సంపాదకీయం

‘చైనా’ శృంగభంగం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంగ్‌కాంగ్ ‘ప్రత్యేక ప్రాంత’ జిల్లాల పాలక మండలుల ఎన్నికలలో ‘ప్రజాస్వామ్య’ ఉద్యమ పక్షాలు ఘన విజయం సాధించడం చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానికి ప్రజల ఘోర అభిశంసన! హాంగ్‌కాంగ్ క్రీస్తుశకం 1841 నుంచి దాదాపు నూట యాబయి ఆరేళ్లు బ్రిటన్ అధీనంలో ఉండేది, 1997లో చైనాలో భాగమయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు హాంగ్‌కాంగ్‌లో సంపూర్ణ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడలేదు. హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమం కొనసాగుతుండడానికి ఇదీ కారణం! హాంగ్‌కాంగ్‌లో సమగ్ర ప్రజాస్వామ్యం వికసించకుండా చైనా ఇప్పటికీ అడ్డుకొంటోంది. జిల్లా స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి ఉంది. కానీ ‘ప్రత్యేక ప్రాంత’ రాజ్యాంగ వ్యవస్థ మాత్రం సంపూర్ణ ప్రజాస్వామ్యవంతం కాలేదు, ‘ప్రత్యేక ప్రాంతం’ ఏర్పాటు జనాభిప్రాయం ప్రాతిపదికగా జరగడం లేదు. జిల్లాల మండలులు ఎన్నుకున్న ప్రతినిధులు, చైనా ప్రభుత్వం నియమించే ప్రతినిధులతో కూడిన ‘వరణ సమితి’- ఎలక్షన్ కమిటీ- ‘ప్రత్యేక ప్రాంత’ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తోంది, ‘ప్రధాన పాలన అధికారి’- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్-ని నియమిస్తోంది. ఫలితంగా చైనా కమ్యూనిస్టు పార్టీ, చైనా ప్రభుత్వం హాంగ్‌కాంగ్ ‘ప్రత్యేక ప్రాంత’ ప్రభుత్వాన్ని, పరిపాలనను గత ఇరవై రెండేళ్లుగా నియంత్రించగలుగుతున్నాయి. ఈ అక్రమ నియంత్రణ తొలగిపోవాలన్నది హాంగ్‌కాంగ్‌లో కొనసాగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమ ప్రధాన లక్ష్యం. చైనాలో 1949 నుంచి ‘కమ్యూనిస్టు పార్టీ’వారి ఏకపక్ష నియంతృత్వం నెలకొని ఉంది. ఇందుకు భిన్నంగా తమ ప్రాంతంలో బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు కావాలని హాంగ్‌కాంగ్ ప్రజలు 1997వ సంవత్సరానికి పూర్వం స్పష్టం చేశారు. అందువల్ల ఏకపక్ష నియంతృత్వ రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి ఉన్న చైనాలో కలవడానికి హాంగ్‌కాంగ్ ప్రజలు ఒప్పుకోలేదు. కానీ బ్రిటన్ ప్రభుత్వం ఒప్పించింది. ఒప్పందంలో భాగంగా ‘ఒకే దేశంలో రెండు వ్యవస్థలు’ అన్న సూత్రాన్ని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అంగీకరించింది. చైనా అంతటా ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థ యథాతథంగా కొనసాగడం ఈ ఒప్పందంలో భాగం. ‘హాంగ్‌కాంగ్’ ప్రాంతంలో మాత్రం బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడాలన్నది 1997 నాటి ఒప్పందం! ఇలా ‘ఒక దేశంలో రెండు రకాల రాజ్యాంగ వ్యవస్థ’లు సమాంతరంగా కొనసాగడానికి హాంగ్‌కాంగ్ ప్రజలు, చైనా ప్రభుత్వం అంగీకరించాయి. ఈ అంగీకారం ప్రాతిపదికగా 1997లో హాంగ్‌కాం గ్ బ్రిటన్ నుంచి విముక్తమై చైనాలో ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడింది. కానీ ‘విలీనం’ జరిగిన కథ వేరు. హాంగ్‌కాంగ్ పద్దెనిమిది జిల్లాలుగా విభక్తమై ఉంది. ఈ జిల్లాల పాలక మండలులను మాత్రమే ప్రజలు ఎన్నుకుంటున్నారు. ‘ప్రత్యేక ప్రాంత’ ప్రభుత్వం ఇప్పటికీ ప్రజాస్వామ్య పద్ధతిలో రూపొందడం లేదు!
