సంపాదకీయం

పెరుగుతున్న పొరుగు మైత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అఫ్గానిస్తాన్, ఖతార్ దేశాలలో జరిపిన పర్యటన వ్యూహాత్మక సహకారం విస్తృతికి నిదర్శనం. భారత అఫ్గానిస్తాన్ సంబంధాలలో మైత్రి, ముభావం వంతుల వారీగా దోబూచులాడం 2002 నుండి నడుస్తున్న చరిత్ర. తాలిబన్, అల్‌ఖాయిదాల బీభత్స పాలన నుండి విముక్తి అయిన అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణం కోసం మనదేశం చిత్తశుద్ధితో కృషి చేస్తుండడం సడలని మన మైత్రీ విధానానికి నిదర్శనం. భారత-అఫ్గాన్ మైత్రీ జలాశయాన్ని జూన్ నాలుగవ తేదీన మన ప్రధాని ప్రారంభించడం ఈ మైత్రికి చిహ్నం. కానీ ఇదే సడలని మైత్రిని అఫ్గానిస్తాన్ ప్రభుత్వాలు 2002 నుండి పాటించడం లేదు. 2002కు పూర్వం మనదేశంపై విషం కక్కిన తాలిబన్లు అల్‌ఖాయిదాలు అంతరించిపోవడం హర్షణీయ పరిణామం. మత విద్వేషానికి మారుపేరయిన తాలిబన్లు 2001 వరకు అఫ్గానిస్తాన్‌లోని బుద్ధ విగ్రహాల, ఇతరేతర హైందవ చిహ్నాలను ధ్వంసం చేయడం, వికృత పరచడం చరిత్ర. 1999లో మన ప్రయాణీకుల విమానాన్ని అపహరించిన జిహాదీ బీభత్సకారులకు అఫ్గానిస్తాన్‌లోని కాంధహార్ విమాన స్థావరంలో ఆశ్రయం లభించడం తాలిబన్ల విద్వేష ప్రవృత్తికి ఒక నిదర్శనం మాత్రమే. 2001లో అమెరికాపై అల్‌ఖాయిదా, తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత అఫ్గాన్ సమాజం విప్లవాత్మకమైన పరివర్తనకు గురైంది. అమెరికా నాయకత్వంలోని ఉత్తర అట్లాంటిక్ రక్షణ కూటమి-నాటో-అఫ్గానిస్తాన్‌లో చొరబడి తాలిబన్ల పాలననుండి అల్‌ఖాయిదా ప్రాబల్యం నుండి విముక్తిని కలిగించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు నిబద్ధతను ప్రకటించిన ప్రభుత్వాలు అఫ్గానిస్తాన్‌లో ఏర్పడి ఉన్నా యి. అందువల్ల అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణం కోసం వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి సహకరిస్తున్న మన దేశం పట్ల ఆదేశం ప్రభుత్వం నిరంతర మైత్రిని వహించడం సహజం. కానీ ఈ ద్వైపాక్షిక మైత్రీ ప్రస్థానంలో అఫ్గాన్ పాలకులు అప్పుడప్పుడు అపశ్రుతులను పలికించడం కూడ పరిణామక్రమం. అఫ్గానిస్తాన్ ప్రజల సమష్టి మనఃప్రవృత్తిని పాకిస్తాన్ ప్రభుత్వం నియంత్రించడానికి యత్నిస్తుండడం ఈ అపశ్రుతులకు ప్రధాన కారణం. పాకిస్తాన్ వెనుక నుంచి చైనా తొంగిచూస్తున్నది కూడా..‘‘్భరత్ మిత్ర దేశం, కానీ పాకిస్తాన్ సోదర దేశం..’’ అని ప్రజాస్వామ్య అఫ్గానిస్తాన్ పాలకులు వ్యాఖ్యానించిన సందర్భాలు కూడ ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లో మనదేశం వౌలిక ప్రగతి పథకాలను అమలు జరుపడం పాకిస్తాన్‌కు ఇష్టం లేదు. పాకిస్తాన్ జిహాదీలు అఫ్గానిస్తాన్‌లో మన ఉనికిని కూడ సహించలేరు. అందువల్లనే మన దౌత్య కార్యాలయాల మీద వాణిజ్య కలాపాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం గత పదకొండేళ్లలో అనేకసార్లు దాడులను జరిపించింది. నరేంద్ర మోదీ జరిపిన పర్యటనకు ఇదంతా నేపథ్యం. ఈ విపరీత నేపథ్యాన్ని అధిగమించి అఫ్గానిస్తాన్‌తో వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకొనడానికి గత రెండేళ్లుగా మన ప్రభుత్వం చేసిన కృషి సత్ఫలితాన్నిచ్చినట్టు మోదీ పర్యటన సందర్భంగా వెల్లివిరిసిన సౌహార్దం ధ్రువపరచింది.
