. గతంలో ఇలాంటి ప్రదర్శనలు పెద్దగా జరిగేవి కావు. జరపడానికి, జరిపించుకొనడానికి ‘స్వాగతకర్తలు’, ‘ప్రవేశిస్తున్నవారు’ సంశయించేవారు, సిగ్గుపడేవారు. జనం కూడ బహిరంగంగానే ఫిరాయింపుదారులను విమర్శించేవారు. ఇప్పుడు విలువలు మారిపోయాయి. మార్పు సహజం మరి! ‘మార్పు అభిలషణీయమన్న’ సిద్ధాంతానికి ఇదీ వర్తమానపు ఆకృతి! అందువల్ల ‘నిర్లజ్జ’ నిరాఘాటంగా రాజ్యమేలుతోంది. ముందురోజు వరకు ఆ పార్టీని తిట్టినవారు, ‘నామాంకనం’ సమర్పించే రోజున ఆ పార్టీలో చేరిపోయి నిర్లజ్జగా ఆ పార్టీని పొగుడుతున్నారు. ‘లజ్జాయాం పరిత్యక్త్వా త్రిలోకే విజరుూభవేత్’- లజ్జలేనివాడు మూడు లోకాలలోను విజేత కాగలడు- అన్న బతకనేర్చిన నీతి ఈ ఎన్నికల్లో వనె్నకెక్కుతున్న రాజకీయ రీతి! ఇలా చక్కగా, సిగ్గులేకుండా ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కాగోరుతున్నవారు పార్టీలు మారుతుండడానికి అత్యంత ప్రధాన కారణం రాజకీయ పక్షాలలో సంస్థాగత ప్రజాస్వామ్యం సున్న కావడం లేదా నామమాత్రం కావడం.. శాసనసభలకు, లోక్‌సభకు వివిధ పక్షాల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆయా రాజకీయ పక్షాల సభ్యులు ఎన్నుకోవడం లేదు. ఆయా రాజకీయ పక్షాల అధిష్ఠానం వారు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు, టిక్కెట్లు ఇస్తున్నారు. దాదాపు అన్ని రాజకీయ పక్షాల్లోను ‘అధిష్ఠానం’ అని అంటే అధినాయకుడు మాత్రమే లేదా అధినాయకురాలు మాత్రమే. అందువల్ల టిక్కెట్టు దక్కడానికి సంస్థాగత కార్యకర్తల అండదండల కంటె అధినాయకుని అనుగ్రహం అనివార్యమైంది.. సంస్థాగత ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఈ ‘టిక్కెట్లు ఇచ్చే పద్ధతి’ విఘాతకరం..
ప్రతి నియోజకవర్గంలోను లోక్‌సభ లేదా శాసనసభలకు ఎన్నికలు జరగడానికి ముందుగా ప్రతి రాజకీయ పక్షంలోను సంస్థాగత ఎన్నికలు జరగాలి. ఈ ‘ఎన్నికల’ ద్వారా మాత్రమే వివిధ పక్షాల తరఫున సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నిర్ణయించాలి. అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ‘కాంగ్రెస్’- పార్లమెంట్-లోని ఉభయసభలకూ ప్రత్యక్షంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. ‘ప్రతినిధుల సభ’- హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్- దిగువసభ, మన లోక్‌సభ వంటిది. ‘సెనేట్’ రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్న ఎగువసభ- మన రాజ్యసభ వంటిది. ఈ ఉభయసభలకూ నియతంగా రెండేళ్లకోసారి ప్రజలు వోట్లు వేసి ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. ప్రతినిధుల సభలోని మొత్తం నాలుగు వందల ముప్పయి ఎనిమిది స్థానాలకు, వందమంది సభ్యులున్న ‘సెనేట్’లోని మూడవ వంతు స్థానాలకు రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులను ఆయా పార్టీల అధిష్ఠాన వర్గాలు నిర్ణయించడం లేదు. డెమొక్రటిక్ పార్టీ తరఫున ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికలో పోటీ చేయడానికి అభ్యర్థిని ఆ నియోజకవర్గంలోని పార్టీ సభ్యులు ఎన్నుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోను ఇదే పద్ధతి. పార్టీ అభ్యర్థి కాదలచుకున్నవారు ఎందరైనా ఉండవచ్చు. అభ్యర్థిని నిర్ణయించడానికి మొదట పార్టీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ‘ప్రైమరీ’- ప్రాథమిక సంస్థాగత స్పర్థ-లో గెలిచినవారు పార్టీ అభ్యర్థి అవుతున్నాడు. రిపబ్లికన్ పార్టీలోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోను పోటీ చేస్తున్న వారిలో ఒకరిని- వందల లేదా వేల మంది సంస్థాగత సభ్యులు అభ్యర్థిగా ఎన్నుకుంటున్నారు. దీనివల్ల ప్రతి నియోజకవర్గంలోను కార్యకర్తల, సభ్యుల మద్దతు ఉన్న నాయకుడు మాత్రమే పార్టీ అభ్యర్థి కాగలుగుతున్నాడు. అధిష్ఠానం వారు టిక్కెట్టు ఇవ్వనవసరం లేదు.
ఈ ‘సంస్థాగత స్పర్థ’- ప్రైమరీ ఎలక్షన్- పద్ధతిని మన దేశంలో కూడ పాటించినట్టయితే ఎన్నికల సమయంలో ఫిరాయింపులు ఆగిపోతాయి. ఎందుకంటే ఏళ్ల తరబడి పార్టీలో ఉండి పార్టీ సిద్ధాంతబద్ధులై పనిచేసిన వారిని మాత్రమే పార్టీ సభ్యులు తమ నియోజకవర్గపు పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంటారు. ఈ అభ్యర్థిత్వం కోసం ఒకరి కంటె ఎక్కువ మంది పోటీ పడితే ఆ నియోజకవర్గంలోని పార్టీ సభ్యులు వోట్లు వేసి ఎవరో ఒకరిని అభ్యర్థిగా ఎన్నుకుంటారు. అభ్యర్థి ఎవరన్నది ఇక్కడే తేలిపోతుంది. నియోజకవర్గం స్థాయిలోనే తేలిపోతుంది. అధిష్ఠానం వారి అనుగ్రహం అవసరం లేదు. పార్టీ సాధారణ సభ్యుల అనుగ్రహం చాలు. ఇలా అన్ని ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల ఎన్నికకు ఒకే రోజున పోలింగ్ జరుగుతుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఎవరు ఎవరో ఒక్కసారే తేలిపోతుంది. అందువల్ల అభ్యర్థిత్వ నిర్ణాయకపు ఎన్నికల్లో ఓడినవారు మరో రాజకీయ పక్షంలోకి ఫిరాయించి, ఆ కొత్త పార్టీ అభ్యర్థిత్వం సాధించడానికి వీలుండదు. స్వచ్ఛందంగా రాజకీయ పక్షాలు ఈ పద్ధతిని పాటించవచ్చు.. పాటించవు.. అధినాయకుని ప్రాధాన్యం, పెత్తనం తగ్గిపోతుంది. అందువల్ల గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పక్షాలు ఈ ‘సంస్థాగత వరణ’- ప్రైమరీ ఎలక్షన్- పద్ధతిని పాటించాలని నిర్దేశిస్తూ చట్టం రూపొందాలి. ఎవరు పూనుకుంటారు?