ఈ జిల్లాల పాలక మండలుల ఎన్నికల ప్రక్రియను సైతం చైనా ప్రభుత్వం నియంత్రిస్తూ వస్తోంది. ఫలితంగా 2014 వరకూ చైనా అనుకూల పక్షాలకే హాంగ్‌కాంగ్ జిల్లాల పాలనాధికారం దక్కుతూ వచ్చింది! గత ఆదివారం జరిగిన జిల్లా పాలక మండలుల ఎన్నికలలో చైనా ప్రభుత్వ వ్యతిరేక ప్రజాస్వామ్య పక్షాల కూటమి ఘన విజయం సాధించింది. పద్దెనిమిది జిల్లాలలో పదిహేడుచోట్ల పాలక మండలులలో ప్రజాస్వామ్య ఉద్యమపక్షాలకు పూర్తి ‘సంఖ్యా బాహుళ్యం’-మెజారిటీ- లభించిందట! గత ఆరునెలలుగా ఉద్ధృతం అవుతున్న ప్రజాస్వామ్య ఉద్యమం ఈ ఎన్నికలకు సమీప నేపథ్యం. ఉద్ధృతం అవుతున్న ఉద్యమాన్ని అణచివేయడానికి చైనా ప్రభుత్వం భయంకర బీభత్సకాండను సాగించింది. ప్రభుత్వ బీభత్సకాండను హాంగ్‌కాంగ్ ప్రజలు అభిశంసించినట్టు ఎన్నికల ఫలితాల వల్ల ధ్రువపడింది. పద్దెనిమిది జిల్లాలలో నాలుగువందల యాబయిరెండు స్థానాలకు ఎన్నికలు జరుగగా ప్రజాస్వామ్య ఉద్యమపక్షాలు మూడువందల తొంబయి ఆరుచోట్ల విజయం సాధించడం ఈ ‘అభిశంసన’.. చైనా ప్రభుత్వపక్షాలు ఘోర పరాజయం పాలుకావడం ఈ ‘అభిశంసన’.. 2014లో మూడువందల నాలుగు స్థానాలను గెలువగలిగిన ‘చైనా అనుకూల’ పక్షాలు ఈ ఎన్నికలలో కేవలం యాబయి ఆరు స్థానాలను సాధించడం చైనా పట్ల హాంగ్‌కాంగ్ ప్రజల అభిశంసన!
దురాక్రమించిన ‘ప్రాంతాల’లోకి తమ దేశ ప్రజలను తరలించడం ద్వారా ‘స్థానికుల’ను-తరతరాలుగా ఆ ప్రాంతాలలో పుట్టిపెరిగిన వారిని- అల్పసంఖ్యాకులుగా మార్చడం దశాబ్దుల తరబడి చైనా కమ్యూనిస్టు పార్టీ అమలు జరుపుతున్న వ్యూహం. టిబెట్ రాజధాని ‘లాసా’ నగరంలో 1949 నాటి ఒక్క చైనా కుటుంబం కూడ లేదు. చైనా దౌత్య కార్యాలయం మాత్రం ఉండేది. 1949నుంచి చైనా టిబెట్‌ను దురాక్రమించడం ఆరంభమైంది. 1959నాటికి దురాక్రమణ పూర్తయింది. ఈ పదేళ్లలో వేలాది చైనా ప్రజలు టిబెట్‌లోకి చొఱపడి స్థిరపడినారు. ఫలితంగా టిబెట్ జనాభా నైష్పత్తిక స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి. లాసా నగరంలో ప్రస్తుతం స్థానిక ‘త్రివిష్టప’-టిబెట్- ప్రజల కంటె చైనీయుల సంఖ్య పెరిగింది. ఇదే పద్ధతిలో హాంగ్‌కాంగ్ జనాభా నైష్పత్తిక స్వరూప స్వభావాలను మార్చడానికి చైనా యత్నిస్తోంది. 