రెండేళ్లుగా మన ప్రభుత్వం ఆర్భాటం లేకుండా అనుసరిస్తున్న అఫ్గాన్ విధానం వల్ల పాకిస్తాన్ కంటె మన దేశం అఫ్గా నిస్తాన్‌కు దగ్గరైంది. అఫ్ఘానిస్తాన్‌కు తాలిబన్లకు మధ్య జరిగిన చర్చలలో మనదేశానికి ప్రాతినిధ్యం లేకుండా చేయడంతో గత జూలైలో పాకిస్తాన్ తాత్కాలిక దౌత్య విజయం సాధించింది. ఈ చర్చలను మన ప్రభుత్వం బహిరంగంగానే నిరసించింది. నెలరోజులు తిరగకముందే అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని గత ఆగస్టులో దుయ్యబట్టాడు. ఇది మనకు వ్యూహాత్మక విజయం. జూలై నాటి చర్చలకు మన దేశాన్ని పిలవనందుకు నిరసనగా ఆ తరువాత కాబూల్‌లో జరిగిన అఫ్గానిస్తాన్ ఆర్థిక సదస్సును మనదేశం బహిష్కరించింది. ఇలా ద్వైపాక్షిక సంబంధాలలో మైత్రి ముభావం దోబూచులాడుతూనే ఉన్నాయి. దాదాపు ఆరువందల కోట్ల రూపాయల ఖర్చుతో మన ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌కు నూతన పార్లమెంటు భవనం నిర్మించి ఇచ్చింది. కాబూల్‌లో గత డిసెంబర్‌లో జరిగిన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ‘‘మేము సమర్పించడానికి మాత్రమే అఫ్గానిస్తాన్‌లో పనిచేస్తున్నాము, సంఘర్షణ సాగించడానికి కాదు..’’ అని అప్పుడు మోదీ చెప్పిన మాట పాకిస్తాన్‌కు పరోక్షంగా చెప్పిన పాఠం. ఆరునెలలు తిరగకుండానే మైత్రి జలాశయాన్ని అఫ్గానిస్తాన్ ప్రజలకు సమర్పించడం మన సౌహార్దానికి చిహ్నం.
ఇతర దేశాలవలె తాత్కాలిక ప్రయోజన లక్ష్యంతో మనదేశం అఫ్గానిస్తాన్‌కు సహకరించడంలేదు. అందువల్లనే ‘‘్భరత అఫ్గానిస్తాన్ సంబంధాలు కాలానికి కట్టుబడనివి, అవధిలేనివి..’’అని మోదీ హీరట్‌లో నాలుగవ తేదీన చెప్పిన మాటలు ‘‘అన్నం పెట్టే ఆశ్రయమిచ్చే’’ తరతరాల భారత జాతీయ సంస్కృతికి అనురూపాలు. పదిహేడు వందల కోట్లతో హీరట్ సమీపంలో నిర్మించిన సాల్మా జలాశం పేరు ‘మైత్రీ’ జలాశయంగా మార్చడం అఫ్గానిస్తాన్ ప్రభుత్వం వ్యక్తం చేసిన కృతజ్ఞతకు చిహ్నం. ‘హరిరుద్’-హరిరుద్ర-నదిపై నిర్మించిన ఈ జలాశంలోని నీరు దాదా పు లక్షా ఎనబయి ఐదువేల ఎకరాల భూమిని సస్యశ్యామల క్షేత్రంగా మార్చనుంది. నలబయి రెండు మెగావాట్ల జలవిద్యుత్ కూడ ఉత్పత్తికాగలదట! ఇలా నదీమతల్లి నీటిని నిప్పును కూడా సాధించి అన్నాన్ని వెలుగును పంచిపెట్టగలదని మోదీ వ్యాఖ్యానించడం భారతీయ సంస్కృతికి ప్రతిధ్వని. అఫ్గానిస్తాన్ క్రీస్తుశకం ఏడవ శతాబ్దంవరకు అఖండ భారత్‌లో భాగం. యోన, గాంధార, ఉత్తర జ్యోతిషం వంటి అనేక రాజ్యాలు ఇప్పటి అఫ్గానిస్తాన్‌లో అప్పుడు విలసిల్లాయి. ఎనిమిదవ శతాబ్దిలో మతాలను ధ్వంసం చేయడంతో ఈ ప్రాంతం భారత ఖండం నుంచి విడిపోయింది. భారత అఫ్గానీ సంబంధాలు కాలాన్ని అధిగమించినవన్న మోదీ మాటలలోను ఈ చరిత్ర కూడ ధ్వనించింది.
అరబ్ దేశాలలో ప్రవాస భారతీయులపై పాశవికమైన దాడులు జరుగుతుండడం నరేంద్ర మోదీ ఖతార్ పర్యటనకు నేపథ్యం. ఖతార్‌లో ప్రవాస భారతీయులు మాత్రమే కాక భారతీయ సంతతి ప్రజలు సైతం లక్షల సంఖ్యలో ఉన్నారు. పదిహేను లక్షల జనాభా, పదకొండు వేల ఐదువందల చదరపు కిలోమీటర్ల చిన్న దేశమైన ఖతార్ వ్యూహాత్మకంగా అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగివుంది. ప్రపంచీకరణలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్య సదస్సు రాజధాని దోహాలో జరిగిన తరువాత ఈ ప్రాధాన్యం మరింత పెరిగింది. సౌదీ అబియాకు ఈశాన్యంగా పర్షియన్ సింధుశాఖ వాయువ్య భాగాన నెలకొని ఉన్న ఖతార్ అరేబియా సముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యం కానుంది. ఇటీవల సౌదీ అరేబియా, ఇరాన్‌లలో పర్యటించిన నరేంద్ర మోదీ ఖతార్‌లో ఐదవ తేదీన కుదుర్చుకున్న ఒప్పందాలు ఉగ్రవాద నిరోధక వ్యూహం పటిష్టం కావడానికి ఉపకరించగలవు. అరేబియా సముద్ర ప్రాంతంలో తాలిబన్లు, ఓడ దొంగలు సమష్టిగా కలాపాలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ గ్వాడార్ ఓడరేవు కేంద్రంగా చైనా అరేబియా సముద్రమంతటా చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు అభివృద్ధికి మన ప్రభుత్వం గత నెలలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకాలం అంటీ ముట్టనట్టు ఉండిన ఖతార్‌తో కూడా మన దౌత్య సంబంధాలు ఇప్పుడు మెరుగుపడినాయి. కానీ ఖతార్‌లోని ప్రవాస భారతీయుల బతుకులు మెరుగుపడతాయా?