సంపాదకీయం

మందిర మహోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయం ఇది, స్వజాతీయ
హృదయ గగన శుభోదయం
విజయం ఇది, తరతరాల
విభవ స్వప్న సాకారం..
విజయం ఇది, సర్వోన్నత
న్యాయం పలికిన సత్యం,
భరతమాతృ చరితనందు
మరో మధుర మధుమాసం..
రఘురాముని స్ఫూర్తి గెలిచింది, చీకటి తొలగింది! ఈ ‘చీకటి’ విదేశీయ దురాక్రమణ బీభత్స మూకలు శతాబ్దుల క్రితం వ్యాపింప చేసినది, స్వజాతీయ సాంస్కృతిక కిరణాలపై శతాబ్దుల పాటు ఉండి చేసినది! సర్వోన్నత న్యాయస్థానం శనివారం చెప్పిన తీర్పు శతాబ్దుల ఈ వ్యధకు ముగింపు! భారతదేశం ఏ విదేశంలోకి చొఱబడిన చరిత్ర లేదు.. సహస్రాబ్దుల పాటు విదేశాల దాడులకు గురి అయిన చరిత్ర భారత దేశానిది. కొన్నిసార్లు దాడులను ప్రతిఘటించి కొన్నిసార్లు తిప్పికొట్టింది, కొన్నిసార్లు ప్రతిఘటించ లేకపోయింది. దురాక్రమించిన విదేశీయ బర్బర మూకలతో సహస్రాబ్దుల పాటు, రెండున్నర సహస్రాబ్దులకు పైగా సంఘర్షణ సాగించవలసి రావడం భారతదేశపు వ్యధ! ఈ విస్తృత వ్యధలో అయోధ్యలోని రఘురాముని మందిరం, రామలక్ష్మణ భరత శత్రుఘు్నలు జన్మించిన చోట వెలసిన మందిరం విధ్వంసానికి గురి కావడం భాగం. యుగాలకు పూర్వం రఘురాముడు అయోధ్యలో జన్మించడం వాస్తవం. శనివారం సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తీర్పులో ఈ చారిత్రక వాస్తవానికి ‘ధ్రువీకరణ’ ధ్వనిస్తోంది.. ఈ చారిత్రక ప్రస్థానంలో కలియుగం ముప్పయి ఒకటవ శతాబ్దిలో- క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దిలో విక్రమ సమ్రాట్టు అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో వెలసి ఉండిన మందిరాన్ని మరోసారి నిర్మించాడు. ఈ మందిరాన్ని కలియుగం నాలుగు వేల ఆరువందల ముప్పయ్యవ- క్రీస్తుశకం పదహైదు వందల ఇరవై ఎనిమిదవ- సంవత్సరంలో మీర్ బక్షీ అనే జిహాదీ బీభత్సకారుడు కూలగొట్టడం ‘రామ జన్మభూమి’ చరిత్రలోని విషాద ఘట్టం. ఈ మీర్ బక్షీ విదేశ ప్రాంతమైన ‘సమర్‌ఖండ్’ నుంచి మన దేశంలోకి చొఱబడిన మొఘలాయి బాబర్ అనేవాడి బీభత్స సేనాని! ఇలా విదేశీయ బీభత్సకారులకూ స్వదేశీయ సమాజ రక్షకులకూ జరిగిన సహస్రాబ్దుల సంఘర్షణలో అయోధ్య మందిర విధ్వంసం ధ్రువపడిన చారిత్రక వాస్తవం.. సంఘర్షణ కొనసాగడం- ‘వివాదం’పై శనివారం ఉదయం సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయి, న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఏ అబ్దుల్ నజీర్ ప్రకటించిన తీర్పునకు నేపథ్యం. ఈ తీర్పు శతాబ్దుల వ్యధకు ముగింపు, దశాబ్దుల న్యాయ వివాదానికి ముగింపు, ధ్వంసమైన అయోధ్య రామజన్మభూమి మందిర పునర్ నిర్మాణ కార్యక్రమానికి సరికొత్త కొనసాగింపు..
