సంపాదకీయం

హింసా కళంకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో హింసను నిరోధించలేకపోవడం మన రాజ్యాంగ వ్యవస్థలో నిహితమై ఉన్న ఘోర వైఫల్యం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చివరి దశ ప్రచారం ఒకరోజు ముందుగానే ముగిసిపోవడం ఈ ఘోర వైఫల్యానికి పరాకాష్ఠ. ఏడు దశలుగా దేశమంతటా ‘సాగతీత’కు గురి అయిన ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల చివరి దశ ‘మత ప్రదానం’ పంతొమ్మిదవ తేదీన- ఆదివారం జరుగనుంది. అందువల్ల దేశంలోని చివరి విడత మత ప్రదానం-పోలింగ్- జరుగనున్న రాష్ట్రాలలో ‘నలబయి ఎనిమిది గంటల’ నిశ్శబ్ద కాలవ్యవధి శుక్రవారం సాయంత్రం నుంచి మొదలు కానుంది. మత ప్రదానం ముగిసే వేళకు నలబయి ఎనిమిది గంటల ముందు నుంచీ ఎలాంటి ప్రచారం జరుగరాదన్నది నిశ్శబ్ద కాల వ్యవధి- సైలెన్స్ పిరీయడ్- నియమం. ఆదివారం సాయంత్రం మతప్రదానం పరిసమాప్తం అవుతుంది. చరిత్రలో మొదటిసారిగా పశ్చిమ బెంగాల్ ‘చివరి విడత’ ఎన్నికల ప్రక్రియలో ఈ ‘నిశ్శబ్ద కాల వ్యవధి’ మూడురోజులకు విస్తరించడం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు దాపురించిన మరో వైఫల్యం. డెబ్బయి ఏళ్లకు పైబడిన ‘బ్రిటన్ దురాక్రమణ విముక్త భారతదేశం’లో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ పరిణతి చెందింది. కానీ ఈ ‘పరిణతి’ కేవలం సామాన్య ‘మత ప్రదాత’- వోటర్-లకు మాత్రమే పరిమితం కావడం నడచిన చరిత్ర, నడుస్తున్న చరిత్ర. రాజకీయ పక్షాల కార్యకర్తలు, రాజకీయవేత్తలకు అతి ఉత్సాహంగా ‘అక్రమ సమర్ధన’ను కొనసాగిస్తున్న పోలీసులు, ఉద్యోగులు ఈ ‘పరిణతి పరిధి’కి ఆవల నిలబడి ప్రజాస్వామ్య వ్యవస్థను వెక్కిరిస్తుండడం, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుండడం ఆవిష్కృతవౌతున్న వికృత దృశ్యం. ఈ వికృతి పశ్చిమ బెంగాల్‌లో మరింతగా విస్తరించడం ఎన్నికల ప్రచారం నిర్ణీత సమయం కంటె ఒకరోజు ముందుగా ముగిసిపోవడానికి కారణం.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన తరువాత ‘ఎన్నికల సాధికార సంఘం’ - ఎలక్షన్ కమిషన్- ఆదేశాలకు అధికార పరిధికి లోబడి వ్యవహరించవలసిన పోలీసులలోను, ఉద్యోగులలోను అధికులు అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలవారి ‘ఆదేశాల’ను శిరసావహిస్తుండడం వ్యవస్థలో విస్తరిస్తున్న నైతిక వైఫల్యం. అందువల్లనే పశ్చిమ బెంగాల్‌లో ప్రతి దశ ‘పోలింగ్’ ప్రక్రియ కూడ హింసాత్మకమైపోయింది, రక్తసిక్తమైంది. మంగళవారం, బుధవారం జరిగిన హింస ఈ వైపరీత్యానికి వికృత నిదర్శనం! ప్రపంచంలోని వివిధ దేశాలలో ఎన్నికల హింస జరుగుతోంది. కానీ పరిణతి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థలున్న దేశాలలో ఒక రోజులోనే ఎన్నికల ‘మత ప్రదానం’ ప్రశాంతంగా పరిసమాప్తం అవుతోంది. అమెరికాలోను బ్రిటన్ తదితర ఐరోపా దేశాలలోను ఇజ్రాయిల్ జపాన్ వంటి ఆసియా దేశాలలోను ‘మత ప్రదానం’ ప్రశాంతంగా జరిగిపోతోంది. కానీ మన దేశంలో మాత్రం ప్రతి లోక్‌సభ ఎన్నికల సమయంలోను, శాసనసభల ఎన్నికల సమయంలోను ఎక్కడో అక్కడ ‘హింస మృగం’ దూకుతూనే ఉంది. బెంగాల్‌లో మాత్రం దాదాపు ప్రతి నియోజకవర్గంలోను ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