1997లో బ్రిటన్ నుంచి చైనాకు బదిలీ అయిన నాటికి నాలుగువందల తొమ్మిది చదరపు మైళ్ల- దాదాపు పదకొండు వందల చదరపు కిలోమీటర్ల- హాంగ్‌కాంగ్- జనాభా యాబయి మూడు లక్షలు. ఈ ఇరవై రెండేళ్లలో మరో ఇరవై లక్షల మంది హాంగ్‌కాంగ్‌లో పెరిగారు. కానీ వీరిలో పది లక్షల మంది చైనానుండి హాంగ్‌కాంగ్‌కు వచ్చి స్థిరపడినవారు. ఇలా డెబ్బయి రెండు లక్షల ప్రస్తుత ‘హాంగ్‌కాంగ్’ జనాభాలో పది లక్షల మంది ఇరవై ఏళ్లలో చైనానుంచి వచ్చి చేరినవారు! ఇలా క్రమంగా చైనీయుల- హాణలు-ను పెంచి మంచూరియా, సింకియాంగ్, టిబెట్, మంగోలియా ప్రాంతాలలో స్థానికుల శాతాన్ని తగ్గించగలిగింది చైనా ప్రభుత్వం. ‘హాంగ్‌కాంగ్’లో చెలరేగుతున్న నిరసన జ్వాలలకు ఈ ‘జనాభా దురాక్రమణ’ కూడ ఒక ప్రధాన కారణం! చైనా దక్షిణ తీరానికి సమీపంలో ‘కాంతాన్’ నది సముద్రంలో కలిసేచోట ‘హాంగ్‌కాంగ్’ ద్వీప సముదాయం నెలకొని ఉంది. శతాబ్దులపాటు ఈ ద్వీప సముదాయం నిర్జనంగా ఉండేది. 1841లో బ్రిటన్ ఈ దీవుల సమూహంలో కొంత భాగాన్ని ఆక్రమించింది. 1898లో చైనాకూ బ్రిటన్‌కూ మధ్య కుదిరిన ఒప్పందం 1997 వరకు అమలు జరిగింది! 1997 తరువాత చైనాలో కలసిన హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పటికీ సమగ్రం కాలేదు...
హాంగ్‌కాంగ్‌లో జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమానికి ఇదీ దీర్ఘకాల నేపథ్యం. అయితే చైనాకు హాంగ్‌కాంగ్‌లోని ‘నిందితుల’ను తరలించి విచారించి శిక్షించడానికి వీలుకల్పించే ‘‘తరలింపు చట్టం’’ తక్షణ నేపథ్యం. హాంగ్‌కాంగ్‌లోని రాజకీయ ప్రత్యర్థులను ఏరివేయడానికి వీలుగా ‘హాంగ్‌కాంగ్’ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ప్రజాఉద్యమం వెల్లువెత్తడం ఈ చట్టానికి సంబంధించిన ‘బిల్లు’ను హాంగ్‌కాంగ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవలసి వచ్చింది. ‘వరణ సమితి’ ప్రక్రియ ద్వారా చైనా ప్రభుత్వం వారు ఇంతవరకు ‘హాంగ్‌కాంగ్’లో తమకు ‘కీలుబొమ్మ’లా పనిచేసే ప్రభుత్వాన్ని నడిపించగలిగారు. జిల్లా మండలికి వలెనే ఈ ‘హాంగ్‌కాంగ్ ప్రత్యేక ప్రాంత’ శాసనసభకు కూడ ప్రతినిధులను ప్రత్యక్షంగా ‘వోటర్లు’ ఎన్నుకోవాలన్నది ఉద్యమకారుల లక్ష్యం! ఈ లక్ష్యం నెరవేరడం సమీప భవిష్యత్తులో సాధ్యం అవుతుందా? అన్నది వేచి చూడదగిన పరిణామం.. చైనా తమ దేశానికి సమీపంలో ‘హాంగ్‌కాంగ్’వంటి సముద్రస్థ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ఏర్పడనీయలేదు. మన దేశంలో ఒకప్పుడు భాగమైన ‘మాల్‌దీవులు’, ‘సింహళం’వంటి సముద్రస్థ ప్రాంతాలు మాత్రం స్వతంత్ర దేశాలుగా ఏర్పడినాయి... చైనాకూ మన దేశానికి మధ్యకల ‘వ్యూహాత్మక’ అంతరం ఇదీ...