అయోధ్యలోని ‘వివాద స్థలం’ అక్కడ విలసిల్లుతున్న ‘బాలరాముడి’- రామ్‌లల్లా విరాజ్‌మాన్-కి మాత్రమే చెందినదని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించడం ఈ కొనసాగింపు. కలియుగం ఐదువేల నూట ఇరవై ఒకటవ, చాంద్రమాన శుభ వికారి వత్సర కార్తిక శుక్ల ద్వాదశి నాడు- శనివారం నాడు ఇలా జరిగిన నిర్ధారణ భారత చరిత్రలో మరో విజయ ప్రతీకగా విలసిల్లగలదు. ‘బాలరాముని’ శాసకీయ అస్తిత్వం- లీగల్ ఎంటిటీ- ఈ తీర్పు ద్వారా ధ్రువపడడం చరిత్రకు జరిగిన న్యాయం. రఘురాముడు, అతని పరివారం, అతని సమూలం, అతని పరిపాలన కృతకమైన కథలు కావన్నది ఈ ధ్రువీకరణ. రఘురాముడు, అతని పరివారం, అతని సమకాలీకులు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాస్తవ చరిత్రకు ఈ తీర్పు ధ్రువీకరణ. ఈ చరిత్రను సర్వోన్నత న్యాయస్థానం వారు ‘వాచ్యం’గా ఉటంకించారా? లేదా? అన్నది ప్రధానం కాదు. విశ్వాసాలపై కాక ధ్రువపడిన వాస్తవాలపై ఆధారపడి హక్కుల నిర్ణయం జరగాలన్నది మాత్రం సర్వోన్నత న్యాయస్థానం చేసిన స్పష్టీకరణ. అందువల్ల ఈ తీర్పు ద్వారా రఘురాముడు కేవలం విశ్వాసం కాదని చారిత్రక వాస్తవమని ధ్రువపడినట్టు అయింది. వివాద స్థలంలో జరిగిన తవ్వకాలలో బయటపడిన మందిర అవశేషాలను కూడ సర్వోన్నత న్యాయస్థానం పరిగణించినట్టు తీర్పు ద్వారా స్పష్టమైంది. భూగర్భంలోని మందిరం ఏ దేవతకు లేదా ఏ సంప్రదాయానికి చెందినదన్న విషయమై భారతీయ పురాతత్త్వ మండలి- ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా- ఏఎస్‌ఐ- స్పష్టంగా నిర్ధారించకపోయినప్పటికీ వివాద స్థలంలో భూగర్భ మందిరం అవశేషాలు బయటపడడం మాత్రం తిరుగులేని వాస్తవం. ‘ఆ భూగర్భ మందిర అవశేషాలు ఇస్లాం మతానికి చెందినవి కావు’ అన్న వాస్తవం కూడ సర్వోన్నత న్యాయ నిర్ణయానికి మరో ప్రాతిపదిక. అందువల్ల మసీదు పేరుతో నిర్మాణం జరిగి ఉన్నట్టయితే ఆ నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదు. మందిరం భూగర్భంలో నిక్షిప్తం అయి ఉన్న స్థలంలో మాత్రమే మసీదు పేరుతో నిర్మాణం జరిగింది. బ్రిటన్ దురాక్రమణ మొదలయ్యే వరకు అక్కడ ఇస్లాం ప్రార్ధనలు జరిగిన దాఖలా లేదు! - ఇవీ సర్వోన్నత న్యాయ నిర్ధారణ వల్ల ధ్రువపడిన మరిన్ని అంశాలు!!