ఒకటి, రెండు దశలలో దేశమంతటా లోక్‌సభ ఎన్నికల ‘మత ప్రదాన’- పోలింగ్- ప్రక్రియను నిర్వహించలేక పోవడానికి కారణం రాజకీయాలు క్రమంగా హింసాత్మకం అవుతుండడం. దొంగవోట్లు వేయడం, వోటర్లను మత ప్రదాన కేంద్రాలకు రానీయకుండా నిరోధించడం వంటి అక్రమాలు దశాబ్దుల తరబడి కొనసాగాయి. ‘ఎలక్ట్రానిక్’ మత ముద్రణ యంత్రాలు- ఇవిఎమ్‌లు- ఏర్పడడం వల్ల, ప్రతి ‘వోటరు’నకు గుర్తింపుకార్డును ఇవ్వడం వల్ల ఈ అక్రమాలు తగ్గిపోగలవన్న విశ్వాసం ప్రబలింది. కానీ ప్రత్యర్థి పక్షాన్ని బలపరచనున్నట్టు కచ్చితంగా గుర్తింపునకు గురి అయిన ‘మత ప్రదాత’లు మత ప్రదాన కేంద్రాలకు రాకుండా నిరోధించే ప్రయత్నాలు మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఓటమి భయం పెరిగిన అభ్యర్థులు, రాజకీయ పక్షాల వారు హింసను రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం పరిపాటి అయిపోయింది. ఈ భయం దాదాపు రెండు దశాబ్దులుగా బెంగాల్‌లో మరింత ముదిరింది. అందువల్ల 2001వ సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల సమయం నుంచి ప్రతి ఎన్నికల ప్రక్రియలోను బెంగాల్‌లో భయంకర హింసాకాండ విరుచుకొని పడుతోంది. 2001వ సంవత్సరం నాటి శాసనసభ ఎన్నికలలో ‘్భరత కమ్యూనిస్టు మార్క్సిస్టు’పార్టీ కూటమి ప్రభుత్వానికి పరాజయం తప్పదని మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ప్రచారమైంది. కానీ ఈ విజయం తృణమూల్ కాంగ్రెస్‌కు లభించడానికి మరో పదేళ్లు పట్టింది. ఆ పదేళ్ల కాల వ్యవధిలో, 2011నాటి శాసనసభ ఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించే వరకు, మార్క్సిస్టుల పలుకుబడి క్షీణించినకొద్దీ బెంగాల్ రాజకీయాలలో హింసాకాండ పెరిగింది. ఇప్పుడు ఆ చరిత్ర పునరావృత్తం అవుతోంది. మార్క్సిస్టులను 2001వ 2011వ సంవత్సరాల మధ్య ఆవహించి ఉండిన పరాజయ భయం ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌ను ఆవహించి ఉంది. భారతీయ జనతాపార్టీ పలుకుబడి ద్విగుణం, త్రిగుణంగా పెరిగిపోయిందట. ఈ లోక్‌సభ ఎన్నికలలో ‘్భజపా’ బెంగాల్‌లోని నలబయి రెండు స్థానాలలో అత్యధికం కైవసం చేసుకోనున్నదన్న భయం తృణమూల్ కాంగ్రెస్‌ను ఆవహించింది, ‘తృణమూల్’ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ఆవహించింది. ఎన్నికల ప్రక్రియ రక్తసిక్తం అవుతుండడానికి హింసాగ్ని జ్వాలలు చెలరేగుతుండడానికి ఇదీ నేపథ్యం. ఇదీ పునరావృత్తి...