అందువల్ల సర్వోన్నత నిర్ణయం ‘ఎవరికీ అపజయం కాదు, ఎవరికీ విజయం కాదు’. ఈ న్యాయ నిర్ణయం వాస్తవ చరిత్రకు ధ్రువీకరణ మాత్రమే. ప్రపంచంలోనే ‘రామాయణం’ మొదటి కావ్యం. ఇది ఇతిహాస కావ్యం. అంటే జరిగిన చరిత్రను వాల్మీకి మహర్షి కావ్యంగా వ్రాశాడు. రఘురాముడు, అతని పరివారం తన సమకాలం లోని వారని వాల్మీకి స్పష్టం చేసి ఉన్నాడు. వాల్మీకికి అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. పదహారు మంగళకర మానవీయ సుగుణాలున్న సమకాలీన మానవుని చరిత్రను కావ్యంగా వ్రాయాలన్నది వాల్మీకి లక్ష్యం. ఆ అత్యుత్తమ మానవుడు, పురుషోత్తముడు రఘురాముడు. ఇలా అనేక యుగాలకు పూర్వం ఈ దేశంలో పుట్టి పెరిగిన రఘురాముడిని మన దేశంలోనే కాక అనేక విదేశాలలో సైతం ఆరాధించడానికి కారణం ఆయన సకల సంస్కారాలకు సజీవ రూపం కావడం! రాజ్యాన్ని, మాతృభూమిని ఉపాసించిన- రామో రాజ్యం ఉపాసీత్వా- ఆదర్శ పాలకుడు రఘురాముడు. రాజ్యాధికారం ఆయనకు భోగవస్తువు కాలేదు. అహంకారంతో అతడు అధికారం చెలాయించలేదు. అధికారం మాతృభూమిని ఆరాధించడానికి మాధ్యమం కావడం రఘురాముని చరిత్ర. అందువల్ల రఘురాముడు తరతరాలుగా యుగాలుగా మన దేశ ప్రజలకు ఆరాధ్యుడయినాడు. ఈ మాతృభూమి సంతానమైన అన్ని మతాలవారు, భాషల వారు, ప్రాంతాల వారు ఈ మాతృభూమిని ఆరాధించడమే జాతీయత, దేశభక్తి. ‘నమాతుః పరదైవతమ్’- తల్లిని మించిన దైవం లేదు. మొత్తం జాతికి తల్లి మాతృభూమి. ఈ వౌలిక సంస్కారానికి సాకారం రఘురాముడు. అందువల్ల జాతీయ మహాపురుషుడైన రఘురాముడు దేశంలోని అన్ని మతాల వారికీ వందనీయుడు. విదేశాల నుంచి చొఱబడి, ఈ జాతీయ సంస్కృతిపై దాడి చేసిన మొఘలాయి బాబర్ ఈ దేశంలోని అన్ని మతాలవారికీ గర్హనీయుడు..
సర్వోన్నత న్యాయస్థానం తీర్పు దేశంలోని అనాది సర్వమత సమభావ సమాజ జాతీయ జీవనరీతికి అనుగుణం. అన్ని మతాల వారికి, సంప్రదాయాల వారికి తమ మత సంప్రదాయాలను కాపాడుకునే పెంపొందించుకునే అవకాశం ఉంది. ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం ఈ జాతీయ సర్వమత సమభావ స్వభావానికి మరో ధ్రువీకరణ. విదేశీయ బీభత్సకారులు కూల్చిననాటి నుంచి కూడ రామజన్మభూమి పునర్‌నిర్మాణానికై సమాంతర ఉద్యమం కొనసాగింది. ‘రామజన్మభూమి న్యాస్’ ఏర్పడడం, విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఉద్యమం స్వజాతీయ విజయ సాధనకు పరాకాష్ఠ. రఘురాముడు ప్రతీక... భారతజాతి విభవం విజయం, ప్రపంచ జనహితం ఈ ‘ప్రతీక’కు అసలు లక్ష్యాలు!
అతని స్మృతులు మధుర స్మృతులు
మానవతా భావ ద్యుతులు,
అతని కథలు అమర కథలు
దారిచూపు కాంతితతులు..
అతని కృతులు జనమానస
సీమల పండించు ‘్ధనులు’
ఆ పలుకులు ప్రగతి యజ్ఞ
వేదికపై ప్రతిధ్వనులు..