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన తరువాత కూడ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు అక్రమంగా పెత్తనం చెలాయించడం విచిత్రమైన వ్యవహారం. ఈ అక్రమ రాజకీయ కలాపాన్ని ‘ఎన్నికల సాధికార సంఘం’ వారు ఎప్పటికప్పుడు నిరోధించకపోవడం మరింత విచిత్రం. ‘్భజపా’ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించిన ‘హెలికాప్టర్’ను ‘గగన శకట అవతరణ ప్రాంగణం’- హెలిపాడ్‌లో దిగడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతిని నిరాకరించడం ఈ వైచిత్రి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి పయనించిన ‘గగన శకటం’ దిగడానికి కూడ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతిని నిరాకరించిందట! ఈ వ్యవహారంలో ‘ఎలక్షన్ కమిషన్’ ఎందుకని ప్రేక్షకపాత్రను వహించింది. మమతా బెనర్జీని అవమానించిందన్న ఆరోపణపై నిర్బంధానికి గురి అయిన ‘్భజపా’ యువజన విభాగం నాయకురాలు ప్రియాంక శర్మను విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన తరువాత కూడ ఆమెను బెంగాల్ పోలీసులు వదలిపెట్టకపోవడం మరో విచిత్రం. ఈ విషయమై న్యాయధిక్కరణ జరిగిందా లేదా అన్నది సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించనున్నదట. ప్రియాంక శర్మను విడుదల చేయకపోతే బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయధిక్కరణ అభియోగాన్ని నమోదు చేయవలసి వస్తుందన్నది సర్వోన్నత న్యాయస్థానం బుధవారం చేసిన హెచ్చరిక. ప్రియాంక శర్మ మమతాబెనర్జీకి క్షమార్పణ చెప్పాలన్న న్యాయ నిర్దేశం, ఆమెను నిర్బంధం నుండి విడుదల చేయాలన్న ఆదేశం వేఱువేఱు అంశాలు. క్షమార్పణ చెప్పవలసిన తప్పును తాను చేయలేదన్నది ప్రియాంక శర్మ వాదం. ఏమయినప్పటికీ ‘ఎన్నికల సాధికార సంఘం’ పరిధిలోని ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో నిర్వహించింది. పశ్చిమ బెంగాల్‌లోని అరాజకాన్ని ‘ఎన్నికల సంఘం’ నిరోధించలేకపోవడం ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన అంశం..
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత బెంగాల్‌లో హింసాకాండ కూడ మొదలైపోయింది. ఐదవ విడత మతప్రదానం సందర్భంగా ఆరవ తేదీన బెంగాల్‌లో మాత్రమేకాదు, ఝార్‌ఖండ్‌లోను జమ్మూకశ్మీర్‌లోను హింస చెలరేగింది. ఆరవ దశ పోలింగ్ సందర్భంగా బెంగాల్‌లో పనె్నండవ తేదీన కేంద్ర భద్రతాదళాలవారు హింసను నిరోధించడానికై కాల్పులు జరుపవలసి వచ్చింది. ఝార్‌ఖండ్‌లో పేలుళ్లు జరిగాయట. ఇంత జరిగినప్పటికీ మంగళవారం అమిత్ షా ప్రసంగించిన సభ ముగిసిన వెంటనే చెలరేగిన హింసను నిరోధించడంలో భద్రతాదళాలు విఫలమయ్యాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన తరువాత కూడ బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం ‘ఎన్నికల కమిషన్’ ఆదేశాలను కాక, రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల మాటలను మన్నిస్తోందన్నదానికి ఇది సరికొత్త ఉదాహరణ. ఇంత జరిగిన తరువాత మాత్రమే చిట్టచివరి ఘట్టంలో ‘‘రాజ్యాంగంలోని మూడువందల ఇరవై నాలుగవ అధికరణ ప్రకారం తమకున్న అధికారాలు’’ ఎన్నికల కమిషన్ వారికి గుర్తుకు వచ్చాయి. ఏడు దశలుగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ సుదీర్ఘకాలం ఎన్నికల ప్రక్రియ సాగిపోతున్నప్పటికీ, ఈ ‘సాగతీత’వల్ల ఎన్నికల హింస ఆగకపోవడం, దాన్ని నిరోధించలేక పోవడం మన ప్రజాస్వామ్య ‘కీర్తి ధవళిమ’కు ఏర్పడి ఉన్న నల్లని మచ్చ..